3, మార్చి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (101 ) – భండారు శ్రీనివాసరావు

 


వెనుకటి రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి విద్యార్ధులు హైదరాబాదు ఎక్స్ కర్షన్ కు వస్తే వాళ్లకు చూపించే ప్రదేశాల్లో రేడియో స్టేషన్ కూడా వుండేది. బేగం పేట ఏరోడ్రోం  మరోటి.  విమానాశ్రయం అనే వాళ్ళు కాదు,  ఏరోడ్రోం అంటేనే చెప్పుకోవడానికి గొప్పగా వుండేది. ఆ రోజుల్లో ఇప్పట్లా కాదు, రోజు మొత్తంలో కలిపి ఒకటీ అరా  విమానాలే హైదరాబాదు వచ్చి వెళ్ళేవి. కొన్ని నైట్ హాల్ట్ బస్సుల మాదిరిగా రాత్రంతా అక్కడే వుండి మరునాడు బయలుదేరి వెళ్ళేవి.  అందుకని స్కూలు పిల్లల్ని తీసుకువచ్చిన మాస్టర్లు కూడా ఏదో ఒక విమానం వచ్చే టైమో, వెళ్ళే టైమో ముందుగా కనుక్కుని అక్కడికి తీసుకువెళ్ళేవాళ్ళు. విమానాశ్రయం మేడ మీద అద్దాల కిటికీల్లో  నుంచి విమానం దిగివస్తున్న వాళ్ళను చూసి సంతోషంతో కేరింతలు కొట్టేవాళ్ళు, అల్లాగే అసెంబ్లీ బిల్డింగ్, దానిపక్కనే పబ్లిక్ గార్డెన్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇలా అన్ని చోట్లకీ తిప్పి వెనక్కి తీసుకుపోయేవాళ్ళు. తరువాత తరువాత ఈ జాబితాలో నెహ్రూ జూ పార్కు, రవీంద్రభారతి వచ్చి చేరాయి.

ఇంతకుముందే చెప్పినట్టు గొప్ప సంస్థల్లో పనిచేసే అవకాశం రావడం వల్ల  అంతవరకూ చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్నవాళ్ళతో కలిసి పనిచేసే గొప్ప అవకాశం లభిస్తుంది. రేడియోలో చేరడం వల్లనే,  పన్యాల రంగనాధ రావు గారు, తిరుమలశెట్టి శ్రీరాములు గారు, మాడపాటి సత్యవతి గారు, డి.వెంకట్రామయ్య గారు ఇలాటి గొప్ప స్వర సంపన్నులతో సహోద్యోగిగా సాంగత్యం చేసే స్వానుభవం సొంతం అయింది. (నిజానికి రేడియో వార్తల్లో ‘గారు’ వాడరు ‘శ్రీ’ తప్ప. కానీ ఈ గొప్పవారిపట్ల పెంచుకున్న గౌరవంతో ‘గారు’ చేర్చి గౌరవించుకుంటున్నాను)

జర్నలిజం వృత్తిలో చేరినప్పుడే సీనియర్లు, జూనియర్లు అనే తేడా వొదులుకోవాలని, ‘హోదాలతో’ సమకూరే పెద్దరికాలను పక్కనపెట్టాలని నా పెద్దలు నాకు నేర్పిన పాఠం. అందుకే నా వృత్తి జీవితంలో నాకు ఎవ్వరూ ‘బాసులు’ కారు, నేను ఎవ్వరికీ ‘బాసును’ కాను. ఇదే సూత్రాన్ని నేను మూడు దశాబ్దాలపాటు పాటించాను. ఆచరించాను.

 

1975 లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తా విభాగంలో అసిస్టెంట్  ఎడిటర్ (రిపోర్టింగ్) గా చేరినప్పుడు, నా ఉద్యోగ బాధ్యత కాకపోయినా వారానికి మూడు రోజులు ఉదయం ఆరుగంటల నలభయ్ అయిదు నిమిషాలకు ప్రసారం అయ్యే ప్రాంతీయవార్తల బులెటిన్ ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. అప్పుడు పరిచయం గుడిపూడి శ్రీహరి.

తిరుమలశెట్టి శ్రీరాములుడి. వెంకట్రామయ్యజ్యోత్స్నాదేవి రెగ్యులర్ న్యూస్ రీడర్లు. మాడపాటి సత్యవతి గారు అసిస్టెంట్ ఎడిటర్. అప్పుడప్పుడు  వార్తలు చదివేవారు. వారి వీక్లీ ఆఫ్స్సెలవు రోజుల్లో వార్తలు చదవడానికి క్యాజువల్ న్యూస్ రీడర్లుగా పీ.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రిసురమౌళిగుడిపూడి శ్రీహరి గార్లు వచ్చేవారు. అప్పుడప్పుడు అనుకోకుండా వాళ్లకు  గొంతు  పట్టేసిన సందర్భాలు వచ్చేవి. అప్పుడు నేనే  బులెటిన్ పేపర్లు పట్టుకుని వెళ్లి స్టూడియోలో కూర్చుని వార్తలు చదివేసేవాడిని. (ఈ  అనుభవం తర్వాత రోజుల్లో నాకు అక్కరకు వచ్చింది. రేడియో మాస్కోలో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేసే సమయంలో, వస్తుతః నేను రేడియో విలేకరిని అయినప్పటికీ, , అవసరార్థం నెత్తికి ఎత్తుకున్న ఈ అనుభవం పనికివచ్చింది)

ఉదయం పూట న్యూస్ రీడర్లు చదివే వార్తలను ఎడిట్ చేసి, ప్రాధాన్యతా క్రమంలో హెడ్ లైన్స్ (ముఖ్యాంశాలు) ఎంపికచేసి   ఇవ్వడం నా బాధ్యత. ఉద్యోగంలో చేరకముందే, స్కూలురోజులనుంచే వీళ్ళు చదివే వార్తలు నేను రేడియోలో  వింటూ వుండేవాడిని. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే మహత్తర అవకాశం నాకు రేడియో ఉద్యోగం ఇచ్చింది.

శ్రీహరి సంగతి కదా చెప్పుకుంటున్నాం.

ఆయన వయసులో నాకంటే పెద్ద.  కానీ ఆహార్యంలో నాకంటే కుర్రవాడు. హాలీవుడ్ సినిమా హీరో మల్లే నెత్తిన హ్యాటు. చలవ కళ్ళజోడుకోటుబూటుతో మోటార్ సైకిల్ మీద ఆయన రేడియో ప్రాంగణంలో ప్రవేశిస్తూ వుంటే చూడాలి. శ్రీహరి గారి దగ్గర రకరకాల హ్యాట్లు (టోపీలు కాదు, హాలీవుడ్, హిందీ   సినిమాల్లో  హీరోలు పెట్టుకునేవి), పలురకాల నల్ల కళ్ళజోళ్లుకొట్టవచ్చేటట్టు కనబడే ముదురు రంగుల బుష్ కోట్లువీటన్నితో కలిపి చూస్తే అసలు వయసు కంటే చాలా చిన్నవాడిగా కనబడేవాడు. అంచేత నేను కూడా చనువు తీసుకుని ఏకవచనంలోనే సంబోధించేవాడిని. ఆయనా అల్లాగే నన్నూ ఏమోయ్ శ్రీనివాసరావ్ అని పిలిచేవాడు. అలా అరమరికలు లేని స్నేహం మా నడుమ వుండేది.   

ఆహార్యానికి తగ్గట్టే శ్రీహరి వార్తలు చదివే తీరు కూడా విభిన్నంగా వుండేది. బయట కులాసాగా తిరిగినట్టే స్టూడియో లోపల కూడా బేఫికర్ గా వార్తలు చదివేవాడు. వార్తలు చదువుతూ గొంతు సవరించుకోవడం, ఊపిరి పీల్చి వదిలిన ధ్వని ఇవన్నీ మా రేడియో వాళ్లకి నచ్చవు. అదే రిపోర్టులో రాసి ఆయనకు చెప్పమనే వారు. నేను చెబితే ఆయన నవ్వి ఇలా అన్నాడు.

‘మనం పోటీ ప్రపంచంలో ఉన్నాము. ఇలా అనేవాళ్ళు ఎప్పుడయినా బీబీసీ వార్తలు విన్నారా! వాయిస్ ఆఫ్ అమెరికా వార్తలు విన్నారా! అక్కడ ఇటువంటివి సహజంగా తీసుకుంటారు. నిజానికి అలా చేయడం వల్ల ఈ ప్రోగ్రాము ముందుగా రికార్డు చేసింది కాదులైవ్ ప్రోగ్రాం అని శ్రోతలకు తెలుస్తుంది కూడా

ఆయన చెప్పింది నాకు సరిగానే అనిపించింది.

శ్రీహరికి భార్యావియోగం కలిగింది. ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అనుకున్నా. కొన్నేళ్ళ తర్వాత ఆయనా దూరం అయిపోయారు. 2022 జులై లో తన 88 వ ఏట హైదరాబాదులో కన్నుమూశారు.    మనిషి పోయినా స్వరం మాత్రం తెలుగు శ్రోతల గుండెల్లో పదిలంగా వుంటుంది.

అలాగే సురమౌళి. ఈయన కూడా రేడియోలో క్యాజువల్ న్యూస్ రీడర్. మాసిపోయిన లాల్చీ పైజామాతో అత్యంత సాదా సీదాగా వుండే సురమౌళిని చప్పున అర్ధం చేసుకోవడం కష్టం. అసలు ఆ పేరే విచిత్రం. ముందు కలం పేరు అని భ్రమపడే అవకాశం వుంది. అయితే  ఆయనతో పరిచయం పెరిగినకొద్దీ ఆ మనిషిలోని గొప్ప లక్షణాలు నాకు క్రమంగా బోధ పడుతూ వచ్చాయి. ఫక్తు లోహియావాది. జార్జ్ ఫెర్నాండేజ్ వంటి నాయకులతో సన్నిహిత పరిచయం.

చాలా ఏళ్ళ క్రితం నేనూ జ్వాలా నరసింహారావు  ఓసారి ఢిల్లీ వెళ్లాం (బహుశా అదే మొదటి పర్యాయం అనుకుంటా ఢిల్లీ చూడడం). అప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. చూద్దామనే కోరిక. ఇద్దరం పార్లమెంటు లాబీల్లోకి వెళ్లాం. ఇప్పట్లా అప్పట్లో కఠినమైన నిబంధనలు లేవు. లోపలకు వెళ్లి గేలరీ నుంచి పార్లమెంటు సమావేశాలు  చూడాలంటే పాసు అవసరం. దానికి ఎవరయినా ఎంపీ సంతకం కావాలి. అటూ ఇటూ చూస్తుంటే జార్జ్ ఫెర్నాండెజ్ కనిపించారు. దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకున్నాం. హైదరాబాదునుంచి వచ్చామనీ, సురమౌళి స్నేహితులమనీ చెప్పాం. అంతే! మేము ఎవరమో తెలియకపోయినా, సురమౌళి పేరు చెప్పగానే ఫెర్నాండెజ్ మారుమాట మాట్లాడకుండా విజిటర్స్ గేలరీ కాగితం మీద సంతకం చేసి ఇచ్చారు. దటీజ్ సురమౌళి.

బద్రీ విశాల్ పిత్తి వంటి పెద్దపెద్ద వారితో సన్నిహిత పరిచయాలు వున్నాకూడా వాటిని ఎన్నడూ తన సొంత ప్రయోజనాలకు వాడుకోలేదు. ఒక స్థిరమైన ఉద్యోగం చేసిన దాఖలా లేదు. అప్పుడప్పుడూ రేడియో వార్తలు చదువుతూ, రచనలు చేసుకుంటూ జీవితం వెళ్ళదీశాడు. ఎన్టీఆర్ హయాములో జి. నారాయణరావు గారు అసెంబ్లీ స్పీకర్ గా వున్నప్పుడు శాసనసభలో ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సభ్యులు చేసే ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసే ఒక ఉద్యోగాన్ని సృష్టించి సురమౌలికి ఒప్పచెప్పారు. అదీ తాత్కాలికమే.

పెద్ద సంస్కరణవాది.  పుట్టుకతో బ్రాహ్మణుడు అన్న సంగతి పుట్టినప్పుడే మరిచిపోయిన మనిషి. పెళ్లి విషయంలో కులం పట్టింపు పాటించలేదు. పుట్టిన అమ్మాయికి వెన్నెల అని పేరు పెట్టాడు. నిండైన విగ్రహం. కృష్ణ వర్ణం. తెల్లటి లాల్చీ,  పైజామా ధరించిన సురమౌళిని ఎంత దూరం నుంచి అయినా గుర్తుపట్టవచ్చు. అనేక భాషలు తెలిసిన వాడు. రాం మనోహర్ లోహియా రచనలను పుక్కిటపట్టాడు. గంభీరమైన స్వరంతో వార్తలు చదివేవాడు. మంచి స్నేహితుడు. అలాంటి వాడు చిన్న వయసులోనే చనిపోవడం విచారకరం.

ఇక పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి గారు. వారు ఫిలిం జర్నలిస్టు. అక్కినేని నాగేశ్వరరావు వంటి  పెద్ద పెద్ద సినీ నటులతో పరిచయాలు ఉండేవి. శ్రీహరి కూడా హిందూ వంటి ప్రముఖ పత్రికలకు సినిమా వ్యాసాలు రాస్తుండేవారు. కానీ ఏనాడు వారి నోటి వెంట ఈ హీరో తెలుసు, ఆ హీరోయిన్ తెలుసు అనే మాట వినపడేది కాదు. వచ్చి తమ పని చేసుకుని వెళ్ళిపోయేవారు. ఆంజనేయ శాస్త్రి గారిది చాలా పెద్దమనిషి తరహా. అనేక సినిమా కార్యక్రమాల వత్తిడి ఉన్నప్పటికీ రేడియో డ్యూటీ వున్నరోజున  టైం ప్రకారం వచ్చి వార్తలు అనువాదం చేసుకుని చదివి వెళ్ళిపోయేవారు. చిక్కడపల్లిలో మా ఇంటికి దగ్గరలోనే వుండేవారు.  సురమౌళి, శ్రీహరి, శాస్త్రి గార్లది విభిన్న ఆహార్యం. వార్తలు చదివే పద్దతి కూడా విభిన్నం.   

కింది ఫోటోలు:

పాత తరం వారి ఫోటోలు  గూగులమ్మ దగ్గర కూడా దొరకవని తేలిపోయింది. పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్త్రి గారి ఫోటో కోసం వెతికితే, ఆయన ఫోటో లేదు కానీ  ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు ప్రదాన కార్యక్రమం ఫోటో దొరికింది. అందులో వేదిక కింద దండ వేసి వున్న ఆయన ఫోటో ఒకటి కనపడింది.  గుర్తు పట్టేలా లేదు. ఇక సురమౌళి ఫోటో అసలు దొరకనే లేదు. ఫోటో కాదు కదా ఆయన గురించిన సమాచారమే లేదు.  శ్రీహరి ఫోటో మాత్రం  లభ్యం అయింది.

సురమౌళి ఫోటో దొరకలేదు అనే బాధ లేకుండా విజయ జ్యోతి గారు అనే పాఠకురాలు  ఆ ఫోటో పంపారు. వారికి నా ధన్యవాదాలు.












  

(ఇంకావుంది)

 

2, మార్చి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో ( 100) – భండారు శ్రీనివాసరావు

 ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి. వెంకట్రామయ్య  

నా జీవితంలో రేడియో ఉద్యోగం ఓ ప్రధాన అధ్యాయం అనుకుంటే అందులో అన్ని పేజీల్లో కనిపించే పేరు డి. వెంకట్రామయ్య.

ప్రముఖ పాత్రికేయులు , కలం కూలీ జీ. కృష్ణగారు అన్నారు ఒకసారి, వెంకట్రామయ్య వార్తలు చదువుతుంటే చదువుతున్నట్టుగా వుండదు, వార్తలు మనకు చెబుతున్నంత సహజంగా వుండేవని.  ఆయన అలా అన్నారు అంటే అది ఆస్కార్ అవార్డుతో సమానం. 

అయితే, ఆయన రేడియోలో ఉద్యోగం చేయడం వల్ల రేడియోకు లాభం చేకూరిన మాట నిజమే కానీ, వెంకట్రామయ్య గారు రేడియోలో చేరి కధలు రాయడం మానేసినందువల్ల తెలుగు పాఠకలోకం ఒక మంచి రచయితను కోల్పోయిందని నా నమ్మకం.

'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!  

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి,  ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి,  'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

1975 నవంబర్లో అనుకుంటాను,  తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా కలసి పనిచేస్తున్నప్పటికీ, ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.

ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.

టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు. చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా,  నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.


ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే,  అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనూ, పరిచయస్తులనూ, మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.

పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో,  వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! ఆ కొద్దిమందిలో వెంకట్రామయ్యగారు మొదటివరుసలో వుంటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం తగ్గించారు. పత్రికల్లో, మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది. నిజమేనేమో!
అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని, వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని,  పాపపుణ్యాల పైనా, దేవుళ్ళూ దెయ్యాల పైనా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.


అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు కోకుండానో, 'గళం'పేరుతోనో,  రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ, ఒక ఏడాది ఆ పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ.

సాధారణంగా పొగడ్తలకు, పొడిగించుకోవడానికి ఇష్టపడని వెంకట్రామయ్య గారు, రచన మాస పత్రికలో రాసిన తన రేడియో రోజుల సీరియల్ లో  నా గురించి కొన్ని మంచి మాటలు రాయడం నాకొక కితాబు. ఆయన రాతల్లోనే ఆ మాటలు:  

“హైదరాబాదు ఆకాశ వాణి వార్తావిభాగంలో మిగతా అందరికంటే నాతొ ఎక్కువ కాలం పనిచేసిన సహోద్యోగి, మిగతా అందరి కంటే నాకు అత్యంత ఆప్తుడు భండారు శ్రీనివాసరావు. 1975  లో ఆయన చేరినప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు నలభయ్ ఏళ్ళు మా స్నేహం చెక్కుచెదరకుండా వుంది. ...ఎన్నో విషయాల్లో ఏ మాత్రం పోలికా పొంతనా లేని మేమిద్దరం స్నేహితులుగా అన్నేళ్ళు అంత దగ్గరగా వుండడమే విచిత్రం.

“ఎప్పుడు నవ్వుతు, తుళ్ళుతూ గలగలా మాట్లాడుతూ వుండడం, తన వాక్చాతుర్యంతో,చమత్కారాలతో, చలోక్తులతో, వ్యంగోక్తులతో చుట్టూ వున్నవాళ్లనందరినీ కవ్విస్తూ నవ్విస్తూ వుండడం ఆయన సహజ లక్షణాలు. అసలీ మనిషి జీవితంలో ఎన్నడయినా  విచారం, విషాదంలాంటివేమైనా వుంటాయా, ఎప్పుడయినా ఏ సందర్భంలో నయినా ఈయన సీరియస్ గా వుంటాడా అనిపిస్తుంది ఆయన్ని చూసిన వాళ్ళందరికీ. (వెంకట్రామయ్య గారికి నా గురించి ఈ ఆలోచన వచ్చినప్పుడు, ఆయన నమ్మని తథాస్తు దేవతలు ‘తధాస్తు అని వుంటారు. అందుకే నా జీవిత చరమాంకంలో  పెను విషాదాలు, విచారాలు నన్ను చుట్టుముట్టాయి)

“ న్యూస్ రూమ్ అంటేనే వాతావరణం ఎప్పుడు ఎంతో కొంత ఉద్విగ్నంగా వుంటుంది. కాని శ్రీనివాసరావు అక్కడ వుంటే చాలు వేడి తగ్గిపోయేది. ఆయన మాటలతో, చలోక్తులతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకునే వారు. కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, వూరట లభించినట్టుగా అనిపించేది పనిచేసేవాళ్లకి.

“సరే! కొత్తగా వచ్చి చేరిన ఈ శ్రీనివాసరావు అనే ఆయన అసలు స్వరూపం ఏమిటి, ఆయన స్వభావం ఏమిటి, ఆయన  పనితీరు యెలా వుంటుంది అని మొదట్లో అన్నీ సందేహాలే. ఇలాటివన్నీ తెలుసుకోవడానికీ, ఆయన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికీ అధమ పక్షం ఆరు మాసాలు పట్టింది. (పూర్తిగా అన్నమాట వాడకూడదేమో. ఎందుకంటే అప్పుడే కాదు.. ఇన్నేళ్ళ తరువాత కూడా నా మిత్రుడు భండారు శ్రీనివాసరావు లీలలూ, మాటలూ నాకు పూర్తిగా అర్ధం కావు)

“ నాకిప్పటికీ బాగా గుర్తుంది. సందర్భం ఏమిటో జ్ఞాపకం లేదు. ఒకనాటి సాయంత్రం డ్యూటీ ముగించుకుని నేనూ భండారు శ్రీనివాసరావు గారూ (ఇకనుంచి ఈ గౌరవ వాచకం తీసివేసి రాస్తాను) న్యూస్ రూమ్ నుంచి బయటకు నడుస్తుండగా ఆయనో మాట అన్నారు.

“మీరు కుండలు బద్దలు కొట్టండి.  కాని కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొడతానంటే యెలా “ అని. అంతకుముందు ఆఫీసులో ఏదో జరిగింది. ఎవరితోనో నేను ఘర్షణకు దిగడమో, తీవ్రస్థాయిలో వాదించడమో జరిగింది.  అలాటి సందర్భాలలో అవసరానికి మించి ఆవేశపడడం, అవతలి వ్యక్తి ఎవరయినా సరే, ఏమాత్రం సంకోచించకుండా వున్న మాట మొహాన  అనేయడంవంటి నా సహజ స్వభావం గురించి , శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య ఇది. ‘కుండలు కొనుక్కొచ్చి మరీ బద్దలు కొట్టడం’ అన్న ఆయన చమత్కారానికి నేనూ నవ్వుకున్నాను. ఆ చమత్కారపు మాటల వెనక నా బోటివారు ఆలోచించవలసిన, చేతనయితే అనుసరించవలసిన మంచి సలహా వున్నట్టు నాకనిపించింది.

“ అప్పుడే కాదు,  అంతకి ముందు ఆ తరువాతా కూడా ఎన్నో సందర్భాలలో, తన చమత్కారాలు, చతురోక్తులు  జోడించి  ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ  నాకెన్నో సలహాలు అందించేవారాయన. కాని నేను వింటేగా. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు నా మొండితనం నాదే. ఎన్నిమార్లు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నన్నెంత మాత్రం మార్చలేకపోయారు, ముఖ్యంగా ఆఫీసు విషయాల్లో. శ్రీనివాసరావులాటి మిత్రుల  సుదీర్ఘ సహవాసంవల్ల ఆఫీసునుంచి బయటకు వచ్చిన తరువాతైనా  కాస్త నవ్వడం నేర్చుకున్నాను. నలుగురిలో మసలడం నేర్చుకున్నాను. నాలుగు మాటలు నేర్చుకున్నాను”

“నా ఉద్యోగం న్యూస్ రీడర్ అయినప్పటికీ ఓసారి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు గారు నన్ను పిలిచి,  ‘మాస్టారూ ఎన్నాళ్ళని ఇక్కడ కూర్చుని న్యూస్ బులెటిన్లతో కుస్తీ పడతారు. మధ్యమధ్య  రిపోర్టింగ్ కు వెళ్ళి వస్తుండండి. రేపు ఉదయం అసెంబ్లీకి వెళ్ళండి’ అన్నారు. అవి శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నరోజులు. నేను ఉదయం వెళ్ళే సరికే అసెంబ్లీలో ‘QUESTION HOUR’  నడుస్తోంది. అప్పట్నించి భోజన విరామానికి సభ వాయిదా పడేవరకు మూడు నాలుగు గంటలపాటు అక్కడే కూర్చున్నాను. ఛాతీలో కాస్త నొప్పిగా వున్నట్టు అనిపించింది కాని పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి రిపోర్ట్ రాస్తుండగా నొప్పి మరికాస్త పెరిగింది. ఛాతీ ఎడమ వైపు నుంచి భుజానికి ఏదో సర్రున పాకినట్టనిపించింది. వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి. శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా వుంది. ఇక నా వల్ల కాదని అర్ధమై పోయింది. ‘వొంట్లో బాగాలేదు. ఇంటికి పోతున్నాన’ని రామారావు గారికి చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ వేళలో అంత  త్వరగా వచ్చిన నన్ను చూసి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటిలా వచ్చారు. ఏమైంది మీకు వొంట్లో ఎలావుంది’ అని కంగారు పడడం మొదలు పెట్టింది. విషయం చెబితే డాక్టరు దగ్గరకు వెడదామని హడావిడి చేస్తుందని పొడి పొడిగా నాలుగుముక్కలు చెప్పి ‘ఏమీ వద్ద’ని కసరి అలాగే పడుకున్నాను.

“ఎన్నడూ లేనిది ఆవిధంగా పని మధ్యలో వొదిలేసి వెళ్ళిపోయానని తెలిసి శ్రీనివాసరావు, జ్వాలా నరసింహారావూ (వీరిద్దరినీ జంట కవులనేవారు. నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడూ కలిసేవుండేవారు) ఆ సాయంత్రం మా ఇంటికి విషయం కనుక్కుందామని  వచ్చారు. నేను చెప్పేది  వినిపించుకోకుండా డాక్టర్ మనోహరరావు (శ్రీనివాసరావు మేనల్లుడు) దగ్గరకు తీసుకువెళ్ళారు. తరువాత డాక్టర్ గారిని కూడా వెంటబెట్టుకుని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అందులో చేర్పించారు. ‘ANGINA PECTORIS’  అనే హృదయ సంబంధమైన రుగ్మత వల్ల నాకలా అయిందని నిర్ధారించిన వైద్యులు రెండు రోజులపాటు ఐ సీ యూ లోనే వుంచి ఆ తరువాత ఇంటికి పంపారు. మరునాడు కాబోలు జ్వాలా నరసింహారావూ. శ్రీనివాసరావు సతీ సమేతంగా మా ఇంటికి వచ్చారు.

మాటల మధ్య మా ఆవిడ శ్రీనివాసరావుతో,  ‘ ఆరోజు మీరు దేవుడల్లే వచ్చి ఆసుపత్రిలో చేర్పించార’ని  ఏదో  చెప్పబోతుంటే, శ్రీనివాసరావు తన మామూలు తరహాలోనే ‘ఈ ఇంట్లో దేవుడు అనే మాట వినడం విచిత్రంగా వుంది’ అన్నారు చిరునవ్వుతో.

నా నాస్తికత్వం మీద ఆయన విసిరిన వ్యంగ బాణం అది.

ఇలా అన్ని సందర్భాలలో నవ్వుతూ నవ్విస్తూ వుండే ఈ మనిషి ఎప్పుడయినా కంట నీరు పెట్టుకుంటాడా అనిపించేది. అదీ చూశాను. నేను రిటైర్ అయినప్పుడు జరిగిన వీడ్కోలు సభలో నా గురించి మాట్లాడబోయి, మాటలు పెగలక కంట తడిపెట్టారు.”

వెంకట్రామయ్య గారికి పుస్తకాలన్నా, సినిమాలన్నా ప్రాణం. కొంచెం ఖాళీ దొరికితే చాలు మంచి సినిమాహాలు చూసుకుని ఏదో ఒక సినిమా చూసేవారు. మొదట్లో నన్నూ వెంట తీసుకు వెళ్ళేవాళ్ళు. మూడు గంటలు కాలు కదపకుండా ఒక చోట కూర్చోవడం అలవాటు లేని నేను నెమ్మదిగా ఏదో కారణం చెప్పి తప్పించుకునేవాడిని.  ఆరోజు ఉదయం ఇంట్లో  వెంకట్రామయ్య గారు పడుకున్నవాడల్లా  లేచి,   మనమడ్ని వెంట తీసుకుని వరసగా రెండు సినిమాలు, సరిలేరు నీకెవ్వరూ, అలవైకుంఠపురం చూడాలని కూకట్పల్లి  పీవీఆర్ ఫోరం మాల్ కి వెళ్ళారు. ఒక ఆట చూసి రెండో సినిమాకు వెడుతూ మధ్యలోనే  కుప్పకూలిపోయారు. మనుమడు పక్కన వుండడం వుండడం వల్ల, దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఫలితం లేకపోయింది.

హాయిగా సినిమాకని వెళ్ళిన మనిషి విగతజీవుడిగా ఇంటికి రావడం వెంకట్రామయ్య గారు నమ్మని విధి విచిత్రం కాకపోతే మరేమిటి?

 

కింది ఫోటో:

రేడియో న్యూస్ రీడర్ గా వెంకట్రామయ్య గారు రిటైర్ అయినప్పుడు సహోద్యోగి షుజాత్ ఆలీ సూఫీ Shujath Ali Sufi  ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో  వెంకట్రామయ్య గారు, నేనూ.



(ఇంకావుంది)

1, మార్చి 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో ( 99 ) : భండారు శ్రీనివాసరావు

 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాడపాటి సత్యవతి

మూడు దశాబ్దాల క్రితం దాదాపు ప్రతి సాయంత్రం ఆరుగంటల పదిహేను నిమిషాలకల్లా తెలుగునాట లోగిళ్ళలో ఈ మధుర స్వరం వినబడేది. మెల్లగా, సౌకుమార్యంగా వినవచ్చే ఆ  కంఠస్వరం చాలామందికి సుపరిచితం.

ఒకప్పుడు ఇంట్లో కూర్చుని ఆవిడ చదివే వార్తలు విన్న నేను,  ఆ తర్వాత ఆవిడతో కలిసి రేడియోలో ఒకే విభాగంలో  దశాబ్దాల పాటు కలిసి  పనిచేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం.

‘శ్రీనివాసరావు గారు ఎలావున్నారు బాగున్నారా!’

పాతికేళ్ళ సుదీర్ఘ పరిచయ కాలంలో ఆవిడ  నోటి నుంచి  నేను విన్న అతి  పెద్ద వాక్యం ఇదే.

మాడపాటి సత్యవతి గారు ఎంతో  క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటినుంచి. అంతటి మితభాషి. మరి  పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ  స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది.  ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడుమంది. ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.

వార్తావిభాగం పనితీరు గురించి ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. హిందీలో చెప్పాలంటే (నిజానికి నాకూ ఆ భాషకు చుక్కెదురు) అక్కడ వాతావరణం ‘బహుత్  బహుత్ గంభీర్.’  నేను అడుగుపెట్టేంత వరకు పరిస్తితి అదే. పని అయిపోయేంతవరకు అందరూ ముక్తసరిగా మాట్లాడుకునేవారు. అంతా రొటీన్ గా  ‘స్క్రీన్ ప్లే’  పుస్తకంలో రాసివున్నట్టు జరిగిపోయేది. వార్తల్లో ఎలాటి తభావతు  రాకుండా  బులెటిన్ల తయారీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక వార్త ఇవ్వాలా వద్దా  ఇస్తే ఎన్ని వాక్యాలు ఇవ్వాలి  యెంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకటి రెండు సార్లు ఆలోచించే వాళ్లు. మరీ  ముఖ్యంగా సత్యవతిగారికీ, వెంకట్రామయ్య గారికీ ఈ విషయంలో పట్టింపులు మెండు. అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకునే నా తత్వం వారికి అంతగా రుచించకపోయినా ఇంట్లో చిన్నవాడిని ముద్దు చేసినట్టు నన్ను చూసీ చూడనట్టు వొదిలేసేవారు. ఎడిటర్లు అంతే!  దానితో నాది ఆడింది ఆట పాడింది పాట. అంతకు ముందు దినపత్రికలో పనిచేసిరావడం వల్ల, వార్తలు ఇవ్వడంలో కొంత స్వేచ్చను ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడిని. బహుశా నాతో పడ్డన్ని తలనొప్పులు వాళ్లు ఎవరితోనూ పడి వుండరేమో కూడా.

నేను చేరిన కొత్తల్లో అనుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జట్ గురించి వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన ప్రత్యేక వార్తావాహిని తయారు చేస్తున్నారు. అభిప్రాయాలు రికార్డ్ చేసుకొచ్చే బాధ్యత నా మీద పడింది. అన్నీ తీసుకొచ్చి, ఆ టేపులన్నీ సత్యవతిగారికి వొప్పచేప్పేసి చక్కాపోయాను.  రాత్రి ఏడుగంటల నలభై అయిదు నిమిషాలకు  ప్రసారం. లోపల డబ్బింగు స్టూడియోలో సత్యవతి గారు నానా అవస్థ పడుతున్నారు. గొంతులు వినబడుతున్నాయి.  ఎవరి గొంతు ఎవరిదో తెలియచెప్పే ‘క్యూ షీట్’ సత్యవతి గారికి ఇవ్వడం మరచిపోయాను. ఓపక్క  టైం దగ్గర పడుతోంది. ఆవిడకి నరాలు తెగిపోయే టెన్షన్. నేనెక్కడో ఎవరితోనో కబుర్లు చెబుతూ కూర్చున్నాను. ఇప్పట్లా  సెల్ ఫోనులు లేని రోజులాయె.   ఆవిడ అనుభవమే ఆవిడకు  అక్కరకు వచ్చింది. కాని ఆరోజు,  డబ్బింగు పని  పూర్తిచేసి టేపు స్టూడియోలో వొప్పగించేసరికి ఆవిడ తల ప్రాణం తోకకు వచ్చివుంటుంది.

మరునాడు ఆఫీసుకు వెళ్ళిన తరువాత కాని నాకు విషయం తెలియలేదు. కనబడగానే బాగా కోప్పడాలి. కోపడ్డారు కూడా.  యెలా అనుకున్నారు? నోరు తెరిచి ‘ఇదేంటి శ్రీనివాసరావు గారూ’ అన్నారు. అంతే!  

రేడియోలో పనిచేసేవారికి ముందుగా ఓ నీతి పాఠం బోధిస్తారు.  యెంత క్లుప్తంగా (వార్త) చెబితే  భావం అంత ఖచ్చితంగా అర్ధం అవుతుంది అని. (Brevity is sole of expression).

సత్యవతి గారి భావం నాకు చాలా బాగా అర్ధం అయింది.  తీరు పూర్తిగా మార్చుకోకపోయినా  కొంత గాడిలో పడ్డాను. (అని అనుకున్నాను)

అలా,  మధ్యలో నేను మాస్కో రేడియోలో పనిచేసిన అయిదేళ్ళు మినహాయిస్తే ఆవిడ రిటైర్ అయ్యేవరకు కలిసే పనిచేశాం. 

వయసులో పెద్దావిడ కనుక మా అందరికంటే ముందుగానే రిటైర్ అయ్యారు. అప్పుడు ఆవిడ వయసు యాభయ్  ఎనిమిది.

ఇప్పుడు ఎనభయ్ ఎనిమిది. ఈ మూడు దశాబ్దాల కాలంలో అడపాదడపా కలుస్తూనే వున్నాం. అప్పుడప్పుడూ  ఫోన్ చేసి మాట్లాడేవారు.  

2019 డిసెంబరు చివర్లో  ఒకసారి నేనే ఫోన్ చేశాను. సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
అంతకంటేనా! తప్పకుండా రండిఅన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
దారిలో వెంకట్రామయ్య గారన్నారు. ఖార్ఖానాలో చంద్ర ఉంటాడుచూసి వెడదామని.
మదర్ తెరిస్సా వృద్ధాశ్రమంలో ఉంటున్న చంద్రను చూసాము. తన వేలికొనలతో కుంచె పట్టుకుని వేలాది అందమైన చిత్రాలను గీసిన ప్రసిద్ధ చిత్రకారుడాయన. ఎప్పుడో దశాబ్దాల క్రితం హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయచలన చిత్రోత్సవంలో ప్రతిరోజూ కలుసుకునే వాళ్ళం. వృద్ధాప్యం కారణంగా  ఆకారంలో వచ్చిన తేడా తప్ప మనిషిలో మార్పు లేదు. పొతే, వెంకట్రామయ్య గారూ చంద్రా ఏనాటి నుంచో ప్రాణ స్నేహితులు. నన్నాయన గుర్తుపట్టి పలకరించడమే నాకు వింత అనిపించింది. ఆయన మొహంలో ఆనందం చూస్తుంటే కోరుకున్న బొమ్మ చేతికి ఇస్తే ఓ చిన్న పిల్లాడు ఎలా కేరింతలు కొడతాడో ఆ దృశ్యం గుర్తుకువచ్చింది. కాసేపు కూర్చుని వచ్చేసాము. తరువాత సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారుఅన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు.

 వారి చిన్నతనంలో సంగతులు చెప్పారు. మాడపాటి హనుమంతరావు గారు హైదరాబాదు నగర మొదటి మేయరు. వారి సోదరుడి కుమారుడు మాడపాటి రామచంద్రరావు. వారి కుమార్తెలలో ఒకరు మాడపాటి సత్యవతి. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు హనుమంతరావు స్త్రీ విద్య ఉద్యమాన్ని ప్రారంభించి అందులో భాగంగా నిజాం సంస్థానంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను హైదరాబాదులోని ఇసామియా బజారులో ఓ చిన్న గదిలో ఏర్పాటుచేశారు. ఆడపిల్లలను చదువులకోసం బడులకు పంపడం ఆ రోజుల్లో అంత తేలికకాదు. ఎంతగానో శ్రమిస్తే నలుగురు ఆడపిల్లలు చేరారు. అందులో ఒకరు మాణిక్యాంబ గారు. ఆవిడ హనుమంతరావు భార్య. ఇప్పుడా పాఠశాల హైదరాబాదు నగరంలో చాలా ప్రాముఖ్యం కలిగిన మహిళా విద్యాలయంగా రూపుదిద్దుకున్నది. హనుమంతరావు చనిపోయిన తర్వాత దానికి వారి పేరు పెట్టారని మాడపాటి సత్యవతి చెప్పారు.

 మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.

మార్దవస్వరమాలతి  మాడపాటి సత్యవతి అంటారు అందుకే కాబోలు.

తర్వాత నాలుగు మాసాలకే  ఆ శ్రావ్యమైన రేడియో స్వరం శాశ్వతంగా మూగపోయింది.

కింది ఫోటో:

మాడపాటి సత్యవతి గారితో డి. వెంకట్రామయ్య గారు,  నేను


 

(ఇంకా వుంది)