18, మే 2013, శనివారం

నమ్మకం - భండారు శ్రీనివాసరావు
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధ్రువ పరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు.అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది. “ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మావాడితో.

“నమ్మకం” అనేవాడు మా వాడు స్తిరంగా.

“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచి తూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో పదేళ్ళ నుంచి వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.

అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.

చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.

వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం,

కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం,

ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించి కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం,

బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం,
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం,
అవతల వ్యక్తి ఏమిచెప్పినా అది మనల్ని మోసం చేయడానికే అన్న భావం ఏకోశానా వుండకూడదనే నమ్మకం-

ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా,
ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలము.

ఎందుకంటే – ఈ అరవై ఏళ్ళ పైచిలుకు స్వతంత్ర ప్రజాస్వామ్యం మనకిచ్చిందీ, మిగిల్చిందీ ఏమోకానీ ‘నమ్మకం’ అన్న పదాన్ని జీవితాల్లో కనబడకుండా చేసింది.

నాయకులు తమ అనుచరులనే నమ్మరు.
నీడలా వెన్నంటే వుంటూ, తందానా అనకముందే తాన అని అంటూ, ప్రతి చిన్న విషయంలో ఆహా ఓహో అని భజన చేసే కార్యకర్తలు – కడకంతా తమ వెంట వుండరన్న అపనమ్మకం నాయకులది.

అనుచరులు నాయకులని నమ్మరు.
తమ నాయకుడు ‘తన నాయకుడికి’ ఎలా పంగనామాలు పెట్టాడో అన్న వాస్తవానికి వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి. అవసరమయితే నిచ్చెన మెట్లెక్కినట్టు నాయకుడి తలపైనే కాలుమోపి పైమెట్టుకి ఎగబాకాలనే తాపత్రయం వారిది.

జనం ఈ కార్యకర్తలని నమ్మరు.
ఎందుకంటె తమపేరు చెప్పి వసూలు చేసే మొత్తంలో తమకు ముట్టినదెంతో అణాపైసలతో సహా వారికి లెక్కలు తెలుసు కాబట్టి.

జనాన్ని రాజకీయులు నమ్మరు.
ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా వారితో పనేమిటన్నది వారి నమ్మకం.

ఇక మీడియా.
ఒక ఛానల్ ను మరో ఛానల్ నమ్మదు. అందుకే ఒకే వార్త రెండురకాలుగా కనిపిస్తుంది. వినిపిస్తుంది.
ఒక పత్రికను మరో పత్రిక నమ్మదు. ఒక పత్రికలో వచ్చిన వార్తను మరో పత్రిక వ్యాఖ్యాన సహితంగా ఏకిపారేస్తుంది.

ఇప్పుడు చెప్పండి!

నమ్మకం గురించి ఎవరయినా మాట్లాడినా,
నమ్మకస్తులు గురించి ప్రస్తావించినా
నమ్మొచ్చునంటారా?

(17-12-2010)

కామెంట్‌లు లేవు: