12, జనవరి 2021, మంగళవారం

విప్లవ తపస్వి పీవీ : రచన: శ్రీ ఏ. కృష్ణారావు

 

ఒక రోజు ఢిల్లీలోని మయూర్ విహార్ లో ఎల్ ఐ సీ పాలసీ కట్టేందుకు ఈ పుస్తక రచయిత శ్రీ ఏ. కృష్ణారావు క్యూలో నిలబడి వుండగా పీవీ గారి నుంచి ఫోన్ వచ్చింది.
‘కృష్ణారావ్ నీతో పనిపడింది వస్తావా’ అంటున్నారు మాజీ ప్రధాని పీవీ.
ఆయన పనులు పూర్తిచేసుకుని, ఇంటికి వెళ్లి భోజనం చేసి ఆ తర్వాత మోతీలాల్ మార్గ్ లోని పీవీగారి నివాసానికి వెళ్లారు కృష్ణారావు.
ఆయన్ని చూస్తూనే పీవీ ఇలా అడిగారు, “నా వద్ద పాత పత్రికల పీ డీ ఎఫ్ కాపీలు వున్నాయి. వాటిని ఓసీఆర్ (Optical Character Recognition) చేసి టెక్స్ట్ గా మార్చి ఎడిటింగ్ చేసుకోవచ్చా.”
“నాకు తెలిసింది చెప్పాను. దానికే పీవీ ఎంతో సంతోషపడ్డారు. వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు” అని గుర్తుచేసుకున్నారు కృష్ణారావు.
ఒకప్పుడు ఒంటిచేత్తో దేశాన్ని పాలించిన మనిషి. కంటిచూపుతో రాజకీయాలను శాసించిన మనిషి. అలాంటి వారు పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా కాకితో కబురు చేస్తే చాలు, అటువంటి పనుల్లో నిష్ణాతులైన వాళ్ళు ఎగురుకుంటూ వచ్చి అడిగిన పనులు వెంటనే చేసి పెడతారు. అయినా ఆయన ఆ అవకాశాలను వాడుకోకుండా తనకు పరిచయస్తుడైన ఓ పత్రికా విలేకరి సాయం కోరారు. ఇది ఆయన వ్యక్తిత్వశోభకు గీటురాయి అని చెప్పడానికి, ఒకప్పుడు దేశానికి అయిదేళ్లపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తితో గ్రంధ రచయితకు ఉన్న సాన్నిహిత్యాన్ని తెలపడం ద్వారా ఇందులో రాసిన విషయాలకు ఎంతటి సాధికారత ఉన్నదో ఈ సమీక్ష చదివే పాఠకులకు అవగాహన కలిగించడానికి మాత్రమే ఈ ఉదంతాన్ని మొదట్లోనే స్థాలీపులాక న్యాయంగా పేర్కొంటున్నాను. (ఇంకావుంది)NOTE: సుమారు 225 పేజీలకు విస్తరించిన ఈ గ్రంధంలోని ఆసక్తికర విషయాలను సంక్షిప్తంగానే అయినా చదువరులకు తెలియచెప్పడం కోసం ఈ సమీక్షను చిన్న చిన్న భాగాలుగా విభజించి రాస్తున్నాను. దయచేసి గమనంలో పెట్టుకోగలరు. – (భండారు శ్రీనివాసరావు)
విప్లవ తపస్వి పీవీ రచన: శ్రీ ఏ. కృష్ణారావు,ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, ఫోన్: 9494875959 (HYD), 9032428516 (Vijayavada)
Kinige, & amazon For Online purchase : www.srpublications.in
PRICE: Rs. 150/-

కామెంట్‌లు లేవు: