22, ఏప్రిల్ 2023, శనివారం

ఓ మంచి పిచ్చి అధికారి – భండారు శ్రీనివాసరావు

 ఇది ఇప్పటి మాట కాదు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి అనుభవాలకు ఆస్కారమే లేదు.

ఏమండీ ఆయన గారు వచ్చారు, మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయిందేమో!”

బయటకు వచ్చి చూస్తే ఆయనే. మొహం వాడిపోయినట్టు వుంది. మనిషి దిగాలుగా వున్నాడు.

పేరుకు పెద్ద అధికారి. పైగా సీనియర్ ఐ.ఏ.ఎస్. మా ఇంటికి వచ్చి నాకోసం ఎదురు చూడడం ఏమిటి చిత్రం కాకపోతే!

నిమిషాల్లో తయారై ఆయన్ని తీసుకుని ఆటోలో వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయన్ని బయట కూర్చోబెట్టి లోపల చెప్పాల్సిన వాళ్లకు ఆయన గురించి చెప్పాను.

నువ్వు ఇంతగా చెప్పాలా శ్రీనివాసరావ్! ఆయన గురించి నాకు బాగా తెలుసు. నిజాయితీపరుడు. తన డ్యూటీ శ్రద్ధగా చేస్తాడు. కానీ..”

ఆ కానీ ఏమిటో నాకూ తెలుసండీ. మీరు ఆయన అడిగిన పోస్టు ఇస్తే, రేపు నేను వెళ్లి ఆయన్ని కలిసినా కూడా,  ఎవరు నువ్వు అన్నట్టే చూస్తారు. ఫోన్ చేసినా రెస్పాన్స్ వుండదు. మళ్ళీ బదిలీ అయిన దాకా నేనెవరన్నది ఆయనకు గుర్తు కూడా వుండదు. ఏ పని చేయాలన్నా రూలు బుక్కే వేదం. మీరే కాదు, ముఖ్యమంత్రి చెప్పినా వినే రకం కాదు. నిజంగా ఇలాంటి అధికారులే కావాలి. అందుకే వెంట బెట్టి తీసుకువచ్చాను. ఇక మీ ఇష్టం” అనేశాను.

నేనూ అదే చెబుతున్నా! ఇక నీ ఇష్టం. ఈసారి చేస్తాను. ఆరు నెలల్లో మళ్ళీ నువ్వే వస్తావు, ఆయన సంగతి చూడమని. రూలు బుక్కు అంటూ ఎక్కడా ఇమిడే రకం కాదు. ఎవరి మాటా వినే రకం కాదు.” అన్నాడా మంత్రిగారు.

మూడు రోజుల్లో ఆయన కోరుకున్న పోస్టు దొరికింది. నాకు తెలుసు దొరుకుతుందని. మరో విషయం కూడా తెలుసు తిరిగి బదిలీ అయ్యేదాకా నేను ఎవరన్నది ఆయనకు గుర్తు కూడా ఉండదని.

అయితే ఇలాంటి నిజాయితీ అధికారులు వుండాలి అని కోరుకునే వాడిని కనుక ఆయన నన్ను పట్టించుకున్నాడా లేదా అనే విషయాన్ని పట్టించుకునే వాడిని కాదు.

పొతే, ఇంత నిబద్ధత కలిగిన అధికారికి  పోస్టింగుల మీద  ఈ వ్యామోహం ఏమిటి అనే అనుమానం తొలుస్తూ వుండేది.

ఒకసారి బదిలీ అయినప్పుడు ఆయనే చెప్పారు ఇలా.

సాయం చేయగలిగిన అదీ అవసరంలో వున్న పేదవారికి సహాయపడగలిగిన పోస్టులో వుంటే చేయగలిగింది చేస్తాను. కలక్టరుగా వున్నప్పుడు ఆ స్వేచ్ఛ వుండేది కొంతవరకు. కానీ సచివాలయానికి వచ్చిన తర్వాత అలా కుదరదు. అవసరంలో ఉన్నవారికి  సాయం చేయగలిగిన మంచి పోస్టుల్లో ఎక్కువకాలం నన్ను వుంచుతారనే నమ్మకం నాకు లేదు.  ఎవరికీ ఉపయోగపడలేని పోస్టులో వేస్తె,  గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని జీతం తీసుకుకోవడం తప్పిస్తే ఏం చేయగలను చెప్పు”

అది సరే! మీకు బదిలీల్లో  సాయం చేసిన వారి మాట చెవిన పెడితే, మీ గురించి అలా మాట్లాడరు కదా!”

సరి సరి భలే మాట చెప్పావు. వాళ్ళ మాటలు వినడం మొదలు పెడితే నాచేత వాళ్ళు చేయించేవి పనులు కాదు, అకృత్యాలు”

విజయనగర్ కాలనీలో నివాసం  వుండే ఈ అధికారి భార్య రెండు సిటీ బస్సులు మారి, నారాయణ గూడాలో దీపక్ మహల్ పక్క సందులో వుండే  నర్సింగ్ హోం కి వచ్చేవారు. ఆఫీసు కారుని భార్యాపిల్లలను కూడా వాడనిచ్చే మనిషి కాదు.

మేనకోడలు వరసయ్యే ఓ లేడీ డాక్టర్ ది ఆ హాస్పిటల్. పైగా మా ఆవిడకి వాళ్ళ కుటుంబంతో చిన్నప్పటి స్నేహం. ఒకసారి ఆ అయ్యేఎస్ భార్యగారిని వెంటబెట్టుకుని మా ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు నేను ఇంట్లోనే వున్నాను. ఆ అధికారి భార్య ఇలా అన్నారు. ‘మీ వారు మా వారి పనుల మీద ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు. మా ఆయన బయటే నిలబెట్టి మాట్లాడే వారు. మీరు (అంటే మా ఆవిడ) మద్రాసులో చదువుకున్నారు. మీకు తెలిసే వుంటుంది, మాకు (తమిళులకు) ఎన్ని పట్టింపులో. ఇవ్వాళ మీ ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతుంటే నాకు సిగ్గనిపిస్తోంది”   

(ఆ అధికారి ఎవరన్నది ముఖ్యం అనుకోను. ఆయనిప్పుడు జీవించి కూడా లేరు. సర్వీసులో ఉన్న రోజుల్లో తోటి ఉన్నతాధికారులు ఆయనకి  పెట్టిన పేరు పిచ్చోడు)

19, ఏప్రిల్ 2023, బుధవారం

ఎవరేమనుకున్నా సరే! - భండారు శ్రీనివాసరావు

 అవకాశాలు రాని సమర్దులకన్నా, అవకాశాలు వచ్చిన అసమర్ధులకు మంచి పేరు వచ్చే రోజులివి. ఈ రెండో రకానికి చెందిన నేను ఆ రకంగా మా సీనియర్ల కంటే అదృష్టవంతుడిని. రిటైర్ అయిన తరువాత కూడా యేవో మనసులోని మాటలు వ్యాసాల రూపంలో రాసుకోగల బంగారు అవకాశం సాంఘిక మాధ్యమాల రూపంలో నాకు లభించింది.

వెనుకటి రోజుల్లో పత్రికలకు వ్యాసాలూ అవీ రాయడం గగనంగా వుండేది. ముందు రాయాలి. రాసింది మళ్ళీ సాఫు చేసుకుని తిరగ రాయాలి. రాసింది ‘తిరుగు టపాకు తగినన్ని స్టాంపులు జతచేసి’ మరీ పోస్టులో పంపాలి. అది చేరిందో లేదో తెలవదు. చేరినా చేరిందనే కబురు తెలవదు. ఆశ ఒదులుకున్న తరువాత ఎక్కడి నుంచో ఓ మిత్రుడు పోస్ట్ కార్డు రాసి పడేస్తాడు, ‘పలానా పత్రికలో మీ వ్యాసం చదివానని’. ఆ రచన పడ్డ పత్రిక వెతికి పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివచ్చేది.

ఇప్పుడలా కాదు. అంతా ఇన్ స్థంట్ కాఫీ మాదిరి. ఇలా రాసి అలా పోస్ట్ చేయడం తరువాయి బాగుందనో, బాగాలేదనో కామెంట్లు కూడా తయారు. కొందరయితే శ్రద్ధగా చదివి తప్పొప్పులను ఎత్తి చూపెడతారు. సరిదిద్దుకునే సదవకాశం కూడా వుంటుంది. అందుకే నేను పత్రికలకోసం రాసినప్పుడు, వారికి ఇష్టం వున్నా లేకపోయినా ఒక రోజు ముందే వాటిని ఫేస్ బుక్, బ్లాగు వంటి మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాను. యెంత జాగ్రత్తగా రాసినా కొన్ని స్ఖాలిత్యాలు దొర్లడం కద్దు. వాటిని ఎంచక్కా దిద్దుకోవచ్చు. అదీ నా స్వార్ధం.

కాకపోతే ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. పత్రికల్లో రాసినప్పుడు ఎవరికయినా నచ్చకపోయినా ఆ విషయం మనకు తెలిసేనాటికి చాలా రోజులు పడుతుంది. ఇక్కడ అలా కాదు, వెంటనే, మొట్టి కాయలు ఎలాంటి మొహమాటం లేకుండా వేసేస్తారు.

ఇన్నేళ్ళ వయస్సులో అవన్నీ పట్టించుకుంటే కష్టం. అందుకే ఎవరి ఇష్టం కోసమో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాసుకుంటూ పోతుంటాను.

పాత జోకు ఒకటి వుంది కదా!

దుకాణం బయట రాసి వుంటుంది.

మీరు అరువు అడుగుతారు. నేను ఇస్తాను. మీరు తిరిగి డబ్బు కట్టరు. చివరికి నేను బాధ పడతాను.

మీరు అడుగుతారు. నేను ఇవ్వను. ఇవ్వలేదని మీరు బాధపడతారు.

నేను బాధ పడడం కంటే మీరు బాధ పడడమే మేలు కదా!”

అల్లాగే ఇక్కడ కూడా. మీకు నచ్చాలని నాకు నచ్చనివి నేను రాయను.

మీరు ఏమనుకున్నా సరే!



NOTE: COURTESY IMAGE OWNER

18, ఏప్రిల్ 2023, మంగళవారం

ఆకిరి రామకృష్ణారావు గారు ఇక లేరు

 ఈ సంగతి చూచాయగా గంట క్రితమే తెలిసినా ఆ దుర్వార్తను ధ్రువపరచుకోవడానికి ఇంత సమయం పట్టింది. హైదరాబాదు ఆలిండియా రేడియో, దూరదర్సన్ వార్తా విభాగాల అధిపతిగా సుదీర్ఘ కాలం పనిచేసిన పిదప, పదవీవిరమణ అనంతరం వైజాగ్ లో సెటిల్ అయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థులుగా ఉంటూ, ఈ ఉదయం  తుది శ్వాస విడిచారు. ఆలిండియా రేడియోలో ఆయనతో కలిసి అనేక సంవత్సరాల ప్రయాణం నాది. మంచి స్నేహితుడు. అవసరానికి ఆదుకోవడంలో ముందువెనకలు చూసే రకం కాదు.

1987 లో నాకు రేడియో మాస్కోలో పనిచేసేందుకు మాస్కో వెళ్ళే అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు రావాల్సి వుంది. ఈ నేపధ్యంలో, రామాయణంలో పిడకల వేటలా, హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ నడుపుతున్నందుకు  నన్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం, ఫలితంగా శాసన సభ ఒక రోజు వాయిదా పడడం, జర్నలిస్టుల సామూహిక ఆందోళనకు  దిగివచ్చిన ప్రభుత్వం  సంబంధిత పోలీసు అధికారిని బదిలీ చేయడం, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటనపై  న్యాయ విచారణకు ఆదేశించడం, మాజీ హై కోర్టు న్యాయమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు జారీకావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలతో కలత చెందిన నాకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా మాస్కో వెళ్ళిపోవాలని మనసులో పడింది. ఢిల్లీ వెళ్లి ఆర్డర్ పట్టుకొద్దామని ఆకిరి రామకృష్ణారావు చెప్పడంతో ఇద్దరం కలిసి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి ఢిల్లీ చేరి ఏపీ భవన్ లో దిగిపోయాము. బ్రేక్ ఫాస్ట్ కు ముందే ఆకిరి అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతున్న మంత్రి పి. శివశంకర్ గారికి ఫోన్ చేస్తే, ఆయన మమ్మల్ని వారి ఇంటికి రమ్మన్నారు. ఆటో పట్టుకుని పొతే, ఇంటి బయట పటిష్టమైన బందోబస్తు. పలానా అని చెప్పగానే తలుపులు తెరుచుకున్నాయి. వరండా పక్క గదిలో శివశంకర్ ఒక్కరే కూచుని  పనిచేసుకుంటున్నారు. ఆకిరిని చూడగానే ఆయన సాదరంగా లేచి ఆహ్వానించారు. నన్ను పరిచయం చేయబోతే ఆయన నవ్వి నాకు తెలియదా, రేడియో శ్రీనివాస రావు అన్నారు. ఆకిరి  మీనమేషాలు లెక్కబెట్టకుండా  సూటిగా వచ్చిన విషయం చెప్పేశారు. మా డైరెక్టర్ జనరల్ కు ఫోన్ కలపమని ముందు పియ్యేకి చెప్పి మళ్ళీ వద్దులే అని  RAX  ఫోన్లో అంటే పియ్యేలతో సంబంధం లేకుండా నేరుగా మాట్లాడడానికి వీలుండేది. ప్రధాని, కొందరు ముఖ్యమైన మంత్రులకు, ఉన్నతాధికారులకు  మాత్రమే ఈ సదుపాయం వుండేది)  మాట్లాడి నా వివరాలు చెప్పారు.

మేము ధన్యవాదాలు చెప్పి మా డీజీ ఆఫీసుకు వెళ్ళే సరికి అంతా  హడావిడిగా కనిపించింది. మా డైరెక్టర్ (పి) గుంటూరు రఘురాం గారు మమ్మల్ని చూడగానే, అమ్మయ్య వచ్చారా, హైదరాబాదు వాళ్ళు పంపిన మీ దరకాస్తు కోసం వెతుకుతున్నాము, ముందు ఈ ఫారం పూర్తి చేసి సంతకం పెట్టి ఇవ్వండి, అరగంటలో ఆర్డరు ఇస్తామని డీజీ, మంత్రి గారికి మాట ఇచ్చారు అని తొందర పెట్టారు.

అంతే! ఆయన అన్నట్టు అరగంటలోపలే నా ఆర్డరు కాగితం నా చేతిలో పెట్టారు. అలా వుంటుంది, ఆకిరి అడగకుండా చేసే సహాయం.

ఆకిరికి దైవభక్తి మెండు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే అంతా ఇంతా కాదు. స్వామికి ప్రీతికరమైన మంగళవారంనాడే ఆకిరి గారు కన్ను మూయడం విధి విచిత్రం.

ఆకిరి రామకృష్ణారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అంజనీపుత్రుడినే ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.  


(కీర్తిశేషులు ఆకిరి)


(18-04-2023)

16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఆయారాం గయారాం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 16-04-2023, SUNDAY, today)

 

జరుగుతున్న కధలు చూస్తుంటే జరిగిన కధలు గుర్తొస్తుంటాయి ఒక్కోసారి.

‘జనత పార్టీ’ ప్రయోగం విఫలం అయిన తర్వాత, 1980 లో ఇందిరాగాంధీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే, ఆనాటి హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ రాత్రికి రాత్రే పార్టీ మార్చి, ‘సహేంద్ర తక్షకాయస్వాహా’ మాదిరిగా తన కేబినేట్ మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు. ఆ  సందర్భంలో, నాటి మరాఠా రాజకీయ నాయకుడు ఎస్.బీ. చవాన్, ఈ తరహా ‘రాజకీయ కప్పదాట్ల’కు కొత్తగా చేసిన నామకరణమే ఈ ‘ఆయారాం గయారాం’. అప్పటినుంచి ఈ రాజకీయ విషసంస్కృతి మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొత్త రెమ్మలు తొడుగుతూనే వస్తోంది. 

ఏ రంగంలోనూ కానరాని ఈ అభివృద్ధి రేటు ఈ రంగంలో చూసి దేశంలోని  రాజకీయ పార్టీలే విస్తుపోతున్నాయి. కోడి మనదే, కోడిని ఉంచిన గంప మనదే అనే ధైర్యం సన్నగిల్లి పోతోంది. గంప గంప లాగానే వుంది. కోళ్ళు మాత్రం మాయం అవుతున్నాయి. అందుకే కాబోలు పార్టీ టిక్కెట్టు మీద గెలిచిన వాళ్ళు తమ కట్టు దాటిపోకుండా అనేక ఎత్తులు వేస్తున్నాయి. ‘ఆయారాం గయారాం’ బెడద తప్పించుకోవడానికి మేఘాలయ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, ‘యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ’ చాలా ఏళ్ళ కిందటే  ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. అదే ‘నయా రాం’. దీనికింద పార్టీ టిక్కెట్టు ఇచ్చేముందే అభ్యర్ధులతో, ఇండియన్ కాంట్రాక్ట్ ఆక్ట్ కింద బాండు మీద సంతకం చేయించుకుంటారు, అయిదేళ్ళ వరకు పార్టీ ఒదిలి వెళ్ళమని. కానీ రాజకీయాలను ‘స్కాచి’ వడబొసిన ధిగ్గనాధీరులు, యేరు దాటగానే బోడి మల్లయ్య’ అనడం నేర్చిన వాళ్ళు, ఈ బాండ్లు, సంతకాలు లక్ష్యపెడతారనుకోవడం అమాయకత్వం. 1972 లో అస్సాం నుంచి విడిపడి ఏర్పడ్డ మేఘాలయ రాష్ట్రంలో గత అయిదు దశాబ్దాల కాలంలో పాతిక ముప్పయికి పైగా ప్రభుత్వాలు ‘ఆయారాం గయారాం’ సంస్కృతి కారణంగా మారిపోయాయి. మరికొన్నిసార్లు రాష్ట్రపతి పాలన అదనం. 

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి ఈ కబుర్లు. 

ఈ పార్టీ ఆ పార్టీ అనికాదు, అందరిదీ ఈ విషయంలో ఒకే మాట, ఒకే బాట.  అనుకూలంగా వున్నప్పుడు ఒక మాటా, ప్రతికూలంగా వున్నప్పుడు మరో మాటా చెబుతూ వచ్చే ఇటువంటి రెండు నాలుకల ధోరణి కారణంగానే రాజకీయ నాయకుల మాటల పట్ల  ప్రజలకు విశ్వాసం కొరవడుతోంది.  


పార్టీ ఫిరాయింపులకు మొదటి బీజం పడింది, స్వతంత్ర భారతంలో 1967 లో జరిగిన నాలుగో సార్వత్రిక ఎన్నికల  అనంతరం.  ఆ విత్తనం   యెంత బలంగా పడిందంటే,  ఈ ఫిరాయింపుల ఫలితంగా 1967 - 1973  మధ్య ఆరేళ్ళ కాలంలో పదహారు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి. ప్రజలచేత ఎన్నికయిన  మొత్తం రెండువేల ఏడువందలమంది ప్రజా ప్రతినిధులు,  తాము ఎన్నుకున్న వోటర్ల ప్రమేయం లేకుండా  వేరే పార్టీల్లో చేరిపోయారు. 1967  నుంచి మూడేళ్ళలో ప్రతి అయిదు మంది ఎమ్మెల్యేలలో ఒకరు పార్టీ మారారంటే, ఫిరాయింపులు యెంత తీవ్రంగా జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఏదో ప్రతిఫలం లేకుండా ఈ గోడ దూకడాలు జరగవు అనే నమ్మకానికి ఊతం ఇవ్వడానికా అన్నట్టు  అలా దూకిన వాళ్ళలో పదిహేనుమంది ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. 212 మంది మంత్రులు కాగలిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న బాపతు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వికృత పోకడలకు మొదటి అడ్డుకట్ట వేయడానికి మన రాజకీయ నాయకులకు దాదాపు పదిహేడేళ్ళు పట్టింది.

1984  డిసెంబర్  29 వ తేదీన కర్ణాటకలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం   28 స్థానాలకుగాను నాటి పాలకపక్షం అయిన జనతా పార్టీని  మట్టి కరిపించి, ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుని తన సత్తా ప్రదర్శించింది. ఆనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి  రామకృష్ణ హెగ్డే  ఓటమికి నైతిక బాధ్యత వహించి గవర్నర్ కు మంత్రివర్గం తరపున రాజీనామా పత్రం సమర్పించారు. మామూలుగా అయితే అటువంటి పరిస్తితుల్లో గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు.  ఒకటి  జనతా పార్టీనుంచి  ఫిరాయింపులు ప్రోత్సహించి  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం. లేదా, రాష్ట్రపతి పాలన  విధించడం.  అంతకుముందు  శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయ ఎత్తుగడలకు అలవాటు పడిన వారందరూ యువనేత రాజీవ్ గాంధీ కూడా తల్లి బాటలోనే పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కర్ణాటకలో అసెంబ్లీ రద్దు చేయడానికి వీలుగా గవర్నర్ కు స్వేచ్ఛ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు రాజీవ్ యెంత వ్యతిరేకం అన్నది ఈ ఒక్క ఉదంతంతో తేటతెల్లమయింది. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన రెండోవారంలోనే పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలని, అందుకు రాజ్యాంగాన్ని సవరించి ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. ఇక ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్లమెంటులో తమ పార్టీకి వున్న తిరుగులేని  ఆధిక్యతను ఆసరాగా చేసుకుని   52 వ రాజ్యంగ  సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకువచ్చి ఈ దశగా తొలి అడుగు వేసారు. కానీ ఏం జరిగింది? ఏం జరుగుతోంది?  ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చిందో, అదే పార్టీ కాలక్రమంలో ఫిరాయింపులకు పుట్టిల్లుగా మారింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో పార్టీ మారిన వారి సంఖ్యను లెక్కవేయాలంటే అది చేతివేళ్ళతో సాధ్యం అయ్యే పనికాదు, కాలిక్యులేటర్లు కావాలి. ఈ లెక్కలు చూస్తే ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరిందా లేక ఫిరాయింపులకు చట్టబద్ధమైన మార్గాన్ని ఏర్పరిచిందా అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ విషయంలో ఏ ఒక్క పార్టీకి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి పార్టీ తన స్వప్రయోజనాలకోసం ఈ చట్టానికి తూట్లు పొడవడమే కాకుండా చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తూ రావడం మరో విషాదం.

పార్టీ ఫిరాయింపులను దొంగతనంతో సమానంగా పరిగణించాలని ఫిరాయింపుల తాకిడితో తల్లడిల్లే పార్టీలు కోరుతుంటాయి.

నిజమే. ఒక పార్టీ టిక్కెట్టుపై ఎన్నికయిన వారిని మరో పార్టీలోకి తీసుకోవడం అంటే ఒక రకంగా అది దొంగతనమే. మరొకరి సొత్తును అపహరించడమే. కానీ 'నేను చేస్తే ఒప్పు నువ్వు చేస్తే తప్పు' అనే ద్వంద్వ వైఖరే ఈ వాదానికి బలంలేకుండా నిర్వీర్యం చేస్తోంది.  

గతంలో ఎన్నికలకు ముందూ, లేదా ఎన్నికలు ముగిసిన తరువాత కొద్దికాలం పాటు ఈ ఫిరాయింపులు నడిచేవి. మారుతున్న కాలానికి, పరిస్తితులకు  అనుగుణంగా ఇప్పుడవి నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఎవ్వరు కారణం అంటే అన్ని పార్టీలకూ ఇందులో అంతో ఇంతో భాగం వుంది. ఈ సంస్కృతి ప్రబలడానికి అందరూ ఎంతో కొంత పాత్ర పోషించబట్టే గట్టిగా తమ వైఖరిని సమర్ధించుకోవడానికి అదే అడ్డం పడుతోంది. ఫిరాయింపులను పోత్సహించేవారు, ఫిరాయింపులవల్ల నష్టపోయేవారిని ఉద్దేశించి 'నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష' అని ఎద్దేవా చేయడానికి వీలు కల్పిస్తోంది. 


జూలియస్ సీజర్ నాటకంలో బ్రూటస్ అనే పాత్ర వుంటుంది. సీజర్ కు అతడు ఆరోప్రాణం. సీజర్ అంటే ప్రాణం ఇచ్చే తత్వం బ్రూటస్ ది. చివరికి ఏమైంది. సీజర్ ని అంతమొందించే కుట్రలో అతడూ పాలుపంచుకుంటాడు. ప్రత్యర్ధులు కత్తులు దూసి తనను పొడుస్తుంటే చలించని సీజర్, బ్రూటస్ తనను చంపడానికి కత్తి ఎత్తినప్పుడు మాత్రం అతడి మొహం వివర్ణమౌతుంది. ‘యూ టూ బ్రూటస్’ (బ్రూటస్ !నువ్వు కూడానా) అంటూ ఆశ్చర్యంగా అతడివైపు చూస్తూ ప్రాణాలు వదులుతాడు. 

రాజకీయాల్లో ఇవన్నీ సహజమని సరిపుచ్చుకోక తప్పని పరిస్తితి. ఎందుకంటే ఈనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న అనేకమందికి ఇలాంటి అనుభవాలతో కూడిన గతమే వుంది. 


ఉపశృతి:

తమ పార్టీ వాళ్ళు సొంత పార్టీ ఒదిలి బయటకు పరిగెడుతున్నా, పార్టీ అధినాయకులు మాత్రం మొక్కుబడిగా చేసే వ్యాఖ్య ఒకటుంది.’ ఇలా ఎందరు పోయినా మా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు’

నిజమే వారికోసమే సినారె పాట రాసివుంటారు. 

“ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి, నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి”



11, ఏప్రిల్ 2023, మంగళవారం

సినిమా రివ్యూ కాదు – భండారు శ్రీనివాసరావు

 

ఈ మధ్య ఒక లాయరు మిత్రుడు నాతొ మాట్లాడుతూ విశాఖ కేసు విషయం ప్రస్తావించాడు. విశాఖ అంటే విశాఖపట్నం కాదు. ఒక స్వచ్చంద వేదిక. నేపధ్యం రాజస్తాన్. కధాకాలం 1992. అంటే మూడు దశాబ్దాల పైమాట. ఒక బాల్య వివాహం ఆపడానికి ప్రయత్నించిన భన్వరీదేవి అనే ఒక రాజస్థానీ మహిళను స్థానిక అగ్ర కులస్తులు పగబట్టి ఆమెను మూకుమ్మడి మానభంగం చేస్తారు. షరా మామూలుగానే ఆ కేసు కింది కోర్టుల్లో తిరస్కరణకు గురవుతుంది. విశాఖ అనే స్వచ్చంద వేదిక నేతృత్వంలో అనేక మహిళా సంఘాలు ఏకమై న్యాయ పోరాటం సాగిస్తాయి. చివరకు 1997 ఆగస్టు 13 వ తేదీన దేశపు అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు ప్రకటిస్తుంది. పని ప్రదేశాల్లో ఆడవారిపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శిక సూత్రాలను ఆ తీర్పులో వెలువరించింది. చారిత్రాత్మక తీర్పు అనడానికి ఒక కారణం వుంది. విషయంలోని తీవ్రతను గుర్తించిన న్యాయమూర్తులు తీర్పు చివర ఒక ఆదేశాన్ని జారీ చేశారు. సాధారణంగా కోర్టులు తీర్పులు ఇస్తూ అందుకు తగిన శాసనాలను రూపొందించాలని ప్రభుత్వాలకు సూచిస్తాయి. ఈ కేసులో సుప్రీం విభిన్నమైన ఆదేశాన్ని జారీచేసింది. తగిన చట్టం రూపొందించేవరకు సుప్రీం జారీ చేసిన ఈ మార్గదర్శిక సూత్రాలకు చట్ట బద్ధత ఉంటుందని, చట్టాన్ని అమలుచేసినట్టుగానే వాటిని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేయాలని ఉత్తర్వు ఇస్తుంది. ఇది ఒక పెద్ద విశేషం.

అయితే, కేంద్రం మాత్రం తనకు సరిపడా సమయం తీసుకుని సుప్రీం సూచనలకు అనుగుణమైన చట్టాన్ని ఆ తరువాత నాలుగేళ్ళకు (2013) రూపొందించి అమల్లోకి తెచ్చింది.

చాలా పకడ్బందీగా తయారుచేసిన ఈ చట్టం కనుక తుచ తప్పకుండా అమలుకు నోచుకుని వుంటే దేశంలో అసహాయులైన మహిళల పరిస్తితి మరింత మెరుగుపడి వుండేదేమో!

(11-04-2023)

10, ఏప్రిల్ 2023, సోమవారం

రేడియో వార్తలు విన్న రాష్ట్రపతి - భండారు శ్రీనివాసరావు


పురుషులలో ఉత్తమ పురుషుల మాదిరిగా జర్నలిష్టులలో హిందూ విలేకరులను అలా పరిగణించే రోజులు నాకు తెలుసు.
అలాంటి ఒకానొక రోజుల్లో హిందూ కరస్పాండెంట్ (ముందు ముందు విలేకరి అంటాను, టైప్ చేయడం ఇబ్బందిగా వుంది) గా పనిచేస్తున్న దాసు కేశవరావు అనే చిన్నగా కనబడే ఈ పెద్దమనిషికి, కొన్ని రోజులపాటు నా చిలిపితనాన్ని భరించాల్సిన పరిస్తితి ఏర్పడింది. దీనికి కారణం ఆ నాటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి.

సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారిగా అనంతపురం వచ్చారు. ఆ పట్టణానికి దగ్గరలోనే వారి స్వగ్రామం ఇల్లూరు వుంది. అనంతపురంలో ఉన్న వారి సొంత ఇల్లు తాత్కాలికంగా రాష్ట్రపతి నిలయం అయింది. అంతటి పెద్దాయన మొదటిసారి సొంతూరు వస్తుంటే పత్రికలు ఊరుకుంటాయా! హైదరాబాదు నుంచి విలేకరులను పంపించాయి. ఇక ఆకాశవాణి సంగతి చెప్పేదేముంది. నేనూ వాలిపోయాను.

అనంతపురంలో మెయిన్ రోడ్డుపైనే ఉన్న హోటల్లో మా బస. చెప్పానుకదా నాకు చిలిపితనం ఓ పాలెక్కువ అని. దాసు కేశవరావు గంగిగోవు లాంటి జర్నలిష్టు. మేమిద్దరం చాలా ఏళ్ళుగా స్నేహితులం. అంచేత నా గోల ఆయన మౌనంగా భరించేవాడు.
ఇద్దరమూ బయటకు పోయేవాళ్ళం. కాసేపు అటూ ఇటూ తిరిగేవాళ్ళం. మధ్యలో ఓ పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి నేను హోటల్ రిసెప్షన్ కు ఫోను చేసేవాడిని.
‘ రాష్ట్రపతి క్యాంప్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాము. మీ హోటల్లో, కేశవరావు, శ్రీనివాసరావు, హైదరాబాదు జర్నలిష్టులు వుంటే ఒకసారి కనెక్ట్ చేస్తారా! అర్జంటుగా మాట్లాడాలి’ అనే వాడిని.
హోటల్లో అడుగుపెడుతూ ఉండగానే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ‘మీకోసం ప్రెసిడెంటు గారి ఆఫీసు వాళ్ళు ఫోన్ చేసారు’ అని చెప్పేవాళ్ళు ఆదుర్దాగా.
‘వాళ్ళు అలానే చేస్తారు. అవసరం వుంటే మళ్ళీ వాళ్ళే చేస్తారు, ఏం పర్వాలేదు’ అనేవాడిని నిర్లక్యంగా.
ఈ ట్రిక్కు బాగా పనిచేసింది. ఆ రోజు నుంచీ హోటల్లో మాకు మర్యాదలు పెరిగాయి. ఉదయం సాయంత్రం కనుక్కునేవారు. రూమ్ సర్వీసు బాగు పడింది.
‘ఇది అవసరమా’ అనేది కేశవరావుగారిలోని గంగిగోవు. ‘అవసరమే’ అనేది నాలోని పోట్లగిత్త.

ఒక రోజు ఇల్లూరు ప్రయాణం కట్టాము. ఎందుకంటే సంజీవరెడ్డి గారు అక్కడికి బయలుదేరారు.
ఇల్లూరులో నీలం వారిల్లు పెళ్లివారిల్లులా హడావిడిగా వుంది. తన ఈడువారిని ఆయన ఆప్యాయంగా ‘ఏమప్పా’ అంటూ పేరుపెట్టి పలకరిస్తున్నారు. చిన్నవారితో ఎప్పటి సంగతులో ముచ్చటిస్తున్నారు. వూరు ఊరంతా అక్కడే వుంది.
సాయంత్రం ఆరవుతోంది. నేను వారింటి నుంచే హైదరాబాదు ఫోన్ చేసి వార్త చెప్పాను. రాష్ట్రపతి మకాం చేస్తున్న సందర్భం కాబట్టి వెంటనే లైను కలిపారు. అది మొదటి వార్తగా వస్తుందని నాకు తెలుసు. వెంటనే సంజీవరెడ్డి గారిని ( రాష్ట్రపతి కార్యదర్శి పేరు కూడా సంజీవరెడ్డే. పీ.ఎల్. సంజీవ రెడ్డి గారు. ఐ.ఏ.ఎస్. అధికారి)ని ఒక రేడియో తెప్పించమన్నాను. ఆయన నావైపు అదోలా చూస్తూ రేడియో తెప్పించారు. దాన్ని అక్కడ ఉన్న మైక్ సెట్టుకు కలిపారు.
వార్తలు మొదలయ్యాయి. అంతా నిశ్శబ్దం. రాష్ట్రపతి స్వగ్రామం వచ్చిన వార్తా విశేషాలతో బులెటిన్ మొదలయింది.
ఈ మారుమూల గ్రామంలో వార్త ,అంత త్వరగా రేడియోలో ఎలా వచ్చిందని జనం ఆశ్చర్యంగా గుసగుసలాడుకున్నారు.
నేను ఇప్పటికీ గర్వపడే మరో విషయం ఏమిటంటే, ఆ నాటి శ్రోతల్లో నీలం సంజీవ రెడ్డి గారు కూడా ఒకరు.
ముందు కొంచెం రుసరుసలాడినట్టు కనిపించిన పీ.ఎల్. సంజీవరెడ్డి గారు కూడా ఖుషీ.
భుజం తట్టారు, మెచ్చుకోలుగా

8, ఏప్రిల్ 2023, శనివారం

తెలుసుకోవాలని వుందా!

 ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు అప్పుడు ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నండూరి రామమోహన రావు గారు, ఆయన దగ్గరే సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నన్ను అడిగిన ప్రశ్న ఇది.

జర్నలిస్టుగా రాణించాలి అంటే తెలుసుకోవాలనే జిజ్ఞాస వుండాలన్నది ఆయన ప్రశ్నలోని అంతరార్ధం. రాణించడం సంగతి దేవుడికి ఎరుక. కానీ ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం నండూరి వారి ఉపదేశం కారణంగా అలవడింది. నా ఫేస్ బుక్ రాతల్లో సింహభాగం అలా ఇతరులు చెప్పగా విని రాసినవే.

ఫేస్ బుక్ మిత్రుడు Ramnath Kampamalla వృత్తి రీత్యా జర్నలిస్టు కాకపోయినా ప్రవృత్తి రీత్యా పాత్రికేయుడే. ఆయనలో నాకు నచ్చింది ఏమిటంటే  తెలుసుకోవాలనే ఆసక్తి. ఏది రాసినా క్షుణ్ణంగా తెలుసుకుని రాయాలనేది రాంనాద్ గారి పట్టుదల. అదే ఆయన్ని కొన్ని పర్యాయాలు మా ఇంటికి రప్పించింది. ఈ రాకపోకలు ఇప్పటివి కావు, మా ఆవిడ వున్న రోజుల నుంచి సాగుతున్నవే. ఆయన వస్తే నాకు ఒక సంతోషం. ఆడపిల్లలు లేరనే కొరత మా దంపతులకు వుంది.వుండేది అనాలేమో! ఆయన ఎప్పుడు వచ్చినా పిల్లల్ని వెంటబెట్టుకు తీసుకువస్తారు. ఇద్దరూ  చక్కని చుక్కలు. రీతూ ప్రియ, రియా దేవకి. ఎలిమెంటరీ స్కూలు అనుకుంటా. వచ్చినప్పుడల్లా మీ పేర్లు ఏమిటమ్మా అని అడుగుతా. ప్రతిసారీ ఈ ప్రశ్న ఏమిటి అంటూ నా మతిమరపును ప్రశ్నించకుండా పాపం  బుద్దిగా మైనేమ్ ఈజ్ రీతూ ప్రియ, మై నేమ్ ఈజ్ రియా దేవకి అని ప్రతిసారీ జవాబు చెబుతారు. వచ్చినప్పుడల్లా మా మనుమరాలి మోచేతి పొడుగంత క్యాడ్ బరీస్ చాక్లెట్లు తెస్తారు. వాళ్ళ నాన్నగారు నాతొ మాట్లాడుతూ వుంటే వాళ్ళిద్దరూ మొదటి ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ స్కూల్ మేట్ ఇంటికి వెళ్లివస్తారు. ఈలోగా దేశ కాలమాన పరిస్థితుల గురించి మా చర్చలు సాగుతాయి. ఆయనకు తెలుసుకోవాలనే కోరికా, ఎవరైనా ఏదైనా అడిగితే తెలిసింది చెప్పాలనే నా ఆతృత మా  సంభాషణకు ఉపకరిస్తాయి. ఆయన పుణ్యమా అని పాత సంగతులు నెమరు వేసుకోవడం వల్ల తగ్గిపోతున్న నాజ్ఞాపక శక్తి కాసింత మెరుగుపడే అవకాశం వుండడం వల్ల, రామనాద్ రాక నాకే బాగా ఉపయోగం అని చెప్పాలి.

అయితే ఆయన్ని చూసినప్పుడల్లా నాలో కలిగే అసూయ ఇంతా అంతా కాదు. ఇంత మంచి తండ్రిని నేను ఎందుకు కాలేక పోయాననే  బాధ నన్ను వేధిస్తూ వుంటుంది. నా పిల్లలు చిన్నప్పుడు ఏమి అడిగినా నా నుంచి సానుకూల స్పందన వుండేది కాదు. ఎంతసేపూ నా ఫ్రెండ్సూ, వాళ్ళతో కాలక్షేపాలు. ఒక సినిమాకు తీసుకు వెళ్ళడం, ఒక హోటల్ కు తీసుకువెళ్లి వాళ్ళు కోరిన టిఫిన్స్ పెట్టించడం నాకయితే గుర్తు లేదు. రాంనాద్ అలా కాదు. సెలవు దొరకడం తడవు పిల్లల్ని వెంటబెట్టుకుని శిల్పారామాలు, సినిమాలు, హోటళ్ళు ఒకటేమిటి వాళ్ళు తితగని ప్రదేశాలు లేవు. అవన్నీ చెబుతుంటే మా పిల్లలు పెరిగిన తీరు గుర్తుకువచ్చి  మనసులో ఎక్కడో  ముల్లు గుచ్చుకున్న ఫీలింగు.

నేనో బాడ్ ఫాదర్. సందేహం లేదు.  అందుకే రాంనాద్ ని చూస్తే అంత అసూయ.

కింది ఫోటో: ఈ సాయంత్రం వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు తీసిన ఫోటో. Courtesy: Ramnath Kampamalla



(08-04-2023)