17, జనవరి 2021, ఆదివారం

డ్రెస్ మార్చుకుని రా! మంత్రిగా ప్రమాణం చేద్దువుగానీ!

  

విప్లవ తపస్వి పీవీ – రచన : శ్రీ ఏ.కృష్ణారావు 

సమీక్ష (ఆరో భాగం)- భండారు శ్రీనివాసరావు 

ఆర్ధిక సంస్కరణల అమల్లో పీవీకి నమ్మకంగా తోడ్పడిన మన్మోహన్ సింగ్ తదనంతర రాజకీయ పరిణామాల్లో, పీవీ శకం ముగిసిన చాలా కాలం తర్వాత భారత దేశానికి ప్రధాని అయ్యారు. పీవీకి మొదట్లో  స్టాప్ గ్యాప్ ప్రధాన మంత్రి అనే పేరు వచ్చినట్టే, మన్మోహన్ సింగ్ కి  కూడా తాను ప్రధానమంత్రిని అవడం అనేది చాలా యాదృచ్చికంగా జరిగిందనే అభిప్రాయం వుండేది.

మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అయిన తర్వాత ‘Changing India’ అనే గ్రంధం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనే ఈ విషయం వెల్లడించారు.

‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా వున్నప్పుడు ప్రధానమంత్రి పీవీ నుంచి ఫోన్ వచ్చింది. ‘ఎక్కడున్నారని అడిగితే ఆఫీసులో’ అని జవాబిచ్చాను. ‘అలెగ్జా౦డర్ చెప్పలేదా?’ అని పీవీ ఆరా తీస్తే, ‘చెప్పారు. కానీ నేను అంత సీరియస్ గా తీసుకోలేదని బదులిచ్చాను. 

‘లేదు. నిజంగా సీరియస్సే. నువ్వు వెంటనే వెళ్లి డ్రెస్ మార్చుకుని ప్రమాణ స్వీకారానికి రా!’ అని పీవీ ఆదేశించారు. 

‘ఆ రకంగా నేను యాదృచ్చికంగా ఆర్ధిక మంత్రిని అయ్యాను’ అని మన్మోహన్ సింగ్ చెప్పేసరికి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లోని సభా ప్రాంగణం నవ్వులతో మార్మోగిపోయింది అని రాసారు ఈ పుస్తక  రచయిత కృష్ణారావు.

ఆర్ధిక సంస్కరణలను అమలు చేసే విషయంలో తనకు ప్రధాని పీవీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెబుతూ, ‘బడ్జెట్ ప్రవేశపెట్టాల్సివచ్చినప్పుడల్లా నేను నార్త్ బ్లాక్ కి (ప్రధానమంత్రి కార్యాలయం) వెళ్ళాల్సిన అవసరం వుండేది కాదని మన్మోహన్ సింగ్ ఒక సందర్భంలో చెప్పారు.

నిజానికి ఎగుమతి సబ్సిడీ రద్దు చేయడానికి వాణిజ్యమంత్రిగా వున్న చిదంబరం వెనుకాడారు. ఎగుమతులను ప్రోత్సహించాలంటే సబ్సిడీ తప్పదనే పాత కాలం ఆలోచనలతో ఉన్న చిదంబరం తటపటాయించడంతో మన్మోహన్ సింగ్ ఆయనకు గట్టిగా చెప్పారు. ‘త్వరగా నిర్ణయించండి, రేపటికల్లా ప్రకటించాలని ప్రధాని చెప్పారు’ అనడంతో చిదంబరం ఆశ్చర్యపోయి సాయంత్రానికల్లా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

1991 జులై  13న లోకసభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందు ప్రధాని పీవీ నరసింహారావు తన సంస్కరణలను బలంగా సమర్ధించుకున్నారు. ప్రసంగపాఠాన్ని పక్కనపెట్టి నలభయ్ అయిదు నిమిషాల పాటు అనర్ఘలంగా ప్రసంగించారు.

‘సర్వనాశే సముత్పన్నే అర్ధం త్యజిత పండితా’ (సర్వం నాశనం అవుతున్న తరుణంలో వివేకవంతులు కొంత త్యాగం చేసి మిగతాది నాశనం కాకుండా కాపాడుకుంటారు) అని లోకసభ సాక్షిగా దేశ ప్రజలకు స్పష్టం చేశారు.

వ్యవసాయం గురించి మాట్లాడినప్పుడల్లా పీవీలో రైతు నేపధ్యం స్పష్టంగా కనపడేది.

వ్యవసాయానికి సంబంధించి ప్రయోగాలు చేసి ప్రమాదాలను ఆహ్వానించ కూడదు అని ఆయన చెబుతుండేవారు.

‘దయచేసి పేద ప్రజలతో ప్రయోగాలు చేయకండి’ అని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనపై 1994లో జరిగిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో పీవీ కోరారు.

‘నా గ్రామంలో నా భూమిలో ప్రతి సర్వే నెంబరు గురించి నన్ను అడగండి. ఏ పరిస్థితుల్లో అది పండుతుందో, ఏ పరిస్థితుల్లో అది పండేందుకు నిరాకరిస్తుందో నేను చూశాను. అది కేవలం మట్టి నేలే కదా, దానితో మీరేమి చేసినా పండుతుంది అని అనుకోకండి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరిగినట్టు జరుగుతుందని అనుకోకండి. దానికి ప్రాణం వున్నది. దాన్ని పసిపాపలా చూసుకోవాలి. అమ్మలా దాన్ని కాపాడుకోవాలి’ అని పీవీ చెప్పారు.

చరిత్రలో ఒక్కో వ్యక్తి అవసరం ఒక్కో రకంగా వుంటుంది. దేశంలోని ఆర్ధిక, సామాజిక పరిస్థితులను సమూలంగా మార్చేందుకు ప్రయత్నించిన పీవీ నరసింహారావు చారిత్రక పాత్రను కూడా ఇదే విధంగా అవగాహన చేసుకోవాలని ఈ పుస్తక రచయిత కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: