(సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు)
ఒక్కోసారి నిజాలు కూడా, నిజమేనని నమ్మలేనంత విడ్డూరంగా వుంటాయి.
1990 సంవత్సరం.
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా ముప్పయ్ ఆరేళ్ల క్రితం ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి పక్కా రిజర్వేషన్ చేయించుకుని లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మళ్ళీ వాళ్ళు అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని అంటూ, వాళ్ల బెర్తుల్ని దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా. పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయ కూడా లేకుండా పెద్ద గొంతుకతో, అసభ్య పదజాలంతో సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు వారికి కన్ఫర్ముడ్ రిజర్వేషన్ లేదు. దానితో వారిలో ఒక అమ్మాయి ఢిల్లీ లోనే ఆగిపోయింది. రెండో అమ్మాయికి మాత్రం తప్పనిసరిగా అహమ్మదాబాదు వెళ్ళాల్సిన పరిస్థితి. టికెట్ రిజర్వ్ చేసుకున్నా కన్ఫర్మ్ కాలేదు. వెయిట్ లిస్టు టికెట్ తోనే రైలు ఎక్కింది. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా మనసులో పచ్చిగా వుండిపోవడంతో యువతి భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత ప్రయాణం సాఫీగా సాగిపోయింది. పైగా ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరు బెడ్ షీట్ పరచుకుని తాను కిందనే పడుకుని, తన బెర్త్ ఆ అమ్మాయికి ఇచ్చారు.
మరునాడు ఉదయం రైలు దిగి ఎవరి దోవన వాళ్లు వెళ్ళబోయే ముందు, ఆ యువతి డైరీ తెరచి పట్టుకుని, ‘నేనూ, డిల్లీలో ఆగిపోయిన నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల రాత్రి నా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
ఒంటరిగా ప్రయాణం చేస్తున్న యువతికి తన బెర్త్ ఇచ్చి కింద పడుకున్నది ఎవరో కాదు, నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
(శంకర్ సింగ్ వాఘేలా గుజరాత్ ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఆ హోదాలో ఆయనకు రైల్లో మొదటి తరగతిలో ఒక సహాయకుడితో ఉచితంగా ప్రయాణం చేసే వీలుంది. సహాయకుడిగా మోడీ ప్రయాణంలో ఆయన వెంట వున్నారు. ఈ కధనం పూర్తి పాఠం 01-06-2014 తేదీ హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో ప్రచురించారు.
https://www.thehindu.com/news/national/other-states/vaghela-recalls-the-miles-he-journeyed-with-modi/article6083017.ece
https://www.thehindu.com/opinion/open-page/a-train-journey-and-two-names-to-remember/article6070562.ece)
గమనిక: గొప్ప రాజకీయ నాయకుల పుట్టిన రోజులను పురస్కరించుకుని, సందర్భోచితంగా పాజిటివ్ పోస్టులు రాసే నా అలవాటు ప్రకారం ఇది పోస్టు చేస్తున్నాను. వేరే కారణాలు లేవు)