29, జూన్ 2020, సోమవారం

పీవీనా! మజాకా!

“పెళ్ళయి పదేళ్ళవుతున్నా, పెళ్ళానికి ఇంకా ఆమె పుట్టింటి పేరు మీదే ఉత్తరాలు వస్తున్నాయి అంటే, ఆ మొగుడు ఉత్త నస్మరంతి అన్నమాట అని భాష్యం చెప్పారు ముళ్ళపూడి వెంకట రమణ గారు. నస్మరంతి అనే పదానికి  అర్ధం, ‘ఎవరూ  తలచుకోనివాడు’ అని వారి తాత్పర్యం.

ఇప్పుడు దాన్ని మొబైల్ ఫోన్లకు వర్తింప చేయలేమో. రోజుకి ఒకసారన్నా తన ఉనికిని చాటుతూ సెల్లు మోగకుండా మూగనోము పట్టిందంటే దాని ఓనరు కూడా నస్మరంతి బాపతే అనుకోవాలి.

ఒకరకంగా సెల్ ఫోన్ కి సంబంధించి నేను ఇదే తరహా మనిషిని. రోజు మొత్తం మీద అయిదారు సార్లు మోగితే అదే ఘనం. అందులో కొన్ని మార్కెటింగు కాల్స్.

అలాంటిది, నిన్నా ఈరోజూ ఓ రెండు గంటల పాటు నేనే బలవంతంగా దాని నోరు కుట్టేయాల్సివచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా వుంది. దీనికి కారణం పీవీ గారు. ఆయన మీద నేను సాక్షిలో రాసిన వ్యాసం చదివిన వాళ్ళు పదేపదే అదేపనిగా ఫోన్లు చేస్తూ ఉండడంతో కాలకృత్యాల కోసం రెండు గంటలు సైలెన్స్ మోడ్ లో పెట్టాల్సి వచ్చింది. బహుశా నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టిన నాటి నుంచి అలా చేయడం ఇదే మొదటి సారి.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఫోన్లు చేసారు. పీవీ గారికి ఇంతమంది అభిమానులు వున్నారా అని ఆశ్చర్యపోతూ ఆనందించిన క్షణాలు ఎలా మరిచిపోగలను?

మచ్చుకి కొన్ని:

‘పీవీ గారికి మా వూళ్ళో శిలావిగ్రహం వేయాలని తీర్మానించాం. ఈరోజు నుంచే ఆ పనిలో ఉంటున్నాం’ – చామర్తి శ్రీధర్, వినుకొండ.

‘పీవీ గారు సీఎం గా వుండగా తీసుకొచ్చిన భూసంస్కరణల చట్టం గురించి అనకాపల్లిలో జడ్జిగా వున్నప్పుడు నేనిచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించాను. దానికోసం వెతుకుతున్నాను. దొరకగానే మీకు పంపుతాను” – నరసింహాచారి, హైదరాబాదు.

“ మా వూళ్ళో ఉంటున్న తెలుగు వాళ్ళం అందరం కలిసి ఈరోజు పీవీ గారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం” – అవ్వలరాజు కామేశ్వర రావు, ఆస్ట్రేలియా.

“పీవీ గారు ప్రధానిగా వున్నప్పుడు బనగానపల్లికి వచ్చారు. అప్పుడు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. వారికి సప్లయి చేసిన నీళ్ళ బాటిల్ ని నేను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను” – చిన్న మద్దప్ప నాయుడు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్, ధోన్.

“కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించి మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా చూడడం అన్నది ఒక్క పీవీగారికే సాధ్యం అయింది, ఏ నాయకుడూ ఆ సాహసం చేయలేకపోయారు” - డాక్టర్ ఎం. జైనుల్లావుద్దీన్, ఎడిటర్, విజ్ఞానసూచిక, నంద్యాల.  

“వైజాగ్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ వ్యాసం గురించి చెప్పాడు. మనిషిని పంపించి పేపరు తెప్పించాను. చాలా బాగుంది. ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.   

“నవోదయా స్కూల్స్. పీవీ గారి హయాములో మొదలయిన ఈ పధకం చాలా గొప్పది. ప్రతి గ్రామంలో నవోదయా స్కూళ్ళు పెట్టి వుంటే చదువు సంధ్యల నాణ్యత విషయంలో మనకు ప్రపంచంలో పోటీ వుండేది కాదు” – శ్రీమతి మణి ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, దిల్ సుఖ్ నగర్.  

 “కాకతాళీయం కావచ్చు. అంతకు ముందు రాత్రి మీ అన్నగారు రాసిన నమో నరసింహాయ పుస్తకం బాగా పొద్దు పోయేదాకా చదువుతూ పోయాను. పొద్దున్నే పీవీ గారినోట మీ అన్నగారి ప్రస్తావన వచ్చిన విషయం మీ వ్యాసంలో వుంది” – కే. లక్ష్మీనారాయణ, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్)  

ఫోన్లో ఇన్ కమింగ్ కాల్స్ లెక్క పెట్టి చూస్తే ఇప్పటికి రెండు వందల నలభయ్ ఎనిమిది లెక్కతేలాయి. ఫోన్ ఎంగేజ్డ్ గా వుండడం వల్ల మరో పాతిక దాకా నేను రెస్పాండ్ కావాల్సిన కాల్స్ మిగిలి వున్నాయి. ఎస్సెమ్మెస్ లకు జవాబు ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు.

వీటన్నిటి బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే పీవీ మరణించలేదు, జనం గుండెల్లో బతికే వున్నారని.

(29-06-2020)(భార్య శ్రీమతి సత్యమ్మ గారితో పీవీ గారు)
5 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

*పీవీ కీర్తిశరీరుడు*

కం. పీవీ కీర్తి శరీరుం
డా వంతయు లేదు సందియం బట్లయ్యున్
కేవలము తెలుగువాడని
రావలసిన గౌరవములు రావయ్యెనుగా

తే. బ్రతికి యుండగ కొకనికి వచ్చు కీర్తి
స్వర్గమున నుండ నొకనికి వచ్చు కీర్తి
త్వరితగతి నొకనికి కల్గ వచ్చు కీర్తి
బహువిడంబిత మొకనికి వచ్చు కీర్తి

కం. వినుడీ కాంగ్రెసు వారును
పనవుచు నున్నారు గాదె పాములపర్తిన్
కనుగొన మావాడతడని
నినమొన్నటి తీరు మారె నేడెందులకో

అజ్ఞాత చెప్పారు...

గొప్ప వ్యక్తులుకి గౌరవం గుర్తింపు కావాలంటే అధికారం లో అయినా ఉండాలి లేదా చనిపోయి ఉండాలి అని తెలుస్తుంది. రిటైర్ అయి బతికి ఉన్నా కూడా ఎవ్వలు పట్టించుకోరు అన్నట్టు.

Jai Gottimukkala చెప్పారు...

“పెళ్ళయి పదేళ్ళవుతున్నా, పెళ్ళానికి ఇంకా ఆమె పుట్టింటి పేరు మీదే ఉత్తరాలు వస్తున్నాయి"

పీవీ నరసింహారావు భార్య పుట్టింటి ఇంటిపేరు కాదు సరికదా, అసలు పేరు కూడా ఎవరికీ తెలిసినట్టు లేదు. హన్మకొండ, మంథనిలో సైతం ఆమెను చూసినట్టు చెప్పే వాళ్ళే అగుపించరు. ఆమె ఫోటో ఎప్పుడూ ఏ పేపర్లోనూ రాదు.

ఏమిటో ఈ చిదంబర రహస్యం, మీకు తెలిస్తే ఆ గుట్టు విప్పండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Jai Gottilukkala : పీవీ గారి భార్య పేరు శ్రీమతి సత్యమ్మ . ఫోటో పోస్టులో పెట్టాను చూడండి.

శ్యామలీయం చెప్పారు...

భండారు వారూ, మీరు చాలా మంచి వారండీ, జై గారు పేరు అడిగితే ఫోటోనే ఇచ్చారు. ( అదేదో‌ సినిమాలో ఒకతను, "ఆయన చాలా మంచి వారండీ అగ్గిపెట్టె అడిగితే లైటర్ ఇచ్చారు" అంటాడు. అలాగన్న మాట). పీవీ దంపతుల ఫోటో చూసి చాలా సంతోషం కలిగింది. ధన్యవాదాలు.