10, ఏప్రిల్ 2021, శనివారం

‘బెనిఫిట్ షో

చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో నలుపు తెలుపు రంగుల్లో అలికినట్టు అక్షరాలు రాసిన పోస్టర్లు కనపడేవి.

‘బీద విద్యార్థి సహాయార్ధం ఆదివారం  ఉదయం తొమ్మిది గంటలకు బెనిఫిట్ షో! ఒకే ఆట! తగ్గింపు రేట్లతో’ అని ఓ పాత సినిమా వేసేవాళ్ళు.

ఆ బీద విద్యార్థి ఎవరో ఎవరికీ తెలియదు. కానీ సగం రేట్లకే సినిమా కాబట్టి చాలామంది వెళ్ళేవాళ్ళు. హాలు నిండక పోయినా బొమ్మ పడేది..

ప్రస్తుతం డెబ్బయ్యవ పడిలో పడిన వాళ్లకు ఇది అనుభవమే!  

(10-04-2021)

గతం గుర్తులు –భండారు శ్రీనివాసరావు

 కొన్నేళ్ళ  క్రితం పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. హైదరాబాదు నగరంలో అతివేగంగా  నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త అది. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్ సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి. కానీ, మెట్రో నిర్మిస్తున్నది అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!

మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో!


9, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఇలా చేసి మాడండి

 "ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.

"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.

"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ కూడా తయారుకాలేదు, అని మంగళగౌరీదేవి గారు రాశారు.

"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు, మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే, మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"

8, ఏప్రిల్ 2021, గురువారం

అదిగో పులి! – భండారు శ్రీనివాసరావు

 

రాజకీయ పార్టీలు తమ ప్రస్తుత ప్రచార వ్యూహం మార్చుకోకపోతే అద్యతన భావిలో పెద్ద ఇబ్బందులే ఎదుర్కోవడం ఖాయం.

ఆయా పార్టీల మీడియా విభాగాల వాళ్ళు కనికట్టు విద్యలు ప్రదర్సిస్తూ వున్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కలిగిస్తున్నారు. పాత వీడియోలను మార్ఫింగ్ చేస్తూ తమ పార్టీకి అనుకూలంగా లేక ప్రత్యర్థి పార్టీకి ప్రతికూలంగా రోజుకొక కధనం వండి వారుస్తున్నారు.

ఇవన్నీ, ఆయా పార్టీల అభిమానులకు కనుల పండుగగా ఉంటున్న మాట వాస్తవం. చెప్పగా చెప్పగా అబద్ధం నిజం అవుతుందనే కాలం చెల్లిన ప్రచార వ్యూహాలు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవు అనే విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో చెలియలి కట్ట దాటుతున్నారు. రాతలపై నియంత్రణ కోల్పోతున్నారు.

కాలం ఎంత వేగంగా కదులుతోంది అంటే ఒక ఎన్నికకు మరో ఎన్నికకు నడుమ ప్రజల అవగాహన పెరుగుతోంది. కనపడేది అంతా వాస్తవం కాదు అనే ఎరుక వారిలో ప్రబలుతోంది.

ఇది ధ్రువ పరచుకోవడానికి ఎక్కువ కష్టపడనక్కరలేదు.
వివిధ రాజకీయ పార్టీల మీడియా విభాగాలు అనుదినం పెడుతున్న పోస్టులే దీనికి రుజువు. ఎవరైనా ఓపిక చేసుకుని చిన్న పరిశోధన లాంటిది చేస్తే ఈ పోస్టులన్నీ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే బాపతు అని ఇట్టే తేలిపోతుంది.

పది, పదిహేనేళ్ల క్రితం ఈ టెక్నిక్ ఓ మేర పనిచేయడంతో అందరూ ఈ బాట పట్టారు. మరి కొంత కాలం పనిచేయొచ్చు కూడా. కానీ దీన్నే నమ్ముకుని ఎన్నికల వైతరణి దాటాలని అనుకుంటే ముందు ముందు ఇబ్బంది పడాల్సి రావచ్చు.

అయితే ఇందులో ఉన్న కిక్కు మరి ఏ ఇతర ప్రచారాస్త్రాలలో లేకపోవడమే ఈ ప్రక్రియకు జీవం పోస్తోంది. ప్రత్యర్థిని తమ మాటలతో, రాతలతో, మార్ఫింగ్ చేసిన పోస్టింగులతో బలహీనపరచామని అనుకుంటూ అహాన్ని తృప్తి పరచుకోవడానికి బాగా పనికి వస్తుండడం కూడా ఈ విధానం పట్ల ఆసక్తిని పెంచుతోంది.
అయితే ఈ రాతలు తమ పార్టీ గెలుపుకు దోహదం చేస్తాయేమో కానీ గెలిపించలేవు. అది చాలు అనుకునే వాళ్లకు మాత్రం ఇదే సరైన దారి.
(08-04-2021)

పర్వాలేదు ఈ దేశానికి ఏమీ కాదు – భండారు శ్రీనివాసరావు

 ‘పెద్దరికం ఒకటే సరిపోదు, పెద్ద మనసు కూడా ఉంటేనే దానికి గౌరవం’ అంటుండేది మా ఆవిడ బతికున్న రోజుల్లో.

కరోనా కోరలు చాచి వీర విరాట్ స్వరూపం చూపించిన రోజుల్లో కూడా మా వీధి వైపు కన్నెత్తి చూడని ఆ వ్యాధి ఇప్పుడు ఏకంగా మా అపార్ట్ మెంటులోకే జొరబడింది. మా ఫ్లోర్ లోనే వుండే ఓ నడికారు భార్యాభర్తలు ఈ మధ్య నలతగా వుండి ఆసుపత్రిలో చూపించుకుంటే పరీక్షలు చేసి పాజిటివ్ అని తేల్చారు. మునుపటి మాదిరిగా అటునుంచి అటే గాంధీ హాస్పటల్ కు పంపించకుండా ఇద్దరికీ చెరో మెడిసిన్స్ కిట్ ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండమని పంపించేశారు, ‘మధ్య మధ్య ఫోన్ చేసి కనుక్కుంటూ వుంటాం’ అనే హామీ కూడా ఇచ్చి.
ఇంట్లో వాళ్లిద్దరే. పిల్లలు, ఇద్దరూ ఆడపిల్లలు, ఒకళ్ళు అమెరికాలో, మరొకళ్ళు వైజాగ్ లో వుంటారు. వాళ్ళు వచ్చి చేయగలింది కూడా ఏమీ లేదు.
అయితే గతంలో మాదిరిగా అపార్ట్ మెంటు వాసులు కంగారు పడడం అదీ తగ్గిందనే చెప్పాలి. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే భరోసా కాబోలు.
మా పిల్లవాడు, కోడలు ప్రస్తుతానికి వాళ్ళిద్దరికీ కావాల్సిన కూరగాయలు, ఇతర సామగ్రి తెచ్చి సానిటైజ్ చేసి వాళ్ళ గుమ్మం ముందు పెట్టి ఫోన్ చేసి చెబుతున్నారు. ‘జాగ్రత్తగా వుండడం ఒక్కటే ఈ వ్యాధికి మందు’ అన్నది మా కోడలు ‘జాగ్రత్త సుమా! అని హెచ్చరించిన నాతొ.
ముందు అందుకే చెప్పింది పెద్దరికం ఒక్కటే కాదు పెద్ద మనసు కూడా వుండాలి. ఈనాటి యువతరంలో అది వుంది. మనిషికి మనిషి తోడు. ఇలాంటి సందర్భాలలో ఇది మరీ అవసరం. ఇది వారి ఎరుకలో వుంది.
భయం లేదు! ఈ దేశానికి ఏమీ కాదు!
(08-04-2021)

మమజీవన హేతునా.... రెండేళ్ల నాటి జ్ఞాపకం

ఒక రచన చదివిన తర్వాత ఆహ్లాదం కలగొచ్చు. లేదా ఆగ్రహం రావచ్చు. కానీ నేను మొన్నో చిన్న నవలను (నవలిక అనొచ్చా) చాలా కోపంతో ఊగిపోతూ చదివాను. దానికి కారణం లేకపోలేదు.
స్వాతి వారపత్రిక వారే ఓ మాస పత్రికను కూడా అదే పేరుతొ ప్రచురిస్తూ వుంటారు. వార పత్రిక మొదటి రెండు అక్షరాలకు తగ్గట్టే షడ్రుచుల సమ్మేళనం పేరుతొ కొంత అసభ్యతను కూడా రంగరించి వదులుతుంటారు. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈ పత్రిక ఈనాడు తెలుగునాట చాలా ఇళ్ళల్లో దర్శనం ఇస్తూ వుంటుంది. పిల్లలు చదువుతారేమో అనే బెంగ కొన్నాళ్ళు తలితండ్రులను వేధిస్తూ వుండేది. అయితే జియో పుణ్యమా అని ప్రతి చేతిలో చిన్నాపెద్దా తేడాలేకుండా మొబైల్స్ రావడంతో ఏది అసభ్యత ఏది కాదు అనే చర్చ తెరచాటుకు పోయింది.
బహుశా ఇది దృష్టికి వచ్చిందేమో స్వాతి మాస పత్రిక మాత్రం కడిగిన ముత్యంలా తీసుకువస్తున్నారు. జనం వార పత్రిక ‘స్వాతి’ రుచికి అలవాటు పడ్డారేమో తెలియదు, ఈ మాస పత్రికకు ఆట్టే పాఠకాదరణ వున్నట్టు తోచదు. అయినా చదువరుల దృష్టిలో ఈ మాస పత్రిక ఓ మంచి పత్రిక. సందేహం లేదు.
సరే! కాసేపు ఈ విషయాన్ని తెరవెనక్కు నెట్టి అసలు విషయానికి వస్తాను.
టీవీల్లో చర్చ ప్రారంభానికి ముందు మైక్ టెస్ట్ చేసేటప్పుడు అందరూ మైక్ టెస్టింగ్ వన్, టు, త్రీ అని చెబితే నేను మాత్రం ‘భండారు శ్రీనివాసరావు, భ వత్తు భ. Is it OK?’ అని అడుగుతూ వుంటాను. అయినా సరే అయిదారు సంవత్సరాలుగా వారానికి రెండుసార్లు వెళ్ళే టీవీ చానల్స్ వాళ్ళు ‘బండారు’ అని వత్తు లేకుండానే వేస్తుంటారు. వారిది చాలా సరళ హృదయం. పరుషపు గుండె కాదని నేనే సమాధానం చెప్పుకుంటాను. పోనీలే వచ్చే జన్మలో అయినా లక్ష వత్తుల నోము నోచుకుంటారులే అనుకుంటాను.
వారం రోజుల క్రితం ఫేస్ బుక్ మిత్రులు నాకు స్వాతి మాస పత్రిక సంచికను పంపారు. అందులో ప్రచురించిన ‘మమజీవన హేతునా’ అనే నవలికలో మీ ప్రస్తావన వుంది చూసుకోండి అని పేజి నెంబరుతో సహా తెలియచేశారు.
నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక నవలలో ప్రస్తావించ తగిన స్థాయి లేదన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఆసక్తిగా తిరగేశాను.
ఆ నవలలో ‘బండారి’ అనే పాత్ర వుంటుంది. ఆ పాత్ర పరిచయం ఇలా జరుగుతుంది.
‘మమ జీవన హేతునా!’ నవలిక 23 వ పేజీ :
“....వాళ్లకు ఏదో సోర్స్ వుంటే వేస్తారు. మనం అడిగితే ఇంకాస్త న్యూస్ జోరు పెంచుతారు. వదిలేద్దాం’ అన్నాడు బండారి. ఆయన పూర్తి పేరు బండారు శ్రీనివాస్ రావు.ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ విభాగంలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.......బండారి ముఖంలో రంగులు మారడం గమనించాడు భరద్వాజ.
“పిచ్చివాళ్ళు. ఆ న్యూస్ మీడియాకు నేనే ఇచ్చానని తెలీదు” అనుకున్నాడు అతడు. అతడ్ని రెండు మూడు సార్లు మీడియా చర్చల్లో కూడా చూసిన గుర్తు.
ఇంటి పేరులో వత్తు మినహాయిస్తే మిగిలిన వర్ణనలు అన్నీ నాకు వర్తించేలానే వున్నాయి. నేను రేడియోలో వార్తా విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. అప్పుడప్పుడు టీవీ చర్చల్లో కనబడుతుంటాను. నా గురించి కాదని ఎలా అనుకుంటాను? అందుకే కోపం వచ్చింది. ఆ కోపంతోనే ఆ నవల చదివాను. నిజానికి ఆ పాత్రకు నా నేపధ్యం లేకున్నా తేడా ఏమీ రాదు. మరి ఆ నవల రాసిన రచయిత్రి నన్నెందుకు ఈ నవల్లోకి దింపారు.
వివరాలు చూసాను. అది రాసింది శ్రీమతి తటవర్తి నాగేశ్వరి. ఊరు కొవ్వూరు. ఫోన్ నెంబరు కూడా ఇచ్చారు.
ఫోన్ చేసి అడిగాను.
ఆవిడ గారికి కూడా ఇలానే కొందరు ఫోన్లు చేసి అడుగుతున్నారట. ఒక జర్నలిస్ట్ పాత్రకు నా వివరాలు వాడుకున్నారట. ఆ నవలలో రాష్ట్రపతి పాత్ర కూడా వస్తుంది. దానికి అరుణ్ ముఖర్జీ అని పేరు పెట్టారు. ముఖ్యమంత్రి పేరు శేఖర్ నాయుడు. నా పేరును ఇలా మార్చారు.
రచయిత్రి తటవర్తి నాగేశ్వరి గారు చాలా బాధ పడ్డారు. అది ఆవిడ కంఠంలో కనపడింది. నాకిచ్చిన మెసేజ్ లో కూడా మరోమారు కనబడింది.
“శ్రీనివాస్ రావు గారి కి నమస్కారాలు.
మీ పేరు ఒక మంచి పాత్రకు వాడాను.అన్యధా భావించ కండి
మన్నించండి
ఒక వేళ మీరు మనస్థాపానికి గురి అయితే నన్ను హృదయ పూర్వక న్గా ఛమించండి..
నాగేశ్వరి” (వాట్సప్ లో తెలుగు టైప్ చేసేటప్పుడు కొన్ని ముద్రారాక్షసాలు దొర్లుతూనే వుంటాయి, అది సహజం)
ఇలా కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి.
ఎందుకంటే ఇది జీవితం. కల్పన కాదు.
(08-04-2019)

7, ఏప్రిల్ 2021, బుధవారం

అద్దంలో మొహం ఎలా కనబడుతుంది? - భండారు శ్రీనివాసరావు


ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.

మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.
అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.

పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే!

ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.