ఫస్టు తారీకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫస్టు తారీకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2026, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (359) : భండారు శ్రీనివాసరావు

 

ఫస్టు తారీకు
1987 లో మాస్కో వెళ్ళేవరకు మా ఇంటిల్లిపాదికీ చిరపరిచితమైన పదం, ఈ ఫస్టు తారీకు. అందరం చకోర పక్షుల్లా ఎదురుచూసే రోజును ఎలా మరచిపోగలం!
చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కాబట్టి నెల జీతం ఏనెలకానెల నెలాఖరురోజున ఇచ్చేవాళ్ళు. (అదేమిటో చిత్రం, రిటైర్ అయిన తర్వాత పించను డబ్బులు ఠంచనుగా చాలా ముందస్తుగానే ప్రతి నెలా 27 కల్లా బ్యాంకులో క్రెడిట్
చేస్తున్నారు)
గతంలో సూర్యుడు ఎటు పొడిచినా సరే మేము నలుగురం అంటే నేనూ మా ఆవిడా ఇద్దరు పిల్లలు, ఫస్ట్ తారీకు సాయంత్రం మొదటి ఆట ఏదో ఒక సినిమా చూడాల్సిందే. హిమాయత్ నగర్ మినర్వా ( బ్లూ ఫాక్స్) లో భోజనం చేయాల్సిందే. ఆ రోజు తప్పిందంటే మళ్ళీ నెల రోజులు, ఫస్ట్ తారీఖు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఆగాల్సిందే. ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మర్నాటి నుంచే మా ఇంట్లో నెలాఖరు మొదలు కాబట్టి.
మాస్కో వెళ్ళిన కొత్తల్లో ఏమో కానీ, ఆ తరవాత్తరవాత అక్కడ ఫస్ట్ తారీకు అనే మాటే మరచిపోయాము. గమ్మత్తేమిటంటే అక్కడ నెలకు ముప్పయి రోజులు మాకు ప్రతి రోజూ ఫస్ట్ తారీకు మాదిరిగానే గడిచిపోయేవి డబ్బులకు ఏమాత్రం కొరత లేకుండా. అక్కడ సమస్య డబ్బులు లేకపోవడం కాదు, వున్న డబ్బులు ఖర్చు చేయడం ఎల్లా అన్నది. అక్కడి డబ్బులు అక్కడే ఖర్చు చేయాలి. అందుకోసం కనపడ్డవన్నీ కొనే వాళ్ళం, పెద్దపెద్ద క్యూల్లో నిలబడి.
ఆ రష్యన్ రూబుళ్ళు ఇండియా తెచ్చుకున్నా మన దగ్గర అవి ఎందుకూ పనికి రావు. మాస్కోలో మా రష్యన్ స్నేహితుడు ఫిలిపెంకో, రూబుళ్ళని ‘తాయిలెత్నయా బుమాగో’ (టాయిలెట్ పేపర్) అని అపహాస్యం చేసేవాడు.
అయిదేళ్ళ తర్వాత, మాస్కో నుంచి తిరిగొచ్చిన పిదప, కధ మళ్ళీ షరా మామూలే. కాకపొతే, కొత్తగా వచ్చిన క్రెడిట్ కార్డులు మళ్ళీ మొదటి తారీకును మరచిపోయేలా చేసాయి కానీ, ఆ తరవాత కాలంలో, టిక్కెట్టు కొనకుండానే నరకాన్ని కూడా చూపించాయి. ఈ కార్డులు అనేవి లేకపోతే నాకసలు బీపీ అనే జబ్బు వచ్చేది కాదని మా ఆవిడ దృఢ విశ్వాసం.
2005 లో రిటైర్ అయిన తర్వాత, పాత రోజుల్ని రివైండ్ చేసే పనిలో పడ్డాము. పించను డబ్బులు బ్యాంకులో పడగానే, నెట్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉబెర్ లో బయలుదేరి వెళ్లి మల్టీప్లెక్స్ లో ఖాళీగా వున్న హాల్లో ఏదో ఒక సినిమా చూసేసి, ఎంచక్కా హోటల్లో భోజనం చేసేసి, ఉబెర్లో పడి ఇంటికి చేరేవాళ్ళం.
కాకపొతే అప్పుడు నలుగురం, ఇప్పుడు ఇద్దరం.
ఆ ఇద్దరం, ఒకరికొకరం చెరిసగం అని అనుకున్నా. కానీ మరీ ఇలా సగంలో సగమైపోతానని ఏనాడూ ఊహించలేదు.
ఇప్పుడా తిరుగుళ్ళు కూడా లేవు, ఇంట్లో కూచుని ఉబుసుపోక ఊసులు రాసుకోవడం తప్ప వేరే పనేమీ లేదు.
ఆయా రాజకీయ పార్టీల అభిమానుల పుణ్యమా అని, భయంకరమైన వారి కామెంట్లు భరించే ఓపిక లేక టీవీ చర్చలకు కూడా మంగళం పాడాను.
కింది ఫోటో:
యాభయ్ ఏళ్ళ పైచిలుకు నా పాత్రికేయ వృత్తిని కొందరు మిత్రులు గుర్తించి, మెచ్చుకుని అయాచితంగా కప్పిన మేకతోళ్ళు. వాళ్లకు కృతజ్ఞతలు 🙏







(24-09-2026)