‘ఒకటి
నుంచి పదిహేను వరకు నా గోల (సినిమాల ) నాది. పదిహేను నుంచి ఖాళీ అని కాదు కానీ, తీరిగ్గా
కలుసుకోవడానికి తీరుబాటు’ అన్నారు ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయశర్మ గారు.
నాకు
రాత్రిపూట టీవీల్లో వచ్చే ప్రతి పాత సినిమా చూసే అలవాటు. అంచేత శర్మ గారిని కలవలేకపోతున్నానే
బెంగ నాకు లేదు. ఏదో ఒక తెలుగు చిత్రంలో ఏదో ఒక పాత్రలో ఆయనను నేను చూస్తూనే
వుంటాను. పెద్ద చిత్రాల్లో చిన్న పాత్ర అయినా, చిన్న చిత్రాల్లో పెద్ద పాత్ర అయినా పాత్రోచితంగా నటించి మెప్పించే
సుప్రసిద్ధ నటుడు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మ.
శర్మగారికి నాకూ కొన్ని బాదరాయణ
సంబంధాలు వున్నాయి. ఆయనదీ నాదీ డిగ్రీ బెజవాడ ఎస్సారార్ కాలేజి. ఆయనకు రేడియో అంటే
రేడియో కాదు, ఆకాశవాణి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత
ఇష్టం అంటే తన మొబైల్ కు రేడియో సిగ్నేచర్ ట్యూన్ ని కాలర్ టోన్ గా పెట్టుకునేంత.
( నా మొబైల్ లో కూడా అదే ట్యూన్) నాకూ రేడియో అంటే ఇష్టమే ఎందుకంటే అది నా
మాతృసంస్థ కాబట్టి. ఆయనకు డెబ్బయి ఎనిమిది. iనా వయసు ఒక్కటి అంటే ఒకటి ఎక్కువ.
సంబంధాలు, పోలికలు ఇంత వరకే. ఆయన పాటించే స్నేహ ధర్మం విషయంలో కాని, ఆయనకు వున్న మంచి పెద్ద మనసులో కాని, అబ్బే ఆయనతో నాకు సాపత్యమే లేదు. ఈ విషయంలో ఆయన నాకంటే చాలా చాలా
పెద్దవాడు.
వారం
రోజుల కిందట ఫోను చేసి పదిహేనో తేదీన కలుద్దాం అని చెప్పినప్పుడు సంతోషం వేసింది.
ఎంతైనా పర్సనల్ గా కలవడం వేరు కదా! మతిమరపు రోగం ఒకటి వుంది ఎలా అనుకుంటే, నిన్న ఉదయం
మళ్ళీ ఫోన్ చేసి ఇవ్వాళ సాయంత్రమే మనం
కలిసేది అని గుర్తు చేయడం ఆయన సౌజన్యం. దానికి తోడుగా వాట్సప్ మెసేజ్.
అలవాటుగానే
ఆలస్యంగా వెళ్లాను. దాదాపు ఓ పాతికమందితో కొలువు తీరి కనిపించారు. వారిలో బాగా
తెలిసిన వారున్నారు. పేరు చెప్పగానే గుర్తు పట్టేవారు కొందరు వున్నారు. అసలు
తెలియని వాళ్ళు ఒకరిద్దరు వున్నారు. పైగా బెజవాడ ఎస్సారార్ కాలేజి జంధ్యాల బ్యాచ్
వాళ్ళు కనిపించారు. ప్రాణం లేచివచ్చినట్టు అనిపించింది. కాకపొతే, అందరితో కలిసి ఫోటో దిగే అవకాశం
లేకపోయింది.
కింది
ఫోటోలో చాలా లబ్ధ ప్రతిష్టులు వున్నారు. నా పక్కన వున్న సుబ్బరాయ శర్మ గారి
గురించి చెప్పేది ఏముంది?
అందరికీ తెలిసిన నటులే. సినిమా రంగంలో తెర వెనుక మనుషులు మనకి కొందరు కనిపించరు
కానీ, సినిమాని అందంగా మలచి మనకు చూపిస్తారు. అలాంటి వారిలో ప్రధమ తాంబూలం
ఇవ్వాల్సిన వ్యక్తి రఘు. బాండ్ జేమ్స్ బాండ్ లాగా రఘు, ఎం,వి, రఘు. సినిమా రంగంలో అనేక విభాగాల్లో
పనిచేసిన అనుభవం. ఫిలిం డైరెక్టర్,
స్క్రీన్ ప్లే రైటర్,
సినిమాటో గ్రాఫర్. 2023 ఆస్కార్
సెలక్షన్ జ్యూరిలో భారత దేశం తరపున సభ్యుడు. అన్నింటికీ మించి ఎస్సారార్ కాలేజి
సహాధ్యాయి. అలాగే మరో కాలేజి సహాధ్యాయి ప్రముఖ వైణిక విద్వాంసుడు అయ్యగారి
శ్యామసుందర్. పద్మశ్రీ వంటి అవార్డుకు తగిన విద్వత్ వున్న కళాకారుడు. ఇక కధా రచయిత,
కాలేజి మిత్రుడు, ఫేస్ బుక్ ఫ్రెండ్ మురళీ దేవరకొండ. ఆయన్ని గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన పని లేదు. మరొక చిత్రసీమ స్నేహితులు, ప్రముఖ సినీ రచయిత తోటపల్లి సాయినాద్.
మిగిలిన వాళ్ళు అందరు వారి వారి రంగాల్లో నిష్ణాతులైన కళాకారులు. వీరందరికీ దండలో
దారం వంటి ఒక ప్రముఖవ్యక్తి ఒకాయన నలుగురి
చాటున కనిపించారు. వివిధరంగాల్లో ప్రసిద్ధులైన అనేక మందికి అవార్డులు ఇచ్చారు కానీ
కళా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఎవరూ అవార్డు ఇచ్చినట్టు లేరు. ఆయనే కిన్నెర మద్దాలి రఘురాం.
ఈ సమావేశంలో ముందు చేసిన పని మొన్న పుట్టిన మిత్రుడు
జంధ్యాలను నిన్న స్మరించుకోవడం. వచ్చిన కళాకారులందరూ తమ అభ్యున్నతికి మొదట చేయూత ఇచ్చింది దూరదర్సన్
అని ప్రశంసించడం. అందులో సుదీర్ఘ కాలం పనిచేసిన చక్రవర్తి సేవలను ప్రస్తుతించడం.
అక్కడే వుండి అన్నీ విన్న చక్రవర్తి అవేవీ తనకు పట్టనట్టు హుందాగా మిన్నకుండిపోవడం బాగుంది. పొగడ్తలకు చక్రవర్తులు ఆనందిస్తారేమో కానీ పడిపోరు
కదా! దూరదర్సన్ లో నా సహచర మిత్రుడు చక్రవర్తిని అంతమంది కొనియాడుతుంటే నాకు చాలా
సంతోషం కలిగింది. ఈ ప్రశంసలకు చక్రవర్తి నూటికి నూరు శాతం అర్హుడు. (16-01-2025)
(PHOTO
COURTESY : Sri Raghava Reddy)
4 కామెంట్లు:
భండారు వారూ,
నటుడు సుబ్బరాయ శర్మ గారి వృత్తి ఏమిటండీ ?
He is a very good character actor in Telugu movies
అయ్యగారి శ్యామ్ సుందర్ గారు గొప్ప వైణికులు. ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం సముచితంగా ఉంటుంది.
Ex dgm sbi
కామెంట్‌ను పోస్ట్ చేయండి