4, జనవరి 2010, సోమవారం

రాయని రచయిత - డి వెంకట్రామయ్య

రాయని రచయిత - డి వెంకట్రామయ్య



శ్రీ డి.వెంకట్రామయ్య



'డి వెంకట్రామయ్య' కధలపై నేను మరింతగా యిష్టం పెంచుకుంటున్న రోజుల్లోనే ఆయన రాయడం బాగా తగ్గించారు. తగ్గించారు అనడం కంటే రాయడం మానేశారు అంటే బాగుంటుందేమో!

వస్తున్న కధల్లో రాశి పెరిగి, వాసి తగ్గి - ఆ బాపతు వాటిని 'చదవడం మానేస్తే పోలా' అని అనేకమంది చదువరులు అనుకుంటునట్టే , 'కాగితంపై కలం పెట్టగలిగినవాళ్ళందరూ కధలు రాయడం మొదలుపెట్టేసరికి- 'రాయడం మానేస్తే పోలా' అనిపించి రచనా వ్యాసంగానికి ఆయన దూరమయ్యారేమోనని నా అనుమానం.

రచయితగా నాకు తెలిసిన వెంకట్రామయ్య గారు- నాకు వృత్తిపరంగా తెలిసివచ్చేనాటికే 'కలం సన్యాసం' స్వీకరించినట్టున్నారు. అడిగినవారి కోసం అడపా దడపా రాయడం తప్పిస్తే- అప్పటినుంచీ కధా రచయితగా ఆయన రాసిందీ, రాస్తున్నదీ ఏమీ లేదనే చెప్పాలి.

1975 నవంబర్లో అనుకుంటాను- తొలిసారి వెంకట్రామయ్యగారిని హైదరాబాద్ ఆకాశవాణి వార్తా విభాగంలో సహోద్యోగిగా కలుసుకున్నాను. ప్రాచుర్యం పొందిన రచయితతో ఏ అభిమానికయినా సాన్నిహిత్యం ఉండవచ్చుకానీ పాతికేళ్ళకు పైగా ఒకే కార్యాలయంలో కలిసి పనిచేయడం అరుదు. వృత్తిరీత్యా కలసి పనిచేస్తున్నప్పటికీ- ప్రవృత్తిరీత్యా ఆయనకూ, నాకూ నడుమ శతసహస్ర వైరుధ్యాలు.

ఆయనకు నిశ్శబ్దం యిష్టం. వార్తలు ఎంపిక చేసేటప్పుడూ, వాటిని అనువాదం చేసేటప్పుడూ పనిచేసే వాతావరణం ప్రశాంతంగా వుండాలని కోరుకునేవారు. ఇందుకు నేను పూర్తిగా విరుద్ధం. నలుగురితో బాతాఖానీ వేస్తూ, గలగలా నవ్వుతూ, నవ్విస్తూ పని చేస్తూ పోవడం నా పధ్ధతి.

టేబుల్ పై కాగితాలన్నీ ఒక పధ్ధతి ప్రకారం సర్దిపెట్టుకోవడం ఆయనకలవాటు. చెత్తబుట్టకూ, రాతబల్లకూ తేడా తెలియనంతగా - నానా చెత్త మధ్య కూర్చుని చెత్త రాతలు రాస్తూ వుండడం నా ప్రత్యేకత.



ఆ రోజుల్లో ఎవరయినా వార్త పట్టుకు వస్తే- అది ఆయన చేతులో పడితే ఇంతే సంగతులు. రేడియో మార్గదర్శిక సూత్రాలనూ, ఆనాటి బులెటిన్ ప్రాదాన్యతలనూ అప్పటికప్పుడు బేరీజు వేసుకుని 'ఈ వార్త యివ్వడం కుదరద'ని మొహమ్మీదే చెప్పేసేవారు. అంత నిష్టూరంగా అలా చెప్పకపోతే ఏం అనిపించేది కానీ ఆయన మాత్రం లేనిపోని భేషజాలు తనకు సరిపడవన్న తరహానే ప్రదర్శించేవారు. స్నేహితులనో- పరిచయస్తులనో -మొహమాటపడి వ్యవహరించడం ఆయనకు చేతకాని పని. ఇలాంటి విషయాల్లో ఆయనకూ నాకూ మధ్య కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు బయటపడేవి. బయట తిరిగే విలేకరులకు కొన్ని కొన్ని ఆబ్లి గేషన్స్ ఉండడానికి అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించేవారు కాదు. దానితో, వార్త ఎందుకు యివ్వలేకపోయామో అన్నది సంజాయిషీ ఇచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్తితి మాది.

పని పట్ల ఆయన చూపే నిజాయితీ, నిబద్దతా అందర్నీ కట్టిపడేసేవి. బులెటిన్ ఆయన తయారుచేసారంటే దానిపై ఆయన ముద్ర స్పష్టంగా వుండేది. అందులో యితరుల జోక్యాన్ని ఆయన అనుమతించేవారు కాదు. ప్రజాసంబందాలకు పెద్దపీట వేసే మా బోంట్లకు ఆయన ఈ మొండి వైఖరి కొండొకొచొ కొన్ని చిక్కులు తెచ్చి పెట్టేది. అయినా ఆయన ధోరణి ఆయనదే. సిద్దాంతాలూ, సూత్రాలూ వల్లించే వాళ్ళల్లో - వాటికి కట్టుబడి వ్యవహరించేవాళ్ళని చాలా తక్కువమందిని చూస్తాం! వెంకట్రామయ్యగారు దీనికి పెద్ద మినహాయింపు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్త విభాగంలో చేరిన చాలా కాలం తర్వాత నాకు ఆయన కధలు రాయడం పూర్తిగా తగ్గించిన సంగతి తెలిసింది. పత్రికల్లో- మీడియాలో పనిచేసే 'రచయితల'కు సొంత రచనలు చేసే తీరిక తక్కువన్న అభిప్రాయం ఒకటి ఉంది.నిజమేనేమో!
'పని రాక్షసుడి'గా పేరు పడ్డ వెంకట్రామయ్యగారు-
విధి నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం యిచ్చే వెంకట్రామయ్యగారు-
ఉద్యోగిగా తన కర్తవ్యాన్ని వొదిలిపెట్టి-
'వెంకట్రామయ్య'గా కధలు రాసుకోగలరని అనుకోవడం భ్రమ. అందుకే ఆయన 'రాయని రచయితగా మిగిలిపోయారు.
ఆయన మిత్రుల్లో చాలామంది మాదిరిగానే నాకూ ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆయనతో పెంచుకున్న చనువునీ, సాన్నిహిత్యాన్నీ, స్నేహాన్నీ ఉపయోగించుకుని- వీలుదొరికినప్పుడల్లా కధలు రాయమని పోరేవాడిని. అలా వెంట పడగా పడగా బద్ధకం వొదిల్చుకుని చివరికి ఒక కధ రాసారు.దాన్ని గురించి స్నేహితులతో చెబుతూ- 'యిది శ్రీనివాసరావు పుణ్యమే' అని - పాపపుణ్యాల పయినా, దేవుళ్ళూ దెయ్యాల పయినా ఏమాత్రం నమ్మకం లేని వెంకట్రామయ్యగారన్నట్టు గుర్తు.
అతికొద్ది 'మంచి' కధలు రాసిన రచయితగా 'డి వెంకట్రామయ్య' అసంఖ్యాక చదువరులకు పరిచయం. కానీ ఆయన పేరుపెట్టు కోకుండానో, 'గళం'పేరుతోనో - రేడియోకి అసంఖ్యాకంగా రచనలు చేసిన సంగతి అందులో పనిచేస్తున్నవారికే తెలియదు. పేరు మీద వ్యామోహం పెంచుకోకపోవడంవల్లనే ఆయనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు రాలేదని అనుకునేవారు కూడా వున్నారు. రాసినవి 'కొద్దే' అయినప్పటికీ, పుస్తక ప్రియులను 'పెద్దగా' ఆకట్టుకున్నవే ఆయన ఖాతాలో చేరాయి. అందుకే 'ఎన్ని' రాసారన్నది కాకుండా, 'ఏమి' రాసారన్నదానికి విలువ కట్టి పురస్కారాలు ఇస్తారనే మంచి పేరున్న 'రాచకొండ రచనా పురస్కారం' ఎంపిక కమిటీ ఈ ఏడాది పురస్కారాన్ని డి వెంకట్రామయ్యగారికి ప్రకటించడం ముదావహం. పురస్కారానికి వున్న విలువ పురస్కార గ్రహీతను బట్టి మరింత పెరుగుతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. అలాగే, రావిశాస్త్రి గారికి వీరాభిమానిగా చెప్పుకోవడానికీ, ఒప్పుకోవడానికీ సంకోచించని వెంకట్రామయ్యగారికి ఇదో కలికితురాయి. మరెన్నో మంచి రచనలు చేయడానికి ఈ పురస్కారం ఆయనకి తగిన ప్రోత్సాహకారకం కాగలదని ఆశించడం అత్యాశ కాబోదేమో.

- భండారు శ్రీనివాసరావు

3 కామెంట్‌లు:

Jwala's Musings చెప్పారు...

అరుదైన వ్యక్తుల్లో అరుదైన మహామనీషి దివి వెంకట్రామయ్యగారు. నీ ద్వారా నాకు పరిచయమైన వెంకట్రామయ్యగారికి-ఆయన రచనా శక్తికి గుర్తింపు ఎన్నడో నీలాంటి (అజ్ఞాన) రచయితల ద్వారా లభించింది. "రాచకొండ రచనా పురస్కారం" అదిచ్చిన వారు తమను తాము గౌరవించుకోవడానికేనని నా అభిప్రాయం. అయినా గుర్తింపు వున్న సంస్థలు వెంకట్రామయ్యగారిని ఇప్పటికైనా గుర్తించారంటే అభినందించాల్సిందే. నువ్వు రాసినట్లు ఆయన వ్యక్తిత్వం నిజంగా అందరికంటే భిన్నమైందేననాలి నాకు తెలిసినంతవరకూ కూడ. ఇష్టంలేని పని వారితో చేయించాడానికి నేను కష్టపడి అతి కొద్ది సార్లు (దాదాపు అసలు లేనట్లే) సఫలీకృతుడైంది ఇద్దరి విషయంలోనే. ఒకరు స్వర్గీయ జి, కృష్ణ గారు-ఇంకొకరు వెంకట్రామయ్యగారు. అందులో ఒకటి (వెంకట్రామయ్య గారు) ఆయనతో ఒకటిరెండు సార్లు చేస్తున్న పని మాన్పించి బయటకు పట్టుకెళ్ళడం అనుకుంటా-నాకు గుర్తున్నంత వరకు. ఆయన లాంటి మన మితృడికి "రాచకొండ రచనా పురస్కారం" లభించినందుకు అభినందనలు-నీ ద్వారా.
వనం జ్వాలానరసింహా రావు

Vanam Jwala Narasimha Rao
http://jwalasmusings.blogspot.com
email: jwala99@gmail.com

Jwala's Musings చెప్పారు...

అరుదైన వ్యక్తుల్లో అరుదైన మహామనీషి దివి వెంకట్రామయ్యగారు. నీ ద్వారా నాకు పరిచయమైన వెంకట్రామయ్యగారికి-ఆయన రచనా శక్తికి గుర్తింపు ఎన్నడో నీలాంటి (అజ్ఞాన) రచయితల ద్వారా లభించింది. "రాచకొండ రచనా పురస్కారం" అదిచ్చిన వారు తమను తాము గౌరవించుకోవడానికేనని నా అభిప్రాయం. అయినా గుర్తింపు వున్న సంస్థలు వెంకట్రామయ్యగారిని ఇప్పటికైనా గుర్తించారంటే అభినందించాల్సిందే. నువ్వు రాసినట్లు ఆయన వ్యక్తిత్వం నిజంగా అందరికంటే భిన్నమైందేననాలి నాకు తెలిసినంతవరకూ కూడ. ఇష్టంలేని పని వారితో చేయించాడానికి నేను కష్టపడి అతి కొద్ది సార్లు (దాదాపు అసలు లేనట్లే) సఫలీకృతుడైంది ఇద్దరి విషయంలోనే. ఒకరు స్వర్గీయ జి, కృష్ణ గారు-ఇంకొకరు వెంకట్రామయ్యగారు. అందులో ఒకటి (వెంకట్రామయ్య గారు) ఆయనతో ఒకటిరెండు సార్లు చేస్తున్న పని మాన్పించి బయటకు పట్టుకెళ్ళడం అనుకుంటా-నాకు గుర్తున్నంత వరకు. ఆయన లాంటి మన మితృడికి "రాచకొండ రచనా పురస్కారం" లభించినందుకు అభినందనలు-నీ ద్వారా.
వనం జ్వాలానరసింహా రావు

Vanam Jwala Narasimha Rao
http://jwalasmusings.blogspot.com
email: jwala99@gmail.com

Jwala's Musings చెప్పారు...

sorry please read as (అజ్ఞాత) and not as (అజ్ఞాన)as revised like this:
అరుదైన వ్యక్తుల్లో అరుదైన మహామనీషి దివి వెంకట్రామయ్యగారు. నీ ద్వారా నాకు పరిచయమైన వెంకట్రామయ్యగారికి-ఆయన రచనా శక్తికి గుర్తింపు ఎన్నడో నీలాంటి(అజ్ఞాత) రచయితల ద్వారా లభించింది. "రాచకొండ రచనా పురస్కారం" అదిచ్చిన వారు తమను తాము గౌరవించుకోవడానికేనని నా అభిప్రాయం. అయినా గుర్తింపు వున్న సంస్థలు వెంకట్రామయ్యగారిని ఇప్పటికైనా గుర్తించారంటే అభినందించాల్సిందే. నువ్వు రాసినట్లు ఆయన వ్యక్తిత్వం నిజంగా అందరికంటే భిన్నమైందేననాలి నాకు తెలిసినంతవరకూ కూడ. ఇష్టంలేని పని వారితో చేయించాడానికి నేను కష్టపడి అతి కొద్ది సార్లు (దాదాపు అసలు లేనట్లే) సఫలీకృతుడైంది ఇద్దరి విషయంలోనే. ఒకరు స్వర్గీయ జి, కృష్ణ గారు-ఇంకొకరు వెంకట్రామయ్యగారు. అందులో ఒకటి (వెంకట్రామయ్య గారు) ఆయనతో ఒకటిరెండు సార్లు చేస్తున్న పని మాన్పించి బయటకు పట్టుకెళ్ళడం అనుకుంటా-నాకు గుర్తున్నంత వరకు. ఆయన లాంటి మన మితృడికి "రాచకొండ రచనా పురస్కారం" లభించినందుకు అభినందనలు-నీ ద్వారా.
వనం జ్వాలానరసింహా రావు

Vanam Jwala Narasimha Rao
http://jwalasmusings.blogspot.com
email: jwala99@gmail.com