“ మా ముత్తాత రామయ్య గారి భార్య శేషమ్మ గారు. ఆమె దాదాపు ఎనభయ్ ఏళ్ళకు పైగా బతికింది. రామయ్య గారి దంపతులకు ముగ్గురు కుమారులు. పర్వతాలయ్య (మా తాతగారు), లక్ష్మీ నారాయణ, వెంకట సుబ్బారావు. కొడుకులలో పెద్దవాడయిన పర్వతాలయ్య గారిదే కరణీకం. చాలా కాలం అంతా కలిసే వున్నారు. అప్పుడు మా ఇల్లు ఉత్తర ముఖంగా వుండేదిట. ప్రస్తుతం సుబ్బయ్య తాతయ్య జాగాలోకి వున్న బేస్ మట్టం, మెట్లు అప్పుడు ఇంటికి సింహ ద్వారం వైపు ఉండేవి. ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి కావడం వల్ల మా నాన్నగారు రాఘవరావు గారు ఇప్పుడున్న ఇంటిని నిర్మించారు. కొద్దిగా కాలిన దూలాలను కొన్నింటిని కొత్త ఇంటి నిర్మాణంలో వాడారు. జాగ్రత్తగా పరికించి చూస్తే ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ కానవస్తాయి.
ఆ రోజుల్లో ఊళ్ళోకి తాసీల్దారు రావడం అంటే గొప్ప విషయం. వూరికి వచ్చిన తాసీల్దారు పొలాల వెంట తిరుగుతూ అడంగల్ లో రాసిన విధంగా పంటలు వాస్తవంగా వేసేవారో లేదో ప్రత్యక్షంగా తనిఖీ చేసేవాడట. అందుకోసం ఆయన దర్జాగా మేనాలో వెడుతుంటే , కరణం, మునసబులు ఆ మేనాకు చెరో వైపు, వెంట పరిగెత్తుతూ పంటల వైనం, సర్వే నెంబర్లు వివరించేవారట. అప్పుడు అందరికీ గుర్రాలు ఉండేవి. ప్రయాణాలు ఎక్కువభాగం కాలినడకనా, గుర్రాల మీదా సాగేవి. ఆడవాళ్ళు మేనాలో గాని ఎద్దు బండ్లపై గాని ప్రయాణం చేసేవారు. నేను కాలేజీ చదువులకు వచ్చే వరకు ఆ మేనా మా ఇంట్లో వుండేది. మోతుబరులు, కరణాలు గుడిసె బండ్లలో వెడితే, సంసారులు(రైతులు) జల్లబండ్లలో వెళ్ళే వాళ్ళు. బండ్ల ప్రయాణాల్లో జీతగాళ్ళు ఎడ్ల తాళ్ళు పట్టుకుని ముందు నడుస్తుంటే వెనుక వెట్టివాళ్ళు (వాళ్ళు గ్రామోద్యోగులయినా వెట్టివాళ్లనే పేరు పోలేదు. ఒకప్పుడు వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. మోతాదు, వెట్టి వాడు అని పిలిచేవాళ్ళు. మా నాన్నగారివద్ద అలాటివాళ్ళు ముగ్గురు వుండేవాళ్ళు. ఇప్పుడు వారికి సమాజంలో గౌరవం లభించేలా వారి ఉద్యోగ హోదాలు మార్పు చేయడం అభిలషణీయం)
బండ్లు వెడుతున్నప్పుడు వడ్డేరకాలు (బాటలో ఎత్తుపల్లాలు) వచ్చినప్పుడు బండి పడిపోకుండా వాళ్ళు బండి చక్రం పట్టుకుని బరువానేవాళ్ళు. వానాకాలం దోవ బురదగా వుండి బండి చక్రాలు కూరుకుపోతాయనే భయంతో ఒక్కొక్క బండికి రెండేసి జతల ఎడ్లను కట్టే వాళ్ళు. అసలా రోజుల్లో కరణాలు తప్ప ఎవరూ బండ్లు కట్టి ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. వ్యవసాయపు పనులు చెడతాయని కొంతా, ఎడ్లు దెబ్బతింటాయని కొంతా భయం.
ఆరంభంలోనే చెప్పినట్టు, ఇది నా ఒక్కడి కధ కాదు. మా ఊరి కధ. మా కుటుంబం కధ. నేను పుట్టకముందు, పుట్టిన తరవాత, నాటి జీవన విధానాలు, సాంఘిక, ఆర్ధిక, సామాజిక పరిస్థితులు నా తరువాత తరం వారికి తెలియచెప్పాలనే ప్రయత్నంతో మొదలుపెట్టిన కధ. సహజంగా ఇటువంటి సొంత విషయాల్లో బయట వారికి ఆసక్తి వుండదు. ఆ సంగతి పూర్తిగా తెలిసే ఈ ప్రయత్నం మొదలు పెట్టాను. ఒక చరిత్రను రికార్డు చేయడమే ఈ రచన ధ్యేయం.
పునరుక్తి దోషం అయినా మరోమారు నా తత్వం గురించి చెబుతాను.
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడినని గారాబం చేయడంతో, మా కుటుంబంలో ఎవరికీ లేని మొండితనం, మంకుపట్టు నాకు అబ్బాయి.
ఈ స్వగతం ఎందుకంటే నాలోని ఆ మొండితనమే మా ఊరు గురించి, చిన్ననాటి కబుర్లు గురించి నాచేత ఇంతగా రాయించేలా చేస్తోంది. రోజులో సింహభాగం కంప్యూటర్ ముందే గడిచిపోతోంది. ‘బాగున్నాయి, బాగా రాస్తున్నారు’ అని ఎవరయినా కితాబులు ఇచ్చినప్పుడు, ‘పోనీలే! మొండితనం కూడా ఒక రకంగా మంచితనమే’ అనుకుంటున్నాను.
రాయడం నాకు కొత్తేమీ కాదు, బ్లాగుకూ, పత్రికలకీ వందల కొద్దీ వ్యాసాలు, వేల పుటల్లో రాసాను. కానీ అవన్నీ రాజకీయ అంశాలు.
ఈ విషయంలో నాకెందరో సహకరించారు. సహకరిస్తున్నారు. ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. ఇంకా చెబుతున్నారు. నేను రాసిన వాటిల్లో ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాను. నిజానికి చాలా సందర్భాల్లో నేను అనేవాడినే అప్పటికి లేను. నేను పుట్టక ముందు జరిగిన అనేక సంగతులు చాలామందిని అడిగి తెలుసుకున్నాను. నాకే డెబ్బయి తొమ్మిది నడుస్తోంది. చాలామంది రాలిపోయారు. మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు, కంభంపాడు స్కూల్లో నాతో కలిసి చదువుకున్న చిన్నప్పటి స్నేహితులు తుర్లపాటి సాంబశివ రావు, వేమిరెడ్డి ఓబులరెడ్డి (కోటిరెడ్డి, కోటయ్యఅని పిలిచేవాళ్ళం), పమ్మి సత్యమూర్తి, పర్సా రామ్మూర్తి చనిపోయారు. విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు. మా అక్కయ్యలు తుర్లపాటి సరస్వతి, కొమరగిరి అన్నపూర్ణ రాసిపెట్టుకున్న సంగతులు నాకు అక్కరకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. కాని వారి జ్ఞాపకాలు ఇలా నా రాతల్లో మిగిలిపోయాయి. ఇలా ఎందరి నుంచో సేకరించిన ఇంకా ఎంతో సమాచారం నా మెదడులో నిక్షిప్తం అయి వుంది. నెమ్మదిగా బయటకు తీసి అక్షర రూపం ఇవ్వాలి. దీనికి తోడు నాకు సంప్రాప్తించిన మతిమరపు రోగం తాలూకు భయం ఒకటి. అదృష్టవశాత్తు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు రాసి వుంచిన భండారు వంశం వివరాలు లభించాయి.
మా పెద్దన్నయ్య బహుగ్రంధ కర్త. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎంతో శ్రమించి మా వంశానికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరించారు. పుట్టపర్తిలో ఒక చిన్న గదిలో వుండి రాసిన ఈ వివరాల వ్రాత ప్రతులను మా వదిన గారు సరోజినీ దేవి పదిలంగా హైదరాబాదు చేర్చి మా అన్నయ్య రామచంద్రరావుగారి ఇంట్లో భద్రపరిచారు. ఆ భాండాగారంలో దొరికిందే మా అన్నయ్య రాసిపెట్టిన ‘భండారు వంశం’.
కంభంపాడులో భండారు వంశానికి మూలపురుషుడు వీరేశలింగం అని ఆయన పేర్కొన్నారు. వాడేల రామరాజు గారని ఒకరుండేవారు. ఆయన భార్య బుచ్చమ్మ. వారికి మగపిల్లలు లేరు. ఒక్కతే కుమార్తె. ఆమెను కంచెల గ్రామంలో భండారు వీరేశలింగం గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరేశలింగంగారు కంభంపాడుకు వచ్చి స్థిరపడ్డారు. (ఒకరకంగా ఇల్లరికం అన్నమాట). భండారు లక్ష్మయ్య కులకర్ణి గారు రాసిన ఒక అర్జీలో ఇంటి పేరును స్పష్టంగా ‘భండారు’ అనే రాసారు. కనుక భండారు వీరేశం లేక భండారు వీరేశలింగం అనే ఆయన కంభంపాడులో, భండారు కుటుంబానికి మూలపురుషుడు అనడంలో సందేహం లేదు. వేములపల్లి భండారు వారు లింగాలను ధరించారు. అయితే కంచెల, పల్లగిరి భండారు వారు, వారివలె లింగధారులు కారు. ఆరువేల నియోగులు. స్మార్తులు. యజుస్మాఖాధ్యాయులు. ఆపస్తంభ సూత్రులు.
కింది ఫోటోలు :
మా అమ్మగారితో అమ్మలగన్న అమ్మలు మా అక్కయ్యలు
జీవిత చరమాంకంలోఆధ్యాత్మిక రచనా వ్యాసంగంతో మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు
(ఇంకా వుంది )
9 కామెంట్లు:
// “ ఇటువంటి సొంత విషయాల్లో బయట వారికి ఆసక్తి వుండదు. “ //
నాకు ఆసక్తేనండి. మీ స్వంత విషయాల గురించి కాదు గానీ చరిత్ర అంటేనూ, ఆనాటి జీవనవిధానం వివరాలంటేనూ … నాకు బహు కుతూహలం. కాబట్టి కొనసాగించండి.
సొంత విషయాల పట్ల ఆశక్తి ఉండదు అని మీరు ఎలా అనుకుంటారు ??
బయోగ్రఫీ లు కూడా సొంత విషయాలే కదా , కానీ ఆ పుస్తకాలూ ఎందుకు అమ్ముడుపోతాయి ? ఆశక్తి ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు .
ఆ రోజుల్లో మనుషులు సామాజికంగా ఎలా జీవించేవారో , ఆలోచన విధానం ఎలా ఉండేదో ఇవన్నీ తెలియాలంటే ఎవరో ఒకరి గురించి చదవాలి కదా ... అది సొంత విషయాలో , బయటి విషయాలో ....
ఒక చిన్న ప్రశ్న ... మీ పెద్దన్నయ్య గారు , చాలా పరిణితి గలవారు , బహు గ్రంథ కర్త అని రాశారు కదా .
ఆయనకీ సత్యసాయి బాబా గారి మీద భక్తి , నమ్మకం రావడానికి గల కారణం ఏంటి ? కుతూహలం కొద్దీ అడుగుతున్నాను . మా స్నేహితులతో ఆయన గురించి చెరిగిన చర్చ లు నన్ను ఈ ప్రశ్న అడగించాయి . అప్రస్తుతం అనుకుంటే మీరు సమాధానము ఇవ్వొద్దు
9849130595 మీరు అజ్ఞాతం వీడి ఫోన్ చేయండి. మీ సందేహం నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను సరేనా!
జిలేబి ఫోన్ నెంబరు బయటపడింది !
🙂🙂ఆ ఫోన్ నెంబర్ భండారు శ్రీనివాసరావు గారిదే నండీ.
“జిలేబి” అంత తేలికగా దొరికిపోతారా ? 🙂 అరవల ఊతపదంలో అన్నట్లు “ఛాన్సే లేదు”.
Please do continue this fascinating narrative. I have read all of the stories in this series, and I eagerly look forward to reading the forthcoming ones. While reading your life story, I am reminded of my own similar experiences of how life was while I was growing up in villages both in Telenagana and Andhra Pradesh.
All the best.
-
విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు...
మంచి నిర్ణయం తీసుకున్నారు వ్రాయటానికి
కొనసాగించండి
భండారు వీరేశం గారికి లక్ష్మయ్య గారికి మధ్య ఎన్ని తరాలు ?/ఆ లింకు మిస్సింగ్
బండారు వారు కామెంట్లు చదువుతున్నట్లుంది
చదువుతారు. జవాబివ్వడమే అరుదు 🙂.
కామెంట్‌ను పోస్ట్ చేయండి