14, జులై 2011, గురువారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు


“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

“బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.” (పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

(14-07-2011)

6 కామెంట్‌లు:

రాజేష్ జి చెప్పారు...

$భండారు శ్రీనివాసరావు గారు

అక్షరం పొల్లుపోకుండా చెప్పారు వాస్తవాన్ని. ఈ మధ్యకాలంలో చదివిన అత్యంత స్పూర్తివంతమైన టపా ఇది. ధన్యవాదాలు.

నిజవే..సమాజాన్ని ఉద్దరించే ముందు ఇంటిని ఉద్దరించుకోవాలి. ఇంటిని ఉద్దరించడం అంటే ఇంట్లో అందరూ కోట్లకుకోట్లు సంపాయించాలని కాదు.. అన్న అడుక్కుతింటుంటే తమ్ముడు సమాజోద్దరణ అమి బయలుదేరడం హాస్యాస్పదం. ఇది నా అభిప్రాయం.

#“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే"

కృతజ్ఞతలు...!

Rao S Lakkaraju చెప్పారు...

శ్రీనివాసరావు గారూ ఇప్పుడైనా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుండే ప్రారంభించ వచ్చు. చేద్దా మనుకున్నవి మొదలెట్టటమే. మనం గమ్యము చూడాల్సిన పనిలేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju - నిజమే మీరన్నది. Better late than never. కానీ ఈ నాలుగు మంచి ముక్కలు చెప్పిన 'సన్యాసి' పదకొండో శతాబ్దానికి చెందినవాడు. అప్పటినుంచి 'కధ'ఇలాగే నడుస్తూ వస్తోందన్నమాట. చెప్పేవాళ్ళు,వినేవాళ్ళు పుష్కలం.ఆచరించే వాళ్ళే అరుదు.-భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@రాజేష్ జి. - ధన్యవాదాలు రాజేష్. అత్యంత స్పూర్తిమంతమయిన మంచి ముక్క చెప్పిన 'సన్యాసి' పదకొండో శతాబ్దానికి చెందిన వాడు. నేను చేసిందల్లా ఆయన బోధను 'ఎత్తిపోతల పధకం'(LIFT) ద్వారా తెలుగు పాఠకులకు అందించడమే. అందుకే నాలాటివారిని 'పరవస్తు చిన్నయసూరి' అని ముద్దుగా పిలుస్తుంటారు.అంటే ఇతరుల భావాలను సంగ్రహించి తమ రచనలుగా చెప్పుకోవడం అన్నమాట. కాపీ రైట్ చట్టం వర్తించని వారన్నమాట.-భండారు శ్రీనివాసరావు

Rao S Lakkaraju చెప్పారు...

నాకు ఈ వాక్యాలు పదకొండవ శతాబ్దములో చెప్పినవని తెలియదు. కొందరి మాటలు విశ్వం లో ఎల్లకాలం అలా పరిభ్రమిస్తూ నే ఉంటాయి. మళ్ళా వాటిని మేల్కొల్పినందుకు థాంక్స్.

Ramesh Parcha చెప్పారు...

chala correct ga chepparu