12, డిసెంబర్ 2015, శనివారం

నమ్మకంపై సడలుతున్న నమ్మకం - భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 13-12-2015, SUNDAY)
సూటిగా ......సుతిమెత్తగా......
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే సియాటిల్ నగరంలో  మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మా అబ్బాయితో.
నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.
అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళకు పైగా వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.


అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం.
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం.
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం.
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం.
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.
ఎందుకంటే, ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా మాత్రం చేసింది.
నాయకులు తమ అనుచరులనే నమ్మరు. నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు, కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.
అనుచరులు నాయకులని నమ్మరు. ఎందుకంటె, తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్షసాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి ఆపైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.
జనం ఈ కార్యకర్తలని నమ్మరు, ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.
జనాన్ని రాజకీయులు నమ్మరు, ఎన్నికల క్రతువు ముగియగానే  మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.
ఇలా లెక్కేసుకుంటూ వెడితే ఈ జాబితా కొండవీటి చాంతాడే.
ఏటీఎం లనుంచి డ్రా చేసే కరెన్సీ నోట్లలో ఎన్ని అసలువో, ఎన్ని నకిలీవో తెలియదు. మెరిసిపోతున్నాయని ముచ్చటపడి కొనే నగలలో అసలు బంగారం ఎంతో, కాకి బంగారం ఎంతో అన్నది అనుమానమే.
నిగనిగ లాడుతోందని తినే మామిడి పండ్లకు, అరటి పండ్లకు ఆ మెరుపు సహజంగా వచ్చిందా కార్బైడ్ వంటి కృత్రిమ లేపనాలతో వచ్చిందా అంటే చప్పున చెప్పడం కష్టమే.
నకిలీ ఔషధాలు గురించిన వార్తలు మరింత ఘోరం. శారీరక రుగ్మతలనుంచి బయటపడడానికి డాక్టర్లు రాసిన మందులు రోగులు నమ్మకంతో కొనుక్కుంటారు. కానీ మార్కెట్లో విచ్చలవిడిగా పంపిణీలో వున్న నకిలీ మందులు రోగాల సంగతి అటుంచి రోగుల  ప్రాణాలనే బలిగొంటున్నాయి.
తాగే నీళ్ళు అంతే. ప్లాస్టిక్ సీసాల్లో దొరికే మంచి నీళ్ళు తాగడానికి యెంత శ్రేయస్కరమో చెప్పలేము కాని, వాటిని తయారు చేసేవాళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి.
మొన్నీ మధ్య కల్తీ నెయ్యి వ్యవహారం బయట పడింది. ఏకంగా ఏడుకొండల వాడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యే కల్తీ అని చెప్పుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. లెక్క ప్రకారం దర్యాప్తులు అయితే జరుగుతాయి కానీ నిజాలు వెలుగు చూస్తాయా అన్న విషయంలో ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. వెంకన్న లడ్డును మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. అందులో ఏ నెయ్యి వాడారు అన్న దానితో భక్తులకు నిమిత్తం వుండదు. కల్తీ నెయ్యి వల్ల ప్రాణాలు పోకపోవచ్చు. కానీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం వుంటుంది. పైగా ఈ ప్రసాదం దేశంలోని అన్ని ప్రాంతాలకు వెడుతుంది. పర్యవసానాల గురించి తెలియరావడానికి చాలా వ్యవధానం పట్టొచ్చు కూడా. నెయ్యి కల్తీ చేసినవారు మాత్రం హాయిగా కోట్లకు పడగలు ఎత్తుతుంటారు. విజయవాడ పొలిమేరల్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఒక ఫాక్టరీ పై పోలీసులు దాడి చేసి ఇద్దర్ని అరెస్టు చేసారు. అసలు యజమానులు పరారీలో వున్నారన్నారు. అలవాటుగానే వాళ్ళు పోలీసులకు పట్టుబడరు. కొంతకాలం తరువాత అంతా సర్దుకుంటుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్. ఇదంతా  షరామామూలే. ఉత్తర ప్రదేశ్ లో ఇంతకంటే పెద్ద ఘోరమే వెలుగు చూసింది. నెయ్యి సహజరూపంలో పొలుసులు పొలుసులుగా కానరావడానికి ఎముకల పొడిని జంతువుల కొవ్వుతో  కలిపి తయారు చేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలకి ఈనెయ్యి సరఫరా అవుతోంది. మంచి ఆకర్షణీయమైన ప్యాకింగుల్లో లభించే ఈ నెయ్యిని జనం అమాయకంగా కొని మోసపోతున్నారు. ఇటువంటి నెయ్యి వాడిన వాళ్ళు కాలక్రమంలో కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం వుందని అధికారులే చెబుతున్నారు. 
కల్తీ వ్యవహారాలకి క్లైమాక్స్ రూపంలో మొన్నీ మధ్య విజయవాడలో కల్తీ మద్యం దుర్ఘటన చోటుచేసుకుంది.
కల్తీకల్లు తాగి జనాల ప్రాణాలు హరీ అనడం గురించి లోగడ విన్నాం. బారులో మద్యం సేవించి అయిదుగురు చనిపోయిన  వార్త విన్నప్పుడు ఇక ప్రజల ప్రాణాలకు పూచీ ఎక్కడ అనిపించక తప్పదు.
ఇది జరిగింది ఉదయం పది గంటలకు అని పత్రికల్లో వచ్చింది. అంత పెందలాడే బార్లు తెరవడం నిబంధనల ప్రకారం కుదిరే పనా! కూలీ నాలీకి వెళ్ళేవాళ్ళు ఆ బారులో మద్యం సేవించి వెడుతుండడం రివాజే అని ఆ పత్రికలే రాశాయి. అంటే ఏమిటన్న మాట. యధేచ్చగా  మద్యం అమ్మకాలు, బహిరంగంగా  తాగడాలు ఇవేవో  అధాటుగా జరిగినవి కావు, అలవాటుగా రోజూ జరిగే వ్యవహారమే అనుకోవాలి. దుర్ఘటన జరిగింది కనుక విషయాలు వెలుగులోకి వచ్చాయి.లేకుంటే, మద్యం కల్తీ అనేది చాపకింది నీరులా సాగిపోతుండేది.
చౌకరకం కల్లు, సారా వంటి నాసిరకం  కాకుండా బార్లలో దొరికే  మరికాస్త ఖరీదయిన మద్యం శ్రేయస్కరమనే పేద  వినియోగ దారుల నమ్మకం ఆ విధంగా వమ్మయింది.            
ఇప్పుడు చెప్పండి!
నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా, నమ్మకస్తుల  గురించి ప్రస్తావించినా
నమ్మకంగా నమ్మొచ్చునంటారా?నమ్మకం అనేది రాతి మీది గీతగా వుండాలి, నీటి మీది రాత కాకూడదు.

(12-12-2015)

NOTE: Courtesy Images Owner

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


ఈ టపా రేపు సాక్షి లో నమ్మకం గా వస్తుందంటారా ;)

జేకే !

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Zilebi - I did not say. I said that this will be published in 'SURYA' telugu daily in it's edit page on 13th Dec. 2015, Sunday.