22, జూన్ 2020, సోమవారం

పీవీ గారి రెండో కోరిక – భండారు శ్రీనివాసరావు

(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)

‘ఏమయ్యా! కృష్ణారావ్! నా కేసెట్ల సంగతేమిటి” అని అడిగారు పీవీ నరసింహారావు గారు మాజీ ప్రధాని హోదాలో అని చెప్పుకున్నాం కదా! ఆ కధే ఇది.

పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.

అసలే గతకాలపు ముచ్చట. ఈ ముచ్చట చెప్పుకునే ముందు అంతకు ముందు గతం కొంత చెప్పుకోవాలి. అంటే గతంలోని గతం అన్నమాట, మూగమనసులు సినిమాకి మల్లె.

ఆర్వీవీ కృష్ణారావు గారు. రాయసం వీర  వెంకట  కృష్ణారావు గారు. పేరులో రాయసమే కానీ మనిషిలో ఆ రాజసం కనపడదు.  సాదాసీదా మనిషి. ఇక వీర అనే పేరులోని  మాట పేరులోనే దాగిపోయేలా ఇంటి పేరు ఆర్వీవీ అని రాసుకునేవారు. ఆయనా నేనూ ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తావిభాగంలో బహుకాలం కలిసి పనిచేసాము. మాకు కృష్ణార్జునులు అని పేరు. నేనొకసారి అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి ప్రసార భారతి సీఈఓ కంభంపాటి సుబ్రమణ్య శర్మగారు ఆర్వీవీని పట్టుబట్టి హైదరాబాదు దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు. ఆరు మాసాల అనంతరం అమెరికా నుంచి రాగానే నన్నూ అక్కడికే వేశారు. పుట్టిపెరిగిన రేడియో విడిచి రానని నేను  పట్టుబట్టాను. ‘ఈ పోస్టుకోసం ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటారు. నువ్వేమిటి అయాచితంగా వేసినా పోనంటావ’ని హితులు, స్నేహితులు పోరుపెట్టారు. వున్న ఊళ్లోనే ఉన్న డీడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ మూడు నెలలు చేతిలో పెట్టుకుని సంక్షేపించిన నేను చివరికి దూరదర్శన్ లో చేరిపోయాను. అయితే ఇంటికి ఆఫీసుకి చాలా దూరం. ఆఫీసు వాహన సౌలభ్యం ఉన్న కారణంగా అదో ఇబ్బంది అనిపించక, అప్పటి  రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం కేటాయించిన ఎర్ర మంజిల్ క్వార్టర్స్ లోనే వుండిపోయాను. ఆఫీసు దూరం అనే మాటలు చెవిన పడ్డాయేమో తెలియదు శర్మ గారు ఆలిండియా రేడియో ఆవరణలోనే ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేశారు. ఉదయం డీడీ వార్తలు తయారు చేయడం, తర్వాత నుంచి నగరంలో వార్తలు సేకరించడం, ఇందుకోసం రేడియో ఆఫీసులో ఒక కెమెరా యూనిట్, ఈ వైభోగం బాగానే వుందనిపించింది.

ఇక సొంత గోల పక్కనబెట్టి అసలు విషయానికి వస్తాను. ఆర్వీవీకి దూరదర్శన్ ఆవరణలోనే ఒక పెద్ద క్వార్టర్ కేటాయించారు. ఆయనకు ఒక పాత అంబాసిడర్ కారు బెజవాడ రోజుల నుంచి వుండేది. ఆ కారు పెట్టుకోవడానికి   

చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ క్వార్టర్ లో ఒక కారు షెడ్డు కూడా వుంది. అందులో ఏదో పాత సామాను వేసి తాళం వేశారు. తీసి చూస్తే ఎన్నో అపూర్వమైన కేసెట్లు. మంచి సంగీత కచ్చేరీల రికార్డులు. అవన్నీ అలా పాత సామాను మాదిరిగా పారేయడం చూసి సంగీతం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు గారు చాలా బాధ పడ్డారు. తీరా విచారిస్తే తేలిందేమిటంటే అవన్నీ పాత కాలపు డెక్కులు. అవి ఈరోజుల్లో పనికిరావు. పైగా ఆ పాత రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరచినట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో పీవీ గారు ‘ఏవయ్యా నా కేసెట్లు’ అని అడిగారు. దూరదర్శన్లో, రేడియోలో గాలించారు. అవి దొరికాయా, పీవీ గారికి అందచేసారా అనే వివరాలు తెలవ్వు. ఎందుకంటే తర్వాత కొన్నాళ్ళకే ముందు నేను, తర్వాత ఆర్వీవీ రిటైర్ అయ్యాము.   


2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎంతో ఉత్కంఠతో పైనుండీ చదివితే చివర్లో “వివరాలు తెలవ్వు” అంటారా? ఇది చాలా అన్యాయం, శ్రీనివాసరావు గారూ.

Zilebi చెప్పారు...


Tip of the iceberg మాత్రమే :) ఇట్లా ఎన్ని పోయేయో ఎవరికెరుక :)



జిలేబి