13, జనవరి 2021, బుధవారం

ఉండవల్లి చెప్పిన సుడిగుండాల కధ - భండారు శ్రీనివాసరావు

 

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మాజీ పార్లమెంటు సభ్యుడు,తెలుగునాట సుబ్రమణ్యస్వామి అయిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి విలేకరులతో ప్రసంగించారు.
మాట్లాడుతున్నట్టు,ముచ్చట్లు చెబుతున్నట్టు గంటకు పైగా సాగినట్టు అనిపించిన ఈ ప్రసంగాన్ని చేటలో వేసి చెరిగి,రాజకీయాలను వడబోసిచూస్తే మాత్రం అందులో కొన్ని ఆధ్యాత్మిక ఛాయలు గోచరిస్తాయి. కానీ ఉండవల్లి ఏమి మాట్లాడినా రాజకీయ రంగు కనబడకుండా వుండడం అతి కష్టం. ఒక జాతీయ పార్టీని మనసులో పెట్టుకుని నర్మగర్భంగా విమర్శలు చేస్తూ పోయినా,చివరికి ఆ పార్టీని, ఆ పార్టీ అధినాయకుడిని పేరు పెట్టే మాట్లాడారు.
ఎప్పుడైతే రాజకీయం రంగప్రవేశం చేస్తుందో ఇక ఆ చెప్పిన దానికి రంగులు మారిపోతాయి.
అయితే,రాజకీయ పార్టీలకి,వాటికి వత్తాసు పలికే మీడియాకు ఉండవల్లితో ఒక వెసులుబాటు వుంది. ఆయన అన్ని పార్టీలని తెగిడేస్తారు. ఆ నోటితోనే అన్ని పార్టీలని పొగిడేస్తారు. కాబట్టి ఆయన ప్రసంగాన్ని ముక్కలు ముక్కలు చేసి ఎవరికి కావాల్సిన ముక్కను వాళ్ళు ప్రసారం చేసుకోవచ్చు. నిన్న కొన్ని టీవీల్లో అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ చూసిన వారికి ఈ విషయం బాగా అర్ధం అయ్యేవుంటుంది.
అతి తీవ్రమైన రాజకీయ వ్యాఖ్యలు మినహాయిస్తే ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి.
వివేకానందుడి బోధనలు కూర్చిన “Selected works of Swami Vivekananda” అనే గ్రంధంతో పాటు మరికొన్ని పుస్తకాలను దగ్గర పెట్టుకుని తాను చెప్పే విషయం ఏ పేజీలో వుందో ఆ పేజీ నెంబరుతో సహా పేర్కొంటూ ఆయన తన ప్రసంగం కొనసాగించడం ఒక విశేషం.
నేను విన్నంత వరకు ఆయన చెప్పిన విషయాలను సంక్షిప్తంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. వింటూ నోట్ చేసుకున్న సంగతులు కనుక పొరబాట్లు దొర్లితే దానికి నాదే బాధ్యత. ఉండవల్లి వారిది కాదు. కొన్ని ఆయన మాటల్లోనే:
“కాశ్మీర్ లో ఖీర్ (క్షీర్ ) భవానీ దేవాలయానికి స్వామి వివేకానంద వెళ్ళారు. (ఎప్పుడో వందేళ్ళ క్రితం నాటి మాట). అక్కడి దేవతా విగ్రహాన్ని తురుష్కులు పాడు చేశారు. జగన్మాత విగ్రహం అలాంటి దుస్థితిలో వుండడం చూసి వివేకానందుడికి తట్టుకోలేని బాధ,పట్టరాని కోపం కలిగాయట. “ఇలాంటి పనిచేసిన వారిని...” అని భావోద్వేగంతో తల్లడిల్లుతుంటే భవానీ మాత పలుకులు ఆయన చెవికి సోకాయి. “నువ్వు నన్ను కాపాడతావా లేక నేను నిన్ను కాపాడుతానా? ఏమి మాట్లాడుతున్నావు?” (పేజీ 130)
“దేశానికి ‘హిందుత్వ’నినాదాన్ని ప్రసాదించిన వీర సావర్కార్ కి దేవుడు అంటే నమ్మకం లేదు. ఆయన నాస్తికుడు. ఇంకో విచిత్రం ఏమిటంటే జిన్నా మూల పురుషులు హిందువులు. వాళ్ళ తాతగారు రాజపుట్. చేపల వ్యాపారం చేస్తాడని కులం నుంచి వెలి వేస్తె ముస్లిములు దగ్గరకు తీశారు. పేదవాడిని కులంపేరుతో దూరం చేసుకుంటే బ్రహ్మం అనే పేరు కలిగిన హిందువు అబ్రహాం అవుతాడు,ఇబ్రహీం అవుతాడు. మతాల మార్పిళ్లు ఆగాలంటే ముందు హిందూ మతంలో వున్న ఈ అవలక్షణాన్ని సరిచేసుకోవాలి.”
వివేకానందుడు ఇదే చెప్పాడు.
“పరమత సహనం అనేది మంచి మాట కాదు. మనం ఎవరం వారిపట్ల సహనం చూపించడానికి. నిజానికి అది దైవ దూషణ కిందికి వస్తుంది. మరో దేవుడిని కించపరచడమే. పరమతాన్ని ఒప్పుకోవాలి. నేను అన్ని మతాలను ఒప్పుకుంటున్నాను. క్రైస్తవులతో కలిసి వారి చర్చికి వెళ్లి వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తే నేనూ అలా చేస్తాను. ముస్లిములతో కలిసి మసీదుకు వెళ్లి వారు ఎలా నమాజు చేస్తే నేనూ అలాగే చేస్తాను. అలాగే బౌద్ద ఆరామాలలో” (పేజీ 374)
మత మార్పిడులకు ప్రధాన కారణం అస్పృశ్యత అని అంటూ ఉండవల్లి ఓ ఉదాహరణ చెప్పారు.
“పూర్వ కాలంలో తెల్లవాళ్లు మనని పాలించేటప్పుడు వారికి సంఘంలో చాలా గౌరవం వుండేది. పల్లెటూళ్ళలో అంటరానివారిని దూరంగా పెడతారు. వారికి గ్రామ కారణం,మునసబు వీరే పెద్దలు. అలాంటివాళ్ళు కూడా తెల్ల దొర రాగానే లేచి నిలబడి మర్యాద చేయడం వీరు గమనించిన తర్వాత ఆ తెల్లదొర మన మునసబు, కరణాలకంటే గొప్పవాడనే అభిప్రాయం వారికి కలుగుతుంది. అంత గొప్ప తెల్లదొర నేరుగా తమ గూడేనికి వచ్చి తమను గుండెలకు హత్తుకుని మనందరం ఒకటే అని చర్చికి తీసుకుపోతే మతం మారకుండా ఎలా ఉంటాడు. వాడు మారుతున్నాడని గుండెలు బాదుకుంటే ప్రయోజనం ఏమిటి? హిందువులు తమలోని అన్ని కులాల వారినీ సమానంగా అక్కున చేర్చుకుని వుంటే ఈ దుస్థితి దాపురించేది కాదు”
వై.ఎస్. గురించి కూడా ఉండవల్లి ఓ జ్ఞాపకాన్ని మననం చేసుకున్నారు.
“వై.ఎస్.ఆర్. కి మత పట్టింపులు లేవు. ఒకసారి అన్నవరం దేవస్థానంలో చక్కగా కూర్చుని చాలాసేపు వ్రతం చేశారు. నేను దూరంగా నిలబడి వుంటే, ‘నువ్వేం బ్రాహ్మడివయ్యా వచ్చి కూర్చో’ అని పిలిచారు.
“ఇక ఆయన బాబాయి సుబ్బారెడ్డి గారెని మించిన హిందువు లేడు. గ్రహణ కాలం పూర్తయిన తర్వాత కానీ వాళ్లింట్లో వంటలు వండరు. అంత నిష్టగా వుంటారు. సుబ్బారెడ్డి గారి భార్య పొద్దున్నే నల్లావుకి (కపిల గోవు) దణ్ణం పెట్టుకొని కానీ ఏ పనీ చేయరు”
“ప్రపంచంలోని మిలిటరీ అంతా తెచ్చినా మన దేశంలో గుళ్ళకి కాపలా పెట్టడం సాధ్యం కాదు. ఇక్కడి నుంచి మా ఇంటికి అయిదు నిమిషాల నడక. ఈ కొద్ది దూరంలోనే నాలుగు దేవాలయాలు వున్నాయి. అయితే మన పోలీసులు కడు సమర్ధులు. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే ఇరవై నాలుగు గంటల్లో దోషులని పట్టుకుంటారు. దొరికినవాళ్ళు వైసీపీ అని టీడీపీ, టీడీపీ వాళ్ళు అని వైసీపీ పేచీలు పెట్టకూడదు. అలా అయితేనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగవు. అసలు రామతీర్ధం వంటి సంఘటనలతో ఏ పార్టీకి సంబంధం లేదనేది నా నమ్మకం. అధికారంలో వున్న వైసీపీ అసలు చేయదు. కాకపొతే ఇలాంటివి జరిగినప్పుడు అన్ని పార్టీలు తమ స్వలాభం కోసం ప్రకటనలు చేస్తుంటాయి. వీటికి అసలు కారణం ఆకతాయి మనుషులు. వారికి ఏదో చేసి దానితో ఏదో చేయగలిగాం అని సంతోషపడుతుంటారు. సుడిగుండాలు సినిమా జ్ఞాపకం వుంది కదా! ఒక చిన్న పిల్లవాడిని ఒక యువ జంట అకారణంగా హత్య చేస్తుంది. కోర్టులో అదే చెబుతారు. అసలా పిల్లవాడు ఎవడో తమకు తెలియదు అని,సరదాకోసం ఈ పని చేసాం అని.”
“సత్య కామ జాబాలికి తండ్రి ఎవరో తెలియదు. తల్లి ఎవరి ఇంట్లోనో దాసిగా వున్నప్పుడు అనేకమందికి పరిచర్యలు చేసేది. ఆ సమయంలో కడుపున పడ్డ వాడు యితడు. గౌతముడి వద్ద శిష్యుడిగా చేరడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇతడి కుల గోత్రాలను ఆరా తీస్తాడు. నాకు నా తల్లి చెప్పిన ప్రకారం నా తండ్రి ఎవరో నాకు తెలియదు. నా పుట్టుక ఇది అని ఆ కుర్రవాడు చెబుతాడు. గౌతముడు అతడి నిజాయితీని మెచ్చుకుని ‘కఠోరమైన నిజాలను చెప్పే శక్తి ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే ఉంటుందని అతడిని శిష్యుడిగా స్వీకరిస్తాడు.”
ఉండవల్లి చెప్పిన మాటల్లో ఒక జాతీయ పార్టీకి తీవ్ర అభ్యంతరకరమైన అంశాలు వున్నాయి. కావాలనే వాటి ప్రస్తావన తీసుకు రావడం లేదు. (13-01-2021)

కామెంట్‌లు లేవు: