20, జూన్ 2020, శనివారం

మంచివాళ్ళు మనచుట్టూ వున్నారు

 

రాజకీయాల్లో నిజాయితీ, నిబద్దత గురించి రాస్తూ శ్రీయుతులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, చిక్కాల రామచంద్ర రావులను గుర్తు చేసుకున్న పోస్టులు చదివిన పాత్రికేయ మిత్రుడు ఫోన్ చేసి మరి ఇద్దరి ప్రస్తావన తీసుకుకువచ్చాడు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.
ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాన్ని దివాకర్ గుర్తు చేసుకున్నాడు.
అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు. ‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. అది పొరబాటు అనుకుని విలేకరులు చప్పిడి వెంకయ్య అని రాసేవారు.
వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.
‘మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’ దివాకర్ అన్నాడు. (20-06-2020)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.