26, మే 2021, బుధవారం

గురు దక్షిణ

 స్వాతంత్రానంతరం పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని దేశంలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సర్కారు కొలువులు  పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు గ్రామీణులకు తెలిసిన ఉద్యోగాలు కొన్ని మాత్రమే. తహసీల్దారు, మునసబు, కరణం, పోస్టు మేష్టారు, బడి పంతులు వగైరా.

తరవాత్తరవాత బీడీవో, ఆయన కింద రకరకాల  ఎక్స్ టెన్షన్ అధికారులు. పేరులో అధికారి అని వున్నా నిజానికి అవి గుమాస్తా వంటి చిన్న ఉద్యోగాలే. వాటిని తెలుగులో విస్తరణాధికారి అంటున్నారు. అలాంటి వాటిల్లో ఒక దాంట్లో మా  రెండో అన్నయ్య కూడా ఖమ్మం జిల్లాలో చేరాడు. తదనంతర కాలంలో ఆయన స్టేట్ బ్యాంక్ పీవోగా సెలక్ట్ అయి ఆ బ్యాంక్ చీఫ్ జనరల్ గా రిటైర్ అయ్యారు.

గ్రాడ్యుయేషన్ కాగానే మా అన్నయ్య చేసిన ఉద్యోగాల్లో బ్లాక్ ఎస్.ఈ.వొ., ఒకటి. ఆ రోజుల్లో పంచాయతి సమితిని బ్లాక్ అనేవారు. అంతకు ముందే ఒక పెద్ద మనిషి మధిర ప్రాంతం నుంచి కొత్తగూడెం వెళ్లి అక్కడ పంచాయతీ సమితిలో ఇలాంటి ఉద్యోగంలోనే చేరారు. ఆయనే ఈ పోస్టుకు కథానాయకుడు. పేరు చేకూరి కాశయ్య. స్వయం కృషికి మారుపేరు. కొత్తగూడెం సమితిలో పనిచేసింది కొద్ది కాలమే అయినా, అయన పనికట్టుకుని ఊరూరూ తిరిగారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా స్థానికులతో చక్కటి పరిచయాలు పెంచుకున్నారు. స్వతహాగా నలుగురితో కలిసిమెలిసి తిరిగే మనస్తత్వం కావడం వల్ల అతి త్వరగా అన్ని గ్రామాల్లో కాశయ్య గారి పేరు తెలవని వాళ్ళు అంటూ లేకుండా పోయారు.

ఇంతలో పంచాయతీ సమితి ఎన్నికలు వచ్చాయి. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి సమితి ప్రెసిడెంట్ కాగలిగారు. ఇది కేవలం ఆయన స్వయం కృషి.

ఆ రోజుల్లో విల్లీస్ జీపులు ఉండేవి. జిల్లా మొత్తంలో కొద్ది మంది అధికారులకే వాహన యోగం. వారిలో ఒకరు డీ.పీ.ఆర్.వొ.  కాకపొతే ఉద్యోగ అవసరాల దృష్ట్యా జీపు బదులు పెద్ద వ్యాన్ వుండేది. (మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కెరీర్ ఈ ఉద్యోగంతోనే మొదలయింది. తదనంతర కాలంలో అదే శాఖకు అంటే సమాచార, పౌర సంబంద శాఖకు డైరెక్టర్  అయ్యారు) మరొకరు బ్లాక్ డెవలప్ మెంటు ఆఫీసర్ (బీ.డి.వొ). ఆయన దౌరాకు బయలుదేరి జీపు ఎక్కగానే బిలబిల మంటూ కింది ఉద్యోగులు జీపు వెనక సీట్లలో సర్దుకు కూర్చొనే వారు.

మొన్న మొన్నటిదాకా కాశయ్య గారు కూడా అలా ఎగబడి తోసుకుని వెనక సీట్లో ఇరుక్కుని కూర్చుని ప్రయాణాలు చేసిన వారే. కానీ ఆయన ఇప్పుడు సమితి ప్రెసిడెంటు. ఆ హోదాలో ఆయన సీటు ముందుకు మారింది. ఆయన ఎంత నిరాడంబరజీవి అంటే ఇటువంటి విశేషాలన్నీ ఆయనే తన సహచరులతో పంచుకునేవారు.

ఇక తర్వాత జిల్లా మొత్తానికి జిల్లా పరిషద్ చైర్మన్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే. ఇలా అనేక మెట్లు ఎక్కినా ఆయన తన మూలాలని మరచిపోలేదు. తనతో కలిసి పనిచేసిన, లేదా తనకు పరిచయం వున్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకునేవారు. మనిషి మొహం చూసి బాగున్నారా అని పలకరించడం కాకుండా పేరు పెట్టి పిలిచి మరీ ఆత్మీయత చూపేవారు.

ఉద్యోగ పర్వంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ చెన్నై స్టేట్ బ్యాంక్ సీ జీ ఎం గా వెళ్ళిన మా అన్నయ్య ఒకసారి   వివాహ వేడుక  కోసం ఖమ్మం వచ్చారు. ఆ సమయంలో రైల్వే ప్లాటు ఫారం మీద కాశయ్య గారు కనబడ్డారు.  ఆయన గబగబా దగ్గరకు  వచ్చి ఏం రామచంద్ర రావు గారు, ఎలా వున్నారు, ఇప్పుడు మద్రాసులో ఉన్నారట కదా!’ అని పలకరించేసరికి మా అన్నయ్య ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. పేరు గుర్తు ఉండడమే కాదు, తాను ప్రస్తుతం ఏ వూళ్ళో వున్నది తెలిసింది అంటే తన పరిచయస్తులను గురించి ఆయన కనుక్కుంటూ ఉంటారని ఆయనకు అర్ధం అయింది. ఉన్నత స్థానాలకు ఎదిగిన  మనుషుల్లో ఇది చాలా అరుదనేది మా అన్నయ్య అభిప్రాయం.

కొన్నేళ్ళ క్రితం ఖమ్మం వెళ్ళాను, డాక్టర్ ఏ.పీ. రంగారావు గారితో  కలిసి 104 పని మీద. ఖమ్మం వచ్చాము కదా అని ఫోన్ చేస్తే కాశయ్య గారు వెంటనే మేమున్న గెస్ట్ హౌస్ కు వచ్చారు. మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్లి,  ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్డు అంటారేమో, దాన్ని దాటి వెళ్లి,  నిర్మాణంలో వున్న గురు దక్షిణ ప్రాంగణాన్ని చూపించారు. చాలా విశాలంగా చాలా బాగా నిర్మిస్తున్నారు. అక్షరం ముక్క నేర్పి సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చి దిద్దిన గురువులకు దక్షిణగా వారి శేష జీవితం సుఖ ప్రదంగా వుండడం కోసం కాశయ్య గారు తలపెట్టిన బృహత్ పధకం అది.

ఆ వయసులో కూడా  ఆయన పడుతున్న తపన, శ్రద్ధ చూస్తే ముచ్చటేసింది.

స్వయం కృషితో తాను అనుకున్నది సాధించి, ఎన్నో  ఎత్తులకు ఎదిగి కూడా  పాదాలను ఆన్చిన తల్లి నేలను మాత్రం మరచిపోని  కాశయ్య గారికి నా అశ్రు నివాళి


(చేకూరి కాశయ్య)

( (25-05-2021)          

కామెంట్‌లు లేవు: