6, జనవరి 2022, గురువారం

చిలక జోస్యం – భండారు శ్రీనివాసరావు

 

చిలక జ్యోతిష్యాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఆ చిలకకూ, దాన్ని పెంచేవాడికీ బతుకు గడవాలి కదా! అంచేత తాము చెప్పేది నిజమే అని భ్రమింపచేసే ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అలాంటి ఓ చిలక జోస్యం ఇది.

‘భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఎన్నికల ఖర్చును పూర్తిగా తగ్గించుకుంటాయి. అలా ఆదా చేసిన డబ్బుతో, గెలిచిన అభ్యర్ధులనే, వాళ్ళు ఏ పార్తీవాళ్ళయినా సరే టోకుగా కొనేసుకుని అప్పటికి పబ్బం గడుపుకుంటాయి.

‘అలాగే రాజకీయ పార్టీలు సొంతంగా టీవీ ఛానళ్ళు, పత్రికలు పెట్టుకోవు. వాటిమీద, వాటి రాతల మీద జనాలకు విశ్వాసం ఉండకపోవచ్చు. అంచేత ఉన్న ప్రాచుర్యంలో ఉన్న టీవీ ఛానళ్ళకు, వార్తాపత్రికలకు నెలవారీ పెట్టుబడులు సమకూర్చి, నమ్మకమైన ప్రచారం చేసుకుంటాయి.’

ఇలా బోలెడు సంగతులు ఆ చిలక చెప్పబోతుండగా యజమాని దాన్ని బలవంతంగా బోనులోకి తోసి చెప్పాడు.
‘రూపాయికి రెండు ప్రశ్నలే. రాజకీయంలాగే నాదీ వ్యాపారమే’

5, జనవరి 2022, బుధవారం

జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం

 మొన్న హైదరాబాదులో జరిగిన సుబ్బరాయ శర్మ గారి డెబ్బయ్ అయిదవ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బెజవాడ ఎస్సారార్ కాలేజ్ జంధ్యాల బ్యాచ్ గా పిలవబడే మిత్ర సప్తకం:



ఎడమనుంచి ప్రముఖ కధా రచయిత దేవరకొండ మురళి, ప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, వెండి తెర, బుల్లి తెరలపై సత్తా చాటుతున్న నటుడు సుబ్బరాయ శర్మ, సినీ దర్శకుడు, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి. రఘు, భండారు శ్రీనివాసరావు ప్రసాద్ ఏలేశ్వరపు, ధర్మవరపు రామ్మోహన రావు 

సభ్యతకు పలుకే గీటురాయి

 మా చిన్నప్పుడు ‘ఏం గురూ’ అనే మాట మా నోట వినబడితే పెద్దవాళ్ళు తొడపాశం పెట్టేవాళ్ళు. ఇప్పటి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కూడా అలా పిలుచుకుంటుంటే అది మరీ అంత చెడ్డ మాట కాదేమో అని అనుకోవాల్సి వస్తోంది. తరాలు మారిపోతున్న కొద్దీ మాటల్లో అర్ధం మారి ‘బూతు’ తగ్గి పోతూ వుంటుందేమో మరి.

"కొన్ని పదాలు పలకడం అంటే తగని అసహ్యం. వాటిని అక్షరీకరించడం అంటే మరింత అసహ్యం. కోపాన్ని, ఆగ్రహాన్ని,అసహనాన్ని వ్యక్తీకరించడానికి సభ్య సమాజంలో అటువంటి  పదాల అవసరం ఉంటుందని అనుకోను. ఆ అవసరమే వస్తే, పర్యాయపదజాలానికి తెలుగు భాష గొడ్డుపోలేదు.

“అయినా కానీ టీవీ చర్చల్లో, ఫేస్ బుక్ రాతల్లో ఇంకా అలాంటి దుష్ట పదాలు అలవోకగా జారిపోతూ వుండడం చూస్తే చాలా బాధ వేస్తుంది”

3, జనవరి 2022, సోమవారం

“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ! – భండారు శ్రీనివాసరావు

 పెద్ద చిత్రాల్లో చిన్న పాత్ర అయినా, చిన్న చిత్రాల్లో పెద్ద పాత్ర అయినా పాత్రోచితంగా నటించి మెప్పించే సుప్రసిద్ధ నటుడు శ్రీ ఉప్పలూరి సుబ్బరాయ శర్మ.

శర్మగారికి నాకూ కొన్ని బాదరాయణ సంబంధాలు వున్నాయి. ఆయనదీ నాదీ డిగ్రీ బెజవాడ ఎస్సారార్ కాలేజి. ఆయనకు రేడియో అంటే రేడియో కాదు, ఆకాశవాణి అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే  తన మొబైల్ కు రేడియో సిగ్నేచర్ ట్యూన్ ని కాలర్ టోన్ గా పెట్టుకునేంత.  ( నా మొబైల్ లో కూడా అదే ట్యూన్) నాకూ రేడియో అంటే  ఇష్టమే ఎందుకంటే అది నా మాతృసంస్థ కాబట్టి. ఆయనకు డెబ్బయి అయిదు సంవత్సరాలు. నా వయసు ఇంకొంచెం ఎక్కువ.

సంబంధాలు, పోలికలు ఇంత వరకే. ఆయన పాటించే స్నేహ ధర్మం విషయంలో కాని, ఆయనకు వున్న మంచి పెద్ద మనసులో కాని, అబ్బే ఆయనతో నాకు సాపత్యమే లేదు. ఈ విషయంలో ఆయన నాకంటే చాలా చాలా  పెద్దవాడు. లేకుంటే కలిసి దశాబ్దాలు గడిచిన తర్వాత ఈరోజు ఉదయం ఫోన్ చేసి సాయంత్రం కలుద్దాం అంటారా! ఆయనకే చెల్లు.

వెళ్లాను. అప్పుడు తెలిసింది సుబ్బరాయ శర్మ గారి అమృతోత్సవం ఈరోజు అని. 75వ పుట్టిన రోజు అన్నమాట.   ఎప్పుడో నలభయ్ యాభయ్ ఏళ్ళ నాటి పరిచయస్తులు, చిన్ననాటి స్నేహితులు చాలామంది కలిసారు. ఎస్సారార్  కాలేజ్ మేట్స్  మాధవపెద్ది సురేశ్ (ప్రముఖ సంగీత దర్శకుడు), ఏమ్వీ రఘు (సినీ దర్శకుడు,  ప్రసిద్ధ  సినిమాటోగ్రాఫర్) జెన్నీ (ప్రముఖ హాస్య నటుడు), ఒకనాటి ప్రముఖ కథారచయిత దేవరకొండ మురళి, ధర్మవరపు రామ్మోహన రావు, ఏలేశ్వరపు ప్రసాద్, అలనాటి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ గారు,  దూరదర్సన్  ఓలేటి పార్వతీశం, చక్రవర్తి, ప్రసిద్ధ కార్టూనిష్ట్ శంకు, కళాపోషకుడు మద్దాలి రఘురాం, జమలాపురం రమణ, ఓపెన్ యూనివర్సిటీ చెన్నయ్య,   కోవిడ్ నిబంధనలు లేకపోతే ఇంకా ఎక్కువమంది కలిసేవాళ్ళేమో!

ఇక ఒకప్పటి నా రేడియో కొలీగ్ వాచస్పతి మురళీకృష్ణ ఈ మొత్తం కార్యక్రమానికి సంధానకర్తగా సందడి చేశాడు.

సుబ్బరాయ శర్మ గారి మీద వారి మనుమరాలు మహతి తీసిన చిన్న డాక్యుమెంటరీ అద్భ్తతః. సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషల్లో అనర్ఘలంగా తాతగారి గురించి చెప్పిన పలుగులు  వింటుంటే సుబ్బరాయ శర్మ గారు చాలా అదృష్ట వంతులు అనిపించింది.

మంచి భోజనంలో  బోలెడు ఆనందాన్ని కలుపుకుని, కడుపులో నింపుకుని మళ్ళీ ఇంటిబాట పట్టాను.

వయసులో కొంచెం పెద్దవాడిని అని ఈరోజే తెలిసింది కనుక,

“శతాయుష్మాన్ భవ” శర్మ గారూ!   



(సుబ్బరాయ శర్మ గారితో నేను)

 


(03—1-2022)

సర్వనామాలకు సర్వమంగళం – భండారు శ్రీనివాసరావు

 పూర్వం కమ్యూనిస్టుల ఏలుబడిలో సోవియట్ యూనియన్ వర్ధిల్లిన కాలంలో రేడియో మాస్కోలో దాదాపు ఎనభైకి పైగా ప్రపంచభాషల్లో వార్తాప్రసారాలు జరిగేవి. నేను తెలుగు విభాగం బాధ్యుడిగా ఉండేవాడిని. అప్పుడు సోవియట్ అధినేత మిహాయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్.

ఇన్ని ప్రపంచ భాషలకు సంబంధించిన వార్తలను ముందు ఇంగ్లీష్ భాషలో తయారు చేసి వాటి ప్రతులను అన్ని విభాగాలకు పంపేవారు. వాటిని ఆయా భాషల నిపుణులు తమ భాషలలోకి అనువదించి ప్రసారం చేసేవాళ్ళు. నాకు సహాయకుడిగా కొద్దిగా తెలుగు తెలిసిన  గీర్మన్ అనే రష్యన్ ఉండేవాడు.

మీరు అసలు ప్రతి ఇస్తున్నారు సరే. మీ వార్తల్ని మీరు అనుకున్నట్టు యధాతధంగా అనువదిస్తున్నామా లేదా అనే సంగతి మీకెలా తెలుస్తుంది’ అని అడిగాను. దానికి ఆయన చెప్పిన సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది.

ప్రతి వార్తలో దాదాపు మా నాయకుడి పేరు అనేకసార్లు వస్తుంది. మీరు ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ అంటారో దాన్ని మా వాళ్ళు విని, మా దగ్గర వున్న ఒరిజినల్ బులెటిన్లో ఆ పేరు ఎన్ని సార్లు వచ్చిందో సరిచూసుకుని అప్పుడు మీరు సరిగా అనువాదం చేస్తున్నారో లేదో మావాళ్ళు కనుక్కుంటారు’ అని కర్ణుడి జన్మ రహస్యం నా చెవిన వేశాడు.

అంటే ఇక ఎటువంటి పరిస్తితిలోనూ అతడు, ఆయన అనే సర్వనామాలు పనికిరావు అనేది బోధపడింది.

ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ప్రకటించారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఇంకా ఇలా అన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ పేర్కొన్నారు, ప్రెసిడెంట్ మిహయిల్ సెర్గేవిచ్ గోర్భచేవ్ ఉద్ఘాటించారు’ అంటూ ఒకే పేరాలో నాచేత అష్టోత్తరం చదివిస్తున్నారు అనే వాస్తవం ఎరుకలోకి వచ్చింది.

సరే! ఆ శకం ముగిసింది.

ఇలాంటిదే మరో విశేషం నా కంట పడింది.

ఆఫ్రికా దేశం అయిన ఉగాండాను ఇదీ అమీన్ అనే నియంత పాలించేవాడు. రేడియో కంపాలాలో ప్రతి రోజు అయన గురించిన వార్తలే ప్రముఖంగా ప్రసారం అయ్యేవి. ఆయనకు రేడియోలో తన పూర్తి పేరు చెప్పాలని మక్కువ. నియంత తలచుకుంటే కానిదేముంది. కాకపోతే ఒక ఇబ్బంది ఎదురయింది. పూర్తి పేరు అయితే పరవాలేదు కానీ తనకున్న బిరుదులు, మెడల్స్ కూడా జోడించి చెప్పాలని ఆదేశం. నియంత పాలించే ఆదేశంలో ఆయన ఆదేశం శిరోధార్యమాయే. దాంతో ఒకటికి పదిసార్లు రేడియోలో ఆయన పేరు వచ్చేది. ఒకటికి పదిసార్లు జనం దాన్ని వినాల్సివచ్చేది. ఎలా అంటే ఇలా:

“His Excellency the President of the Republic of Uganda, General al Haji Idi Amin Dada, VC, DSO, MC……”

2, జనవరి 2022, ఆదివారం

గుర్తింపుకో గుర్తింపు కార్డు – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 02—1-2022, SUNDAY)


రోడ్డు మీద పోతుంటే పోలీసు ఆపి, నువ్వెవరు అంటే పలానా అని చెబితే సరిపోదు. జేబులోనుంచి ఓ కార్డు తీసి ఇదిగో ఇది నేను అని చెప్పాలి. అప్పుడే అతడు నమ్మే వీలుంది, నమ్ముతాడని నమ్మకం లేకపోయినా. అంటే ఏమిటన్నమాట. మనమెవరో మనమే మన నోటితో చెప్పినా నమ్మని వాడు, మనం మన కార్డు తీసి ఇచ్చి నేను పలానా అంటే నమ్మే చాన్స్ వుంది. అందుకే ఈ కలియుగంలో మనుషులకన్నా కార్డులకే విలువ ఎక్కువ. అవి మనకి ఒక గుర్తింపు ఇస్తాయి.
జ్ఞానపీఠాలు, పద్మశ్రీలు, దాదా సాహెబ్ లు, స్వర్ణ నందులు ఒక రకం గుర్తింపులే. అవి పెట్టిపుట్టిన వారికి.
పుట్టి కూడా పుట్టినట్టు దాఖలా కోసం కావాల్సిన గుర్తింపులు మరి కొన్ని. ఉదాహరణకు బర్త్ సర్టిఫికేట్. స్కూలు ఫైనల్ లేదా టెన్త్ క్లాస్ (పుట్టిన తేదీ నిర్ధారణ కోసం), కులం సర్టిఫికేట్ (అవసరాన్ని బట్టి), నివాస స్థలం గుర్తింపు, బ్యాంకు (ఏటీఎం) కార్డు, ఇక ఆధార్ సరేసరి. ఇవన్నీ ఓ మోస్తరు బతుకులకోసం. ఇంకొంచెం ముదిరితే పాస్ పోర్టు, వీసా, బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్లాటినం, గోల్డ్ ఎట్సెట్రా ఎట్సెట్రా.
పాతికేళ్ళు వచ్చేవరకు ఈ కార్డుల గోల పెద్దగా లేదు. పుట్టిన తేదీ పదో తరగతి సర్టిఫికేట్ లోనే వుంది కాబట్టి ఉద్యోగ పర్వం వరకు దానితోనే నెట్టుకొచ్చాను.
హైదరాబాదులో రేడియో విలేకరి ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట అవసరం పడింది రేషన్ కార్డు. అదీ గుర్తింపు కోసం. పాస్ పోర్టు కావాలన్నా ఆ రోజుల్లో రేషన్ కార్డు అడిగేవాళ్ళు. అందరిలాగే ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చేస్తున్న ఉద్యోగం దుర్వినియోగం చేయక తప్పలేదు. వెళ్లి అప్పటి రెవెన్యూ మంత్రి పి. నరసారెడ్డి గారితో చెప్పాను. ఆయన పియ్యేను పిలిచి నాకు సంబంధించిన ఏరియా తాసీల్దారును ఆఫీసుకు పిలిపించారు. అధికార ముద్రతో సహా రమ్మని చెప్పారు. ఆయన ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకుని వివరాలు తీసుకుని స్టాంపు వేసి రసీదు ఇచ్చారు. సాయంత్రం కల్లా రేషన్ కార్డు నాకు ఆఫీసులో ఇచ్చి వెళ్ళారు.
తరువాత కౌలాలంపూర్ తెలుగు మహాసభలకు వెళ్ళడానికి పాస్ పోర్టు అవసరం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు. సీఎం ఆఫీసు చొరవతో అది ఇంటికే వచ్చింది, ఇరవై నాలుగ్గంటల్లో.
అమెరికా వెళ్ళడానికి పదేళ్ల వీసా కూడా చెన్నై వెళ్ళకుండా, ఇంటర్వ్యూ కు హాజరు కాకుండా చెన్నై ఎంబసీ వాళ్ళే పోస్టులో పంపారు. అలాగే మా ఆవిడ వీసా కూడా. అది నేను చేస్తున్న ఉద్యోగం చలవే.
బ్యాంకు కార్డు వద్దనుకున్నాను. కానీ ఒక బ్యాంకు వాళ్ళు ఆఫీసుకు వచ్చి మొహమాట పెట్టి మరీ ఇచ్చారు. ఇవ్వడం ఇచ్చారు కానీ దానితో పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. ఆ క్రెడిట్ కార్డు లేకపోతె బహుశా నాకు జీవితంలో బీపీ రోగం వచ్చేది కాదేమో! అది మాత్రం ఆ బ్యాంకు వాళ్ళ పుణ్యమే. బ్యాంకుల వాళ్ళు కూడా డబ్బు(బాకీ) వసూళ్ళకు ప్రైవేటు ఏజెన్సీల (గూండాల) ను నియమించుకుంటారని అప్పుడే తెలిసింది. దాంతో క్రెడిట్ కార్డు వదుల్చుకుని డెబిట్ కార్డు తీసుకున్నాను.
ఆధార్ కార్డుకు పెద్ద ప్రయాస పడలేదు. ఆధార్ కార్డుల శకం మొదలయిన కొత్తల్లోనే తీసుకున్నాను, పెద్ద ఇబ్బంది పడకుండా. ఇంటిపక్కనే ఆధార్ నమోదు కేంద్రం పెట్టారు. వెళ్లి పదిహేను నిమిషాల్లో నేనూ మా ఆవిడా వేలిముద్రలు, కనుపాప ముద్రలు ఇచ్చి కార్డులు తెచ్చేసుకున్నాం. కాకపోతే దానిమీద ఫోటో మాది అంటే మేమే నమ్మే పరిస్థితి లేకుండా, కింద పేరు రాస్తే కాని పలానా అని గుర్తు పట్టడానికి వీలు లేకుండా గొప్ప అసహ్యంగా వచ్చింది. కొన్నేళ్ళు ఆ ఆధార్ ఆధారంగానే రోజులు నెట్టుకువచ్చి, సాంకేతికంగా పరిస్థితులు కాస్త బాగుపడ్డతర్వాత ఇంటి నుంచి కంప్యూటర్ ద్వారా ప్రయత్నించి మరో కార్డు తీసుకున్నాము. అలాగే ఓటరు గుర్తింపు కార్డు.
విధిగా తీసుకోవాల్సి వచ్చిన మరో రెండు కార్డులు వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్డు, PAN కార్డు, స్కూటర్ కొన్న కొత్తల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డు. ఈ మూడు కూడా పెద్ద కష్టపడకుండానే నా కార్డుల సంతానంలో చేరాయి.
ఇక వృత్తి రీత్యా అవసరమైన ప్రెస్ అక్రిడేషన్ కార్డు. 1975 నుంచి ఇప్పటివరకు అవిచ్చిన్నంగా కొనసాగుతోంది, గత నలభయ్ ఆరేళ్లుగా. దానికి అనుబంధ కార్డులు మరి కొన్ని వుంటాయి. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఉచిత సిటీ బస్సు కార్డు, రాష్ట్రంలో ఎక్కడికైనా మూడో వంతు టిక్కెట్టు ధరతో బస్సుల్లో తిరిగే మరో కార్డు. స్కూటరు యోగం పట్టిన తర్వాత సిటీ బస్సు పాసు వదిలేసాను. కారు కొన్న తర్వాత రెండోదానికీ నీళ్ళు వదిలాను.
వృత్తికి అవసరమైన మరో కార్డు వుంది. విజిటింగ్ కార్డు. ఈ శ్రీనివాసరావు పలానా సుమా అని తెలియచెప్పే కార్డు. అయితే దానితో నాకు ఎప్పుడూ అవసరం పడలేదు. నా పేరే నా విజిటింగ్ కార్డు అనుకునేవాడిని. ఎవరినైనా కలవాల్సినప్పుడు చీటీ మీద నా పేరు రాసి పంపేవాడిని. అయితే ఈ పప్పులు ఈ కాలంలో ఉడకవు అనుకోండి.
పొతే, సగం ధరతో దేశంలో ఏ తరగతిలో అయినా ప్రయాణించే రైల్వే పాసు. అదేదో గుర్తుకోసం అన్నట్టుగా వుండేది కానీ వాడిన సందర్భాలు బహు తక్కువ.
మాస్కోలో వున్న అయిదేళ్ళూ మాస్కో రేడియో వారి గుర్తింపు కార్డు (ప్రోపుస్కా) వుండేది. రేడియోలో ప్రవేశానికే కాదు, మాస్కోలో తిరిగేటప్పుడు కూడా గుర్తింపు కోసం హమేషా అది దగ్గర ఉంచుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడు పరిస్తితులు ఎలావున్నాయో తెలియదు కానీ, ముప్పయ్యేళ్ల క్రితం మేమున్న రోజుల్లో సోవియట్ యూనియన్ లో నిబంధనల అమలు చాలా ఖచ్చితంగా వుండేది. నేను మాస్కో రేడియోలో చేరిన మొదటి రోజునే ఆఫీసువాళ్ళు మా కుటుంబంలో ఉన్న నలుగురికీ ప్రొపుస్కాలు (ఫోటో గుర్తింపు కార్డులు) తయారు చేసి ఇచ్చారు. వాటిని హమేషా దగ్గర ఉంచుకోవాలని, లేని పక్షంలో ఇబ్బందులు పడతారనే హెచ్చరిక కూడా చేసారు. నేను చాలా మామూలుగా తీసుకున్నాను. సంక్రాంతి గంగిరెద్దుల మీద కప్పే బట్టల మాదిరిగా చలి దుస్తులు ఒకదాని మీదొకటి వేసుకుని వెళ్ళే హడావిడిలో ఆ ప్రోపుస్కాను కోటులో ఏ జేబులో పెట్టుకున్నానో మరచిపోయేవాడిని. ఒక రోజు ఆఫీసు ప్రధాన ద్వారం దగ్గరే నన్ను నిలిపేశారు, ప్రొపుస్కా లేదని. అక్కడ వుండే గార్డులు నన్ను రోజూ చూస్తుండే వాళ్ళే. గుర్తు పట్టేంత పరిచయం వుండేది. అయినా లోపలకు పంపడానికి వాళ్ళు సుతరామూ ఒప్పుకోలేదు. వార్తలకు టైం అవుతోంది, నన్ను వెళ్ళనివ్వకపోతే ఇబ్బంది అవుతుందని సైగలతో చెప్పి చూసినా లాభం లేకపోవడంతో రిసెప్షన్ నుంచే కొంచెం కొంచెం తెలుగు తెలిసిన మా రష్యన్ సహోద్యోగి గీర్మన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. అతడు వెంటనే కిందికి వచ్చాడు. అతడి చేతిలో నేను తర్జూమా చేయాల్సిన వార్తలు, కొన్ని తెల్ల కాగితాలు బాల్ పాయింటు పెన్ను వున్నాయి. రిసెప్షన్ గదిలో ఓ కుర్చీలో కూర్చోబెట్టి పని చేసుకోమని చెప్పాడు. ఇంటికి ఫోన్ చేసి ప్రొపుస్కా తెప్పించుకోమని సలహా ఇచ్చాడు. వార్తలకు సమయం ఆట్టే లేదని అంటే పర్వాలేదు, అవసరం అయితే నిన్నటి వార్తల రికార్డు వుంది, అంటాడు కాని నన్ను లోపలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి చెప్పి చూడమంటే గీర్మన్ అటువైపు చూడమని సైగ చేశాడు. ద్వారం దగ్గర ఓ పొడవాటి పెద్దమనిషి నిలబడి తన ప్రోపుస్కా చూపించి లోపలకు వెడుతున్నాడు. అతడ్ని చూపుతూ గీర్మన్, ‘ఆయన ఎవరో తెలుసా! మన రేడియో మంత్రి. ఎవరైనా సరే రూలు రూలే’ అన్నాడు. నాకు పరిస్తితి అర్ధం అయింది. ఈ నిబంధనల పాటింపు చూస్తుంటే మెదడు మోకాల్లో వుంది అనే సామెత గుర్తుకు వస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు గేటు దగ్గరవారికి గుర్తింపు కార్డు చూపాలి. రెండు మెట్లు దిగి ఏదైనా మరచిపోయి మళ్ళీ లోపలకు వెళ్ళాలన్నా చూపించాలి. ఇప్పుడే కదా బయటకు వచ్చింది అంటే కుదరదు.
ఇక చేసేది లేక ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. మా ఆవిడే టాక్సీ వేసుకుని ఆఫీసు కు వచ్చి ప్రోపుస్కా నా చేతిలో పెట్టి అదే టాక్సీలో ఇంటికి పోయింది. ఇదంతా అయ్యేసరికి వార్తల సమయం ముంచుకువచ్చింది. పైకి వెళ్లి స్టూడియోలో వార్తలు ఆ పూటకు మమ అనిపించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
నేను సుదీర్ఘ కాలం పనిచేసిన హైదరాబాదు రేడియో, దూరదర్శన్ లలో కూడా సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకోలేదు. ఇక ప్రెసిడెంట్, ప్రధాని వంటి వీవీఐపీల పర్యటనల సందర్భంలో ప్రత్యేకంగా జారీ చేసే ఫోటో గుర్తింపు కార్డులు. సరే. ఇవి తాత్కాలికం అనుకోండి.
రిటైర్ అయిన తర్వాత పెన్షనర్ కార్డు, సీ.జీ.హెచ్.ఎస్. కార్డు అదనంగా వచ్చి పర్సులో చేరాయి.
మరోటి వుంది. అది ప్రెస్ క్లబ్ కార్డు. ఢిల్లీ, బెంగుళూరు క్లబ్బుల్లో పనికొస్తుంది కాబట్టి అదొకటి వుంటుంది ఎప్పుడూ.
జేబులు కొట్టేవాడి కన్ను నా వాలెట్ మీద పడితే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అన్ని కార్డులు కడుపులో పెట్టుకుని నా పర్సు బలిసిన పిల్ల పందిలా వుండేది. కానీ అదేమిటో విచిత్రం చాలా ప్రాంతాలు తిరిగాను, కొన్ని దేశాలు కూడా తిరిగాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా నా జేబు కొట్టే జేబుదొంగ నాకు తారసపడలేదు. బహుశా ఈయన పర్సులో కార్డులు తప్ప పనికొచ్చే సరుకు ఏమీ ఉండదని వాళ్లకు తెలుసేమో!
ఇప్పుడు కొన్ని కాలనీల్లో నివసించేవారికి లోపలకు వచ్చేందుకు కొత్తరకం ఎలెక్ట్రానిక్ కార్డులు ఇస్తున్నారట. వుండేది మామూలు కాలనీ కాబట్టి ఇంతవరకు ఆ కార్డు అవసరం పడలేదు.
ఒక్క బతుక్కి, ఒక్క మనిషికి ఇన్ని కార్డులు అవసరమా!



1, జనవరి 2022, శనివారం

అలవాటులేని ఔపోసనం – భండారు శ్రీనివాసరావు

 

మాది, అంటే నాది మా ఆవిడది (కలిపి) గుళ్ళో పెళ్లి.

1971 డిసెంబరు 16 వ తేదీన తిరుపతిలో ‘Simple than the word simple’ గా జరిగింది. మరి ఆ పెళ్లి సంగతి నలుగురికీ తెలియడం ఎల్లా? ఆలోచనే నన్ను మొదటి సారిగ్రీటింగ్ కార్డు’ ఐడియా దిక్కుగా అడుగు వేయించింది. గ్రీటింగ్ కార్డుల పేరుతొ డబ్బులు తగలేయడం వృధా అని అప్పటివరకు అనుకుంటూ ఉండేవాడిని.

తిరుపతి నుంచి రాగానే ముందు బెజవాడ గవర్నర్ పేట లోని వాణీ ప్రెస్ కి వెళ్లి, నా పేరూ, మా ఆవిడా పేరూ కలిపి ఓ వంద గ్రీటింగు కార్డులు ప్రింటు చేయించాను. చుట్టపక్కాలకి వాటిని పోస్ట్ చేస్తున్నప్పుడు మరో బ్రిలియంట్ ఐడియా మనసులో మెదిలింది. ముందూ వెనుకా చూడకుండా దాన్ని వెంటనే ఆచరణలో పెట్టేసాను. పనిలో పనిగా ఆఫీసులో నా తోటి సిబ్బందికి కూడా ఆ చేత్తోనే గ్రీటింగు కార్డులు పోస్ట్ చేసాను.

జనవరి ఒకటో తేదీ రానే వచ్చింది. నేను పనిచేసే లబ్బీపేట ఆంధ్రజ్యోతి ఆఫీసుకి వెళ్లాను. మొదటి అంతస్తులో గుర్రపు నాడా ఆకారంలోని బల్ల చుట్టూ సబ్ ఎడిటర్లం అందరం కూర్చునే వాళ్ళం. మధ్యలో న్యూస్ ఎడిటర్ వీరభద్రరావు గారు, ఆ దాపునే అసిస్టెంట్ ఎడిటర్ తుర్లపాటి కుటుంబ రావు గారు, ఆ పక్కనే ఇంచార్జ్ ఎడిటర్ నండూరి రామ్మోహన రావు గారు, సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబు గారు  ఇలా అందరం కూర్చుని వున్న సమయంలో అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి పలకరించాడు.

ఇన్నేళ్ళుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఒక్కరంటే ఒక్కరు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పిన పాపాన పోలేదు. మీరు నిజంగా గ్రేట్. ఏకంగా గ్రీటింగు కార్డే నా పేరు మీద పోస్ట్ చేసారు. చాలా చాలా థాంక్స్ అండీ’ అన్నాడు, అందరూ వింటుండగా. అందరూ నా వైపు గుర్రుగా చూసినట్టు అనిపించింది. ఇంతమంది వుంటే అందర్నీ కాదని ఆఫీసులో పని చేసే అటెండర్ కి గ్రీటింగ్ కార్డా అన్నట్టు చూసారు. మర్నాడు పరిస్తితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. పోస్టల్ వాళ్ళ పుణ్యమా అని, నేను పోస్ట్ చేసిన కార్డులన్నీ లెక్క పెట్టినట్టు రోజుకొక్కటి చొప్పున ఒక్కొక్కరికి, అదీ అడ్డదిడ్డంగా రావడం, రానివాళ్ళు నా వైపు మరోసారి అదోలా చూడడం ఇదంతా ఇబ్బందిగా మారింది. కార్డు వచ్చిన వాళ్ళు కూడా, విషయం తెలిసి, మళ్ళీ పోస్ట్ చేసి వుంటాడు కానీ మన మీద అతగాడికి అంత కారిపోయే ప్రేమ లేదని పరోక్షంలో గొణుక్కున్నారేమో తెలవదు. కానీ ఆ ఫీలింగు మాత్రం నన్ను పట్టుకుంది. వారం పది రోజులు ఇలా ఇదో సీరియల్ లాగా సాగింది. ‘చక్కటి కవిత్వం రాసాడు’ అని మెచ్చుకుంటారని అనుకుంటే సీను కాస్తా రివర్స్ అయింది.

గ్రీటింగు కార్డు ‘గ్రివింగ్ కార్డు అవడం అంటే ఏమిటో తెలిసివచ్చింది.

అంతే! నేను మరుసటి ఏడు నుంచి మళ్ళీ నా పాత పద్ధతికి మళ్ళిపోయాను.

గ్రీటింగులు అందుకోవడమే కానీ పంపే పద్ధతికి స్వస్తి చెప్పాను.