21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సబ్ కో సన్మతి దే భగవాన్ – భండారు శ్రీనివాసరావు

 డ్యూ.(DEW). మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి.

అప్పటికి ఇంకా ప్రాధమిక విద్యాస్తాయిలోనే వుంది. తల్లి టీచరు. తండ్రి కళాకారుడు. మా పక్క పోర్షన్ లో వుండేవాళ్ళు. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగింది. వాళ్ళు విశ్వాసం రీత్యా క్రైస్తవులు. ముస్లిం మత సంస్థ నడుపుతున్న ఒక ప్రముఖ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి ఫస్టున పాసయింది. తలితండ్రుల ప్రోత్సాహంతో హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న సంగీత పాఠశాలలో చేరింది. ఆ పాప కృష్ణాష్టకం, శివాష్టకం చదివే తీరుకు ముగ్డులయిన ఆ పాఠశాల వాళ్ళు ఓ ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు డ్యూను ఎంపిక చేశారు. అందులో మంచి పేరు  తెచ్చుకుంది. తనకు వచ్చిన బహుమతిని మాకు చూపించి మురిసిపోయింది. మేము అంతకంటే ఎక్కువ మురిసిపోయాము. ఇలా పెరిగిన పిల్లలే భావి భారతానికి పట్టుకొమ్మలు.



డ్యూ అంటే మంచు బిందువు. తుషారం.

మళ్ళీ రాని పండగ రోజు

 ఓ ఏడాది (2019) సంక్రాంతి వెళ్ళిన మరునాడు అంటే  కనుమనాడు మా ఇంట పండుగ సందడే సందడి.

పాతికేళ్ళ క్రితం మేము పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో ఉన్నరోజుల్లో మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం ఆ సాయంత్రం మా ఇంటికి వచ్చింది. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. వీళ్ళలో ఒకమ్మాయి కళ తన ఇద్దరు మొగ పిల్లలకు తను పెంచిన మా పిల్లల పేర్లే, సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. యాదమ్మ, మల్లయ్యలకు ఇప్పుడు నలుగురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు. పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి తిరుపతమ్మ ( మాకళ్ళ ముందే పుట్టింది, ఇప్పుడు పాతికేళ్ళు,పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’

వాళ్ళు వున్న సమయం మాకు నిజంగా పండగ మాదిరిగా హాయిగా గడిచిపోయింది.

(మరో ఏడు నెలల తరువాత చూడడానికి వుండదు అని ముందుగా ఏమైనా తెలిసిందో ఏమో అందరూ కట్టగట్టుకుని వచ్చి చూసివెళ్ళారు అని ఇప్పుడు అనిపిస్తోంది)

Below Photo:

Left to Right (Sitting)

Goutham Kartik, Sai Rama Krishna, Samruddhi, Sandeep, Sreemanya, Santosh, Manojna

Left to Right (Standing)

Sampoorna, Abhiram, Nirmala Bhandaru, Kala, Bhagya, Tirupatamma (Roopa), Yadamma




 

20, సెప్టెంబర్ 2021, సోమవారం

అనువాద సమస్యలు - భండారు శ్రీనివాసరావు

 

ఒకసారి హైదరాబాదులో International Conference on Plants నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రిపోర్ట్ ఇచ్చేసి తదనంతర కార్యక్రమాల్లో మునిగిపోయాను.

వారం తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. కాస్త ఇంగ్లీష్ తెలిసిన వాడిని పంపించండి ప్రెస్ కాన్ఫరెన్సులకు అని ఓ ఉచిత సలహా జోడిస్తూ. జవాబు రాయాలి కదా. పాత కపిల కట్ట ( న్యూస్ బులెటిన్లు) విప్పి వెతికితే అతడు చెప్పింది నిజమే అని అనిపించింది. హైదరాబాదులో అంతర్జాతీయ మొక్కల సదస్సు అని హెడ్ లైన్స్ లో వెళ్ళిపోయింది. అనువాదకుడు దాన్ని అంటే ప్లాంట్స్ ని మొక్కలు గా ముక్కలు ముక్కలు చేశాడు. అక్కడ ప్లాంట్స్ అంటే నిజానికి పెద్ద పెద్ద కర్మాగారాలు.

ఈ గతం తవ్వకం ఎందుకంటే

ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి పెట్టమని కొందరు నన్ను అడుగుతుంటారు.

మక్కికి మక్కి అనువాదం చేయను, మొత్తం చదివి తెలుగులో తిప్పి రాస్తాను’ అంటాను.

నా పద్దతి చాలామందికి నచ్చదు. వాళ్ళ పద్దతి నాకూ నచ్చదు.



(NOTE: Courtesy Cartoonist)


(20-09-2021)

చీరే మేరే సప్నే - భండారు శ్రీనివాసరావు

 

నా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి. అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ కొనలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.

చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.

కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు. అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది. మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి. చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాడ్ని, పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.

అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.

దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.

(కింది ఫోటో:   తుర్లపాటి హనుమంతరావు బావగారి శత జయంతికి వచ్చిన దంపతులను ఇలా సింహాసనాల మీద కూర్చోబెట్టి  తీర్చుకున్న ముచ్చట)



ఆడవాళ్ళూ! శతకోటి దణ్ణాలు ! ( ఈ ఒక్కరోజే సుమా!)

 నెల అంటే ముప్పయి రోజులు అని సెలవిచ్చాడు గతంలో హైదరాబాదు వచ్చిన ఓ కేంద్ర మంత్రి. ప్రస్తుతం మాజీ అనుకోండి. అల్లాగే ఏడాదికి అక్షరాలా మూడువందల అరవై అయిదు రోజులు అంటే కాదు కాదు ఇంకా ఎక్కువే అంటున్నారు కొందరు. ఆ సంఖ్య ఎల్లాగూ మారదు కాబట్టి ఒక్కో రోజుకూ రెండో మూడో పేర్లు తగిలించేస్తున్నారు ఈ మధ్య ఆ మరికొందరు. ఆ లెక్కన ఇవ్వాళ అంటే సెప్టెంబరు ఇరవయ్యో తేదీని ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ పొమ్మన్నారు.

‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

ఉన్నట్టుండి దిగబడ్డ ఈ భార్యల ప్రశంసాదినోత్సవ ప్రచార బాధ్యతను కొన్నేళ్ళ క్రితం తన భుజాలకు ఎత్తుకుంది. అప్పటివరకు ఇలాంటి దినం ఒకటి వుందని కూడా ఎవరికీ  తెలియదు. ఆ ప్రచార పర్వంలో భాగంగా ఆ పత్రిక  ఓ వ్యాసాన్ని ముద్రించి జనాల మీదకు వదిలింది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకు  సినిమా ఇష్టమో, ఏ కూర ఎలా చేస్తే నువ్వు ఎంతగా  ఇష్టపడతావో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’ అంటూ ఫోనులో గయ్యిమని లేచాడు.

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. ఈరోజు ఆవిడ చేత  వంట చేయించకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.

 (ఆపత్రిక అంటే అప్పుడు రాసింది కానీ ఇప్పటికీ సెప్టెంబరు ఇరవయ్యో తేదీని భార్యల ప్రశంసా దినోత్సవంగా పాటిస్తున్నారో లేదో నాకు తెలవదు)



19, సెప్టెంబర్ 2021, ఆదివారం

టీటీడీ కొత్త కమిటీ – భండారు శ్రీనివాసరావు

రాజకీయ పార్టీలు రాజకీయ నిర్ణయాలే తీసుకుంటాయని గతంలో ఓ తలపండిన రాజకీయవేత్త చెప్పారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సాగే ఏ ప్రభుత్వమైనా రాజకీయ నిర్ణయాలకే పెద్ద పీట వేస్తుంది. ఇది నిర్వివాదాంశం. కాకపొతే, కొందరు మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో వేసుకోరు, కొందరికి ఆ పట్టింపు కూడా వుండదు.

కాబట్టి, టీటీడీ కొత్త జంబో బోర్డు నిర్ణయం కూడా అదే బాపతు అనుకోవాలి.
రాజకీయ పార్టీలే కాదు బ్యూరోక్రాట్లు కూడా అవసరాలకు (ఇక్కడ తమ అవసరాలకు తగ్గట్టుగా అని అర్ధం) హోదాలు పెంచుకుంటూ పోయిన సందర్భాలు వున్నాయి. ఆ నిర్ణయాలు ప్రభుత్వానివి అని సమర్థించుకుంటే చేసేది ఏమీ లేదు. రాజకీయ నాయకుల్ని కనీసం అయిదేళ్లకోసారి మార్చే వెసులుబాటు అన్నా వుంది.
పూర్వం అంటే 1970 ప్రాంతాల్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి కలిపి, నంబియార్ అని ఒకే ఒక పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ వుండేవారు. ఇప్పుడు ఎంతమంది వున్నారు అంటే చప్పున చెప్పలేము. అప్పుడు డీజీ అనే పోస్టే లేదు. మరి ఇప్పుడో. అలాగే చీఫ్ సెక్రెటరీ హోదా కలిగిన వాళ్ళ సంఖ్య ఎంత పెరిగిందో కూడా చెప్పలేము.
గతంలో అంటే నలభయ్ ఏళ్ళ క్రితం ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టి. అంజయ్య గారు తన మంత్రివర్గాన్ని అరవై మందితో విస్తరించినప్పుడు ఇలాగే నొసళ్ళు నొక్కుకున్నారు. జంబో మంత్రివర్గం అంటూ పత్రికలు ఎద్దేవా చేసాయి. అసమ్మతి వర్గం ఈ అంశాన్ని అధిష్టానం దగ్గర తమకు అనుకూలంగా మార్చుకుని అంజయ్య గారు దిగిపోయేదాకా నిద్ర పోలేదు. సరే. ఆయన నిష్క్రమణకు రాజీవ్ గాంధి వ్యవహార శైలి కూడా దోహదం చేసింది అనుకోండి.
ముఖ్యమంత్రి అంజయ్యకు భోలా మనిషి అనే పేరు. ఏదీ కడుపులో దాచుకునే రకం కాదు. ఆయనే స్వయంగా నాతొ అన్నమాటలు ఇవి.
“చూసావా శ్రీనివాసూ. ఒక జిల్లాలో ఇద్దరు ముగ్గురు ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండవచ్చు. కానీ ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు వుండకూడదు అంటున్నారు. ఇదెక్కడి న్యాయం”
రాజకీయాల్లో న్యాయం ప్రసక్తి ఏముంటుంది?
ఇక టీటీడీ విషయానికి వస్తే,
ఆ జంబో బోర్డు సభ్యులకు ఓ విజ్ఞప్తి.
“మీ మొట్టమొదటి సమావేశంలోనే ఓ తీర్మానం చేయండి. మీ మీద వచ్చిన నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి.
“మేము సభ్యులుగా వుండగా మా చుట్టపక్కాలకు కానీ, అనుచర వర్గాలకు కానీ, స్వామి దర్శనం కోసం సిఫారసు లేఖలు ఇచ్చే అధికారాన్ని స్వచ్చందంగా వదులుకుంటున్నాము. మా పరిధిని కేవలం దేవస్థానం అభివృద్ధికి, యాత్రీకుల సేవల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేసుకుని వ్యవహరిస్తాము”
ఆ చేత్తోనే మరో తీర్మానం చేసి పుణ్యం కట్టుకోండి.
“దేవాలయ పరిసరాల్లో టీవీ కెమెరాలను అనుమతించం. రాష్ట్రపతి వంటి పెద్దలు వస్తే ఎలాగూ ఎస్వీ ఛానల్ చూసుకుంటుంది.”



NOTE: Courtesy Image Owner

(19-09-2021)

సోషల్ మీడియా పౌరులకు ఓ విజ్ఞప్తి

 కల్లోల కడలిలో పడవ ప్రయాణం

సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ వంటి ప్రయత్నం చేయడం నిజంగా కత్తి మీది సామే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఎందుకంటే జుకర్ బర్గ్ సృష్టించిన  ఈ కృత్రిమ సమాజం, బయట మనం జీవిస్తున్న సమాజం కంటే వేయి రెట్లు ఎక్కువగా విభజితమై వుంది, పార్టీల వారీగా, నాయకుల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా. ఆఖరికి దేవుళ్లవారీగా.

నేను ఈ ఈ మీడియాలో రాయడం మొదలు పెట్టి ఏళ్ళు గడిచాయి. మొదట్లో ఏ అంశంపై అభిప్రాయం రాయాలన్నా ఎలాటి ఇబ్బంది వుండేది కాదు. ఇప్పుడలా కాదు, నచ్చని అభిప్రాయాన్ని ఖండఖండాలుగా ఖండించడం నిత్యకృత్యమై పోయింది. దీన్ని కూడా  తప్పు పట్టాల్సిన పనిలేదు. అందరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండాలని రూలేమీ లేదు.

ఎవరైనా రాసిన దానిలో కొన్ని విషయాలు మనం మనసులో అనుకునే వాటికి దగ్గరగా ఉండవచ్చు. మరి కొన్ని నచ్చనవి ఉండవచ్చు. ఒక కుటుంబంలోని వారే అనేక విషయాల్లో విభిన్నంగా ఆలోచిస్తూ వుంటారు. వ్యక్తిగతమైన అభిరుచులు, రాజకీయపరమైన  ఆలోచనలు వేర్వేరుగా వుండే అవకాశాలు మెండుగా  వుంటాయి. అక్కడ సర్దుకుపోయే మనుషులు ఇక్కడ అందుకు విముఖత చూపుతారు. అదేమి చిత్రమో!

నా అభిప్రాయాలతో పొసగని వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తాను. కొన్నిసార్లు తెలిసో తెలియకో చేసే పొరబాట్లు దిద్దుకోవడానికి కూడా ఈ మీడియా చక్కని అవకాశం ఇస్తోంది. అది ఒక కారణం.

ఈ సందర్భంలో నాదొక మనవి.

నా వ్యాసాలతో విబేధించే విభిన్న వ్యాఖ్యలకు కూడా నేను లైక్ కొడతాను. వీలయితే, అదీ అవసరం అనుకుంటే ఓ చిన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా, తమకు పొసగని వ్యక్తుల ప్రస్తావన వచ్చిన సందర్భాలలో కొందరు వారిని ఉద్దేశించి వాడు, వీడు అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటిని నేను పట్టించుకోను అనడానికి ఒకటే సంకేతం. అదేమిటంటే, ఆ వ్యాఖ్యలకు నానుంచి ఎలాంటి స్పందనా వుండదు. కనీసం చూసినట్టు లైక్ కూడా వుండదు.

ఒక పక్క రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేస్తాము. మరి ఆ చేత్తోనే ఇలాంటి మాటలు రాస్తే వారిని విమర్శించే హక్కు మనం కోల్పోయినట్టే కదా!

సద్విమర్శకు, ఉడుకుమోతు వ్యాఖ్యలకు ఉన్న తేడా గమనించి మసలుకుంటే అపార్థాల సీన్లు రావు.

ప్రసిద్ధ సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, ‘అప్పుడు - ఇప్పుడు’ అనే పేరుతొ, కీర్తిశేషులు, ప్రముఖ పత్రికా రచయిత శ్రీ జీ. కృష్ణ రచించిన గ్రంధానికి ముందుమాట రాస్తూ, ఒకానొక సందర్భంలో కృష్ణ గారు నుడివిన వ్యాఖ్యను అందులో ఇలా ప్రస్తావించారు.
“ స్వాతంత్ర్యానంతరం మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? కృష్ణగారు అంటారు – ‘రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం, రెండు గుడ్డిగా వ్యతిరేకించడం’.

ఇప్పుడది కాఫీ డికాక్షన్ లాగా ఈ వేదికలోకి కూడా దిగిపోయినట్టుంది.

తప్పదు, మా అభిప్రాయాలు మావి. మా భాష  మాది అనుకుంటే, ఎలాగూ మీ గోడ మీకు ఉండనే వుంది. రాస్తుండండి. నేను కూడా చదువుతూ వుంటాను.

ఇదొక వివరణ లాంటి విజ్ఞప్తి.  



(19-09-2021)