16, నవంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (7 ) - భండారు శ్రీనివాసరావు

 ‘ఏవేవో పాత సంగతులు రాస్తున్నారు, ఇంతకీ మీ కధ ఎప్పుడు మొదలవుతుంది?‘  ఫోన్ చేసి ఓ పెద్ద మనిషి అడిగారు.

‘ముందు నన్ను పుట్టనివ్వండి. పుట్టి పెరిగిన తర్వాత కదా నా కధ మొదలయ్యేది ‘ అన్నాను నేను.

‘భలే వాళ్ళే!‘ అంటూ పెట్టేశారు ఫోను.

ముందు మాటలో చెప్పినట్టు, ఇది నా కధే కానీ, నా ఒక్కడి కధ కాదు. నా చుట్టూ అల్లుకున్న ఒకనాటి సమాజపు తీరుతెన్నులు, నాటి రోజులు గురించి ఏ మాత్రం తెలియని నేటి తరానికి చెప్పాలనే తాపత్రయంతో  మొదలు పెట్టిన కధ ఇది. నిజానికి మా కుటుంబంలోనే ఆరో తరం నడుస్తోంది. వారిలో చాలామందికి కూడా తమ పూర్వీకుల జీవన విధానాల పట్ల అవగాహన లేదు.  నాకు సయితం తెలియని కొన్ని విషయాలను మా అన్నయ్యలు, మా అక్కయ్యల ద్వారా నాకు తెలిసిన  సంగతులను నలుగురితో పంచుకోవడం ఈ రచనలోని ప్రధాన  ఉద్దేశ్యం. ఇందులో హెచ్చు భాగానికి నేను కేవలం రాయసకాడిని (Amanuensis) మాత్రమే.  

మా నాలుగో అక్కయ్య సావిత్రి, ఐదో అక్కయ్య అన్నపూర్ణల  పెళ్ళిళ్ళు మా నాన్న గారి హయాములోనే జరిగాయి.   

సావిత్రక్కయ్య పెళ్లి చూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు.

మా అమ్మ సంతానంలో సుదీర్ఘ కాలం జీవించినది ఈమె ఒక్కరే. తొంభయ్ ఏళ్ళు మీద పడిన తర్వాత కూడా తన పనులు తానే చేసుకునేది. ప్రతి పండగకి ఆమె నుంచి ఠంచనుగా ఫోన్ వచ్చేది.

‘ఒరేయ్! నీకు పండుగ శుభాకాంక్షలు. సంతోష్ కు సంతోష్ భార్యకు కూడా నా శుభాకాంక్షలు చెప్పు

గడగడా చెప్పేసి, మరో మాటలేకుండా ఫోన్ పెట్టేసేది. సావిత్రక్కయ్య ఎప్పుడూ ఇంతే! తను చెప్పదలచుకున్న రెండు మాటలు రెండు ముక్కల్లో చెప్పేస్తుంది.  

సంక్రాంతికే కాదుఏ పండుగ వచ్చినా, పుట్టిన రోజులకు సయితం  సావిత్రక్కయ్య ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేది. నా ఒక్కరికే కాదుకుటుంబంలో ప్రతి ఒక్కరికీ. తొంభయ్ రెండేళ్ల వయస్సులో ఎంతటి  ఓపికోఎంతటి ఆపేక్షో! ఆ వయసులో కూడా ఎప్పటెప్పటి విషయాలో ఆమెకు గుర్తు. అవన్నీ ఆమె నోటంట చెప్పించాలని నాకో కోరిక.

కాగితం, కలం లేకుండా రేడియోకి ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. అది నా గొప్పతనం కాదు. రేడియోకి  వార్తలు పేరాలు పేరాలు ఇవ్వక్కరలేదు. చెప్పిన దాంట్లో  కీలకమైన అంశం దొరకబుచ్చుకుని మూడు ముక్కల్లో వార్త తయారు చేసే వెసులుబాటు వుండేది.

ఈ సోదంతా ఎందుకంటే  ఒకసారి ఖమ్మంలో మా అక్కయ్యను ఇంటర్వ్యూ చేసాను, ఇలాగే చేతిలో పెన్ను లేకుండా. కాగితం మీద రాసుకోకుండా. అప్పుడు తెలిసింది విషయాలను గుర్తుపెట్టుకుని సవిస్తరంగా రాయడం ఎంత కష్టమో.

 ఓసారి సంక్రాంతి పండక్కి కాబోలు నాలుగయిదు కార్లలో హైదరాబాదు నుంచి మా స్వగ్రామం బయలుదేరి, దారిలో ఖమ్మంలో సావిత్రక్కయ్య ఇంట్లో ఆగాము.

ఆమె వయసు అప్పటికే ఎనభయ్ తొమ్మిదేళ్ళు.  కుటుంబంలో పెద్దావిడ. పాత తరానికి చెందిన విషయాలు తెలుసుకోవడానికి మిగిలివున్న ఏకైక వారధి. అందుకే ఆమెతో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాను. ముందు ఏముంటాయిరా అంత గుర్తుంచుకునే విషయాలు అంటూనే దాదాపు రెండు గంటలు మాట్లాడింది. ఆమె ధారణ శక్తి చూసి ఆశ్చర్యపోవడం మా వంతయింది.

పుట్టి పెరిగిన కంభంపాడు గురించీ, ఎప్పుడో ఎనభై ఏళ్ళనాడు కాలిపోయిన మా ముత్తాతలు నిర్మించిన  మండువా లోగిలి గురించీ, ఆ తర్వాత  మా నాన్న హయాములో కట్టిన పెంకుటిల్లు గురించీ, చిన్ననాటి చదువుసంధ్యలు గురించీ, అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు గురించీ అనేక విషయాలు చెబుతూ పోయింది. మేమంతా వింటూపోయాము. ఈ ధ్యాసలో పడి అంశాల వారీగా గుర్తుపెట్టుకునే అసలు పని మరిచేపోయాను. నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు. ఆమె తనంతటతానుగా అభివ్యక్తీకరించిన ఆత్మావలోకనం.

ఊళ్ళో అప్పయ్యగారి వీధిబడి దగ్గర ఆమె  చదువు ఆగిపోయింది. కానీ మా చెల్లమ్మమ్ముమ్మ పక్కన కూర్చుని, ఆమె నుంచి  నేర్చుకున్న భారత, రామాయణాలు కంఠతా పట్టింది. పొద్దున్నే బామ్మ తోటకు వెడుతూ తననూ, అన్నపూర్ణక్కయ్యను వెంటబెట్టుకుని తోటకు వెళ్ళేది. ఇంటికి వస్తూ ఆ  రోజుకు కావాల్సిన కూరగాయలు కోసుకుని తెచ్చుకునేవారు.

సావిత్రక్కయ్య పెళ్లిచూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు. రాధక్కయ్య ఇంట్లో పెళ్లి కుదిరింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ ఖమ్మంలో రాధక్కయ్య ఇంటి పక్కనే వీళ్ళూ ఇల్లు కట్టుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణ బజారులో వుండేవాళ్ళు. అద్దె పది రూపాయలు.

“కాపురం కొత్తల్లో చాలా ఇబ్బందులు. కొత్త ఇంట్లో చేరిన తర్వాత కూడా అవి వెంటే వచ్చాయి. అయితే దేవుడి దయవల్ల మా వారి ప్రాక్టీసు, ఆయన రెక్కల కష్టం వృధా పోలేదు. పిల్లలు ఎదిగి వచ్చారు. ఆడపిల్లలకు, మగపిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయి. (పోలీసు ఐజీ గా రిటైర్ అయిన  ప్రముఖ రచయిత రావులపాటి సీతారాం రావు గారు ఈ ఇంటి అల్లుడే). ఇవ్వాళ ఈ స్తితిలో వున్నామంటే మా వారి చలువే.” అంది తృప్తిగా.

“మా వారి ప్రాక్టీసు అంతంత మాత్రంగా వున్నప్పుడు నేను ఎక్కువ  రోజులు పుట్టింట్లోనే వుండేదాన్ని. పెద్దమ్మాయి విమల, పెద్దపిల్లాడు దుర్గాప్రసాదు ఇద్దరూ  నేను పుట్టిన ఊరు కంభంపాడులోనే పుట్టారు. తర్వాత కాపురానికి ఖమ్మం వెళ్ళిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో మా అక్కచెల్లెళ్ళ పిల్లాజెల్లా అందరూ పొలోమని అమ్ముమ్మగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఒక్క నేనూమా పిల్లలూ తప్ప. అలాగే నాన్న తద్దినం నాడు కూడా నేను వెళ్ళలేకపోయేదాన్ని. మా వారికి పిల్లలు అంటే ప్రాణం. కోర్టు నుంచి ఇంటికి రాగానే పిల్లలు అందర్నీకంటినిండా చూసుకుంటే కాని ఆయనకు తృప్తిగా వుండేది కాదు. అన్నపూర్ణ మా వారిని ‘ ‘ఏం బావా సావిత్రిని, పిల్లల్నీ రెండు రోజులు కంభంపాడు పంపిస్తే,  నిన్ను  పిల్లులు ఎత్తుకుపోతాయా ఏమిటని’ ఆటలు పట్టిస్తుండేది. కానీ అయన మనసు నాకు తెలుసు. చెప్పాకదా పిల్లలు అంటే ప్రాణమని. ఆ పల్లెటూళ్ళో ఆడుకుంటూ కాలికి చేతికీ దెబ్బలు తగిలించుకుంటారేమో అని భయం. పెళ్ళికి ముందు, పెళ్ళయిన కొత్తల్లో పుట్టింట్లో ఎక్కువ రోజులు వున్నా కనక,  పుట్టింటికి  తరచూ వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అంతగా వుండేది కాదు. నాకు ఇల్లే వైకుంఠం’ చెప్పింది. ఆమె కళ్ళల్లో  నిండుగా సంతృప్తి.

సావిత్రక్కయ్య పెద్ద కుమారుడు  దుర్గాప్రసాద్ (ఈ మధ్యనే పోయాడు) ఒక మంచి పనిచేసాడు. అందర్నీ సంప్రదించి, ఒప్పించి పాత ఇంటిని పడగొట్టి కొడుకులు, కోడళ్ళు,  కూతుళ్లు, అల్లుళ్లు అంతా కలివిడిగా వుంటూనే విడివిడిగా ఉండేలా అందరికీ ఒకే చోట ఒకే భవనంలో అపార్ట్ మెంట్లు కట్టించాడు. కుటుంబం మొత్తం ఒకే గొడుగు కింద వుండే ఏర్పాటు అన్నమాట. వృద్ధాప్యంలో వున్న తల్లికి ఇంతకంటే ఏం కావాలి.

‘కన్నపిల్లలు కంటి ఎదుట కనబడేలా ఇప్పుడు ఏర్పాటు చేసారు. అల్లుళ్ళు, కోడళ్ళు మంచివాళ్ళు దొరికారు. చిన్నవాడు అచ్యుత లలిత అనే అమ్మాయిని  హమేషా నా దగ్గర ఉండేలా నాకు తోడుగా పెట్టాడు. రోజులు మంచిగా గడిచిపోతున్నాయి. ఎవరైనా అడిగితే కానీ, నేను తొంభయ్యవ పడిలో పడుతున్నాను అనే సంగతి గుర్తురావడం లేదు.” అన్నది ప్రశాంత చిత్తంతో.

అదే ప్రశాంత చిత్తంతో అనాయాస మరణం పొందింది. 

తోక టపా:

‘బయట తిరక్కండిరా!’

‘అలా ఎండలో తిరిగితే వడ దెబ్బ తగులుతుంది’

‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది’

‘చలిగాలిలో తిరగకండి వంటికి మంచిది కాదు’

ఇలా ఆరుగాలమూ ఆంక్షలే! అందుకే పెద్దవాళ్ళ కళ్లుగప్పి బజార్నపడే వాళ్ళం. వాళ్ళ కళ్ళబడితే ఇంతే సంగతులు! వీపు విమానం మోతే!

ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి సంగతులన్నీ  ఈ మోస్తరుగానే వుంటాయి.

ఆ రోజు పొద్దున్న ఖమ్మం నుంచి మా సావిత్రక్కయ్య ఫోను. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పడానికి మా ఇంట్లో ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. మా ఆవిడతోనే అన్నింటికీ కృష్ణార్పణం. ఆ సంగతి చటుక్కున గుర్తు వచ్చింది కాబోలు మాటమార్చి అంది.

“బయట తిరక్కురా! అసలే (కరోనా) రోజులు బాగా లేవు”

ఎనభయ్ తొమ్మిది నిండి తొంభయ్యవ పడిలో అడుగుపెట్టిన అక్కయ్య,  డెబ్బయి నాలుగేళ్ల తమ్ముడికి ఇలా సుద్దులు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కింది ఫోటో:



 

సావిత్రక్కయ్యతో మా కుటుంబం

 

15, నవంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (6 ) - భండారు శ్రీనివాసరావు

 ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి మా మూడో అక్కయ్య   సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండో  అక్కయ్య శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేదిట.

మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.

సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.

సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. బ్రిటిష్ ఇండియాలో  వివాహాలకు కనీస వయసును నిర్ధారిస్తూ, స్వాతంత్రానికి పూర్వమే నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంచేసింది. హర్ బిలాస్ శార్దా ( Harbilas Sarda) అనే సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లు తదుపరి చట్టంగా మారింది. దీనికి శారదా చట్టం అనే పేరు స్థిరపడింది.  ఎవరైనా ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో, నైజాం సంస్థానంలో ఈ చట్టం లేదు కాబట్టి,  ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.

పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో చదువురాని పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.

మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడపిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.

పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు.

తరువాత సరస్వతక్కయ్యకు వేరే సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కతే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఎమ్మేనే కాకుండా లా పరీక్ష కూడా రాసి బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకుని బెజవాడ వచ్చి ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టారు.

గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు.          

తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది.

ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్యపిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.

‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు.

ఈ పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే అప్పటికి నేను పుట్టనే లేదు.

కింది ఫోటో:

మధ్యలో మా అమ్మ, మా అమ్మతో ఆమె కన్న ఆడపిల్లలు, వాళ్ళు కన్న ఆడపిల్లలు. కోడళ్ళు   ఫొటోకు చిక్కింది మా అమ్మ సంతానంలో ఒక చిన్న బృందం మాత్రమే.




(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో (5) భండారు శ్రీనివాసరావు



ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి మా మూడో అక్కయ్య   సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండో  అక్కయ్య శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేదిట.
మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. బ్రిటిష్ ఇండియాలో  వివాహాలకు కనీస వయసును నిర్ధారిస్తూ, స్వాతంత్రానికి పూర్వమే నాటి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంచేసింది. హర్ బిలాస్ శార్దా ( Harbilas Sarda) అనే సభ్యుడు ప్రవేశ పెట్టిన బిల్లు తదుపరి చట్టంగా మారింది. దీనికి శారదా చట్టం అనే పేరు స్థిరపడింది.  ఎవరైనా ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో, నైజాం సంస్థానంలో ఈ చట్టం లేదు కాబట్టి,  ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో చదువురాని పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.
మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడపిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు. 
తరువాత సరస్వతక్కయ్యకు వేరే సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కతే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఎమ్మేనే కాకుండా లా పరీక్ష కూడా రాసి బెనారస్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకుని బెజవాడ వచ్చి ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టారు. 
గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. 
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. 
ఈ పెళ్లి నా భావి జీవితం ఒక గాడిన పడడానికి ఒక పునాది అయింది. చిత్రం ఏమిటంటే అప్పటికి నేను పుట్టనే లేదు.

కింది ఫోటో:
మధ్యలో మా అమ్మ, మా అమ్మతో ఆమె కన్న ఆడపిల్లలు, వాళ్ళు కన్న ఆడపిల్లలు. ఫొటోకు చిక్కింది మా అమ్మ సంతానంలో ఒక చిన్న బృందం మాత్రమే. 

(ఇంకా వుంది)

14, నవంబర్ 2024, గురువారం

నెహ్రూలో నెహ్రూను మాత్రమే చూడండి


(ఈరోజు జవహర్ జయంతి)

1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే  అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు.  బహుశా భారత దేశ రాజకీయ నాయకుల్లో నెహ్రూ మీద వచ్చినన్ని గ్రంధాలు కానీ, రచనలు కానీ ఒక్క గాంధీని మినహాయిస్తే ఎవరి మీద రాలేదు. కానీ నేటి యువతరానికి నాటి రచనలు చదివే తీరికా ఓపికా లేవు. ప్రతిదీ రెడీ రికనర్ లాగా ఇలా మీట నొక్కితే అలా కళ్ళ ముందు కనబడాలి. ఇది ఎంతవరకు పోయిందంటే ఒకసారి గూగుల్  లోకి వెళ్లి తెలుగుదేశం అధినేత గురించిన వివరాలు తెలుసుకోవడం కోసం  ఎన్టీఆర్ అని నొక్కి చూడండి, మచ్చుకు ఒకటో ఆరో పెద్దాయనవి, మిగిలినవి జూనియర్ ఎన్టీఆర్ వి కనబడతాయి. దీన్నే మనం చరిత్ర అనుకుంటున్నాం. 
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి, మహాత్మా గాంధీకి ప్రియతముడు కాబట్టి నెహ్రూ స్వతంత్ర భారత దేశానికి ప్రధమ ప్రధాన మంత్రి కాగలిగాడనే భావన నవతరంలో మెండుగా వుంది. అది నిజం కూడా. ఐతే,  ప్రధాని కావడానికి అవే   ఆయన అర్హతలు అనుకుంటే సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగేవాడు కాదు. ఆయన్ని ప్రధాని పదవిలో ప్రతిష్టించిన మహాత్మా గాంధి, స్వతంత్రం వచ్చి  ఆరుమాసాలు కూడా తిరగకుండానే తుపాకీ గుళ్ళకు గురై కన్ను మూసాడు.  కేవలం మహాత్ముని ఆశీస్సులే నెహ్రూ పండితుడికి శ్రీరామ రక్ష అనుకుంటే 1964 లో నెహ్రూ తీవ్ర అస్వస్తతకు గురై కన్ను మూసేవరకు ఆయన ఆ పదవిలో కొనసాగగలిగివుండేవా రు కాదు.

నెహ్రూ మరణించిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం వుంది. ఆ వార్త రేడియోలో వచ్చినప్పటినుంచి ఊరువూరంతటిలో పొయ్యి వెలిగించలేదు. ఆయన ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలవదు, తెలవడానికి ఇప్పట్లా టీవీలు లేవు. ఢిల్లీలో సాగుతున్న శవయాత్ర గురించి అదీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం  రేడియోలో  సాగుతుంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు శోకసంద్రంలో మునిగిపోయింది. వారిలో ఎవ్వరికీ ఆయన ఒక కాంగ్రెస్ ప్రధానమంత్రి అనే స్పృహ లేదు.
ఒకప్పుడు పీ.ఎల్. 480 కింద అమెరికా పంపే గోధుమలు, పాల పిండితో పేదల కడుపు నింపుకునే దేశం చూస్తుండగానే సస్య విప్లవం, శ్వేత విప్లవం సాధించింది. ఆరోజుల్లో వి.ఎల్.డబ్ల్యు. అనే అతి చిన్న అధికారి ప్రతి ఊరికీ వచ్చి ఏపంటలు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయాలను పల్లెటూరివాళ్ళకు వివరిస్తుంటే అందరూ చెవులు ఒప్పగించి వినేవాళ్ళు. ప్రతి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ప్రసారం అయ్యే పాడిపంటలు కార్యక్రమాలు పంచాయతి రేడియోలో వింటూ దేశం పంటల దిగుబడిలో స్వయం సమృద్ది సాధించింది. భాక్రానంగల్ నాగార్జునసాగర్, శ్రీశైలం ఒకటా రెండా ఈనాడు దేశాన్ని పచ్చటి పైర్లతో కళకళలాడిస్తున్న ప్రాజెక్టులు అన్నీ నెహ్రూ పుణ్యమే. అంతెందుకు,  ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించిన సర్దార్ సరోవర్ డాం కు శంఖుస్థాపన చేసింది ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని ఈ తరం మరచిపోకూడదు.
నెహ్రూ నుంచి మోడీ వరకు స్వతంత్ర భారతం అభివృద్ధి పధంలో ముందుకు సాగుతూనే వుంది. ఒక్కొక్క ప్రధాని తమదయిన శైలిలో జాతి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మోడీ చేసే మంచిపనులను భావి భారతం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో నెహ్రూ వంటి నాయకులు చేసి వెళ్ళిన గొప్ప పనులను ఈ తరం గుర్తు పెట్టుకోవాలి. 
దేశ ప్రగతికి  మన వంతు కృషి  ఏమీ చేయలేనప్పుడు కనీసం కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా ఆ పని ఓ మేరకు చేయవచ్చు. 
నెహ్రూను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక కోణాలు వున్నాయి. కానీ ఒక దార్శనికుడిగా వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయనది.
గాంధి, నెహ్రూ, పటేల్, అంబేద్కర్, వాజ్ పాయ్ వంటి వారిని  ఒక పార్టీకి చెందినవారిగా గుర్తిస్తున్నంత కాలం వాళ్ళ వ్యక్తిత్వాలను నిజాయితీగా అంచనా వేయడం కష్టం.



అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 4 ) - భండారు శ్రీనివాసరావు

 మా నాన్నగారు రాఘవరావు (రాఘవయ్య గారు అనేవారు) వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద కరణం గారి అబ్బాయి కొమరగిరి  వెంకట అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే,  కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు (ఆదాయం)  మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.

అలాటి రోజుల్లో నా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో నా  చిన్నతనం నడిచింది.

మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.

ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది, ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణంగారింట్లోనే.

మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ రోజువారీ  డ్యూటీ మొదలయ్యేది.   

మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్ది.  మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవచ్చేవి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు.  

అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి  పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన కారప్పూస, గవ్వలు, మణుగు బూరెలు వంటి చిరుతిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు.

మా అమ్మగారు పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని,  ఒంటిచేత్తో  పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంటకాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచిపైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై  అరచేతి మందాన మీగడ కట్టేది.  మర్నాడు మా అమ్మ  కుండలోని  గడ్డ పెరుగుని ఒక గుంజకు కట్టిన కవ్వంతో చిలికేది. మజ్జిగపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసి, పక్కన నిలబడి ఆశగా చూసే చిన్నపిల్లలకి చిన్న చిన్న వెన్నముద్దలుపెట్టేది. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునేవాళ్ళం. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానేఅంట్లగిన్నెలు సర్దేసివంటిల్లు ఆవుపేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టలేని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

 వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా  నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే  పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.

రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు,  గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. మగవాళ్లు తుండు గుడ్డలు కట్టుకుని  బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే నలుగు పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు  ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు.  బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. నాలుగయిదు అరటి చెట్లు ఉండేవి. అరటి గెల ఒక దిక్కుకు కాస్తే ఇంటికి అరిష్టమని ఆ గెల వేసిన  చెట్టుని కొట్టేసేవారు.  ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్న  ముళ్ళ కంపకు కాకరపాదులు పాకించే వాళ్ళు, తేలిగ్గా ఓ పట్టాన కాయలు తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత  పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.

బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటే వాటికి నల్లరంగుతో చిన్నచిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండకాయలు, దొండకాయలు దొడ్లోనే కాసేవి. దొండపాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత  నిజం వుందో తెలవదు. ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా  వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టే ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.  

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్లబండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై  బండ్ల ఎరువు పోగు పడేది.

(పెంకుటిల్లు కావడం, పాతపడి, తరచుగా రిపేర్లు చేయాల్సిరావడం, అంత పెద్ద ఇంట్లో మా మూడో వదిన గారు అరుణ వదిన  ఒంటరిగా ఉండాల్సిరావడం ఇత్యాది కారణాలతో పిల్లలు రఘు, రమేష్, సాయి పూనుకుని పాతఇల్లు పడగొట్టి పొందికగా, ఆధునికంగా వుండే ఒక డాబా ఇంటిని ఈ మధ్యనే కట్టించారు. తాతల కాలంలో కట్టిన ఇల్లు ఇప్పుడు మా జ్ఞాపకాలకే పరిమితం)

(కింది ఫోటోలు: తాతలు కట్టించిన పాత పెంకుటిల్లు, ఆ ఇంటి ముందు మా రెండో వదిన గారు విమలాదేవి, మా ఆవిడ నిర్మలాదేవి,  పిల్లలు కట్టించిన కొత్త డాబా ఇల్లు)






(ఇంకా వుంది)

13, నవంబర్ 2024, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (3 ) - భండారు శ్రీనివాసరావు

 నిన్నటి నా పోస్టుపై స్పందిస్తూ మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, ఎనభయ్,  తొంభయ్ ఏళ్ళ చరిత్ర కలిగిన మా ఇంటిలో దాదాపు నూరు పురుళ్లు జరిగాయని, ఆ ఇంటితో, ఆ వూరితో, ఆ గాలితో మరచిపోలేని బంధం వున్నదని రాసారు.  ఒక్క ఇంట్లో ఇన్నిన్ని పురుళ్లు ఏమిటని కొందరు ఫోన్లు చేసి అడిగారు.  

ఆ ఇంటి పందిరి గుంజను ముట్టుకుంటే చాలు పిల్లలు పుడతారు అని మా ఇంటిని గురించి చెప్పుకునే వాళ్ళు.  ఈ ఇంట్లో ఎన్ని పురుళ్లు అయ్యాయో లెక్కలేదు. మా అమ్మా, మా పెద్దక్కయ్య రాధ ఇద్దరూ ఒకేసారి కడుపుతో ఉన్నారు. కొద్ది రోజుల తేడాతో పక్క పక్క గదుల్లో ప్రసవించారు. మా అమ్మ కడుపున మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారు, మా అక్కయ్య కడుపున 108 అంబులెన్స్ పధకం సృష్టికర్త డాక్టర్ ఏపీ  రంగారావు గారు జన్మించారు. అమ్ముమ్మ గారి ఊరిలో తన పుట్టుక గురించి, తన చిన్నతనం రోజుల గురించి ఆయన ఇలా రాసుకున్నారు.

నేను మా తలిదండ్రులకు రెండో సంతానాన్ని. నేను అమ్ముమ్మ గారి ఇంటిలో  పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది  ఈ మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా ప్రసవించి క్షేమంగా వున్నారు.  ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ  ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ  చేతిచలవ అని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మా అమ్ముమ్మ గారు, అదీ మా మా పెద్ద మేనమామ (పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు ఆడపిల్లల తరవాత కానుపు  కావడంతో మా అమ్ముమ్మను అప్పుడు ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోయించారు.

“నేను పుట్టిన తరవాత నాకు కానీ, మా అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. మా ఇద్దరికీ ధనుర్వాతం (టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి వున్నట్టు ఆ రోజుల్లో ఎవరికీ తెలిసివుండదు.  పురుడు  రావడానికి కొన్ని నెలలముందు  మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది.  కేవలం పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న  మందులు ఏమీ లేవు.  నేను పుట్టగానే మంత్రసాని కొడవలితో  బొడ్డు కోసి నన్ను ఒక తట్టలో పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.  

“ప్రసవం అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి పురోహితుడితో కబురు పంపించారు.

“మూడోరోజున బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన  వేడినీటితో స్నానం చేయించారు. మరో తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత, పన్నెండో రోజున   ఆమెకు పురిటి స్నానం చేయించారు. పసుపు, పెసరపిండి, శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి చేయించే స్నానం ఇది.  ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పుణ్యావచనం, పూజ అయిన తరవాత, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పులగం మా అమ్మకు తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు కూడా ప్రతి రోజూ  పెద్దవాళ్లో, పనిమనుషులో కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి  నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా ఆ గుడ్డనే, ఉతికి ఆరవేసి మళ్ళీ  వాడేవారు. పన్నెండో రోజున  నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు. నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే  ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో వున్న తిరుమలగిరి గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో  అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం పాయసం.  ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి ఘన పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి  కేశఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా పెళ్ళిళ్ళు కాలేదు. దూలానికి వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు. మా తరంలో నేనే తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.

బోర్లపడితే బూరెలు వండాలి, పారాడితే పాలకాయలు పంచాలి అని ఏదో  పేరుతొ ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు  చేసేవారు. మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మగారు  కూడా అదే ఇంట్లో మరో గదిలో మగపిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ  పెరిగాం. 

“చిన్నప్పటి ఓ జ్ఞాపకం నా మనసు తెరపై ముద్రపడిపోయింది.

1948 నాటి మాట.  మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని  కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే తెల్లారగట్టనే లేచి కాఫీ తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు.  బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని వచ్చి వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న మిషను ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కువచ్చాడు. నన్ను నిద్రలేపి, వొళ్ళో వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ కట్ట తీసి ఒకటి వెలిగించేవాడు.

“వేయించిన గింజల కమ్మటి వాసన, కాఫీ పొడి మిషన్ చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు తిరిగే బీడీపొగ, ఎదురుగా పొయ్యిలో కణకణమని కట్టెల మంటలు, ఇవన్నీకళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయాయి.

“ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.             

“అలాటిదే మరో జ్ఞాపకం, గుడ్డ ఉయ్యాలలు గురించి. ఈ కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను  

దూలానికి వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు ఊపుతూ నిద్రపుచ్చేవారు. బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని అనుమానం కలిగించేలా వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.

 “మరో చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని, బలవంతంగా నోరు తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని నమ్మకం”

ఇవీ నా మేనల్లుడు ( పేరుకు మేనమామను అయినా  వయసులో ఆయనే పెద్ద)  డాక్టర్ రంగారావు తన ముద్రిత గ్రంథంలో రాసుకున్న జ్ఞాపకాలు.  

అమ్ముమ్మ గారి ఇంట్లో పుట్టడం, అమ్ముమ్మ గారి ఊర్లో పెరగడం అనేవి కొత్తేమీ కాదు.  పెళ్ళయిన తర్వాత మా పెద్ద అక్కయ్యలు ఇద్దరూ చాలా కాలం పుట్టింట్లో వుండి పోవడానికి ఒక బలమైన, ఉత్కృష్టమైన కారణం వుంది. భారత స్వాతంత్ర ఉద్యమం బలంగా సాగుతున్న రోజులు. దేశ దాస్య విమోచనం కోసం  సత్యాగ్రహాలు చేస్తున్న మా బావగార్లు అయితరాజు రాం రావు, కొలిపాక రామచంద్ర రావు గార్లను నాటి బ్రిటిష్ ప్రభుత్వం పద్నాలుగు నెలలు జైల్లో పెట్టింది. అప్పటికే గర్భిణి అయిన మా పెద్దక్క రాధను, రెండో అక్క శారదను మా నాన్న తన దగ్గర ఉంచుకోవడానికి మా ఊరు తీసుకు వచ్చారు. అప్పటి సంగతులు శారదక్కయ్య చెప్పేది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే:

“పట్టుమని పన్నెండేళ్ళు అయినా నిండకుండానే నా పెళ్లి అయింది. మా పెద్దమ్మాయి శాంత పుట్టిన ఏడాదికే మా వారు (కొలిపాక రామచంద్రరావు గారు) జైలుకు వెళ్ళారు. మా పెద్ద బావ అయితరాజు రాం రావు గారు మావారితో పాటే జైలుకు వెళ్ళడంతో, నన్నూ మా పెద్దక్క రాధనూ మా నాన్న మా వూరు కంభంపాడు తీసుకు వెళ్ళారు. మా బావగారు, మా వారు జైల్లో వున్న పద్నాలుగు నెలలు మేమిద్దరం మా పుట్టింట్లోనే ఉండిపోయాము. ఆ రోజుల్లో ఇలా గ్యాసు పొయ్యిలు లేవుకదా! మా అమ్మ శనగకట్టె మంట పెట్టి మా అందరికీ వండి పెట్టేది.

“మానాన్న ఊళ్ళోని దుకాణదారుతో చెప్పాడు  ‘మా పిల్లలు ఏదీ లేక ఇక్కడికి రాలేదు. అల్లుళ్ళు దేశం కోసం జైలుకు వెళ్ళారు. వాళ్లకి అవసరమైనవి ఏవి అడిగినా కాదనకుండా ఇవ్వు”

“మా అమ్మకు పుట్టింటి వాళ్ళు ఒక గేదెను అరణంగా ఇచ్చారట. దాన్ని గురించిన కబుర్లు గమ్మత్తుగా చెప్పేది. తాను కోడలిగా ఏనాడు గడప దాటి వెళ్లకపోయినా, తన పేరు మాత్రం ఆ గేదె పుణ్యమా అని నలుగురికీ తెలిసిందట. అది వూళ్ళో అందరిండ్లలో జొరబడి నానా బీభత్సం చేసేదట. ‘వెంకట్రావమ్మ గారి గేదె ఇలా చేసింది, అలా చేసింది’అని వూళ్ళో జనం చెప్పుకునే వారట.

“ఆ రోజుల్లో ఏ కబుర్లు వెంటనే తెలిసేవి కాదు. మా వాళ్ళు జైలు నుంచి విడుదల అయినట్టు ముందు ఎవరు కబురు తెస్తే వాళ్ళ కాళ్ళకు దణ్ణం పెట్టుకోవాలని నేనూ మా పెద్దక్కా అనుకునేవాళ్ళం.

చివరికి శంభాయి ఆ శుభవార్త మోసుకువచ్చాడు.

“మేమిద్దరం ముందు అనుకున్నట్టే, మా ఇంట్లో పనివాడు అయిన శంభాయికి పాదాభివందనం చేశాము”

పెద్ద చదువులు లేకపోయినా చిన్నప్పటి సంగతులను అంత గుర్తుకు తెచ్చుకున్న మా శారదక్కయ్యకు అన్ని డిగ్రీలు వున్నట్టే లెక్క.

నిన్ననే ఆమె జయంతి.

ఆమె గురించిన జ్ఞాపకమే మరోటి.

డెబ్బయ్ ఏళ్ళ కిందటి మాటే.

స్టెయిన్ లెస్ స్టీల్ కంచాలు, గ్లాసులు అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులు అనుకుంటాను. మా ఇంట్లో అప్పటికి అవి గృహ ప్రవేశం చేయలేదు. పెద్దవాళ్లకు వెండి పళ్ళేలు, చిన్న వాళ్లకు  రాతెండి కంచాలు, ఇత్తడి గ్లాసులు. మా రెండో అక్కయ్య శారదక్కయ్య ఓసారి పండక్కి వస్తూ రెండు స్టీలు భోజనం పళ్ళేలు తెచ్చి నాకు ఒకటీ, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావుకూ ఒకటీ ఇచ్చింది. అప్పట్లో వాటి ఖరీదు రెండూ కలిపి పదిహేను రూపాయలు. అంటే కరణీకం చేస్తున్నప్పుడు మా నాన్నగారి మూడు నెలల జీతం అన్నమాట. ఇహ అప్పుడు చూడాలి మా మోహంలో సంతోషం. ఏనుగు ఎలా వుంటుందో తెలవదు కానీ అదెక్కినంత ఆనందం.

మా అక్కయ్య ఇచ్చిన ఆ కంచం మీద నాకు మోహం ఎంతగా పెరిగిపోయిందంటే అది నాకే సొంతం అనుకునేవాడిని. ఆ తర్వాత ముప్పయ్ ఏళ్ళకు పైగా అది నాతోనే వుంది. 1987లో మాస్కో వెళ్ళేటప్పుడు ఆ కంచంతో నా రుణానుబంధం తెగిపోయింది.

తిరిగొచ్చిన తర్వాత లోకమే మారిపోయింది. డిన్నర్ ప్లేట్లు, డిన్నర్ సెట్లు వచ్చిపడిన తర్వాత, చాలా కొద్ది మంది ఇళ్ళల్లో తప్ప, ఇప్పుడు ఈ విడికంచాల గోల లేదు.

కింది ఫోటోలు:

మా ఊరి ఇంట్లోని పక్క పక్క గదుల్లో రోజుల తేడాతో జన్మించిన డాక్టర్ ఏపీ రంగారావు (108, 104 పధకాల రూపశిల్పి, మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు ( స్టేట్ బ్యాంక్ రిటైర్డ్  చీఫ్ జనరల్ మేనేజర్)

(డాక్టర్ రంగారావు)
(రామచంద్రరావు)




ఇంకా వుంది