“ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు.
ఈ ఇద్దరిలో ఒక ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు నా అభ్యర్ధనపై రెంట్ కంట్రోల్ చట్టం కింద ఇల్లు కేటాయించిన సంగతి, దాన్ని నేను వాడుకోలేకపోయిన విషయం ఆయనకు సంబంధించిన అధ్యాయంలో విశదంగా రాశాను.
ఇక అడగగానే ఇల్లు ఇచ్చిన రెండో ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు.
కిందటి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రుల ఇళ్ళ కధలు వినిపించా కదా! ఇక నా ఇళ్ళ పురాణం చిత్తగించండి.
చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులోఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన. ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. ‘పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే’ అన్నారాయన వెక్కిరింతగా.
వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు.
ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా ఆర్డర్ వచ్చింది.
2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో కాలం గడిపాము.
మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.
కాకపోతే, మా పక్క, వెనుక క్వార్టర్ లలో వున్న మామిడి చెట్ల నుంచి సీజనులో మా ఇంట్లో రాలిపడే మామిడికాయలు ఉచితం.
చివరకు చంద్రబాబు పేషీలో అధికారి చెప్పినట్టే జరిగింది. 2005 డిసెంబరు ఆఖర్లో రిటైర్ కాగానే, అంతవరకూ బకాయి పడ్డ అద్దె మొత్తాలను, కరెంటు, నీటి బిల్లులను సెటిల్ చేసి క్వార్టర్ ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడమే కాకుండా, నా రిటైర్ మెంటు బెనిఫిట్స్ నుంచి వసూలు చేసి, ఇక నీ ఇష్టం వచ్చిన చోటికి పొమ్మన్నారు. గవర్నమెంట్ డబ్బా మజాకా!
అరవై ఏళ్ల వయసులో, నాకు దక్కిన షష్టిపూర్తి పూర్తి కానుక అనుకుని సంతృప్తి పడ్డాను.
పిల్లి పిల్లల్ని పెట్టి, ఏడిళ్ళు మారుస్తుందని అంటారు. మేము మా పిల్లలతో కలిసి ఏడిళ్ళకు పైగా మారి ఉంటాము. ఆఖరికి ఇళ్ళ సమస్యలేని మాస్కోలో కూడా రెండు ఫ్లాట్లు మారాము. మాస్కో వెళ్ళేటప్పటికే ఊలిత్స వావిలోవాలోని రేడియో మాస్కో భవనంలో మాకోసం డబల్ రూమ్ ఫ్లాటు సిద్ధంగా వుంచడం, దాంట్లో చేరిపోవడం జరిగింది. అందులో ఒక చిన్నపొరబాటు జరిగింది. దాన్ని అధికారులే గుర్తించి దిద్దుకున్నారు. పిల్లల సంఖ్యను బట్టి ఎన్ని పడక గదులు ఉండాలో నిర్ణయం అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు కాబట్టి మూడు పడక గదుల ఫ్లాటుకు వెంటనే మార్చారు. మంచాలు, పరుపులతో సహా సమస్తం అమర్చి పెట్టిన ఫ్లాట్ కాబట్టి ఆ అయిదేళ్ళు కాలుమీద కాలువేసుకుని కాలక్షేపం చేశాము.
1975 లో హైదరాబాదు రేడియోలో చేరినప్పుడు 75 రూపాయలకు అశోక్ నగర్ చమన్ దగ్గర ఒక వంటిల్లు, ఒక గదితో మా జీవనయానం మొదలయింది. అక్కడి నుంచి చిక్కడపల్లి సుధా హోటల్ దగ్గర మరో వాటాలో దిగాము. అక్కడే మా ఆవిడ ‘అమ్మ ఒడి ‘పేరుతొ ఒక చైల్డ్ కేర్ సెంటర్ మొదలు పెట్టింది. 1987 లో మాస్కో వెళ్ళేవరకు అదే ఇల్లు. తిరిగొచ్చిన తరువాత మకాం పంజాగుట్ట వైపు మారింది. దుర్గానగర్‌లో రెండిళ్ళు , తరువాత అమీర్ పేటలో మరో ఇల్లు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్ ఆఫ్ టర్న్ పద్దతిలో కేటాయించిన ఎర్రమంజిల్ ఐ.ఏ.ఎస్. కాలనీకి మా మకాం మారింది. , సెకండ్ క్లాసు టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న అనుభూతితో అక్కడి క్వార్టర్ లో కొన్నేళ్ళు కాపురం. రిటైర్ కాగానే, తదుపరి ఎల్లారెడ్డి గూడా. తరువాత మజిలీ మాధాపూర్. ఇలా మారుతూ, మారుతూ ఊరి చివరకు చేరుతామేమో అనుకున్నాము. ఒకప్పుడు ఇంట్లో ఒంట్లో బాగా వున్నవాళ్ళు ఊరి నడిబొడ్డున వుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళూ ఊరి పొలిమేరలకు చేరి విల్లాలు కట్టుకుంటున్నారు. మా పక్కన పలానా పెద్దమనిషి వుంటున్నాడని మేమూ చెప్పుకునే రోజు వస్తుందేమో అని కూడా ఆనందపడ్డాము. ఇలా ఇళ్ళు మారడంలో ఓ సులువు కూడా వుంది. కొత్త ప్రాంతాలు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అదే కట్టుకున్న సొంత ఇల్లు అయితే, ఒండుకున్న అమ్మకు ఒకటే కూర సామెత చందం.
ఇలా రోజులు గడుపుతున్న రోజుల్లో ఓ రోజున, మా ఇంటాయన, ఆయన ఢిల్లీలో ఉంటాడో, విశాఖపట్నంలో ఉంటాడో తెలియకుండానే ఈ ఇంట్లో దిగాము, తాలూకు ఒక పెద్ద మనిషి వచ్చి చల్లటి కబురు చెవులో వేసి వెళ్ళాడు, రెండు నెలల్లో ఇల్లు ఖాళీ చేయమని.
మరి, ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు రెండేళ్ళు దాటుతోంది కదా! అడక్క వారికీ తప్పదు, ఖాళీ చేయక మాకూ తప్పదు. అంతయు మన మేలునకే అనుకుంటే పోలా అని మళ్ళీ ఇల్లు మారాము..
కొసమెరుపు: భూమి గుండ్రం సామెత మాదిరిగా మళ్ళీ యెల్లారెడ్డి గూడాకే, అదే మధుబన్ ఫ్లాట్ కి మళ్ళీ చేరాం.
(ప్రాణం పోసిన వాడు ఆవాసం చూపించడా)
కింది ఫోటో:
కాలు విరిగి ఆసుపత్రిలో వున్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నాటి, నేటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
(ఇంకావుంది)
1 కామెంట్:
సార్ ఇప్పటికైనా హైదరాబాదులో స్వంత ఇల్లు ఉందా మీకు ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి