తెలుగు తిథులు తోసుకువచ్చి, ఏడూడి, మొదటి ఆబ్దీకం మొదలైన మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ పది రోజులు ముందుగానే పూర్తయ్యాయి. కానీ, గుర్తు వుండిపోయేది, గుండెలో నాటుకుని సెల వేసేది ఇంగ్లీష్ తేదీనే కదా!
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున అపోలో ఆసుపత్రి నుంచి డాక్టర్ బాబీ ఫోను. ‘అందరూ వచ్చేసేయండి’
అందరం ఎందుకు? అందులోనే వుంది. అర్ధం చేసుకోవాలి. అయినా ముందు రోజు ఆసుపత్రికి బయలుదేరుతుంటే, అక్కరలేదు, ఈ ఒక్క రాత్రి చూసి రేపు డిశ్చార్జ్ చేస్తారు అన్నారు. ఏమి చూశారో మరి ఆ రాత్రి.
వెళ్ళే సరికి మా చుట్టపక్కాలు, సంతోష్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే వున్నారు. అంటే చిట్టచివర్లో తెలిసింది నాకే అన్నమాట. నా గుండె తట్టుకుంటుందో లేదో అని భయం. నాకసలు గుండె లేదనీ, దాని స్థానంలో ఓ రాతి బండ వుందనీ వాళ్లకు ఏం తెలుసు? ఆరేళ్ల క్రితం ఇదే ఆసుపత్రిలో మా ఆవిడను అంబులెన్స్ నుంచి అలా లోపలకు తీసుకువెళ్ళారు. ఓపీలోనే చెప్పేశారు, బ్రాట్ డెడ్ అని. కాకపొతే అలా చెప్పడానికి గంట పైన తీసుకున్నారు. చావు కబురు నిదానంగా చెప్పాలి అనుకున్నారేమో! మరి అంతకు ముందు, ఏం లేదు మామూలు వైరల్ ఫీవర్, మూడు రోజులు డోలో వాడితే తగ్గిపోతుందని అన్నారు. మూడో రోజు ఆ మాత్రల అవసరమే లేకుండా పోయింది.
ఇక సంతోష్ విషయంలో ముందు రోజు అలా వెళ్లి చూసి, వెంటనే వచ్చేయండి అని జాగ్రత్తలు చెప్పి ఐ సీ యు లోకి పంపిన వాళ్ళు, ఈరోజు లోపల ఎంతసేపు వున్నా మాట్లాడలేదు. మొహానికి, వంటికి పెట్టిన పరికరాలు, తీగెలు తీసేస్తున్నారు. వాడేమో వళ్ళు ఎరగని విధంగా నిద్రపోతున్నట్టు పడి వున్నాడు మంచం మీద. నలభయ్ ఏడేళ్ల జీవితానికి తెర పడిపోయింది.
దేముడికి పునర్జన్మల మీద నమ్మకం వున్నట్టు లేదు. మరుసటి జన్మవరకు వేచి చూడకుండా ఎప్పటిశిక్షలు అప్పుడే, ఆ జీవితకాలంలోనే వేసేస్తాడులా వుంది. పెద్దవాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్ళు పోవడాన్ని మించిన శిక్ష ఏముంటుంది?
04-02-2025
6 కామెంట్లు:
మీకు జీవితంలో తగిలిన డబల్ దెబ్బలు. దురదృష్టకరం.
కరోనా వచ్చిన కొత్తలో ఓ ముఖ్యమంత్రి గారు అదే అన్నారు - ఏయ్, ఏం లేదు, మామూలు జ్వరం లాంటిదే, అదేంందయ్యా ఆ గోలీ …. ఆఁ డోలో … అది తీసుకుంటే సరిపోతుంది.
// “ దేముడికి పునర్జన్మల మీద నమ్మకం వున్నట్టు లేదు. …… ఎప్పటి శిక్షలు అప్పుడే.,” // కరక్ట్ గా చెప్పారు. నేనూ ఎప్పుడూ అదే అంటుంటాను ….. ప్రతి మానవుడి ఎకౌంట్లన్నీ ఎక్కడ మెయిన్ టెయిన్ చేస్తూ కూర్చుంటాడు దేవుడు. కాబట్టి ఏ జన్మలో శిక్షలు ఆ జన్మలోనే పడతాయి. నేను చేసిన ఫలానా తప్పుకే ఇప్పుడు ఈ శిక్ష అని మనిషి అన్వయించుకోలేక పోవచ్చు కానీ ఇదే సెటిల్ మెంట్ విధానం దేవుడు అనుసరించేది అని నా నమ్మకం కూడా.
ఎప్పటి శిక్షలు అప్పుడే - అన్ని సమయాల్లో అది నిజం కాదు. కర్మకు తగిన ఫలితాలు ఎప్పుడు అనుభవానికి వస్తాయి అన్నది ఒకే ఫార్ములా ప్రకారం ఉండదు. కొన్ని వెంటనే ఫలితం చూపిస్తాయి. కొన్ని జన్మాంతరంలో కూడా పక్వానికి వస్తాయి. అన్ని కర్మలు ఇంస్టెంట్ ఫలితం ఇవ్వవు. దేవుడికి పునర్జన్మల మీద నమ్మకం ఉండడం కాదు మనకు ఉంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది
జన్మాంతరాల సంగతే నేను చెప్పినది కూడా పరోక్షంగా. అంత కాలం ఆగవు, ఈ జన్మలో తప్పులకు ఈ జన్మలోనే శిక్షలు అని నా నమ్మకం - instant కాదు, తప్పు చెయ్యగానే వెంటనే … వెంటనే శిక్ష పడకపోవచ్చు. ఎప్పుడు పడినా (ఈ జన్మలోనే) అది ఈ జన్మలో చేసిన (ఎప్పుడో ఒకప్పుడు…. ఆఁ ఈ జన్మలోనే) పాపానికే అంటాను నేను. కోట్ల మంది జనాల్లో ప్రతి మానవుడి పాపపుణ్యాల చిట్టా జన్మజన్మల లెక్కలు చూస్తూ, carried forward లు, brought forth లు, balance లు చూడడాలు ఒక జన్మ నుంచి మరో జన్మకు తీసుకు వెళ్ళడం కూడానా ? అలా ఉండదని నా వ్యక్తిగత అభిప్రాయం.
భగవంతునికీ బ్యాంకరులకీ అనుసంధానమైనది ట్రయలు బ్యాలెంసు :)
@vnr no in a single lifetime all karmas doesn't give results. Can one explain the sufferings, illnesses and deaths of very young people or even kids ? Can one explain the extreme poverty of some and richness of others ? Only cycle of many lives gives a plausible explanation. It is surprising you think in a single life accounts are settled.
Each to his own 🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి