2, ఫిబ్రవరి 2019, శనివారం

‘ప్రత్యేక’ రాగాలు – భండారు శ్రీనివాసరావు(Published in SURYA on SUNDAY, 03-02-2019)
సరిగ్గా నాలుగేళ్ల క్రితం .. ఇదే రోజుల్లో  అంటే  2015లో ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై  ఒక టీవీ ఛానల్లో చర్చ జరుగుతోంది.
'గోదావరి పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి తేవడం లేదన్నది వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రతినిధి ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ పడుతున్నారనీఆయనాకొందరు  మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళివిజ్ఞాపన పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారనిరాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద  చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రతినిధి చర్చలో పాల్గొంటూ, కేంద్రం తలచుకుంటే ప్రత్యేక హోదా విషయం తేల్చడం పెద్ద విషయమేమీ కాదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో చిత్తశుద్ధి శూన్యమని అన్నారు.
అప్పుడు ఈ సంభాషణలకు ఒక సాక్షిగా వున్న నేను మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత కూడా తిరిగి ఇదేరకమైన చర్చలకు అదే వేదికలమీద సాక్షిగా ఉంటున్నాను.

రంగస్థలం అదే. పాత్రలూ అవే, పాత్రధారులూ వాళ్ళే. పాడే పద్యాలు అవే. చెప్పే డైలాగులూ అవే. కాకపొతే, పాత్రధారుల పాత్రలు మారిపోయాయి. పాడే పద్యాలు మారిపోయాయి. చెప్పే డైలాగులు మారిపోయాయి. చూసే ప్రేక్షకులు మాత్రం మారలేదు. టిక్కెట్టు లేని సినిమా చూసినట్టు ఉచిత వినోదాన్ని జనాలు పామర పండిత బేధం లేకుండా  ఆస్వాదిస్తున్నారు.
కొంతకాలం క్రితం ఏం జరిగిందో జనాలకు  మరపున పడిందన్న నమ్మకంతో కాబోలు,  తాము చెప్పిన మాటలే తమకు గుర్తులేనట్టు మాట్లాడుతున్నారు. 'అలా అన్నార'ని  ఒకళ్ళు అంటుంటే 'అలా అన'నే లేదని మరొకళ్ళు బుకాయిస్తున్నారు. రాజకీయ అభినయకళ ముందు, చతుష్టష్టి  కళల్లో మిగిలిన అరవై మూడు  కళలు వెలవెలబోతున్నాయి.
రాజకీయ పార్టీలకి ఈ ‘అవసరమైన’ మతిమరపు సహజం కావచ్చు కాని,  కొద్ది కాలం క్రితమే జరిగిన విషయాలు ప్రజలు మరచిపోయే అవకాశం లేదు.
కేంద్రంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్లమెంట్ ఉభయసభల సమావేశాల తుది ఘడియల్లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తెర మీదకు తెచ్చింది. విభజనానంతర ఆంధ్ర ప్రదేశ్ కు అయిదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించబోతున్నట్టు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోకసభ సాక్షిగా హామీ ఇచ్చారు. బిల్లు సానుకూలంగా నెగ్గే విధంగా చూడాలని కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకులను అభ్యర్ధించారు. ఎందుకంటే బిల్లు  ఆమోదం పొందాలంటే  ప్రతిపక్ష బీజేపీ సహకారం కావాలి. 'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం' లాంటి ఆ బిల్లును అన్ని రాజకీయపార్టీలు ఇష్టం వున్నా లేకపోయినా తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం 'మమ' అనిపించి బిల్లును అప్పటికి గట్టెక్కించాయి. బిల్లు తెచ్చిన కాంగ్రెస్ సర్కారును ఒడ్డెక్కించాయి. లోపల ఏమున్నా బయటకు మాత్రం ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిన అన్ని పార్టీల పూర్తి ఆమోదంతోనో, పాక్షిక ఆమోదంతోనో జరిగిందనడం వాస్తవం.
ప్రత్యేక హోదా గురించిన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది కాని, దాన్ని విభజన చట్టంలో చేర్చలేదు. ఈలోగా ఎన్నికలు రావడం, విభజన చేసిన కాంగ్రెస్ సర్కారు ఓటమి పాలయి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇలా అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ హోదా అంశం కొన్నాళ్ళు మరుగున పడిన మాట కూడా వాస్తవం.
బ్రహ్మాండమయిన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడీ కొన్ని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి అయోగ్ ఆవిర్భవించింది. ఈ పరిణామాల ఫలితంగా ప్రత్యేక హోదా అనే అంశానికి ప్రాధాన్యం లేదనే రీతిలో కేంద్రం వ్యవహరించింది.
కేంద్రం, రాష్ట్రం ఎన్నికలలో కుదుర్చుకున్న పొత్తు ధర్మానికి కట్టుబడి ఒకదానినొకటి సమర్ధించుకునే పనిలో పడ్డాయి. ప్రతిపక్షాలు, ప్రత్యేకించి ప్రజాసంఘాలు  ప్రత్యేక హోదా ప్రస్తావన లేవనెత్తినప్పుడల్లా, అప్పటికి తోచిన మాటలు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశాయి. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్దతికి మంగళం పాడాలని మోడీ ప్రభుత్వం అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఆ పార్టీ నాయకులు ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రానికి వచ్చినప్పుడు మరో మాటా చెప్పడం కొంత సందిగ్ధతకు దారితీసింది. ఆ పరిస్తితిలో రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగు దేశం పార్టీ కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ అదే బాటలో నడిచింది. ప్రత్యేక హోదా కోసం ప్రజాసంఘాలు ఆందోళనలు చేసినప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ప్రత్యేక హోదా అనేది అన్ని సమస్యలను పరిష్కరించే దివ్యౌషధం కాదనే రీతిలో ఆ పార్టీ అగ్రనాయకులు ఎద్దేవా చేసిన విషయం కూడా రహస్యమేమీ కాదు. ఈలోగా బీజేపీకి బద్ధశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు రాష్ట్రంలో తాము కాలుకూడదీసుకోవడానికి ప్రత్యేకహోదా అనేది ఒక ప్రధానమైన ఆయుధం అనే అంశాన్ని గుర్తించింది. ఇక ప్రధాన ప్రతి పక్షం వైసీపీ కూడా ఇదే మంచి అదునని భావించి తనకున్న బలాన్ని వాడుకుంటూ ఈ అంశాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు ప్రారంభించింది. లోకసభలో తన సభ్యుల చేత రాజీనామాలు చేయించి అధికార తెలుగు దేశం పార్టీని ఇబ్బందికర పరిస్తితులల్లోకి నెట్టింది. ముందు తేలిగ్గా తీసుకున్నా టీడీపీ కూడా వాస్తవ పరిస్తితులకు తగ్గట్టుగా నడచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి బీజేపీ, టీడీపీ స్థానిక నాయకుల మధ్య మొదలయిన పొరపొచ్చాలు క్రమంగా వేడెక్కడం మొదలయింది. టీడీపీకి ఈ పరిణామాలు గొంతులో వెలక్కాయ చందంగా తయారయ్యాయి. అటు కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకునే పరిస్తితి లేదు. అలాగని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు జగన్ మోహన రెడ్డి ఈ అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చే క్రమంలో చేస్తున్న ప్రయత్నాలను కళ్ళప్పగించి చూసే పరిస్తితీ లేదు. అందుకే మాట మార్చయినా సరే ప్రత్యేకహోదా అంశాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. ఈ విషయంలో మిగిలిన అన్ని పార్టీలకంటే తామే ముందున్నామనే భావన జనంలో కలిగించే క్రమంలో ఎన్డీయే నుండి వైదొలగి ధర్మ పోరాట దీక్షలకు శ్రీకారం చుట్టింది.
ఆ విధంగా  ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు అన్ని పార్టీలకి రాజకీయ అంకుశంగా మారింది.
ఈ నేపధ్యంలో అసలు  ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల లభించే ప్రయోజనాలేమిటి? అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
ఐదు అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారు.

 1. పర్వత ప్రాంతం. 2. జనసాంద్రత తక్కువగా ఉండడం లేదా గిరిజన జనాభా ఎక్కువగా ఉండటం 3. పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకునే వ్యూహాత్మక ప్రాంతం కావడం 4. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం కలిగి ఉండడం 5. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం.
ఈ ఐదు అంశాల్లో ఏ ఒక్క అంశం పరిధిలోకి ఆ రాష్ట్రం వచ్చినా దానికి ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉండటం వంటి కారణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రత్యేక హోదా కల్పించారు.

మొదట అసోం, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. తరువాత అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ప్రత్యేక హోదా రాష్ట్రాల జాబితాలో చేర్చారు.

ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా..? వద్దా..? అన్న విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులతో కూడిన జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీని ఈ రెండు సంఘాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర ప్రణాళికల కోసం ఉద్దేశించిన నిధులను కేంద్ర సహాయం కింద ప్రణాళికా సంఘం ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. (ఇప్పుడు ప్రణాలికా సంఘమే లేదు కాబట్టి ప్రత్యేకహోదా అనే దానికి నూకలు చెల్లినట్టే అనే రీతిలో బీజేపీ నాయకులు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు)
కేంద్ర సాయం మూడు రకాలుగా ఉంటుంది. సాధారణ కేంద్ర సాయం (ఎన్‌సీఏ), అదనపు కేంద్ర సాయం (ఏసీఏ), ప్రత్యేక కేంద్ర సాయం (ఎస్‌సీఏ). ఎన్‌సీఏ కేటగిరీ కింద అందించే మొత్తం సాయంలో 30 శాతం గ్రాంట్ల రూపంలో అందుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు తమ అవసరాల మేర రుణాలు పొందే స్వేచ్ఛ ఉంటుంది. 90 శాతం గ్రాంట్లు, 10 శాతం రుణాల ఫార్ములాను కేంద్ర ప్రాయోజిక పథకాలు, విదేశీ సాయంతో నడిచే పథకాలకు వర్తింపజేస్తారు.

 
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు పలు రాయితీలు, పన్ను మినహాయింపులు పొందుతాయి. ఎక్సైజ్, కస్టమ్స్, ఆదాయపు పన్ను రేట్లు, కార్పొరేట్ పన్ను రేట్లలో మినహాయింపులు ఉంటాయి. ప్రణాళికా సంఘం విదేశీ సాయంతో నడిచే పథకాలకు, నిర్దిష్ట పథకాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నడిచే పథకాలకు కూడా ఆర్థిక సాయాన్ని వర్తింపజేస్తుంది.

 స్థూలంగా ఇవీ ప్రయోజనాలు..
 
కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుతాయి.
 
కేంద్ర ప్రభుత్వ స్థూల బడ్జెట్‌లో 30% నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే వెళతాయి.
 
పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి వస్తు ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఎక్సైజ్ డ్యూటీలో భారీ స్థాయిలో రాయితీలు ఇస్తారు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు రుణాలపై వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ రాయితీ పథకాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఇన్ని రకాల ప్రయోజనాలు వున్న ఈ ప్రత్యేక హోదా హక్కా! సెంటిమెంటా!!
నన్నడిగితే రెండూను. హక్కు నినాదం ముదిరితే సెంటిమెంటు అవుతుంది. ఒక్కసారి అది భావోద్వేగపు రూపు సంతరించుకుంటే దాన్ని నిలువరించడం కష్టమౌతుంది.  ప్రత్యేక తెలంగాణా ఉద్యమమే దీనికి రుజువు. “లక్ష కోట్ల ప్యాకేజీ కావాలా? తెలంగాణా కావాలా?” అన్నప్పుడు ‘కాటా’ తెలంగాణా వైపే మొగ్గిన సంగతి  గమనంలో పెట్టుకోవాలి.
కొన్నేళ్ళ క్రితం ఒక టీవీ ఛానల్ చర్చలో నేను ఇదే చెప్పాను. ఈ అంశానికి మద్దతుగా ఏ పార్టీ ఎంతమంది మద్దతు కూడగట్టగలిగింది అన్నది పాయింటే  కాదు. ముందు ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కలసికట్టుగా ఒకే బాటలో నడుస్తూ,‘ఒకే మాటగా’ ఢిల్లీని అడుగుతున్నారా లేదా అన్నదే ప్రశ్న.
ఉపశృతి:
“ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది” 
శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి శృతి వారిది. ఎవరి నాదం వారిది. అందుకే లయ తప్పుతోంది.
(రచయిత జంధ్యాలకుసంగీతాభిమానులకు క్షమాపణలతో)

కామెంట్‌లు లేవు: