29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సోషల్ మీడియా

సోషల్ మీడియా – భండారు శ్రీనివాసరావు 
నాకు బాగా గుర్తు. గతంలో ‘కలం’ తిరిగిన పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్టికిల్ లేదా వార్త రాస్తూ ఏదైనా అనుమానం కలిగితే ఏమాత్రం భేషజం లేకుండా తమ దగ్గర పనిచేసే జూనియర్లను, లేదా ఫోను చేసి తోటి జర్నలిస్టులను అడిగి సందేహ నివృత్తి చేసుకునే వారు. తాము రాసిన దాంట్లో ఎలాటి పొరబాటు దొర్లకూడదు అనే నిబద్ధతే వారినలా చేయిస్తోంది అనుకునేవాడిని. 
ఇప్పుడు సోషల్ మీడియా అలాంటి విషయాల్లో బాగా అక్కరకు వస్తోంది, సరిగా ఉపయోగించుకోవాలనే సదుద్దేశం ఉన్న పాత్రికేయులకు.నా రాతల్లో చిన్న పొరబాటు దొర్లినా వెంటనే ఎత్తి చూపుతున్నారు. ఇందుకు నేను చిన్నబుచ్చుకోవడం లేదు. పైగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే దొర్లిన పొరబాట్లను సవరించుకోగల వెసులుబాటు వున్న మీడియం ఇది. 
నాకు అర్ధం అయిందేమిటంటే ప్రస్తుతం సమాజంలో చైతన్యం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నారు. చూసినవీ, విన్నవీ, చదివినవీ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటున్నారు. చక్రాంకితాలు వేసుకున్న కొందరు రాజకీయ పార్టీల అభిమానులని మినహాయిస్తే చాలామంది, చాలా వరకు చక్కని, విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. 
అయితే కాస్తంత ఓపిక కావాలి, రాళ్ళల్లో నుంచి బియ్యం ఏరడానికి.

28, సెప్టెంబర్ 2024, శనివారం

నాలాంటి మొగుళ్ళ ఘోష ఒక్కటే


తొమ్మిదేళ్ల క్రితం  ముచ్చట:

'శాస్త్రి గారి భార్య పరిస్తితి బాగాలేదు. గంటలు గడిచే  వ్యవధి  కూడా  లేదు'

అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బాబీ (మా కజిన్) ఫోను. నేను వెళ్ళేసరికే అంతా అయిపోయింది. 
ఆవిడ నిజానికి శాస్త్రి గారికంటే ఆరోగ్యంగా వుండేవారు. రోగం రొష్టు అంటూ ఏనాడు యాతన పడలేదు, పెట్టలేదు, చివర్లో కొద్ది రోజులు మినహాయిస్తే.
 కొన్నేళ్ళ క్రితం  శాస్త్రి గారు, ఆయన భార్య పుణ్యవతిగారితో  కలిసి మా దంపతులం కాశీ యాత్ర చేసివచ్చాం. వాళ్ళిద్దరికీ తీర్ధయాత్రలంటే మక్కువ. తిరిగే ఓపిక మాకు లేదు. మాకు ఇల్లే కైలాసం. ఎంతో వెంటబడితే ఒక్కసారి మాత్రం వాళ్లతో వెళ్లి, మేమూ యాత్ర చేసివచ్చాం అనిపించుకున్నాం. నిజానికి, నేనూ ఆర్వీవీ కృష్ణారావు గారు, జ్వాలా నరసింహారావు వారింటికి (శాస్త్రి భవన్ అని మేము సరదాగా పిలుచుకునే వాళ్ళం. నిజానికది షరా మామూలు, మామూలు ఇల్లే) వెళ్లి కులాసాగా సాయంకాలక్షేపం చేసి వచ్చి  కొన్ని వారాలు కూడా గడవలేదు. అంతలోనే ఈ కబురు. 
 
శాస్త్రిగారు హైదరాబాదులో ఆకాశవాణి డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యారు. వేమూరి విశ్వనాథ శాస్త్రి అంటే ఎవ్వరికీ తెలవదు. వీ.వీ. శాస్త్రి అంటే తెలియని వాళ్ళు లేరు.
 
ఆసుపత్రిలో వాళ్ళ అల్లుడు శ్రీరాం బిల్లులు వగైరా పనులు చూస్తున్నారు. 'బాడీ' ఇవ్వడానికి కొన్ని గంటలు పట్టేట్టు ఉందన్నారు.  అదేమిటో కాసేపటి కిందటి దాకా ఆవిడ  'పుణ్యవతి'. ఇప్పుడేమో 'బాడీ' గట్రా అంటున్నారు. ప్రాణం ఉన్నంతసేపే  మనిషి. ఆ కాస్తా తప్పుకుంటే, కట్టెల మీదకు చేరే మరో  'కట్టె'. అంతే.

శాస్త్రి గారిని తీసుకుని పక్కకు వచ్చాను. ఆస్పత్రి ఆవరణలోనే ఏదో చోటు చూసి కూర్చున్నాం. ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన మాట్లాడ్డం మొదలు పెట్టారు. అన్నీ పచ్చి నిజాలు. అందులో  కనిపించని వేదాంతం వుంది.

"యాభయ్ ఆరేళ్ళు నాతో కాపురం చేసింది. సుఖం నాకు ఒదిలి కష్టం తను పంచుకుంది. బయట పెత్తనాలు చేసిరావడం తప్ప ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెరుగుతున్నారు, వున్న ఒక్క పిల్లాడు ఎలా చదువుతున్నాడు ఏమీ పట్టించుకోకుండా తిరిగాను. అన్నీ తెలుసని పైకి విర్రవీగాను కానీ ఏమీ తెలియదని నాకు బాగా తెలుసు. ఏమీ తెలియని నన్ను ఇలా ఒంటరిగా ఒదిలేసి వెళ్ళిపోయింది. బడాబడా అరవడం తప్ప నాకు స్టవ్ అంటించడం కూడా రాదు. లక్షలు  బిల్లు తీసుకుని ఆసుపత్రివాళ్ళు నా భార్యని ఇలా నా  చేతిలో పెట్టారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసేవుంటారు. నేను చేయగలిగింది నేనేమైనా చేసానా. గత కొద్ది రోజులుగా నాది ఇదే ఆలోచన.  ఇంట్లో గిరగిరా తిరిగే మా ఆవిడ కాలూ చేయీ కదపలేని స్తితిలో ఉండిపోయింది. ఏనాడూ ఆమెకు ఏమీ చేయలేదని తెలుసు. అందుకే నేనే అన్నీ చేయడం మొదలు పెట్టాను. మొహం కడిగేవాడిని. జుట్టు దువ్వేవాడిని. నీ దగ్గర దాపరికం ఎందుకు. మల మూత్రాలు సయితం నా చేతులతో శుభ్రం చేసేవాడిని. ఇదంతా గొప్పకు చెప్పడం లేదు'
శాస్త్రి గారి  కళ్ళల్లో నీళ్ళు. కాసేపు నిశ్శబ్దం.
నిజమే. ఆయన నాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు. రిటైర్ అయ్యేంత వరకు ఇల్లు, ఇల్లాలిని పట్టించుకోలేదు. రిటైర్ అయిన తరువాత ఆయన ఇంటినీ, ఇల్లాలినీ వదిలి బయట తిరగలేదు. ఎవరయినా ఆయన ఇంటికి వెళ్ళాల్సిందే. బయటకు రమ్మంటే,  'నేను రాను ఇంట్లో తనొక్కతే వుండాలి, కరెంటు పోతే భయపడుతుంది' అనేవారు.
'బహుశా నేను అలా అలవాటు లేని సేవలు చేసి వుండాల్సింది కాదేమో. నాచేత చాకిరీ చేయించుకోవడం ఇష్టం లేకే ఇలా దాటిపోయిందేమో!' అంటున్నారు శాస్త్రి గారు 
ఈసారి నీళ్ళు నా కళ్ళల్లో.
( ఇప్పుడు  ఆయన దారిలోనే నేనూ)

కింది ఫోటో: కాశీ యాత్రలో  భాగంగా శాస్త్రి దంపతులతో మా దంపతులం

26, సెప్టెంబర్ 2024, గురువారం

ఎంత కష్టం! ఎంత కష్టం!


ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.
కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకువుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి  క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.
ఈ లోగా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.
అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.
నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వతంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!
పునాదులు తవ్వకుండా ఏ భవన నిర్మాణం సాధ్యం కాదు. ఆ సమయంలోనే అధికారులు అడ్డు కోగలిగితే ఇలాంటి కూల్చివేతలకు ఆస్కారం ఉండదు కదా! 
ఇది పొలిటికల్ పోస్టు కాదు. అన్ని పార్టీల హయాముల్లో కూడా ఈ కూల్చివేతల పర్వాలు వింటున్న పురాణాలే!

బై బై అమెరికా



శుక్రవారం (20-9-2024) ఉదయం  పదిన్నర కు బాల్టిమోర్ నుంచి రోడ్డు మార్గంలో న్యూయార్క్ బయలుదేరాం.  
ఏడుగురం వసతిగా కూర్చుని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించే విశాలమైన వాహనం. ఫిలడెల్ఫియా, డెలావేర్  మీదుగా  న్యూజెర్సీ చేరుకున్నాము. డెలావేర్ అనేది అమెరికాలో చాలా చిన్న రాష్ట్రం. స్టేట్ సేల్ టాక్స్ వుండని కారణంగా అనేక పెద్ద కంపెనీలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి. సెల్ ఫోన్లలో సహా అనేక వస్తువులు బయటకంటే చౌకగా లభిస్తాయి.
చుట్టుపక్కల అనేక రాష్ట్రాల వారు ఆ రాష్ట్రానికి వెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు.
ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంటు బైడన్ ఈ రాష్ట్రానికి చెందిన వారే. గతంలో వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆయన కుటుంబం ఇక్కడే వుండేదిట. ఆయన రైల్లో ప్రతిరోజూ న్యూయార్క్ ఆఫీసుకు వెళ్లి వస్తుండేవారు అని మాతో పాటు వున్న మిత్రుడు చెప్పారు. 

ఇక న్యూ జెర్సీలో ఆగి ఇండియా స్క్వేర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వీధిలోని సదరన్ స్పయిస్ రెస్టారెంట్ లో భోజనాలు చేశాము.  తర్వాత కాలి నడకన కలయ తిరిగాము. పక్కనే వున్న పాన్ షాపులో కిళ్ళీలు తీసుకున్నాము. అచ్చం ఇండియాలో వున్నట్టే వుంది. ఆ షాపుకు ఒక తాడు వేలాడ తీసివుంది. ఎవరో వచ్చి ఒకటి అంటే ఒకటే  సిగరెట్ కొనుక్కుని ఆ తాడు కొసన ఉన్న నిప్పుతో సిగరెట్ వెలిగించుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ వీధిలో కారు హారన్లు వినిపించాయి. ఒకచోట రోడ్డు మీద రంగురంగులలో వేసిన రంగవల్లి కనిపించింది. అలాగే మీ చేయి చూసి జాతకం చెప్పబడును అనే బోర్డు కూడా.

నదీ గర్భంలో సుమారు వందేళ్లకు పూర్వం నిర్మించిన హాలండ్ టన్నెల్ ద్వారా హడ్సన్ నదిని దాటి అవతల న్యూయార్క్ హార్బర్ కు వెళ్లాము. అక్కడ నుంచి పెద్ద బోటులో ప్రయాణిస్తూ, నది రెండు వైపులా అటు న్యూ జెర్సీ, ఇటు న్యూయార్క్ లోని రమ్యహర్మ్య భవనాలు వీక్షిస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేరుకున్నాము. అద్భుతమైన నిర్మాణం. వందేళ్లకు పూర్వమే ఆ భారీ శిల్పం రూపొందించిన తీరు విభ్రమ కలిగించేదిగా వుంది. 
పారిస్ లో ఆ భారీ విగ్రహాన్ని నిర్మించి విడి భాగాలుగా విడతీసి ఆ నాటి తెరచాప పడవల్లో న్యూయార్క్ తీరానికి తరలించిన తీరును వివరించే లఘు చిత్రాలను అక్కడ భారీ (ఐ మాక్స్) తెరలపై ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసాము.
తరువాతి అడంగు న్యూయార్క్ డౌన్ టౌన్ లోని గ్రౌండ్ జీరో. అంటే ఉగ్రవాదుల దాడులకు గురై నేలమట్టం అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల స్థానంలో నిర్మించిన అమర వీరుల స్మారక ప్రదేశం. అలాగే అదే ప్రాంతంలో మరో సమున్నతమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కొత్తగా నిర్మించారు. అక్కడికి చాలా దగ్గరలో వున్న ప్లాజా అనే భవనాన్ని చూడడానికి వెళ్ళాము. ఈ భవనంతో మాకో బాదరాయణ సంబంధం, అనుబంధం వుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వం మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, ఈ భవనం 29 వ అంతస్తులో అనుకుంటా కొన్ని సంవత్సరాలు నివసించారు. అప్పుడు ఆయన న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ వుండే వారు. 
తర్వాత గ్రౌండ్ జీరో పక్కనే అపూర్వ నిర్మాణ కౌశలంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ రైల్వే చూసాము. అక్కడ నుంచి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే న్యూయార్క్ స్టాక్ ఎక్సెంజి దగ్గర ప్రఖ్యాతిగాంచిన భారీ బుల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాము. 
నమ్మకమో, మూఢ నమ్మకమో తెలియదు, వీటికి ఎవరూ అతీతులు కారేమో అనిపించే దృశ్యాన్ని అక్కడ చూసాను. 
షేర్ లావాదేవీల్లో కలిసి రావాలని కోరుకుంటూ అనేక మంది ఆ బుల్ విగ్రహం వద్దకు వెడతారు. తప్పేమీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఆ బుల్ వృషణాలను తాకి మనసులో కోరుకుంటే వారు కోరుకున్నట్టుగా షేర్ ధరలు పెరుగుతాయట. ఈ నమ్మకం అక్కడి వారిలో ఎంతగా వున్నదో తెలియడానికి అక్కడ కనిపించిన క్యూలే సాక్ష్యం.
ఇక చివరి మజిలీ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ స్క్వేర్.
నిజానికి న్యూయార్క్ లోని అనేకానేక వీధుల్లో అదొకటి. కానీ దాని వైభోగమే వేరు. పర్యాటకులు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టు ఆ ప్రాంతం అంతా జనంతో కిటకిట లాడుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా అక్కడే వినియోగిస్తున్నట్టు ధగధగలాడుతోంది.
నా కంటికి మాత్రం అదో కలవారి తిరునాళ మాదిరిగా అనిపించింది.
కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి కారులో మళ్లీ వూరు చేరే సరికి అర్ధరాత్రి రెండు గంటలు దాటింది. శనివారం వచ్చింది. అంటే సరిగ్గా ఒక్కరోజు మిగిలింది.

ఉపసంహారం

రెండు మాసాలు అమెరికాలో వుండి సెప్టెంబర్ 23 రాత్రికి హైదరాబాద్ వస్తున్నాను. మా అన్నయ్య కొడుకు సత్యసాయి ఈ సందర్భంగా వాళ్ళ ఇంట్లో వీడ్కోలు విందు ఇచ్చాడు. వున్న వూళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి మా బంధుమిత్రులు దాదాపు నలభై మంది వచ్చారు. అమెరికాలో అనేక ప్రదేశాలు తిరిగాను. విమానాల్లో, కార్లలో ప్రయాణించాను. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేసాను. ఎక్కడా ఒక్క రూపాయి (డాలర్) ఖర్చు చేయనివ్వకుండా వెంట వుండి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నా పట్ల ఇంతటి అవ్యాజానురాగం చూపించడానికి నాకు తెలిసి ఏ ఒక్క కారణం లేదు. కేవలం మా అమ్మ, నాన్న కడుపున పుట్టిన నా అదృష్టం తప్ప.
రేపు ఎల్లుండి విమానంలో ప్రయాణం. 
పునః దర్శనం ఈశ్వరేచ్చ!
🙏

20, సెప్టెంబర్ 2024, శుక్రవారం

చివరి మూడు రోజులు



సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం అమెరికా నుంచి తిరుగు ప్రయాణం.
సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి  బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము. 
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది. ప్యాంటు జేబులో దువ్వెన తప్ప చేతి సంచీ బరువు కూడా నన్ను మోయనివ్వడం లేదు. 
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.
గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous adress వైట్ హౌస్ మా ప్రియారిటీ.
సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా  అనుమతిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్ళు కనిపించారు. అదే దోవలో పేవ్ మెంట్ పై వచ్చే నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  పోటీ పడుతున్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు వున్న టోపీలు, టీ షర్టులు అమ్ముతున్నారు.
అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. 
అమెరికా రాజధానిలో మేము చూసినంతవరకు ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.
సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగిఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.
హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి,  ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి. 
విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?.
అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి. 
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.
ఇక రేపు అంటే శుక్రవారం ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే  ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.

18, సెప్టెంబర్ 2024, బుధవారం

లేక్ మిచిగాన్

లేక్ మిచిగాన్ - భండారు శ్రీనివాసరావు 

బాల్టి మోర్ చేరడానికి ఇంకా గంటన్నర విమాన ప్రయాణం ఉందనగా నిద్ర లేచిన మా కోడలు భావన, అదేమిటి పాపా మీరు రాత్రల్లా మేలుకునే వున్నారా అని అడిగింది. 
నా దగ్గర జవాబు ఏముంటుంది? ఇది నాకు అలవాటే అని చెప్పలేకపోయాను.
డెల్టా విమానం వెళ్ళే మార్గం ఎదురుగా వున్న చిన్న టీవీ తెరపై కనపడుతూ వుంది. అదేమిటో వెయ్యి కిలోమీటర్ల దూరం దాటివచ్చినట్టు, ప్రస్తుతం అమెరికాలోనే పెద్ద సరస్సు లేక్ మిచిగాన్ మీదుగా వెడుతున్నట్టు ఆ టీవీలో కనపడుతోంది. ఇంకా విచిత్రం ఏమిటంటే అమెరికాలో పెద్ద నగరాలు అయిన డెన్వర్, చికాగో వంటి నగరాల పక్కగా ప్రయాణం సాగుతోంది అనిపిస్తోంది. కానీ ఆ నగరాలు వందల మైళ్ళ దూరంలో వుండవచ్చు. కొన్ని వేల అడుగుల పైనుంచి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం కావడం చేత నేను అలాంటి భ్రాంతికి గురై వుండవచ్చు.
చూస్తుండగానే లేక్ మిచిగాన్ కూడా దాటినట్టే వుంది.
సరే కానీ మైళ్ళ కొద్దీ విస్తరించిన ఈ చెరువులు కబ్జాకు గురి కాకుండా ఎలా మనుగడ సాగిస్తూ వున్నాయబ్బా! 
కారణం ప్రభుత్వాలా! ప్రజలా!

సాల్ట్ లేక్ సిటీ

సాల్ట్ లేక్ సిటీ - భండారు శ్రీనివాసరావు 

ఏ వార్తకు అయినా డేట్ లైన్ ముఖ్యం. ఎప్పుడు, ఎక్కడ అనేది పేర్కొంటూ వార్త రాయడం అనేది జర్నలిస్టులకు వారి గురువులు నేర్పే తొలి పాఠం.
నేనిప్పుడు ఈ పోస్టులు రాస్తున్నప్పుడు సమయం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలు. సియాటిల్ నుంచి మధ్యలో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో దిగి మళ్ళీ బాల్టి మోర్ వెళ్ళే విమానం ఎక్కాము. డెల్టా ఎయిర్ లైన్స్ లో అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ఎయిర్ హోస్టెస్ లు సకల మర్యాదలు చేస్తున్నారు. దానికి తోడు 30 వేల అడుగుల ఎత్తున కూడా వై ఫై సదుపాయం ఉంది. డెల్టా ఫ్లయి మైల్స్ స్కీం కింద ఈ అదనపు ఏర్పాటు అనుకుంటా. 
కింది ఫొటో సాల్ట్ లేక్ సిటీ ఎయిర్ పోర్టులో. ఈ ప్రాంతంలో ప్రధానమైన పర్యాటక ఆకర్షణ కేనియన్స్ (ప్రకృతి సిద్ధమైన లోతయిన లోయలు). 
వాటికి సంకేతంగా ఇక్కడి ఎయిర్ పోర్ట్ ను కేనియాన్స్ ఆకారంలో తీర్చి దిద్దారు.
18-9-2024