10, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఓటరు హక్కులు కాపాడేది ఎవరు? – భండారు శ్రీనివాసరావు

(Published in SURYA telugu daily on SUNDAY, 10-02-2019)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్తితి నెలకొని వుంది.

తనకు మాత్రమే సంబంధం ఉన్న ఒక విషయంలో, తన నిమిత్తం లేకుండా పాలక
ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు చూసి సగటు ఓటరు విస్తుపోతున్నాడు.

ఓటర్ల జాబితా విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయనీ, పాలక పక్షం టీడీపీ అనేక
అవకతవకలకు పాల్పడుతోందని, అర్హులను తొలగించి అర్హత లేని తమ అనుకూలురకు
జాబితాలో స్థానం కల్పిస్తున్నారని  ఆరోపిస్తూ వై ఎస్ ఆర్ సీ పీ అధినేత
జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ఒక
మహజరు అందచేసి వచ్చారు. సర్వేల పేరుతొ పౌరులనుంచి సమాధానాలు రాబట్టి
వాళ్ళు తమకు ఓటు వేసే అవకాశం శూన్యం అని నిర్ధారణకు వచ్చినప్పుడు వారిని
ఓటర్ల జాబితానుంచి తొలగించే ఒక పెద్ద కుట్రకు పాలకపక్షం తెలుగుదేశం
పార్టీ తెర తీసిందనే నిందారోపణను కూడా ఎన్నికల సంఘం ముందు ఉంచింది.

నిజానికి ఓటర్ల జాబితాలో అవకతవకల విషయంలో ఏవైనా అనుమానాలు వుండాల్సింది
ఓటర్లకు. పవిత్రమైన ఓటు అంటూ పార్టీలు ఊదరగొట్టే ఆ ఓటు తమ పేరు మీద
లేకపోతే వారికి ఎంత చిన్నతనంగా వుంటుంది. పైగా రాజకీయ జిమ్మిక్కుల్లో
భాగంగా ఎవరో ఒకరు తమ పేరు మీద ఆ హక్కును ఉపయోగించుకుంటున్నారని తెలిస్తే
ఎంత నగుబాటుతనం. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో తమ ప్రాధమిక హక్కు అయిన
ఓటును కోల్పోవడం ఎంత బాధాకరం. అందుకే, అర్హత వుండీ ఓటర్ల జాబితాలో తమ
పేరు లేకపోతే ఆ విషయంలో పిర్యాదు చేయాల్సింది, అభ్యంతర పెట్టాల్సింది ఆ
పౌరులు మాత్రమే. అలాగే, ఈవీఎంలలో వేసిన ఓటు తాము  అనుకున్న అభ్యర్ధికి
పడిందాలేదా అనే అనుమానం వారికి కలిగినా ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పని
లేదు.

అయితే ఇక్కడ విచిత్రంగా ఈ బాధ్యతని రాజకీయ పార్టీలు తమ తలకెత్తుకున్నాయి.
దానితో ఈ ఆరోపణలకు సహజంగానే రాజకీయ రంగు పులుముకుంది.

ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా, ఓటర్ల జాబితా రూపొందించినా ఆ బాధ్యత
ఎన్నికల సంఘానిదే. రాష్ట్ర ప్రభుత్వానికి వాటితో ఏ ప్రమేయం వుండదు.
అయితే, ఎన్నికల సంఘానికి అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగబద్ధంగా వున్నాయి
కానీ, తనకంటూ విడిగా  ఒక కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. ఆయా రాష్ట్ర
ప్రభుత్వాల యంత్రాంగం మీద ఆధారపడి తన పనులను చక్కబెట్టుకోవాల్సిన
పరిస్తితే ప్రస్తుతం వుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎన్నికల
సిబ్బందిగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆ కొద్ది రోజులు ఎన్నికల సంఘం
కనుసన్నల్లోనే పనిచేయాలి. కోడ్ వ్యవధానం ముగియగానే తిరిగి ప్రభుత్వ
ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఈ కారణంగా వాళ్ళు నిర్భయంగా, నిస్సంకోచంగా,
రాజకీయాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగిపోకుండా, ఒత్తిళ్లకు గురికాకుండా
విధులు నిర్వర్తించడం అనేది కత్తిమీద సామే. వారందరూ అలాగే నిబద్ధతతో
పనిచేస్తారని అనుకోవడం కూడా అనుమానమే.

స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగిన నాటి నుంచి అవసరాలకు,
అనుభవాలకు, మార్పులకు తగినట్టుగా అనేక సంస్కరణలు అమలుచేస్తూ వస్తున్నారు.
మొదట్లో, ఒకే దేశం ఒకే  ఎన్నిక అన్నట్టు అటు లోకసభకు, ఇటు రాష్ట్రాల
అసెంబ్లీలకు ఒకేమారు విడతల వారీగా ఎన్నికలు జరిగేవి. ఏక పార్టీ పాలనకు
కాలం చెల్లి, అనేక పార్టీలు కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారానికి రావడం,
సంకీర్ణ ధర్మాలు పాటించక అనేక సార్లు మధ్యంతర ఎన్నికలు, రాష్ట్రాలలో
రాష్ట్రపతి పాలనలు ఒక ఆనవాయితీగా తయారయిన తర్వాత దేశంలో ఎక్కడో ఒక చోట
ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం మొదలయింది. ఈ నేపధ్యంలో,
ఎన్నికలసంఘానికి కేంద్ర, రాష్ట్ర స్తాయిల్లోనే కాకుండా జిల్లాలు, మండలాల
వారీగా శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాల్సిన అగత్యం తలెత్తుతోంది.

అర్హత కలిగిన ప్రతిపౌరుడి పేరు ఓటర్ల జాబితాలో వుండి తీరేలా వ్యవస్థను
సరిదిద్దాలి. ఇది  రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు. ప్రజాస్వామ్య విధానంలో
ఇలా చేయడం  ప్రభుత్వాల కనీస ధర్మం. అనర్హులయిన వారి పేర్లు నిష్కర్షగా
తొలగించాలి.  కానీ వాస్తవంలో ఇవేవీ జరగడం లేదు. ఎన్నికలు జరిగిన ప్రతి
పర్యాయం ఈ విషయం చర్చకు వస్తూనే వుంది. అనర్హులను జాబితాలో
చేరుస్తున్నారనీ, అర్హులకు ఓటు హక్కు తొలగిస్తున్నారనీ ప్రతిపక్షాలు
ప్రతిసారీ ఆరోపణలు చేస్తూనే వుంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికి
మాత్రమే పరిమితం కాదు. నిరుటి చివర్లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల
సందర్భంలో కూడా ఈ ఆరోపణలు వెలుగు చూశాయి.

వాటిల్లో నిజం వుండే అవకాశం కూడా ఉండొచ్చు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం
సాయంతో వాటిని సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ఉదాహరణకుఒకానొక రోజుల్లో అనేక
కుటుంబాలలో ఒకే పేరు మీద  పలు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. అలాటి
వాటిని సాంకేతిక సాయంతో ఒక్క పెట్టున తొలగించగలిగారు. అదే పద్దతిలో
వేర్వేరు నియోజకవర్గాలలో ఒకరి పేరు మీదనే ఉన్న ఓటరు కార్డులను గుర్తించి
తొలగించవచ్చు. పేరు తొలగించే ముందు ఎస్సెమ్మెస్ ద్వారా ఆ విషయాన్ని
వ్యక్తిగతంగా తెలియచేయవచ్చు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిరంతరంగా
నిర్వహించే శాశ్వత వ్యవస్థను అన్ని చోట్లా ఏర్పాటు చేయవచ్చు. అన్ని
వర్గాలవారితో సమాలోచనలు జరిపి సలహాలు,సూచనలు స్వీకరించి విధానంలో ఏవైనా
లొసుగులు వుంటే వాటిని సరిదిద్దవచ్చు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు గురించి వైసీపీ నాయకుడు జగన్మోహన రెడ్డి
అభ్యంతరాలను లేవనెత్తిన సమయంలోనే  మరోపక్క టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ
ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఈవీఎంల పని తీరు పట్ల అనుమానాలను మరోమారు
లేవనెత్తారు. మునుపటి రోజుల్లో మాదిరిగా పేపరు బేలట్ విధానానికి
మరలిపోవాలన్నది ఆయన తరచుగా చెబుతున్న మాట. ఆయన కూడా హస్తినకు వెళ్లి అనేక
మిత్రపక్షాల ప్రతినిధి వర్గంతో పాటు ఎన్నికల సంఘానికి ఒక వినతి పత్రం
సమర్పించారు.  ఎలక్ట్రానిక్  ఓటింగు యంత్రాల స్థానంలో పేపర్ బేలట్
విధానాన్ని పునరుద్ధరించాలన్నది వారి డిమాండ్. ఒక పార్టీకి వేసే ఓటు మరో
పార్టీకి పడేలా ఈ యంత్రాలను ట్యాంపర్ చేస్తున్నారని వారి ఆరోపణ. బేలట్
పేపర్ విధానానికి మళ్లడం సాధ్యం కాని పక్షంలో వీవీ ఫ్యాట్లను కూడా
లెక్కించాలని వారి సూచన.

ఈవీఎం ల మీద ఈ  చర్చ కొత్తదేమీ కాదు. గతంలో జరిగిన చర్చలే ఇప్పుడు
కొత్తగా సాగుతున్నాయి.

అధికారంలో వున్నవాళ్ళు ఆ యంత్రాలను మాయ చేస్తున్నారని ఓడిపోయిన వాళ్ళు
ఆరోపిస్తారు. గెలిచినవాళ్ళు ఆ వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ప్రతి
విమర్శలుచేస్తారు. గమ్మత్తేమిటంటే, ఓడిపోయి అధికారం కోల్పోయిన వాళ్ళు,
ఒకప్పుడు ఓడిపోయి ఇప్పుడు గెలిచి అధికార అందలం మీద కూర్చున్న వాళ్ళు
ఇద్దరూ  చెప్పేది ఒక్కటే కావడం. కానీ వీరిలో ఎవ్వరూ ఓటరు గురించి
ఆలోచిస్తున్న దాఖలా కనబడడం లేదు. నిజానికి ఇది ఓటరుకు సంబంధించిన అంశం.
తను అనుకున్న అభ్యర్ధికి తాను  వేసిన ఓటు పడిందా లేదా అనేది అతడికి
రావాల్సిన అనుమానం. కానీ, విచిత్రంగా ప్రజలనుంచి ఈ చర్చ మొదలు కాలేదు,
రాజకీయ పార్టీలే రచ్చ చేస్తున్నాయి. మీదుమిక్కిలి, హై టెక్ ముఖ్యమంత్రిగా
పేరుగాంచిన చంద్రబాబునాయుడు నోటివెంట ఇటువంటి మాటలు వినరావడం ఆశ్చర్యం
అనిపిస్తుంది.

ప్రజాస్వామ్య విధానంలో ప్రజలు ఎన్నికల ద్వారా తమకు నచ్చిన పార్టీని
ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం వివిధ రకాల
ప్రక్రియలను స్వతంత్రం వచ్చిన దాదిగా ఎన్నికల సంఘం అనుసరిస్తూ వచ్చింది.

నాణానికి బొమ్మా బొరుసూ ఉన్నట్టే, స్వతంత్ర భారతంలో ఏవగించుకోదగిన కొన్ని
అవకరాలతో పాటుగా   ప్రపంచం గర్వించదగిన గొప్ప లక్షణాలను కూడా మనదేశం తన
కొంగున ముడేసుకుంది. 1947 లో భారతదేశంతోపాటే స్వేచ్చా వాయువులు
పీల్చుకున్న అనేక ఆసియా దేశాలు, ఇరుగు పొరుగు దేశాల్లో కొన్నయినాఈ ఏడు
దశాబ్దాల పైచిలుకు కాలంలో కొన్నేళ్ళయినాకొంతకాలంపాటయినా
ప్రజాస్వామ్యపధాన్ని వీడి నియంతృత్వపు బాటలో నడిచిన దాఖలాలున్నాయి. మన
దేశం మాత్రం ఎన్ని వొడిదుడుకులకు లోనయినా, మరెన్ని వొత్తిడులకు గురయినా,
ఎంచుకున్న మార్గంలోనే అప్రతిహతంగా పురోగమించి ప్రపంచంలోనే అతి పెద్ద
ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా తన స్తానాన్ని పదిలం చేసుకుంది. దీనికి
ప్రధాన కారణం, రాజకీయ పార్టీలు కాదు, వాటి తల రాతలను నిర్దేశిస్తున్న అతి
సామాన్యులయిన స్వతంత్ర భారత ఓటర్లు.

వీరిలో అత్యధిక భాగం నిరక్షరకుక్షులయినా 'ఓటు' అనే ఆయుధంతో ప్రభుత్వాలను
మార్చగల సత్తా వారి సొంతం.

అక్షరజ్ఞానం లేకపోయినా, కానులూ, ఏగానులనుంచి, బేడలూ అర్ధణాల నుంచి నయా
పైసల లెక్కకు అలవోకగా మారగలిగిన 'మేధోతనం' వారి ఆస్తి.

గిద్దెలు, సోలలు, శేర్లు, సవాశేర్లు, మానికెల కొలతలనుంచి లీటర్లకు అతి
తక్కువ వ్యవధిలో మారిన చరిత్ర వారిది.

అలాగే, వీసెలు, మణుగులనుంచి కిలోగ్రాములకు, బస్తాలనుంచి క్వింటాళ్లకు,
'
మైలు రాళ్ళని' అధిగమించి కిలోమీటర్లకు ఎదిగారు. అమెరికా వంటి అభివృద్ధి
చెందిన దేశాలు కూడా కిలోమీటర్ల లెక్కల్లోకి మారిపోకుండా పాతకాలంలో
మాదిరిగా  ఇంకా 'మైలు'రాళ్ళదగ్గరే ఆగిపోయిన సంగతి ఇక్కడ గమనార్హం.

చదువూసంధ్యా లేని వాళ్లనీ, ఎందుకు పనికిరాని వాళ్ళనీ ఇతర దేశాల వారికి
మనపై చిన్నచూపు. కానీ అలాటి మనవాళ్లే, దేశానికి స్వాతంత్రం రాగానే
నిర్వహించిన తొలి ఎన్నికల్లో, పార్టీల గుర్తులున్న పెట్టెలలో ఓటు వేసే
దశను అలవోకగా దాటేసారు. ఆ తరువాత ఒకే బాలట్ పేపరుపై ముద్రించిన అనేక
పార్టీల గుర్తులనుంచి తాము ఎంచుకున్న అభ్యర్ధిని అతడి గుర్తుతోనే
గుర్తుపట్టి ఓటు వేయగల పరిణతిని అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా అధునాతన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తడబడకుండా ఉపయోగించుకోగల సామర్ధ్యాన్ని
అలవరచుకోగలిగారు.

అలాంటి సత్తా కలిగిన భారతీయ ఓటర్లు, తమకు ప్రత్యక్షంగా సంబంధం కలిగిన ఒక
అంశంపై తమతో నిమిత్తం లేకుండా జాతి వ్యాప్తంగా చర్చలు జరుగుతున్న తీరును
గమనించి విస్తుపోతూ వుండివుంటారు. కానీ వాళ్ళది మౌన ప్రేక్షక పాత్ర. వారి
గొంతు వినబడే అవకాశమూ లేదు, వినిపించుకునే నాధుడూ ఉండడు.

ఇప్పుడు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) గురించి జరుగుతున్న
చర్చలో కూడా వారి పాత్ర లేదు. అదేదో తమకు మాత్రమే సంబంధించిన విషయంగా ఆయా
రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

ముందే చెప్పినట్టు, ఈవీఎం లను తమకు అనుకూలంగా టాంపర్ చేయగలిగే అవకాశం
కేంద్రంలో పాలకపక్షానికి వుందని ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికలను
నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని
ఆరోపించడానికి కూడా అవి వెనుకాడడం లేదు. గమ్మత్తేమిటంటే ఇలా
అనుమానిస్తున్న పార్టీలు గతంలో కేంద్రంలో అధికారం చెలాయించిన పార్టీలే.
అదే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి, అవే ఈవీఎంలను
వినియోగించిన విధానంలోనే పరాజయం పాలయినవే మరి. తమ పాలన సమయంలో ఈవీఎంల
వాడకాన్ని సమర్ధించి, తాము అధికారం కోల్పోగానే వాటి పని తీరు పట్ల
సందేహాలు లేవనెత్తుతూ వుండడం చూస్తే అసలు ఆ అనుమానాల పట్లనే అనుమానం
కలుగుతోంది. ఇవి పనికి రానివే అయితే, జయాపజయాలను నిర్దేశించగల స్థాయిలో
వాటిని నియంత్రించగల పద్దతి ఏదైనా వుందని అనుకుంటే, ఆనాడే వాటిని మరింత
బాగా మెరుగుపరిచి వుండాల్సింది. లేదా పాత కాలపు బ్యాలెట్ విధానానికి
మళ్ళి వుండాల్సింది. అధికారంలో వున్నప్పుడు చేయలేని పనిని  ఆ అధికారం
కోల్పోయిన తర్వాత డిమాండ్ చేస్తూ  ఉండడంలోనే రాజకీయం దాగుందని ఎవరయినా
అనుమానిస్తే తప్పేముంది?


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈ పుచ్చలకాయ ఎన్నికల్లో ఓటు ఎవరికి పడినా పట్టించుకునే అవసరం ఓపిక ఆసక్తి పెజానీకానికి లేదు.
"ఎవరయినా
అనుమానిస్తే తప్పేముంది?" . తప్పు ఉందని ఎవరన్నారు స్వామీ. మీడియావాళ్లే ఏవో లాజిక్కులు లాగడం. వార్తలు వస్తున్నాయి అంటూ అభూతకల్పనలు చెయ్యడం. ఎందుకు బయ్యా ప్రజలతో ఆడుకుంటారు మీడియా సోదరులు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత : కదా!