27, ఫిబ్రవరి 2019, బుధవారం

వింగ్ కమాండర్ అభినందన్ - భండారు శ్రీనివాసరావు


భారత సైన్యం జరిపిన మెరుపుదాడిలో  పాకీస్తాన్ కి బందీగా పట్టుబడిన వింగ్ కమాండర్ అభినందన్ ని అక్కడే పాక్ దయాదాక్షిణ్యానికి వదిలి వేయకూడదు. ఇందుకోసం మరో సర్జికల్ స్ట్రైక్ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. భారత సైన్యానికి చెందిన ‘నేత్ర’ నిఘా వ్యవస్థ సాయంతో నిశిరాత్రివేళ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన రీతిలోనే కూలిపోయిన మిగ్ విమాన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ ను తీసుకురాగలిగితే  ఆర్మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. పాక్ బందీగా అభినందన్ అనుభవిస్తున్న చిత్ర హింసల  దృశ్యాలను టీవీ తెరలపై చూస్తున్న ప్రతి ఒక్క భారతీయుడి రక్తం సలసల మరుగుతోంది. అది చల్లబడాలంటే నూటపాతిక కోట్ల భారతీయుల అభినందనలు స్వీకరించడానికి వింగ్ కమాండర్ అభినందన్ ని మెరుపుదాడి చేసి బందీ నుంచి విడిపించుకు రావాలి.
ఈ విషయంలో గతంలో ఇజ్రాయెల్ చూపించిన చొరవ అనుసరణీయం.
అదేమిటంటే...
1976 లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు దారి మళ్ళించి దాన్ని ఉగాండాలోని ఎంటెబే విమానాశ్రయంలో బలవంతంగా దింపేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెలీ ప్రయాణీకులందరినీ చంపేస్తామని బెదరించారు. నాటి ఉగాండా నియంత ఇదీ అమీన్ ఆ హైజాకర్లకు వత్తాసు పలకడంతో బందీలను కాపాడడం అన్నది ఒక  పెద్ద ప్రశ్నార్ధకమైంది. అప్పుడు ఇజ్రాయెలీ సైన్యాధికారులు పకడ్బందీ వ్యూహం రచించి, రెండు రవాణా విమానాల్లో కమాండోలను తరలించారు. ఆ విమానాలు దాదాపు రెండువేల మైళ్ళు ప్రయాణించి నిర్దేశిత ప్రాంతానికి వెళ్లి, మెరుపు దాడి చేసి, ఉగాండా సైనికులను, విమానం దారిమళ్లించిన హైజాకర్లను వధించి, బందీలను విడిపించి తమ దేశానికి తీసుకువెళ్ళారు. థండర్ బోల్ట్ అనే గుప్త నామం కలిగిన ఈ యావత్తు ఆపరేషన్ ప్రక్రియను ఇజ్రాయెలీ కమాండోలు తొంభయ్ నిమిషాల వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేసారు. పాలస్తీనా హైజాకర్లకు, ఉగాండా సైనికులకు  తప్ప వాళ్ళు ఎవ్వరికీ హాని చేయలేదు.

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

అనుకోవటం సులువేగాని అనుకున్నవన్నీ జరగవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా లాంటి దేశాలు తప్ప మిగిలినవి పూర్తిస్థాయి యుద్ధంలో పాల్గొలేవు(దీర్ఘకాలిక భద్రత దృష్ట్యా).
బాధల్ని తట్టుకునే స్టైర్యం పట్టుబడిన సైనికుడికి కలగాలని ప్రార్థించాలి.