15, జనవరి 2021, శుక్రవారం

విప్లవ తపస్వి పీవీ – సమీక్ష (నాలుగో భాగం) : భండారు శ్రీనివాసరావు

 

1992 లోనే దేశంలో మొదటి ప్రైవేట్ టీవీ ఛానల్ జీ టీవీ ప్రసారాలు ప్రారంభించింది. తొలి ప్రైవేట్  ఎయిర్ లైన్స్ ‘ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ఎయిర్ వేస్ తన సర్వీసులు మొదలుపెట్టింది.  టెలికాం విప్లవం కూడా పీవీ హయాంలోనే మొదలైంది. 1995 జులైలో దేశంలో మొట్టమొదటి మొబైల్ టెలిఫోన్ కాల్ అప్పటి టెలికాం మంత్రి సుఖ్ రాం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుల మధ్యన సాగింది. అదే ఏడాది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలు దేశంలో మొదలయ్యాయి.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పనకు ప్రధానమంత్రి రోజ్ గార్ యోజనను ప్రధాని పీవీ ప్రవేశపెట్టారు. అప్పటివరకు దేశంలో యాభయ్ జిల్లాలలో అమలవుతున్న డ్వాక్రా పధకాన్ని పీవీ దేశమంతటికీ విస్తరించారు.

ఇలా ఒకటీ రెండూ కాదు, వందలాది కీలక నిర్ణయాలు అన్ని రంగాల్లో తీసుకున్నారు. ఆహార ధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తి వేశారు. మండల కమిషన్ సిఫారసుల ఆధారంగా చేపట్టిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు పీవీ హయాంలోనే పూర్తిగా అమలయ్యాయి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు అని పేరు తెచ్చుకున్న పీవీ, ఆ సంస్కరణలు   సామాజిక ఉద్వేగాలకు దారితీయరాదని పీవీ అనేక సార్లు చెప్పేవారు. ఇప్పుడు అనేకమంది రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో ప్రస్తావిస్తున్న అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం (Inclusive Growth), స్థిరమైన అభివృద్ధి (Sustainable Development) వంటి పదాలు అప్పుడే జనించాయి. 

ఆర్ధిక సంస్కరణలు పటిష్టంగా అమలు జరగాలంటే ప్రజల భాగస్వామ్యం, అంగీకారం అవసరమని పీవీ అభిప్రాయపడేవారు. ప్రాచీన భారతీయ ఆలోచనావిధానంలో మనిషి ఆధ్యాత్మిక బలాన్ని సంతరించుకోవడానికి సూచించిన ఉదాహరణను ఆయన పేర్కొనేవారు. “ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కను దారిన పోయే మేక పిల్ల సయితం పెరుక్కుని తినగలదు. కానీ అదే మొక్క పెరిగి బలమైన కాండంగా, మహా వృక్షంగా మారితే ఏనుగును కూడా దానికి కట్టి పడేయగలం” అని పీవీ చెప్పేవారు.

ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టే ముందే పీవీ చాలా పెద్ద కసరత్తే చేశారు.

ఆ వివరాలన్నింటినీ  రచయిత శ్రీ కృష్ణారావు ఈ పుస్తకం తొలి అధ్యాయాల్లోనే తెలియచెప్పే ప్రయత్నం చేశారు. వాటిని గురించి మరోమారు.

(ఇంకావుంది)  .      

కామెంట్‌లు లేవు: