(ఈరోజు ఆదివారం 06-02-2022 ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితం)
6, ఫిబ్రవరి 2022, ఆదివారం
నాయకుల 'అదృశ్యాలు', మీడియా ఊహాగానాలు - భండారు శ్రీనివాసరావు
5, ఫిబ్రవరి 2022, శనివారం
కాకినాడ సంబంధం – భండారు శ్రీనివాస రావు
అరవై ఏళ్ళ కిందటి మాట.
అప్పుడు మా వూళ్ళో దోస్తులం అందరం పదో తరగతి
చదువుతున్నాం. పాసు కాగానే మాలో కొందరు టీచర్స్ ట్రైనింగ్ కోర్సులో చేరిపోయారు.
నేను మాత్రం పీయూసీ, బీ
కాం ఇలా చదువు లాగించాను.
కొన్నేళ్ళు గడిచాయి. వాళ్లందరికీ మా వూళ్ళో, లేకపోతె
చుట్టుపక్కల గ్రామాల్లో వున్న చిన్న సర్కారు బడుల్లో టీచరు ఉద్యోగాలు వచ్చాయి. బతకలేక బడి పంతులు
అన్నట్టు ఉండేవి వాళ్ళ జీతాలు, జీవితాలు.
అలా కొన్నేళ్ళు సాగాయి. నా డిగ్రీ పూర్తయింది.
సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం వచ్చింది. చిన్ననాటి
దోస్తులం అప్పుడప్పుడూ కలుస్తూ వుండేవాళ్ళం.
‘మేమూ నీలాగా డిగ్రీ చేసివుంటే బాగుండేది. ఏదో మా
కర్మ ఇలా తగలబడింది’ అనేవాళ్ళు.
అలా మరి కొన్నేళ్ళు గడిచాయి.
అందరం రిటైర్ అయ్యాము.
వున్న వూళ్ళో ఉంటూ వాళ్లకి వచ్చే పెన్షన్ లో సగం
కూడా నాకు హైదరాబాదులో రావడం లేదు.
కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎగుడుదిగుడులు సహజం
నా షరా మామూలు డైలాగు వుంది కదా! గోదావరిలో ఎన్ని
నీళ్ళు వున్నా మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు.
ప్రాప్తం! అంతే!
‘మా నాన్న చెప్పిన కాకినాడ/ పిఠాపురం సంబంధం చేసుకుని వుంటే..’ అనే బాపు కార్టూనులాగా, ఇప్పుడు ముక్కు చీదుకుంటే ఏమిటి లాభం!
(05-02-2022)
కనిపించుటలేదు! – భండారు శ్రీనివాసరావు
4, ఫిబ్రవరి 2022, శుక్రవారం
కోర్టు గుమ్మం జైలు గడప – భండారు శ్రీనివాసరావు
గల్లీ వార్తలు – భండారు శ్రీనివాసరావు
ఏదో పాత సినిమాలో డైలాగు- ‘Long long ago, so long ago, nobody can say how long
ago’ మాదిరిగా
ఇది కూడా చాలా చాలా పాత జ్ఞాపకం. సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి సంగతి.
విలేకరులందరికీ బాగా తెలిసిన ఓ మంత్రి
గారు వుండేవారు. తెలుగుదేశం అధికారానికి రావడంతో ఆయన మాజీ అయ్యారు. కానీ
రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా పేరు పెట్టి
పలకరించేటంత చనువు కలిగిన పత్రికా మితృలు అనేకమంది ఆయనకి వుండేవారు.
రేడియోకి అన్నిచోట్లా విలేకరులు
వుండరు. అంచేత ఆ మాజీ మంత్రిగారు ఏ ఊరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టినా, అది పూర్తి కాగానే హైదరాబాదులో రేడియోకి ఫోను చేసి స్వయంగా వార్త
చెప్పేవారు.
‘నిన్న గుడివాడలో ఇదే పాయింటు చెప్పారు, మళ్ళీ
గూడెంలో మాట్లాడుతూ అదే పాయింటు వార్తల్లో చెబితే బాగుండదు, కాస్త మార్చి వేరే పాయింటు చెప్పండి’ అనేవాడిని ఆయనతో వున్న చనువుతో.
‘వూరి ఊరుకీ పాయింటు ఏం మారుతుంది శ్రీనివాసరావ్. అసలీ పాయింటు చెప్పడానికే
కదా ఇలా ఊరూరూ తిరుగుతోంది. ఈ పేపర్లతో పెద్ద చిక్కు వచ్చి పడింది. గల్లీ గల్లీకి
ఓ ఎడిషన్ అంటారు. ఒక ఊళ్లోనే ఒక పేటలో వార్త మరో వాడలో కనబడదు. అందుకే ఇలా ఊళ్ళు
పట్టుకుని తిరుగుతూ అదే పాయింటు అన్ని చోట్లా చెబుతున్నాను. అసలే మాజీలం. వేస్తారో
వేయరో కూడా తెలియదు’ అంటూ ఆయన తన గోడు చెప్పుకున్నారు.
పాత కధ అన్నాను అందుకే. ఆ రోజుల్లో
ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం వార్తలు ఒక్క రేడియోలోనే వచ్చేవి. దూరదర్సన్ వుండేది కానీ సాయంత్రం ఒక్కటే బులెటిన్. అది తప్పిపోతే మళ్ళీ మర్నాడు సాయంత్రమే. ఇక
ఇప్పట్లా అప్పట్లో ఇన్ని రకాల ఇరవై నాలుగ్గంటల
టీవీ ఛానల్స్ లేవు. పత్రికలు కూడా మర్నాడు కానీ రావు. అంచేత ఆ రోజుల్లో రేడియో
వార్తలకి మంచి గిరాకీ వుండేది. అదన్న మాట.
3, ఫిబ్రవరి 2022, గురువారం
రైళ్ళు కాదు, రైతుల కోసం ఏం చేస్తారు
2, ఫిబ్రవరి 2022, బుధవారం
మా భారతి అక్కయ్య - భండారు శ్రీనివాసరావు
మా అమ్మానాన్నల పదకొండు మంది సంతానంలో ఆడపిల్లల్లో ఆమె చిన్నది. మగపిల్లల్లో నేను చిన్న వాడిని. అంతే అంతవరకే పోలిక. ఆమె వ్యక్తిత్వం ముందు నేనో పిపీలికాన్ని.
రేడియో డ్యూటీ మీద హైదరాబాద్ నుంచి
బెజవాడ వెళ్ళినప్పుడు, గాంధీ నగరంలోని వాళ్ళింట్లోనే వారాల
తరబడి నా ఆల్ మకాం.
పొద్దున్నే రేడియో స్టేషన్ కారు
వచ్చేది. నేను తలుపులు తీసుకుని బాత్ రూమ్ కి వెడుతుంటే బయట బండెడు అంట్ల గిన్నెలు, ఎంగిలి కంచాలు. అంటే అంతమంది జనం ఆ రాత్రి ఆ ఇంట్లో భోజనాలు చేశారన్న మాట.
పక్కనే మా బావగారి పూజ గది. అప్పటికే
ఆమె లేచి ఆ గది శుభ్రం చేసి పూజకు కావాల్సిన
సంభారాలన్నీ సిద్ధం చేసిపెట్టి నాకు
కాఫీ కలిపి ఇచ్చేది. ఇంత పనీ తాను ఒంటి చేత్తో సంభాలించేది.
ఈ బక్కపలచటి ఈ మనిషిలో అంతటి శక్తి ఎక్కడిది ? ఈ
ప్రశ్నకి నాకు తెలిసి ఒకటే జవాబు.
కుటుంబం పట్ల ఆమెకున్న కమిట్ మెంట్. ఈ
పదానికి ఆమెకు అర్ధం తెలుసని నేను అనుకోను.
భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఒక గృహిణిగా, ఒక
భార్యగా, ఒక తల్లిగా ఇన్నేళ్ళుగా శరీరం
సహకరించినా లేకపోయినా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చింది. అయినా కర్మ ఫలం తప్పదు.
విరిగిన
కాలుకే మళ్ళీ ఆపరేషన్. ఆపరేషన్ చేసిన ఆ కాలుకే మళ్ళీ ఫ్రాక్చర్. అదీ ఎప్పుడు?
డెబ్బయి అయిదేళ్లు దాటిన వయసులో.
ఆ
పిడికెడు గుండె అన్ని ఆపరేషన్లను తట్టుకుంది. ఎలా తట్టుకుందో ఆ గుండెకే తెలుసు.
మా
బావగారు పోయినప్పటి నుంచి ఆయన ఆలోచనలతోనే రోజులు గడిపింది. భార్యాభర్తల అనుబంధం అర్ధం కావాలి అంటే వారిలో ఎవరో ఒకరు పోవాల్సిందేనా!
ఎవరికీ
లేని అదృష్టం ఆమెది. అందరూ మగపిల్లలే. కోడళ్ళు అందరూ మంచివాళ్ళు. మంచాన పడిన
రోజులు తక్కువే అయినా, కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆదివారం వచ్చిందంటే
చాలు, పిల్లలూ,
కోడళ్ళూ, వాళ్ళ పిల్లలూ అందరూ ఆమె దగ్గర వాలిపోవాల్సిందే. ఏ తల్లికి దక్కుతుంది ఇంత అదృష్టం. ఏ అత్తకు
దొరుకుతుంది ఈ భాగ్యం. తన అమ్మ భారతి గురించి నా మేనల్లుడు తుర్లపాటి పరేష్ ఫేస్ బుక్ లో రాసిన రాతలు ఇందుకు దృష్టాంతాలు.
ఇంతటి అదృష్టాన్ని హరాయించుకోలేక ఆ చిన్ని గుండె
అలసిపోయింది. కీ అయిపోయిన గడియారంలా ఈ మధ్యాన్నం ఆగిపోయింది.
మా ఏడో
అక్కయ్య తుర్లపాటి భారతికి నా కన్నీళ్ళ శ్రద్ధాంజలి.
(02-02-2022)
కింది ఫోటో: మా అమ్మతో ఆమె కన్న సంతానం ఏడుగురు ఆడపిల్లలు. ఇప్పుడు మా అమ్మతో సహా ఎవ్వరూ లేరు.