14, జనవరి 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (70) – భండారు శ్రీనివాసరావు

 అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్‌' అని ఎద్దేవా చేసేవారు. ఎయిర్ బస్ మంత్రివర్గం అని హేళనగా మాట్లాడేవారు. అరవైమంది మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల సంగతి సరేసరి. అయినా,  ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం ఆయనది. యాదగిరి (హెలికాప్టర్‌)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.

`వెనకటి రోజుల్లో జిల్లాకు ఒకే ఒక్క అయ్యేఎస్‌ ఆఫీసర్‌ (జిల్లాకలెక్టర్‌) ఉండేవాడు. ఇప్పుడో, ఇద్దరు ముగ్గురు అలాంటి అధికార్లు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు జిల్లాకు ఇద్దరు మంత్రులు వుంటే తప్పేంటి శ్రీనివాసూ’  అనేవారు ఆంతరంగిక సంభాషణల్లో.

చెవులు మాత్రమే వున్న కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకునే అలవాటు వుంది. అప్పట్లో మీడియా సంస్థలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడాలి అంటే అలాంటి వార్తలు హైదరాబాదు నుంచి వెలువడే ఆంగ్ల దినపత్రికల ఢిల్లీ ఎడిషన్లలో వచ్చేట్టు చూసుకోవడానికి అసమ్మతి వర్గం వాళ్ళు నానా ప్రయత్నాలు చేసేవాళ్ళు. మొత్తానికి ఆ ప్రయత్నాలు ఫలించాయి.

 

ఆ రోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది,  మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. సచివాలయం బీట్ చూసే విలేకరుల, అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది. 

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో,  ఏం మొయిన్‌  (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లో కూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రం దాకా దిక్కులేదు. కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది! మంత్రులందరూ (రాజీనామా లేఖలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను. వెంటనే ఒకటీ పదికి మొదలయ్యే ప్రాంతీయ వార్తల్లో మంత్రివర్గ రాజీనామా వార్త ప్రముఖంగా మొదటి హెడ్ లైన్లో వచ్చింది.

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియచెప్పడానికే. ఇందుకు నేనూ మినహాయింపు కాదని చెప్పడానికే.

ఆ రోజు నేను హడావిడిలో అరవైమంది మంత్రులు రాజీనామా చేశారని చెప్పాను. మధ్యాన్నం  రేడియో వార్తల్లో అలాగే ప్రసారమైంది. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య అరవై. 59 మంది మంత్రులే ఆరోజు రాజీనామా చేశారు. సాయంత్రం వార్తల్లో ఈ తప్పు సవరించుకున్నామనుకోండి.

సాధారణంగా పత్రికలకు ఒక భాష వుంటుంది. విలేకరుల సమావేశాల్లో నాయకులు మాట్లాడేది సాకల్యంగా విని, నోట్స్ రాసుకుని, తమదైన బాణీలో చక్కగా ఆ వార్తకు సొగసులు అద్ది ప్రచురించేవారు.  మనం ఇంత బాగా మాట్లాడామా అని మర్నాడు పత్రికల్లో తమ వార్తను చదువుకున్న నాయకులు ఆశ్చర్యపోయేవారు.

అంజయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రముఖ దినపత్రిక ఆ బాణీని పూర్తిగా మార్చుకుంది. అంజయ్య గారు తెలంగాణా యాసలో మాట్లాడే వారు. ఆయన మాట్లాడిన ప్రతిమాటా యధాతధంగా ప్రచురించడం ఆ పత్రిక మొదలు పెట్టింది. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా వార్తను ప్రచురించడం అంతవరకు ఎరుగని విషయం. ఇందులో కొత్తదనం వుండడం వల్ల పత్రిక సర్క్యులేషన్ బాగుపడి ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రి స్థాయికి అది తగదని పత్రికల్లో పనిచేసే సీనియర్లు అభిప్రాయపడేవారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పటి లైవ్ టెలికాస్ట్ మాదిరిగా ఆయన గురించిన వార్తలు ఆ పత్రికలో వచ్చేవి. అంజయ్య గారు కూడా అభ్యంతరం పెట్టేవారు కాదు.  

అంజయ్య గారు గతంలో వెంగళరావుగారి మంత్రివర్గంలో,  కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. కార్మికుల సంక్షేమం గురించి అహరహం ఆలోచిస్తుండేవారు.

పురుళ్ళ ఆసుపత్రిలో ‘లేబర్ రూము’ పై అంజయ్య గారి జోకు సుప్రసిద్ధం. లేబర్ మినిస్టర్ గా ఈ ఎస్ ఐ ఆసుపత్రికి వెళ్లారట. అక్కడ మెటర్నిటీ వార్డులో పురుళ్ళ గదికి ‘లేబర్ రూం’ అని బోర్డు వుండడం చూసి ఆయన సంతోషపడి తన ఆనందాన్ని దాచుకోలేక ‘చూసారా ఈ ఆసుపత్రిలో లేబరోళ్లకోసం  ప్రత్యేక ఏర్పాట్లు వున్నాయి” అనేశారట.

ఆయన అమాయకత్వాన్నిబట్టి ఇలాటి జోకులు పుట్టివుంటాయి.  కానీ, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పంచాయతి రాజ్ సంస్థల్లో సర్పంచులను నేరుగా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. చాలాకాలంగా వాయిదా పడుతున్న పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఆ ఎన్నికలను  పార్టీ గుర్తులు లేకుండా నిర్వహించి గెలిచిన వాళ్ళు అందరూ మన పార్టీనే అని ధైర్యంగా ప్రకటించారు.

కింది ఫోటో:

అంజయ్య మంత్రివర్గం రాజీనామా వార్త క్లిప్పింగ్



 

(ఇంకా వుంది)

13, జనవరి 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (69) – భండారు శ్రీనివాసరావు

 

‘నర్సుని కావాలని వుంది, అదీ ఒక అనాథాశ్రమంలో..’

 “పెద్దయిన తర్వాత ఏమవుదామని అనుకుంటున్నావ్? అనే ప్రశ్నకు నేను చెప్పిన ఈ  జవాబు విని క్లాసులో, టీచరుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.”

“దేవుడికి నా కోరిక సగమే అర్ధం అయినట్టు వుంది. అందుకే ఇలా నాచేత ఈ చైల్డ్ కేర్ సెంటర్ పెట్టించి ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు, వారి ఆలనా పాలనా చూడమని”

ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం1980లో అనుకుంటానువాసిరెడ్డి కాశీ రత్నం గారు మా ఇంటికి వచ్చారు, మహిళల పత్రిక, వనితాజ్యోతికి మా ఆవిడను  ఇంటర్వ్యూ చేయడం కోసం. మా ఆవిడ నిర్మల నడిపే  అమ్మవొడి గురించి కాశీరత్నం గారు అడిగినప్పుడు మా ఆవిడ నిర్మల చెప్పిన మాటలు ఇవి.

అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర్లో  పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. నాకు రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న  సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.

ఆ రోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే  జీతానికిజీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితే, ఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన బర్కత్ పురా నుంచి చేతికర్ర  పొడుచుకుంటూ, జాగ్రత్తగా  నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.  మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారుసమయానికి  అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడిమరికొంత చీకాకు పడి.

ఈ నేపధ్యంలో మరో దారి కనపడకమా ఆవిడ ఈ అమ్మవొడి దారి ఎంచుకుంది.

ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం కేటాయించాము. బయట, రోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘అమ్మ కొంగు ముడి విడలేని చిన్నారుల బడి అమ్మవొడి’ అనే ట్యాగ్  లైన్ తో  ‘అమ్మవొడి, చైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.

రెండు వారాలు గడిచాయి కానీ, మా ఆవిడ అమ్మ వొడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీఉయ్యాలలు  కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారుకానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.

అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి మా ఆవిడ చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడిని, ఓ పాలసీసాను పెట్టి‘ఇప్పుడు టైము లేదుసాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయి, సాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. నేను కూడా ఆఫీసు నుంచి వచ్చాను. ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని  సముదాయిస్తూ తను ఒక్కత్తీ కూర్చుని వుంది. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. నాలో ఆరాటం పెరిగింది. ‘పోలీసులకు చెప్పనా!’ అన్నాను. తల అడ్డంగా ఊపింది. ‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అంది స్థిరంగా, మరో మాట లేదన్నట్టు.

మా ఆవిడ అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారుబోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి  ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.

ఆ బాబు పేరు జేమ్స్. మా ఆవిడ పెట్టిన అమ్మవొడిలో చేరిన  మొదటి పిల్లవాడు.

తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. మా ఆవిడకు పని భారము పెరిగింది. పని మనిషి  రాని రోజున చూడాలి మా ఆవిడ అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేసేది.  కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలులాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగేది కాదు. ఇచ్చినది పుచ్చుకునేది. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేది కాదు.

‘మనం అంతేగా! నెలనెలా  అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు సరిపోకనే కదా, ఇద్దరూ ఉద్యోగాలు చేసేది’ అని వారినే సమర్ధించేది.

అలా మొదలైన అమ్మవొడి క్రమంగా పేరు పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు  నా మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.

అమ్మవొడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే తను చాలా సంబర పడేది.

అలా మొత్తం మీద, అనాథాశ్రమంలో నర్స్  కావాలనుకున్న తన చిన్ననాటి కోరికను మా ఆవిడ నిర్మల తన  అమ్మవొడి ద్వారా తీర్చుకుంది.

ఆమె సేవాభావం నాకు అంటలేదు కానీకన్న పిల్లలు ఇద్దరికీ కొంచెం పంచిపెట్టే వెళ్ళిందినేను పంచడానికి ఏమీ లేదని తెలుసు కనుక.

తోక టపా!

తెల్లవారక ముందే రేడియో ఉదయం వార్తల బులెటిన్ తయారు చేయడానికి ఆఫీసు కారులో  వెళ్ళే వాడిని. ఇంటికి తిరిగి వచ్చాక, బారెడు పొద్దెక్కేవరకు పడుకుని, భోంచేసి సిటీ బస్సులో సచివాలయానికి వెళ్లి అటునుంచి అటే రేడియోకి వెళ్లి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. నేను ఎక్కడికి వెడుతున్నది తెలియకపోవడం,  పగలల్లా మా ఆవిడ కేర్ సెంటర్ పిల్లలతో సతమవుతూవుండడం ఇవన్నీ గమనిస్తూ వచ్చిన ఓ పొరుగింటావిడ, నాకు ఉద్యోగం సద్యోగం అంటూ ఏమీ లేదని తనకుతానుగా నిర్ధారించుకుని  నేరుగా మా ఆవిడతోనే అనేసింది, ‘మా ఆయనకు సచివాలయంలో చాలా పరిచయాలు వున్నాయి. వచ్చి ఓసారి మీవారిని కలవమని చెప్పండి, ఏదైనా చిన్న కొలువు ఇప్పిస్తారు, వేన్నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వుంటుంది అని. అది విని మా ఆవిడకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నాకు ఈ సంగతి చెప్పిన తర్వాత మాత్రం పకపకా నవ్వింది.

కింది ఫోటో:

అమ్మవొడి



(గీతా, రాతా అన్నీ నావే. ఈ పేరు పెట్టింది కూడా నేనే. ఆమె చేసే  చాకిరీలో మాత్రం ఈ నేను అనేది లేదు, అది మాత్రం మా ఆవిడ ఖాతా)

 

(ఇంకా వుంది)  

అయాం ఎ బిగ్ జీరో (68) – భండారు శ్రీనివాసరావు

 “ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి అంజయ్య ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికికానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో ‘అమ్మ అమ్మ’ అంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.

చెన్నారెడ్డి గారి వంటి చండశాసనుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన తరవాత ఆ స్తానంలో మేదకుడయిన అంజయ్య గారిని ఊహించుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఒక పట్టాన మింగుడుపడేది కాదు. ఆయన గురించి తేలిగ్గా మాట్లాడుకునేవారు. ఈ విషయం ఇందిరాగాంధీకి తెలియకుండా వుంటుందా. వెంటనే ఒకరోజు ఆమె పనికట్టుకుని హైదరాబాదు వచ్చారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసారు. మామూలుగా ఈ మీటింగులు శాసనసభ ఆవరణలో జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ సంప్రదాయానికి విరుద్ధంగా అంజయ్యగారు ముఖ్యమంత్రిగా నివాసం వుంటున్న ‘జయప్రజాభవన్’ (గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్) లో నిర్వహించారు. ఇందిరాగాంధీ ఆ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశం జరిపి అందులో మాట్లాడడం ద్వారా ఆమె కాంగ్రెస్ వాదులందరికీ ఒక స్పష్టమయిన సందేశం పంపారు. అంతే! అంజయ్య గారిని గురించి అంతవరకూ తేలికగా మాట్లాడిన వారందరూ నోళ్ళు కుట్టేసుకున్నారు.

అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో,  రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గురించి ఆకాశవాణి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దానికి ముఖ్యమంత్రి సందేశం కూడా జోడిస్తే బాగుంటుందని రేడియో అధికారులు భావించి, రికార్డింగ్ యూనిట్ తీసుకుని, అప్పుడు ప్రోగ్రాం ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న పీ.ఎస్. గోపాలకృష్ణగారు, నేనూ కలసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాము. మాటా మంతీ మధ్య అంజయ్యగారు ఎవర్నో పిలిచి అందరికీ చాయ్ తెమ్మని చెప్పి మళ్ళీ కబుర్లలో పడిపోయారు. రికార్డింగ్ కూడా పూర్తయింది. కాని,  చాయ్ రాలేదని గ్రహించిన అంజయ్యగారు తానే లేచి వెళ్ళి మా అందరికీ ట్రేలో తేనీరు తెచ్చి ఇచ్చారు. ‘ఎలాటి భేషజాలు లేని ముఖ్యమంత్రిని చూడడం తన సర్వీసులో అదే మొదటిసారి’ అని గోపాలకృష్ణ పదే పదే గుర్తుచేసుకుంటూ వుండేవారు.

 

అంజయ్య ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఓ రోజు ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు నాయకులు  ఆ తరువాతి కాలంలో (ఉమ్మడి) రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్ అనాలా?) లో ఇంటికి నడిచి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి ‘ శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పద’ అన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో ‘అమ్మవొడి’ పేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే, అక్కడినుంచి మూడో ఇల్లే మాది, ముఖ్యమంత్రితో సహా అందరం మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో బాగా వెనగ్గా వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు భవనం వెంకట్రాం గారు కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాధికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ‘ఇదేం పద్ధతిగా లేదు’ అన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ‘ఆయన్నేమన్నా బొట్టుపెట్టి పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.
అతడు ఎవరో కాదు జర్నలిస్టులు అందరం ముద్దుగా ‘బోలోజీ’ అని పిలుచుకునే బాలాజీ.

కింది ఫోటో:

ముఖ్యమంత్రి అంజయ్యతో ప్రముఖ మెజీషియన్ బీవీ పట్టాభిరాం, మధ్యలో సెక్యూరిటీ అధికారి బాలాజీ



 

(ఇంకావుంది)

12, జనవరి 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (67) – భండారు శ్రీనివాసరావు

 

మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో 1975 ఏప్రిల్ 12 నుంచి  18 వరకు జరిగాయి. అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మహాసభల సారధి నాటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణా రావు. రెండో ప్రపంచ తెలుగు మహాసభలు 1981 ఏప్రిల్ 14 నుంచి 18 వరకు మలేసియాలోని కౌలాలంపూర్ లో జరిగాయి. నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య. సభల సారధి మంత్రి ఏమ్వీ కృష్ణారావు. అనివార్య కారణాల వల్ల ఆయన మహాసభల్లో పాల్గొనలేకపోయారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు   1990 డిసెంబరు 10 నుంచి 13 వరకు మారిషస్ లో జరిగాయి.

కౌలాలంపూర్ సభల ప్రారంభోత్సవం తరువాత, నేను అంజయ్య గారితో పాటే సింగపూరు వెళ్లి ఆయనతో పాటే అక్కడి  హోటల్లో బస చేశాను. తెలుగు మహాసభల హడావిడిలో ఆయన సరిగా భోజనం చేసినట్టు లేదు. ఏదో ఒకటి, ఇడ్లీ, దోస లాంటిది తినాలనిపించింది. మా అందరి పరిస్థితి అదే. అప్పటికే బాగా పొద్దు పోయింది.  ఇండియన్ ఎంబసీ తరపున ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ చూస్తున్న అధికారి ఒకరు లిటిల్ ఇండియా అనే ప్రాంతంలో ఉన్న ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంటుకు తీసుకువెళ్ళారు. టైం అయిపోవడం వల్ల ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం మెట్లు ఎక్కి కిచెన్ లో నుంచి రెస్టారెంట్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. వెంట వున్న సెక్యూరిటి అధికారి, ఐపి ఎస్ ఆఫీసర్ వామనరావు కొంత ఇబ్బందిపడ్డట్టు కనిపించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి భేషజం లేకుండా అలాంటి చోట్లకు వెళ్ళడం ఈ నాటి పరిస్థితులు, వైభోగాలతో పోల్చుకుంటే విడ్డూరమే అనిపిస్తుంది. వేడి వేడి ఇడ్లీలు, మసాల దోశలు చూడగానే అందరం ఆవురావురమని తిన్నాము.

ఉదయం ఎయిర్ పోర్టుకు వెళ్ళాము. అంజయ్య గారి బృందం బొంబాయి మీదుగా, నా తిరుగు  ప్రయాణం మద్రాసు మీదుగా. సింగపూరు నుంచి మద్రాసు చేరి, ఎయిర్ పోర్టులోనే కాలక్షేపం చేసి హైదరాబాదు విమానం ఎక్కాను. తీసుకెళ్ళిన పదిహేను డాలర్లు అలాగే వున్నాయి.  కనీసం కొత్త సూటు కేసు కొనడం కూడా కుదరలేదు. కాకపోతే, తీసుకువెళ్ళిన డబ్బుల్లో ఓ ఆరువందల రూపాయలతో టు ఇన్ వన్ రేడియో/ టేప్ రికార్డర్ కొన్నాను. హైదరాబాదు ఫ్లయిట్లో రాజనరసింహ గారు (ప్రస్తుత ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  రాజనరసింహ గారి తండ్రి) కలిశారు. వారి ఇల్లు బేగంపేట ఎయిర్ పోర్టు పక్కనే. కారులో తాను ముందు దిగి వారి కారులోనే నన్ను చిక్కడపల్లిలోని మాఇంటికి పంపించారు.

ఈ విధంగా నా మొదటి విదేశీ ప్రయాణం ముగిసింది.  

కౌలాలంపూర్ తెలుగు మహాసభలు తెలుగు భాష ఉన్నతికి ఎంతగా దోహదం చేసాయో తెలియదు కానీ, అంజయ్య గారి మీద మరిన్ని జోకులు రాయడానికి, కార్టూన్లు వేయడానికి తెలుగు పత్రికలకు పనికి వచ్చింది.

ఇదంతా చూసినప్పుడు కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు  జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు గుర్తుకు వస్తున్నాయి.

పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఏర్పడ్డ  ఆంధ్రరాష్ట్రానికి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగు వాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా కలెక్టర్  కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్రకేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత  చెడామడా ఉతికేసాడు.

ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే  పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన  కృష్ణగారికి, రమేశన్ మాదిరిగానే  తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.

ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.

1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన అంత దూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో  మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని. 

స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.

అయితే, తెలుగు భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.

ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే  తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం వచ్చి తీరాలి అంటారు. ఈరోజు  సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు.  ఇప్పుడు అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు. తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.

భాషలను, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు మాత్రం ప్రజాప్రభుత్వాలది.

ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో ‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.

తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!

కింది ఫోటో:

మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్



(ఇంకా వుంది)