16, మే 2013, గురువారం

దొంగ నీతులుఒక వూళ్ళో  బ్యాంకు దోపిడీ జరిగింది.
బ్యాంకులో ప్రవేశించిన దొంగల నాయకుడు తుపాకీ చూపుతూ ఇలా అన్నాడు.
‘కదిల్తే కాల్చేస్తాం. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. డబ్బు, ఆస్తులు ప్రభుత్వానివి. ప్రాణాలు మాత్రమే మీవి’
అంతే. బ్యాంకులో వున్న సిబ్బంది,ఖాతాదారులు అందరూ ఒక్కమాటుగా నిశ్శబ్దంగా నేలమీద పడుకున్నారు. దొంగలు తమ పని చేసుకు పోయారు.
దీన్నే మనసుమార్చే టెక్నిక్ అంటారు. ఒక రకంగా ధ్యాస మళ్ళించడం.
ఈ లోగా, బ్యాంకు సిబ్బందిలో ఒకమ్మాయి అతితెలివికి పోయి ఓ బల్లమీద వొయ్యారంగా పడుకుని, దొంగలను లోబరచుకోవడానికి  తన వొంపుసొంపులు ప్రదర్శించింది.
దొంగల నాయకుడు అది చూసి హెచ్చరించాడు. ‘కాస్త నాగరీకంగా ప్రవర్తించు. మేమొచ్చింది దోపిడీకి. అత్యాచారానికి కాదు’
దీన్ని వృత్తి చాతుర్యం అంటారు. చేసే పనిమీద తప్ప వేరే అంశాలపై దృష్టి పెట్టకపోవడం అన్నమాట.

సరే. దోపిడీ పూర్తిచేసుకుని దొంగలు తమ స్థావరానికి వెళ్ళిపోయారు.
వారిలో ఓ జూనియర్ దొంగ,  దొంగ సొమ్ము లెక్కపెట్టే పనిలో మునిగిపోయాడు.
అది గమనించిన సీనియర్ దొంగ ఇలా అన్నాడు.
‘అంత డబ్బు లెక్కపెట్టేసరికి తెల్లారుతుంది. కాసేపట్లో టీవీ వార్తల్లో యెంత సొమ్ముపోయిందీ వాళ్ళే చెబుతారు’
దీన్ని అనుభవం అంటారు. అందుకే ఈ రోజుల్లో కాగితం డిగ్రీలకంటె అనుభవమే ప్రధానం అంటున్నారు.

దోపిడీ దొంగలు వెళ్ళిపోగానే బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫోను చేయమని అసిస్టెంట్ కు చెప్పాడు.
‘తొందరపడి ఆ పని చేయకండి. ఇంతకుముందు లావాదేవీల్లో మనం నొక్కేసిన సొమ్మును కూడా కలిపిచెబుదాం, ఓ పనయిపోతుంది’
‘ప్రతి నెలా ఇలా ఒక దోపిడీ జరిగితే యెంత బాగుంటుందో’ అన్నాడు మేనేజర్ ఆనందంగా.
దీన్ని అలలకు అనుగుణంగా ఈతకొట్టడం అంటారు.  అనూహ్యంగా ఎదురయిన అననుకూల పరిస్తితిని  సయితం తమకు  అనుకూలంగా మార్చుకోవడం అన్నమాట.

మరునాడు పేపర్లన్నీ బ్యాంకు దోపిడీ గురించి మొదటి పుటల్లో ప్రచురించాయి.
ఆ వార్తలు చదివి దొంగల నాయకుడు నోరు వెళ్ళబెట్టాడు.
దోచుకొచ్చిన సొమ్మును ఎన్ని సార్లు లెక్కబెట్టినా పత్రికల్లో వచ్చిన సొమ్ముతో సరిపోలడం లేదు.
కొట్టుకొచ్చింది కాసింతయితే, పోయిందని  బ్యాంకు వాళ్ళు గగ్గోలు పెడుతోంది కొండంత.  
‘మనమేమో ప్రాణాలను పణంగా పెట్టి బ్యాంకు దోపిడీ చేశాం. వాళ్లేమో ఒకే ఒక్క దొంగ లెక్క చెప్పి మనం దోచుకున్నడానికి రెండు రెట్లు నొక్కేసారు. ఇలా అడవిలో దొంగగా బతికే కంటే బ్యాంకులో మేనేజర్ గా వుండడం మేలేమో!’ అని
దొంగల నాయకుడు బెంగ పడ్డాడు. (16-05-2013)
Note: Courtesy Cartoonist 

కామెంట్‌లు లేవు: