17, జూన్ 2020, బుధవారం

రాజాకీయాల్లో కావాల్సింది విధేయతా అవకాశం వెతుక్కోవడమా


“రాజకీయాల్లో విధేయత చూపాలా, అవకాశం చూసుకోవాలా?” అంటే తలపండిన ఓ రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఇది:
“ఈ రెండూ అవసరమే. కానీ ఎన్నాళ్ళు విధేయత చూపాలి, ఎప్పుడు అవకాశం వెతుక్కోవాలి అనే సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాడే రాజకీయాల్లో రాణిస్తాడు. లేకుంటే ఇదిగో ఇలా నాలాగా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి సలహాలు ఇచ్చే పాత్రకు పరిమితమవుతాడు”  
పార్టీలతో, వాటి గుర్తులతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన వావిలాల గోపాల కృష్ణయ్య వంటివారు అరుదు. కానీ అటువంటి నిస్వార్ధ నాయకులుకూడా తరువాత కాలంలో ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అతిరధ మహారధులు ఓటమిపాలయ్యారు. 
ఒక్కోసారి పార్టీ గుర్తు చాలా మేలుచేస్తుంది అభ్యర్దులకి. 1978 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఎన్నికలకు ముందు కేటాయించారు. అభ్యర్ధి ఎవరు అనేదానితో నిమిత్తం లేకుండా ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేశారు. టీడీపీ సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ కారు గుర్తు అలాంటివే. తమ గెలుపు మీద అపారమైన  నమ్మకం ఉన్న వారు కూడా ఎదో ఒక పార్టీ పంచన చేరడం అందుకే.
తమిళనాట నెడు౦జెలియన్ (తెలుగు పత్రికల్లో పనిచేసేవారికి ఈయన పేరు రాయడం చాలా ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు నేను రాసింది కూడా కరక్టు కాదు అని తెలుసు కానీ ఏం చెయ్యలేం) అనే ద్రావిడ నాయకుడు వుండేవారు. ఈయన వరసగా పదమూడు సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పని చేశారు. ప్రధానమైన శాఖలు వీరి అధీనంలోనే  ఉండేవి. పార్టీలో ఈయన మాట సుగ్రీవాజ్ఞ. అన్నాదొరై కాలంనుంచి మంత్రిగా పనిచేసిన సీనియర్. ముఖ్యమంత్రి కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంటుగా పోటీ చేసారు. ఫలితం చెప్పక్కరలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజకీయాల్లో గెలుపోటములు కూడా చిత్రంగా వుంటాయి.
తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు.
(17-06-2020)        

8 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

>> తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు.

ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం‌ అధినేత పరిస్థితి కూడా అప్పుడు కరుణానిథికి ఎదురైనటువంటి స్థితి వంటిదే. ఏమో భవిష్యత్తులో తెలుగుదేశం కూడా అలా అప్పట్లో‌ కరుణానిథి లాగా అదికారం‌ కైవసం చేసుకోవచ్చు కదా. అవకాశం ఎంతమాత్రం లేదనే ఇప్పుడు కొందరు విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తారు లెండి. దానికేం.

అంతే‌కాదు, ఒకప్పుడు భాజాపాకు రెండంటే రెండే‌ పార్లమెంటు స్థానాలు దక్కాయి - దాని పని ఐపోయిందనీ అన్నారు. కాని భవిష్యత్తులో భాజపా అధికారంలోనికి వస్తుందని ఎందరు నమ్మగలిగారు?

ప్రస్తుతం ఆంధ్రాలో అధికారపు మత్తు తలకెక్కి ఉన్న పార్టీవారు ఇంక తెలుగుదేశం‌ భూస్థాపితం ఐపోయిందని రోజూ మీడియాలో గంతులు వేస్తున్నారు. వారికి చరిత్ర గురించిన అవగాహన లేదన్నది ఒప్పుకోవలసిన విషయమే కదా. తెలుగుదేశం పార్టీవారు ఇలాగే‌ కలలు కంటూ‌ ఉండి కాలగర్భంలో కలిసిపోవలసిందే అని సదరు అధికారపార్టీ వారున్నూ (సోషల్ మీడియా)ప్రపంచంలో వారి తోకపుచ్చుకొని ఎగురుతున్న మేతావులూ వాదిస్తారు అన్నది కూడా ఒప్పుకోవలసిన విషయమే.

Jai Gottimukkala చెప్పారు...

ఖాలిస్తాన్ ఉగ్రవాద నేపథ్యంలో ఇందిరా గాంధీ దుర్మరణం దరిమిలా జరిగిన 1984 ఎన్నికలలో బీజేపీకి కేవలం రెండు లోక్సభ సీట్లు వచ్చాయి. ఆ తరువాతి కాలంలో పార్టీ అనూహ్యంగా పుంజుకొని క్రమక్రమంగా ఎదిగి 2014 వరకు సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పరిచింది.

పై వాక్యాలు చూసి "2 సీట్లు గెలిచిన పార్టీ కాలక్రమేణా రాజకీయాలను శాసించే స్థాయికి పెరగడం కాకతాళీయం" అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇందుట్లో ఎంతో శ్రమ, ఆలోచన & వ్యూహాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం:

1. బీజేపీ తుక్కుగా ఓడిపోవడానికి కారణాలు, జనం నాడి అర్ధం చేసుకోవడంలో చేసిన తప్పులు వగైరా మూల విషయాలపై పార్టీ & మాతృ సంస్థలో సుదీర్ఘ అధ్యయనం జరిగింది
2. ఓటమికి ముఖ్యకారణంగా భావించిన గాంధియన్ సోషలిజం పంధాను బుట్ట దాఖలు చేసారు
3. తిరుగు లేని మహానాయకుడిగా అప్పటికే పేరున్న వాజపేయిని పీకేసి అద్వానీకి పీఠం అప్పచెప్పారు
4. బనియా-బ్రాహ్మణ-భూమిహార్ పార్టీ ఇమేజీ తీసి పక్కన పడేసి బీసీ, దళిత & ఆదివాసీ వర్గాలను ఆకర్షించే పథకాలు & వ్యూహాలపై దృష్టి సారించారు
5. ఆర్ధిక విధానాలలో కూలంకుశ మార్పులు చేసారు
6. శివసేన, అకాలీ వంటి భావ సంతుల్యత కలిగిన దళాలతో పొత్తులను పటిష్టం చేసుకోవడమే కాక లోకదళ్, సిండికేట్ కాంగ్రెస్ లాంటి వాటితో పూర్తి తెగతెంపులు చేసారు
7. అయోధ్య & ఇతర ఉద్యమాలతో జనంలో మమేకం అయ్యారు

క్లుప్తంగా చెప్పాలంటే నిర్దాక్షిణ్య ఆత్మ పరిశీలన పిదప పంధా, శైలి, నాయకత్వం అన్నిటినీ
జనాభీష్టానుగుణంగా సవరించుకున్నారు. BJP's rise from ashes is neither an accident nor an interesting tidbit from history.

ఇట్లాగే ప్రపంచ కప్పు పోటీలలో క్వార్ట్రర్-ఫైనల్ కూడా చేరని భారత్ 1983 కప్పు ఎత్తడం అనూహ్యమే కానీ అయాచితం కాదు. Success is a result of commitment, dedication, strategy, planning, execution & performance, not an accident or statistical random.

పచ్చ పార్టీ అనునాయులు పైని ఉటంకించిన వివరాలను విశ్లేషిస్తే సంతోషం. కులగజ్జి మీడియా మాఫియాలో విశ్వవిఖ్యాత మేధోసార్వభౌముడిగా చలామణీ అవుతున్న ఆసామి కనీవినీ ఎరుగని తరహాలో చిత్తుచిత్తుగా చావుదెబ్బలు తిన్నాక కూడా "మేము ఎందుకు ఓడిపోయామో తెలువడం లేదు" అని వాపోవడంలో భావదివాళాఖోరుతనం లేదంటారా? ఇప్పటికీ జనాభిమతాలను గాలికి వదిలేసి పాచి పట్టిన "సింగపూరును తలదన్నే భ్రమరావతి" అంటూ పాకులాడడం ఎవరికి లాభం? ఊళ్లలో తిరిగి జనంతో కనెక్ట్ అవుతే చొక్కాకు మసంటుకుంటుంది కాబట్టి ట్విటరులో రంకెలేస్తే ప్రజానాడి తెలుస్తుందా?

Those who don't learn from history to repeat it: George Santayana

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు జై గారు,
భాజపా వారు అధికారంలోనికి రావటానికి చేసిన కృషిని వివరించినందుకు ధన్యవాదాలు. అవకాశం దొరకబుచ్చుకొని మరలా పచ్చపార్టీ అంటూ మొదలుపెట్టి మీ‌రు స్వభావసిధ్ధమైన ఎత్తిపొడుపులపురాణం‌ మొదలు పెట్టారు! ఇది ఊహించనిది కాదు, ముఖ్యంగా పిచ్చిపార్టీ మేతావులనుండి.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

గురువు గారూ, మీ ఫెవరిట్ పార్టీని & అభిమాన నాయకుడిని నేనేదో అన్నానేమో అనుకొని నన్ను మేతావి అనడం & నాకు "పిచ్చి పార్టీ" ముద్ర వేయడం మీకు సంతోషం కలిగిస్తే అట్లే కానీండి.

బీజేపీ ఎట్లయితే (పైని ఉదాహరణలో)ఘోర పరాజయానికి కారణమయిన పంధా, శైలి & నాయకుడిని తొలగించి "సాధారణ" జనంతో మమేకమైనట్టు టీడీపీ కూడా చేస్తే వారికే మంచిది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఖుర్చీ దిగడం ఆయన జవాబుదారీతనానికి & పరిణితికి నిదర్శనం. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీకి ఆ మాత్రం సోయి లేకపోవడం దురదృష్టం, కాదంటారా?

శ్యామలీయం చెప్పారు...

మిత్రులు జై గారు,
మీరు తెలుగుదేశం‌ పార్టీని టార్గెట్ చేసి ఎద్దేవా చేస్తూ ఉంటారు నిత్యం‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మీ ఆ పార్టీ నా ఫేవరిట్ పార్టీ అని అనుకోనవసరం లేదు అంతే‌కాక ఆ పార్టీ అధినేతను నా అభిమాన నాయకుడనీ అనుకోనవసరం లేదు. అటువంటి అభిప్రాయం‌ మీకు కాని బ్లాగులోకంలో మరెవరికైనా గాని ఉంటే అది అపోహ మాత్రమే అని నా మనవి. మీరు ఒక పార్టీని పచ్చపార్టీ అని ఎద్దేవా చేయటాన్ని నిరసిస్తూ‌ మాత్రమే తద్విరోధ పార్టీని పిచ్చిపార్టీ‌ అనటం‌ తప్ప నా ఉద్దేశం మరొకటి కాదు. ఐతే మీరు చూపిన కారణం‌ సబబుగా ఉంది భాజపా పునరుజ్జీవనానికి - మీ రన్నట్లు తెలుగుదేశం వారు అదే విధంగా జనంతో‌ మమేకం‌ కావటానికి యత్నించటం వారికి మంచి చేస్తుంది. ఇకపోతే రాహుల్ గాంధీ పరిణతి గురించి చెప్పారు కాని అది సమ్మతించ లేను. కష్టకాలంలో కాడి వదిలేవాడు పరిణతి కల నాయకుడని అనుకోలేకపోతున్నాను. వారి పార్టీలో ఉన్న (కు)సంస్కృతి కారణంగా వారి కుటుంబసభ్యులు కాని యావజ్జీవం ఆ పార్టీకి ఊడిగం చేసినా ఇతర వ్యక్తి ఎవ్వరూ వా పార్టీకి అధినేతగా ఉండటానికి ఎంతమాత్రం అర్హులు కారే ! అటువంటప్పుడు కాడి తానెలా వదిలేస్తాడు రాహుల్ గాంధీ? అది గొప్ప విజన్ అని మీరనటం‌ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఈ‌ అపరిణతిని పరిణతిగా లెక్కించి మీరు మళ్ళా అ ఆవుకథలోనికి తీసుకొని వచ్చి మీకు నచ్చని పార్టీ అధినేతకు విజన్ లేదని ఎద్దేవా చేయటం వలన ఉపయోగం‌ లేదు. పోనివ్వండి. మీ‌ అభిప్రాయాలు మీవి మా అభిప్రాయాలు మావి. ఇంత చిన్న విషయానికి వాదవివాదాలు అంతగా అవసరం‌ కాదు.

Jai Gottimukkala చెప్పారు...

గురువు గారూ,

రాహుల్ గాంధీ పలాయనం చిత్తగించాడు అనుకోవడం ఒక దృష్టికోణం. కనీసం తన నాయకత్వలేమి ఘోర పరాభవానికి ముఖ్యకారణం అన్న వాస్తవం గుర్తించాడు, పైగా తన తప్పిదాలకు తానే శిక్ష విధించుకున్నాడు కాబట్టి ఆయన పరిణితిని మెచ్చుకోవడం ఇంకో అప్రోచ్. వేరే ఎవరినో బ్లేమ్ (ఉ. నన్ను ఓడించిన ప్రజలే మూర్ఖులు) చేయకుండా ఉండడం అతని ధైర్యం, నిజాయితీ రెంటినీ చూపిస్తుంది: నేను ఫిదా అయింది ఈ లక్షణాలను చూసే.

True Rahul failed miserably in the elections but he is a good example both for integrity (no passing the buck) and accountability (if you can't fix it, exit). Firing the non-performers is often the first step in revival.

ఫలానా పార్టీ లేకుండా పొతే జనానికి నష్టం లేదు కానీ జనం నాడి తెలుసుకునే ప్రయత్నమే చేసేందుకు మనసొప్పని పార్టీలు ఎక్కడున్నా డేంజరే. Products past expiry date should go off the shelves, sooner the better.

శ్యామలీయం చెప్పారు...

Dear Jai garu, don't you think the Congress party is well past it's expiry date? I believe it is being shelved by the public. May be several other parties are also being thrown into the bin now a days.

అజ్ఞాత చెప్పారు...

I don't think so. Congress is not a political party, it is a movement, it was built to last :)