10, జులై 2011, ఆదివారం

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు


తెలంగాణా ఎంపీల రాజీనామాలపై వచ్చే నెల ఒకటో తేదీన నిర్ణయం తీసుకుంటానని లోకసభ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించి ఈ వ్యవహారం పై ముసురుకున్న సస్పెన్స్ ను మరో మూడు వారాలు పొడిగించారు. బహుశా శాసన సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన తెలంగాణ నేతల విషయంలో కూడా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఇలాటి నిర్ణయమే తీసుకోవచ్చు. ఈ ఇద్దరు సభాపతులు రాజీనామాల ఆమోద ప్రక్రియ ప్రారంభించి దాని పూర్తి చేయడానికి మరి కొన్ని రోజులు అదనంగా వ్యవధి తీసుకునే అవకాశం వుంది. అంటే రాజీనామాల వల్ల రగిలిన వాడీ వేడీ ఎంతో కొంత చల్లారేలా చూడడమే ఇందులోని పరమార్ధం కావచ్చు. మరి రాజీనామాలు చేసిన మంత్రులు అన్ని రోజులు విధులకు దూరంగా వుంటే అసలే అంతంత మాత్రంగా వున్న పాలన మరింత గాడి తప్పే ప్రమాదం వుంది. ఇప్పటికే సచివాలయంలో వందలాది ఫైళ్ళు అతీగతీ లేకుండా పడివున్నట్టు మీడియాలో సమాచారం. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం లోనే సుమారు పన్నెండు వందలకు పైగా ఫైళ్ళు ముఖ్యమంత్రి సంతకం కోసం పడిగాపులు పడుతున్నాయని, నలుగురయిదుగులు మంత్రులు మినహా రాజీనామాలు చేసిన వారు, చేయని వారు సచివాలయం వైపే రావడం లేదని భోగట్టా. రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నుల ప్రభావం పరిపాలనపై, దానిని నడిపే యంత్రాంగం పై యెలా పడుతుందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. రాజీనామాలు చేసిన మంత్రుల పేషీల్లో ఫైళ్ళు పేరుకుపోవడాన్ని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇదే పరిస్తితి వుండడాన్ని యెలా సమర్ధిస్తారు? అధిష్టానంతో చర్చలకోసం తరచుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిరావడం వల్ల, రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రాకతో పాటు ఆమె పాల్గొంటున్న కార్యక్రమాలు, పర్యటనల వల్ల సీయెం పేషీలో ఫైళ్ళ పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతుండవచ్చు. సమర్ధన కోసం చెప్పే ఇలాటి సంజాయిషీలన్నీ రాష్ట్రంలో పాలన స్తంభించి పోయిందని వస్తున్న వార్తలను ఖరాకండిగా ఖండించడానికి ఎంతమాత్రం పనికిరావు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరవాత నిదానంగా పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోగలుగుతున్నారని, మెల్లగా పాలనపై తనదయిన పట్టు బిస్తున్నారని జనం అనుకోవడం మొదలయ్యీ కాకముందే మళ్ళీ పరిస్థితులు ఆయన చేజారిపోతున్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించడం దురదృష్టం.

పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వెంటనే పడే అవకాశాలు లేని వ్యవస్థ మనది. ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే, రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చిందనే సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం. దీనికి తోడు రాజకీయ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కదులుతున్న ఉద్యోగ సంఘాలు మరో సారి సహాయ నిరాకరణకు పూనుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సామాన్య జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. బహుశా ఇవ్వాళో రేపో తెలంగాణా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఈ మేరకు సమ్మె సైరన్ మోగించవచ్చు. గతంలో పద్దెనిమిది రోజులపాటు జరిపిన సహాయనిరాకరణ, లక్ష్య సాధనలో ఎంత ఉపకరించిందన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలు మాత్రం తాముపడ్డ ఇబ్బందులు మాత్రం మరచిపోలేదు. అప్పట్లో విద్యార్ధుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాటి ఇబ్బంది కలిగించకూడదన్న సదుద్దేశ్యంతో తెలంగాణా ఉద్యోగ సంఘాల జే.యే.సీ. సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. పరిపాలనను స్తంభింప చేయడం, రాస్తారోఖోలు చేయడం, నడి రోడ్లపై ధర్నాలకు పూనుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామిక హక్కుల్లో భాగం కావచ్చు కానీ, ఈ రకమయిన ఆందోళనలను ఒక కాల పరిమితి లేకుండా నిరవధికంగా నిర్వహిస్తూ పోవడంవల్ల, ఎవరి బాగుకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ప్రజలే వాటివల్ల నష్టపోతున్నారని, లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారని అర్ధం చేసుకుని వ్యవహరించడం వల్ల సాధారణ ప్రజలనుంచి లభించే సానుభూతి, సహకారం ఉద్యమకారుల లక్ష్య సాధనకు దోహదపడే అవకాశం వుంటుంది. రెండు రోజులపాటు నిర్వహించాలని తలపెట్టిన రైల్ రోఖో, వంటావార్పూ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలంగాణా జేయేసీ చైర్మన్ కోదండరాం ప్రకటించిన వెంటనే జనం అమ్మయ్య అని నిట్టూర్పు వొదలడం ఇందుకు ఉదాహరణ.

రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా పాతుకుపోయి వేళ్ళూనుకున్న కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు అవనిక పైకి వచ్చాయి. చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది. విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన - గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే అవకాశంగా తీసుకుని తమ పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.

మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా బడికి ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే ఆఫీసులకు సెలవు పెట్టి చదివించాల్సిన రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల్ని చదివించే తలితండ్రులు లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు. వాళ్లు ఆఫీసులకు రావడం ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని వాహనాల్లో ఆఫీసులకు తరలించే కొత్త యజమానులు తయారయ్యారు. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.

ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.

తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను మనమెంత గట్టిగా కోరుకుంటున్నామో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు. మనలాగానే అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ

ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం మనలో పోరాట శక్తి తగ్గుతోందనే అనుకోవాలి. ఇన్నాళ్ళు ఆగినవాళ్ళం మరికొన్నాళ్ళు ఆగలేమా? – ఆలోచించండి! (08-07-2011) 

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కుహనా తెలంగాణా వాడు సృష్టించిందే ఈ అనిశ్చితి. వీళ్లకు పనీ పాటా వుండదు.తెలంగాణ వాళ్లకు బుర్రలు పని చేయవు.తెలివితక్కువ వెధవలు వెనకాముందు ఆలోచించకుండా రాజీనామాలు చేయడం ఇప్పుడు తల పట్టుకోవడం. ఎవరిని ఉద్దరించడానికి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. కేసీఆర్ రాజీనామాలు చేయమనడం, వీళ్లు గొర్రెల్లాగా తలాడించడం, తెలంగానా కాంగ్రెస్ వాళ్లకు వ్యక్తిత్వంలేదు ఎవరేది చెబితే అది వినడం, తోకాడించడం తప్పా.

అజ్ఞాత చెప్పారు...

జిత్తులమారి ఆంద్ర నాయక గోముఖ వ్యాఘ్రాలు సృష్టించినదే ఈ అనిశ్చితి.
వీళ్ళకు ఇంకొకడి భూముల్ని, నీళ్ళని, ఉద్యోగాలని దోచుకోవడమే పని!
వీళ్ళ బుర్రలన్నీ నక్కజిత్తుల ఆలోచనలతో పుచ్చిపోయాయి.
వోట్లకోసం ముందు తెలంగాణాకు అనుకూలమని ప్రగల్భాలు పలకడం, వాగ్దానాలు చేయడం, మానిఫెస్తోల్లో
పెట్టుకోవడం ... తీరా తెలంగాణాకు అనుకూలంగా కేంద్ర ప్రకటన చేయగానే తలలు పట్టుకుని కూచోవడం,
లాబీయింగ్ చేయడం నీటి నిజాయితీ లేకుండా సొల్లు కబుర్లు చెప్పడం , గొర్రెల మందలా ఆంద్ర పెట్టుబడి దార్ల చంక నాకడం వీళ్ళకు అలవాటు..
తాము దుర్మార్గంగా నీతీ జాతీ లేకుండా వ్యవహరిస్తూ తెలంగాణా వాళ్ళను ఆడిపోసుకోవడం తూ మీ బతుకు చెడ .
- Jai Telangana

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సీమాంధ్ర అజ్ఞాత - ఈ అనిశ్చితికి కారణం తెలంగాణా వాదులని నా ఉద్దేశ్యం కాదు. ఇలా ఒకరినొకరు నిందించుకోవడం వల్ల నష్టం ఇరు ప్రాంత ప్రజలకే. రాజకీయ నాయకులు మాత్రం భద్రంగానే వుంటారు. జనం కోణం నుంచి ఆలోచించి రాసిన వ్యాసంలో రాజకీయాలు జొప్పించడం వల్ల ప్రయోజనం వుండదు. దయచేసి మూలార్ధాన్ని గ్రహించి స్పందించండి.-భండారు శ్రీనివాస రావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@తెలంగాణా అజ్ఞాత - ఈ అనిశ్చితికి కారణం సీమాంధ్ర ప్రాంతం వాళ్లన్నది నా ఉద్దేశ్యం కాదు. ఇలా ఒకరినొకరు నిందించుకోవడం వల్ల నష్టం ఇరు ప్రాంత ప్రజలకే. రాజకీయ నాయకులు మాత్రం భద్రంగానే వుంటారు. జనం కోణం నుంచి ఆలోచించి రాసిన వ్యాసంలో రాజకీయాలు జొప్పించడం వల్ల ప్రయోజనం వుండదు. దయచేసి మూలార్ధాన్ని గ్రహించి స్పందించండి.-భండారు శ్రీనివాస రావు

అజ్ఞాత చెప్పారు...

మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మత్రులు మాత్రమే పాలనాధ్యక్షులని, వాళ్ళు లేకపోతే పొయ్యిలో పిల్లి లేవదని అనుకుంటున్నారనిపిస్తోంది. వాళ్ళ అర్హతలు పరిశీలిస్తే వారు చేసే పని ఏ జూనియర్ IAS అధికారైనా అత్యంత సమర్థవంతంగా నిర్వహించగలరు. వాళ్ళుంటే దండుకునే ప్రాసస్ మాత్రమే వెనకపడుతుంది. రాజీనామాలు ఆమోదించి, ఒకసారి రాజీనామా చేసిన వాళ్ళూ 6ఏళ్ళూ ఎన్నికల్లో పాల్గొనేందుకు అనర్హులుగా చేస్తూ ఎన్నికల చట్టం సవరిస్తే, నిబద్ధత వుండే వాళ్ళు మాత్రమే నిజతీగా ఉద్యమాలు చేసే అవకాశం వుంటుంది. బలవంతపు, గెలిపిస్తామన్న అస్యూరెన్స్‌లు తీసుకుని ఏడుస్తూ చేసే రాజీనామాలతో ఉద్యమాలు నడవవు. పార్టీలకు రాజీనామాలు చేయకుండా అంటిపెట్టుకుని ఎన్నికలు దగ్గరపడుతున్నాయని చేసేవన్నీ వీధినాటకాలు మాత్రమే.