22, జనవరి 2021, శుక్రవారం

నాడు అయోధ్యలో ఏం జరిగింది?

 

 


విప్లవ తపస్వి పీవీ సమీక్ష : పదో భాగం  

రచన: శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు

మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు గురించి రాసేవారు ఎంత చేయి తిరిగిన రచయిత అయినప్పటికీ పీవీ జీవితంలో ప్రధాన అధ్యాయంగా మారిన ‘అయోధ్య కాండ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ఒకింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయం. వున్నది ఉన్నట్టుగా రాసినా, లేనిది ఉన్నట్టుగా రాసినా చదివేవారి మనస్తత్వాన్ని బట్టి మార్కులు పడతాయి. అటు  పొగడ్తలకు, ఇటు తెగడ్తలకు  సిద్ధపడి వుండాలి. ఎందుకంటే  ఈ అంశం ఒక్క  రాజకీయంతో కలగలిసినది మాత్రమే  కాదు, మరో పక్క మతంతో ముడిపడిన విషయం కూడా  కావడమే ఇందుకు ప్రధాన కారణం.

రచయిత, అందులోను ఒక పత్రికారచయిత,  చదివేవారు ఏమనుకుంటారో అనే కోణం నుంచి ఆలోచించి  రాస్తారు అని నేను అనుకోను. కానీ ఆధునిక  భారతీయ చరిత్రలో జరిగిన ఒక చారిత్రక సంఘటన గురించి రాసేటప్పుడు  నిజమైన పత్రికారచయిత కొంత సంయమనం పాటించే తీరాలి. అది పత్రికా రచయిత నైతిక ధర్మం కూడా. అఖిల సమాజ శ్రేయస్సు దృష్ట్యా  కొన్ని సందర్భాలలో  ఇది అత్యంత ఆవశ్యకం.

అయోధ్య సంఘటన ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగింది కాదు, ఆ నాటి విషయాలు అన్నీ ఇప్పటి కాలంలో చాలామందికి తెలిసిన విషయాలే. అయినాసరే, మాట పడకుండా, అదే సమయంలో మొహమాట పడకుండా వాస్తవాలు  కాగితం మీద పెట్టడం అనేది కత్తి మీది సామే! ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ  రాజకీయ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఆనాటి పరిస్థితులను గమనంలో పెట్టుకోకపోతే, ఈనాడు చదివే అంశాలు  అపార్థాలకు దారితీసే ప్రమాదం కూడా వుంది.  మరీ ముఖ్యంగా  నవతరం పాఠకులు  అంటే నాడు అయోధ్యలో ఏమి జరిగింది అనే విషయంపై  కర్ణాకర్ణిగా వినడం తప్పిస్తే లోతులకు వెళ్లి  పరిశీలించే అవకాశం లేని నేటి తరానికి కొన్ని వాస్తవాలు చేదుగా అనిపించవచ్చు. అసలు ఈ కారణంతోనే ఈ అంశాన్ని నేను  ఈ పుస్తక  సమీక్షలో చివరి అధ్యాయంగా ఎంచుకోవడం జరిగింది.

రచయిత కృష్ణారావు  కూడా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ‘ప్రత్యక్ష సాక్షి’ కధనం రాసేటప్పుడు తన మనసులోని మాటను ఇలా  పేర్కొన్నారు.

“ఒక అసాధారణ సంఘటనను ప్రత్యక్షంగా చూడడం, దాన్ని గురించి రాయడం అదే మొదటిసారి. నా ఆలోచనా ధోరణి, నా భావజాలం, నా అభిప్రాయాలు ఏవైనా, వృత్తికి సంబంధించి రాసే వార్తల్లో అవి చొరబడకూడదని భావించేవారిలో నేనొకడిని

దీన్నిబట్టి నాటి అయోధ్య సంగతులను ఒక జర్నలిస్టుగా రికార్డు చేయడానికి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్ధం అవుతుంది. ఎందుకంటే  ముందే చెప్పినట్టు ఇది రాజకీయాలతో, మతాలతో ముడిపడిన సున్నితమైన అంశం కనుక.

ఇది రాస్తూ వుండగా ఒక ఫోన్ వచ్చింది.

కొత్త నెంబరు. ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ పుస్తకం పబ్లిషర్.

“ఏమండీ మీరిలా పుస్తకం మొత్తం రివ్యూ పేరుతో యధాతధంగా రాస్తూ పొతే ఎలాండీ. కాస్త మా విషయం కూడా ఆలోచించండి” అన్నారు చాలా సౌమ్యంగా, ఇంకా చాలా మర్యాదగా.

“ఏమైనా మీకు నా థాంక్స్. మేము పబ్లిష్ చేసిన మరికొన్ని పుస్తకాలు మీకు పంపుదామని అనుకుంటున్నాను. మీ అడ్రసు చెబుతారా!” అన్నారు అవతలనుంచి  శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ రాఘవేంద్రరావు గారు.

నాకు అందులో అపహాస్యం ఏమీ కనిపించలేదు, అభిమానం తప్పిస్తే.

పుస్తకాలు ప్రచురించడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసిన వాడిని కనుక, సున్నితంగా, పరోక్షంగా రాఘవేంద్రరావు గారు చేసిన అభ్యర్ధనని కాదనలేక ఈ సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాను.

రచయితకి క్షమాపణలతో, ప్రచురణ కర్తలకి కృతజ్ఞతతో ...భండారు శ్రీనివాసరావు        

3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...రాఘవేంద్ర రావు గారి మాటేమో గానీండి మీ సమీక్ష చదివాకే పుస్తకం చదవాలని ఆసక్తి కలిగి కొన్నామండి.

జోక్ యేమిటంటే ఈ పుస్తకం పబ్లికేషను విజయవాడలో , విజయవాడ మేజర్ బుక్ సెల్లర్స్ అంగళ్లలో ఇట్లాంటి పుస్తకం వుందా అని ఆశ్చర్య‌పోవడం వారి వంతై‌ పోయె :)

సో, సమీక్ష వల్ల మంచే జరిగి వుంటుందనుకుంటా.

బైదివే బ్లాగులను చదివే వారెంత మందని ? :)

జిలేబి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi : ధన్యవాదాలు

call center software చెప్పారు...


Thank you for this post. Good luck.