13, జనవరి 2021, బుధవారం

విప్లవ తపస్వి పీవీ : సమీక్ష (రెండో భాగం)

 విప్లవ తపస్వి పీవీ – రచయిత శ్రీ ఏ. కృష్ణారావు

సమీక్ష: భండారు శ్రీనివాసరావు

ఏమిటీ విరోధాభాసం? విప్లవానికి, తపస్సుకు ఎక్కడ పొంతన? రచయిత కృష్ణారావు గారు ఈ పుస్తకానికి ఎందుకిలా పేరు పెట్టినట్టు?
చేతికి అందగానే సహజంగా కలిగే సందేహాలు ఇవి.
203వ పేజీలో వీటికి సమాధానం దొరుకుతుంది.

1972 ఆగస్టు 15, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి పాతికేళ్ళు. దేశమంతటా రజతోత్సవ సంబరాలు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని అర్ధరాత్రి సమావేశ పరిచారు. ముఖ్యమంత్రి శ్రీ పీవీ నరసింహారావు ప్రసంగించారు.

“ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కాంచినాడు
ఒళ్ళు విరిచి, కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు
కటిక చీకటుల చిమ్మెడు కారడివిని పయనించు
నిజ జఠరాగ్ని జ్వాలలు నింగినంత లేపినాడు”
ముఖ్యమంత్రి నోట ఈ కవితాగానం సుదీర్ఘంగా సాగిపోయింది.

‘అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు లేచిన భారతీయుడి హృదయగానం.
ఆ మేల్కొన్న మనిషి ఎవ్వరు?
ఆయనే వివరించారు.

“యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమ్రింగగ
సంధ్యారుణ రౌద్ర క్షితిజ ముఖుడై చెలంగినాడు.
వాడొక విప్లవ తపస్వి”

అంటే ఒక రకంగా ఈ పుస్తకానికి పెట్టే పేరును పీవీ గారే స్వయంగా ముందుగానే సూచించారనుకోవాలి.

‘ఎక్కడ విప్లవం? ఎక్కడ తపస్సు? విప్లవ తపస్వి అనేదే ఒక విరోధాభాస. అది పీవీకే సాధ్యం’ అంటారు రచయిత.

ఆ సామాన్యుడిది ‘మోడువడిన కాయం. బువ్వకు నోచని జనగణముల వెతల బరువు మోసినాడు’ అని పీవీ ఆ కవితలో పేర్కొన్నారు.
దేశ విభజననూ పీవీ విమర్శించారు.

“పావు శతాబ్ధము పొడుగున పాలకులు,అర్భకులు మధ్య
విభజన వికృతమై పోవగ,బావురుమనే జీవితాలు
అటు సమృద్ధి, ఇటు దైన్యము
అటు పెంపు, ఇటు హైన్యము
ఒకరు మింటికెగర, అసంఖ్యాకులింకిరి భూతలమున
ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు”

ఈ కవిత పీవీ రాసారు అనే నిజం తెలియని వారు దీన్నిచదివితే ఇది తప్పకుండా ఎవరో విప్లవకవి రాసిన గీతం అని పొరబడే అవకాశం వుంది.

ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇటువంటి విమర్శలను, అదీ శాసన సభలో చేయడానికి ఎంత ధైర్యం కావాలి?

‘పీవీ నరసింహారావుకు పాండిత్యం, భాషాపరిజ్ఞానంతో పాటు చైతన్యవంతమైన, కవికి అవసరమైన భావోద్వేగాలున్నాయని ఈ ఒక్క కవిత చదివితే అర్ధం అవుతుందని, బహుశా ఈ భావోద్వేగాలతోనే భూసంస్కరణలు ప్రవేశపెట్టినందుకే ముఖ్యమంత్రి పదవి కోల్పోయినట్టు అనిపిస్తుంద’ని రచయిత రాసారు.

చాలా కాలం తర్వాత, ప్రధాన మంత్రి అయిన తర్వాత పీవీకి ఈ కవిత సంగతి గుర్తుకు వచ్చినట్టుంది.

అప్పుడు అసెంబ్లీలో పనిచేస్తున్న శ్రీ కేశవరావు (కలం పేరు నగ్నముని. దిగంబర కవులలో ఒకరు)కు ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.

“1972 ఆగస్టు 15 వ తేదీ అర్ధరాత్రి పీవీ గారు చదివిన కవిత కాపీ దొరుకుతుందా ?” అని పీఎం ఓ.ఎస్.డి. శ్రీ ఏ.వీ.ఆర్. కృష్ణ మూర్తి అడిగారు. నగ్నముని అసెంబ్లీ రికార్డులు అన్నీ వెతికారు. కానీ దొరకలేదు. చివరకు ఆ రోజుల్లో వచ్చే ఆంధ్ర జనత పత్రికలో ఈ కాపీ సంపాదించి పీవీకి పంపారు. ఈ విషయం నగ్నముని తనతో చెప్పినట్టు రచయిత శ్రీ కృష్ణారావు రాసారు.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: