8, జూన్ 2020, సోమవారం

నారాయణ నారాయణ

“ఇంట్లో వుండు, బతికిపోతావ్! బయటకి రాకు ప్రాణాలతో వుంటావ్ అన్నారు. ప్రాణభయమో యేమో తెలవదు, చాలా రోజులు జనం ఈ మాట విన్నారు.

తర్వాత తర్వాత కొద్దికొద్దిగా నిబంధనలు సడలిస్తూ వచ్చారు. ఫలితాలు ఇదిగో ఇలా! పత్రికల్లో వచ్చిన ఫోటోలు చూశారుగా.

చేపలు తినక చాలా రోజులు అయివుండొచ్చు. లేదా మృగశిర కార్తే ఆరంభంలో వచ్చే చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అనే ఆలోచన కావచ్చు. కానీ ఇలా మందలు మందలుగా బయటకు వస్తే ప్రాణాలకు కరోనా ముప్పు వుందనుకున్నప్పుడు  ఆరోగ్యానికి మంచి చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

చిన్నప్పుడు ఓ కధ చెప్పేవారు. ఒకడు అవసాన దశలో వున్నప్పుడు అతడిచేత నారాయణ నారాయణ అనిపించాలని కుటుంబ సభ్యులు ఆరాటపడ్డారు. నారాయణ నారాయణ అంటూ చనిపోతే  స్వర్గానికి పోతాడనే నమ్మకంతో ఎంతో చెప్పిచూశారు కానీ అతగాడిచేత నారాయణ అనిపించలేకపోయారు. చివరికి వాళ్ళల్లో ఒకడు ఒక చేతిలో నారపీచు, మరో చేతిలో అణా పట్టుకుని ఇవేమిటని సైగచేశాడు. అవి చూసి అయినా నారాయణ అని అనకపోతాడా అనే ఆశతో. మంచానపడి  చావు ముంచుకొచ్చిన ఆ శాల్తీకి చావు తెలివితేటలు ముంచుకొచ్చి  వాటిని చూస్తూనే పీచు, కాసు అంటూ కళ్ళు తేలేశాడు.

గతంలో మందుకోసం ఇలాగే వీధుల్లోకి బారులు  తీరారు. ఇప్పుడు చేపలకోసం గుంపులు కట్టారు. నాలుక చవిచచ్చిన వారికి చావు భయం కూడా చచ్చిపోతుందేమో మరి.

సరే! గతంలో మృగశిర అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాదు చేపమందు. ఈసారి కరోనా కట్టడుల వల్ల చేపమందు ప్రసాద పంపిణీ వుండదని బత్తిన కుటుంబం వాళ్ళు ముందుగానే ప్రకటించారు. లేకపోతే ఈపాటికి హైదరాబాదు మీద మరో హైదారాబాదు వచ్చి పడేది.

లోగడ వున్నంత ఆదరణ ఈ చేపమందుకు ఇప్పుడు వుందని చెప్పలేము కానీ ఒకప్పుడు హైదరాబాదు చేపమందుకు చాలా గిరాకీ వుండేది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర  ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ చేపమందు పంపిణీకి అంతర్జాతీయ ఖ్యాతి వుండేది. ఆయనే స్వయంగా ఈ చేప ప్రసాదం యేటా స్వీకరిస్తూ దానికి ఓ బ్రాండు విలువ తెచ్చిపెట్టారు.

ఉత్తర భారతం వారికి ఈ చేపమందు పట్ల నమ్మకం ఎక్కువ. వాళ్ళ నమ్మకం యేమో కానీ రేడియోలో పనిచేసే మా బోంట్లకు లేని తలనొప్పులు తెచ్చిపెట్టేది. డిల్లీలోని ఆకాశవాణి డైరెక్టొరేట్ నుంచి మాకు యెన్నో అభ్యర్ధనలు వస్తుండేవి, మా బావమరది కుటుంబం వస్తోంది, మా మేనల్లుడి కుటుంబం వస్తోంది కాస్త సాయం చేయండంటూ. ఇక వాళ్ళకి వీఐపీ పాసులు, వసతికి ఏర్పాట్లు. ఇంతటితో అయితే పరవాలేదు, పోయేటప్పుడు రైలు రిజర్వేషన్లు. రైల్వే  రామ్మోహన్ కు పనిపెట్టే వాళ్ళం. ఆయన కిందా మీద పడి టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించేవాడు. నిజానికి ఈ ఇబ్బందులు యెక్కువగా భరించింది మొహమాటం పాలు యెక్కువ వున్న మా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు గారే. నాది చిటికినవేలంత మాత్రమే.         


5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చేప , మందు రెండూ కావాలి.

Jai Gottimukkala చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీకెంత ద్వేషం ఉన్నా ఆడు, ఈడు అనడం ఏమాత్రమూ బాగోలేదు.

Jai Gottimukkala చెప్పారు...

@విన్నకోట నరసింహా రావు:

Typo sir, "atadante" బదులు "adatante" అని పడింది. మీరు ఏవేవో ఊహించుకొని హైరానా పడకండి.

బత్తిన కుటుంబం 1845 నుండి చేపమందు ఇస్తున్నారు. దీన్ని కూడా మీరు చంద్రబాబు ఖాతాలో వేయడం ఏమిటి? మీకెంత *అతడంటే* ఎంత ఇది ఉన్నా, ఈ తరహా ప్రచారం అవసరమా.

అజ్ఞాత చెప్పారు...

అతడు చేప - మందు తీసుకున్నాడు.

చేపను మందుతో పాటు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.