1, ఏప్రిల్ 2021, గురువారం

లీకు వీరులు – భండారు శ్రీనివాసరావు

 ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు  తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.

ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి నిజానికి లీకులే. పొగడ్తలతో కూడిన గొప్ప వార్తలు, వ్యాసాలు రాయడానికి చాలామంది వుంటారు. రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని కట్టుడు కధలు పత్రికల్లో/ మీడియాలో రావడం వాళ్లకి ప్రధానం.

అయితే ఈ కధనాలు వాళ్ళు చెప్పినట్టే రావాలి కానీ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా బయటకి రాకూడదు. అలా బయటకు వచ్చిన లీకులపై విస్తృతంగా చర్చ జరిగిన పిమ్మట ‘ఆ వార్తలు మీడియా సృష్టి, నాకేమీ సంబంధం లేదు అని ఖండన ఇచ్చుకునే విధంగా వుండాలి. అలా అని ఆ వార్తలో పూర్తిగా  నిజం వుండకూడదనీ కాదు. అలా అని అసలు నిజం లేదనీ కాదు.  ఆ లీకు వీరుడి పేరు ఎటువంటి పరిస్థితుల్లో  వెల్లడి కారాదు. (సోర్స్  చెప్పాల్సిన  అవసరం మాకు లేదు’ అనే unwritten హక్కు గురించి మాట్లాడేది ఇలాంటి సందర్భాలలోనే). ఇన్ని షరతులతో లీకులు బయటకి వస్తాయి కాబట్టే వాటికి అంతటి డిమాండ్.

ఇంతకీ ఈ లీకులు ఏమిటి? ఎలా పురుడు పోసుకుంటాయి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించేరోజుల్లో అధికార పక్షంలోని అసంతృప్తులే ఈ లీకుల్ని విలేకరులకు ఉప్పందించేవారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వచ్చింది. తదనంతర కాలంలో ఇవి పతాక స్థాయికి చేరి ఏది నిజమో ఏది అబద్ధమూ తెలియనంతగా మారిపోయి పాత్రికేయ ప్రమాణాలను, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా విశ్వరూపం దాలుస్తున్నాయి.

ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పౌర సంబంధాల అధికారులు ఈ లీకు వ్యవహారాలను చూస్తుంటారు. అల్లాగే మంత్రుల దగ్గర పనిచేసేవాళ్ళు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాం.

ఓ ఉదయం (అప్పటికి మీడియా విస్తృతి ఇంత లేదు. పత్రికలే రాజ్యం చేస్తున్నాయి, ఇప్పటికీ వాళ్ళదే రాజ్యం. అందుకే పలానా పత్రిక కావాలని రాసింది అని రాజకీయులు అంటుంటారు. ప్రింటులో వచ్చే వార్త ఖచ్చితం అని నమ్మేవారు ఉండడమే ఇందుకు కారణం) ఓ పత్రికా విలేకరికి  ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోర్స్ నుంచి ఫోన్ వస్తుంది. సంభాషణ ఇలా నడుస్తుంది.

‘ఏమిటి సంగతులు ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా!’

‘మా దగ్గర వార్తలు ఏముంటాయి? మీరిస్తేనే కదా మాకు వార్తలు

‘అలా అంటావు కానీ మీరు రాసేవే మాకు వార్తలు. మొన్న చెప్పాను కదా! ఆయన ఆ పెద్దాయన్ని కలిశాడు అంటున్నారు. నీకేమైనా తెలుసా?

‘తెలియదే. ఎప్పుడు?’

‘నేనూ విన్నదే! కనుక్కోని చెప్పు

ఇక అక్కడినుంచి ఆ విలేకరి పని మొదలవుతుంది. ‘ఆయన అంటే ముఖ్యమంత్రి. మరి పెద్దాయన ఎవరు?

‘ఆయన డ్రైవర్ నెంబరుకు ఫోను చేశాడు. వీ ఐ పీ రాకపోకలు కనుక్కోవాలంటే పోలీసులు, డ్రైవర్లను మించి విలేకరులకు మంచి సోర్సు దొరకదు.

డ్రైవర్ దొరికాడు కానీ కావాల్సిన సమాచారం రాలేదు. కాకపొతే ఓ విషయం చెప్పాడు. ఆ రోజు ‘ఆయన అధికారిక వాహనం కాకుండా వేరే కారులో వెళ్ళిన మాట ధృవీకరించాడు. వెంట ఎవరు వెళ్లిందీ చెప్పాడు. ఆ వెంట వెళ్ళిన వాళ్ళను పట్టుకుంటే ‘ఆ పెద్దాయన ఎవరో తెలిసింది.

ఇవన్నీ జరిగిన సంగతులు. తర్వాత కావాల్సిన విధంగా మసాలాలు దట్టించి  వార్తను వండి వార్చడమే.

‘అధిష్టానంపై తిరుగుబాటుకు పావులు కదుపుతున్న ముఖ్యమంత్రి!’

‘కేంద్రంలో చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ మంత్రిని రహస్యంగా కలుసుకుని చర్చలు జరిపిన  ముఖ్యమంత్రి’

ఇది హెడ్డింగు. అసలు వార్త అనేక సోయగాలు అద్దుకుని అక్షరాల రూపంలో మర్నాడు పత్రికలో మొదటి పేజీలో దర్శనం ఇస్తుంది.

దానితో పాటే ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ‘ఖండన’ ప్రకటన కూడా ఆ పత్రిక కార్యాలయానికి చేరుతుంది.    

ఇతి వార్తాః   

ఉందిలే మంచి కాలం ముందు ముందునా – భండారు శ్రీనివాసరావు

 ఏవిటి రామయ్యా! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్’

ఏముంది మరో రెండు నెలల్లో మన జీవితాలు ఎన్ని కొత్త మలుపులు తిరుగుతాయో తలచుకుంటూనే ఆశ్చర్యంగా వుంది’

అందుకోసం పొద్దటి నుంచీ తిండి కూడా తినకుండా ఆ కుక్కి మంచంలో పడుకుని కాలుమీద కాలు వేసుకుని మరీ ఆలోచిస్తున్నావ్! ఇంతకీ ఆ జరగబోయే మంచి ఏమిటో చెప్పు, నాకూ వినాలని వుంది’

ఇక నుంచి నువ్వూ నేనే కాదు మన ఇంట్లో పిల్లా పాపా అందరం కాలుమీద కాలువేసుకుని దర్జాగా గడిపే రోజులు వస్తున్నాయి. కలలో కూడా ఊహించలేదు సుమా!’

ఏవిటి! పరగడుపునే నాలుగు పేకెట్లు పడ్డాయేమిటి కడుపులో’

అలానే అంటుండు. అప్పుడే ఏప్రిల్ వచ్చేసింది. ఈ నెలకు ముప్పయి రోజులే. పైన మే నెలలో మరో రెండు  రోజులు. ఎంతలో దొర్లిపోతాయి చూస్తుండు’

మేలో ఏం జరుగుతుందేమిటి? మహా అయితే ఎండలు ఇంకా మండుతాయి’

ఇక మనకు కడుపు మండడాలు గట్రా వుండవు. అన్నీ మంచి రోజులే. పించన్లు నాకూ మా ఆవిడకు, నీకూ మీ ఆవిడకు మాత్రమే కాదు, చదువంటక రోడ్లు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరు పిల్లలకు నెల తిరిగేకల్లా విచ్చు రూపాయలు కళ్ళముందు గలగలా మంటాయి. ఉద్యోగం వున్నా డబ్బులే, లేకున్నా డబ్బులే. గ్యాస్ బండలు రూపాయి ఖర్చు లేకుండా వంటింట్లోకి దొర్లుకుంటూ వస్తాయి, కాణీ ఖర్చు లేకుండా. పెళ్ళయిన పిల్లకి పసుపు కుంకుమ, పెళ్లి కాని దానికి మనం కొనిపెట్టలేని అవేవో ల్యాప్టాపులూ, సెల్ ఫోన్లు. వాళ్ళ చదువులు అన్నీ ఇక మనం చూసుకోనక్కర లేదు. పండినా పండక పోయినా ఇన్నాళ్ళు మనకు డొక్కలు ఎండడమే. పంట వేసుకోవడానికి డబ్బులు, పైర్లు కోసుకోవడానికి డబ్బులు. రోగంరొష్టు వస్తే యెట్లా అనే బాధ లేదు. బతికున్నా డబ్బులే. రోగం వచ్చినా డబ్బులే. ఆఖరికి చచ్చి కాటికి వెళ్ళినా డబ్బులే. వచ్చే ఎన్నికల నాటికి ఇంకెన్ని ఇస్తామంటారో. ఇన్నాళ్ళు ఏదో చచ్చామో బతికామో తెలియకుండా బతుకులు ఈడుస్తున్నాం. ఇక బతుకు గురించి బెంగ లేదు. సంసారం ఎలానా అన్న దిగులు లేదు. ఎవరు గెలిస్తే మనకేమిటి. మనకు నిత్యం చచ్చి బతికే పనిలేకుండా చేస్తామంటున్నారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనకు పోయేదేమీ లేదు. వాళ్ళందరూ గెలవాలనే మనం దేవుడ్ని కోరుకుందాం’

అదెలా కుదురుతుంది. ఎవరో ఒకళ్లెకదా గెలిచేది. మరి అందరూ గెలిస్తే కదా నువ్వు చెప్పిన కోరికలన్నీ తీరేది’

అందుకే ఇందాకటి నుంచి ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నువ్వన్నట్టు పోటీలో ఉన్న పార్టీలు అన్నీ గెలిస్తేనే కదా ఇవన్నీ నిజం అయ్యేది. అందుకని ఓ పని చేద్దాము. పోలింగు బూతులోకి వెళ్లి ఆ మెషిన్ మీద అన్ని పార్టీల గుర్తులు గుర్తు పెట్టుకుని ఒకేసారి అన్నింటిపైనా నొక్కేద్దాము, ఓ పనైపోతుంది. ఏవంటావ్’

(01-04-2021}

31, మార్చి 2021, బుధవారం

భగవద్గీత – బొగ్గులబస్తా

 తాతయ్య పొద్దున్నే లేచి భగవద్గీత చదువుతుండేవాడు. అది భగవద్గీత అని చాలా రోజులకుగానీ మనవడికి తెలియలేదు. అయితే ఎన్నిసార్లు విన్నా ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. ఆ సంగతి తెలిసి తాతయ్య చెప్పాడు. 'ఇదిగో ఈ ఖాళీ బొగ్గుల బస్తా తీసుకు వెళ్లి మన ఇంటి దగ్గర వాగులో నుంచి ఓ బస్తాడు నీళ్ళు పట్రా'

మనమడు వెళ్ళాడు. బస్తాను నీళ్ళల్లో ముంచి తీసాడు. ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం నీళ్ళు కారిపోయాయి. మనుమడు మళ్ళీ ముంచి తీసాడు. మళ్ళీ తీసాడు. ఎన్ని సార్లు ముంచి తీసినా చారెడు నీళ్ళు కూడా బస్తాలో మిగిలేవి కావు. ఇలా కాదనుకుని ఈసారి బస్తాను నీటిలో ముంచి క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి చేరేసరికల్లా మళ్ళీ బస్తా ఖాళీ. 'తాతయ్యకు కావాల్సింది నీళ్ళే అయినప్పుడు బస్తా ఎందుకు బకెట్టు తీసుకువెడితే సరి' అని అది చేత్తో పట్టుకున్నాడు. తాతయ్య ససేమిరా వల్లకాదన్నాడు. బస్తాతోటే నీళ్ళు తెమ్మన్నాడు. మనుమడి మళ్ళీ వాగు దగ్గరికి వెళ్ళాడు. బస్తాను నీటిలో ముంచి తీసి మెరుపు వేగంతో ఉరుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఆయాసమే మిగిలింది కాని బస్తాలో చేరెడు నీళ్ళు కూడా లేవు. అన్నీ దోవలోనే కారి పోయాయి. 'ఏమిటి తాతయ్యా ఇదంతా' అని అడిగాడు. తాతయ్య మందహాసం చేసాడు.

'ఒకసారి ఆ బస్తా వంక చూడు మనవడా' అన్నాడు. మనుమడు చూసాడు. నల్లటి బొగ్గుల బస్తా కాస్తా ఇప్పుడు మసంతా కొట్టుకు పోయి శుభ్రంగా వుంది.

తాతయ్య చెప్పాడు. 'చూసావా. నాలుగు సార్లు నీళ్ళల్లో ముంచితేనే బస్తాకు పట్టుకున్న బొగ్గుమసి కొట్టుకు పోయింది. నీళ్ళల్లోముంచి తీస్తుంటే మసి పోతుందని కూడా తెలవకుండా నువ్వు ఇదంతా చేసావు. భగవద్గీత కూడా అంతే! అర్ధం అయిందా లేదా అనికాదు. చదువుతూ పోతుంటే అది మన మనసుల్లోని కల్మషాన్ని తొలగిస్తుంది. తేరుకున్న నీటిలా మన మనసును తేటపరుస్తుంది. అదే భగవద్గీత మహత్యం!'

 

30, మార్చి 2021, మంగళవారం

మళ్ళీ అంటున్నాను ఇది అవసరమా! – భండారు శ్రీనివాసరావు

“కాలం మారింది సర్ అన్ని మతాలను గౌరవించాలి అన్న మాట అన్నారు అంటే మీరు దేశద్రోహి అంతే”

Sreeram Eswara గారు పెట్టిన కామెంటు ఇది. నేను రాసిన పోస్టు చదివి నేరుగా నాపై చేసిన వ్యాఖ్య ఇది. ఇది వారి అభిప్రాయం. దాన్ని వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ వారికి వుంది. నా సర్కిల్ లో వారు వున్నారో లేదో తెలియదు. కనుక ఆయన ఈ స్థాయిలో కామెంటు చేసినా, అందులో వాస్తవం వున్నాలేకపోయినా ఆ వ్యాఖ్యను నేను తొలగించడం లేదు.
కొందరు అలా కాకుండా నా పోస్టుతో సంబంధం లేకుండా వ్యాఖ్యలపై వ్యాఖ్యలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు తొలగించినా తప్పులేదు.
నా పోస్టుతో నేరుగా సంబంధం వుంటే వ్యాఖ్య రాయండి. లేదా ఊరుకోండి. నాతొ నిమిత్తం లేకుండా, సుదీర్ఘంగా సాగే చర్చకు జవాబు ఇవ్వడం కూడా కష్టం. సాధ్యం కాదు కూడా.
ఒక ‘దేశద్రోహి’తో ఫ్రెండ్ సర్కిల్ లో వుండడం Sreeram Eswara గారికి కూడా మంచిదికాదు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే నేను సంతోషిస్తాను.
నా రాతలు నచ్చని వాళ్ళు అనేకులు వున్నట్టు కూడా తేటతెల్లం అయింది. వారికోసం నా తీరు మార్చుకోను. వారికి నచ్చే రాతలు రాయలేను కూడా. కాబట్టి అలాంటివాళ్ళు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే నా అంతట నేను బ్లాక్ చేయడం నాకెందుకో నచ్చదు. అది నా పాలసీ కాదు. వుండదలచుకుంటే వుండండి, సహనం పాటిస్తూ. హుందాగా ఉంటూ.
విదేశాల్లో పాదరక్షల మీద మన దేవతల బొమ్మలు వేయడం ఎవరూ హర్షించే విషయం కాదు. కాకపోతే ఈ విమర్శలు చేసేవాళ్ళు అసలు మన పురాణాలనే పూర్తిగా చదవలేదని అనిపిస్తోంది. రాక్షసుల చేత అంతకంటే భయంకరంగానే పురాణాల్లో దేవతలను అవమానాలకు గురి చేయించారు.
నేను హిందువుని. హిందూ ధర్మం పాటిస్తాను. ‘సహనావతు’ అని ఆ ధర్మం నాకు బోధించింది.
ఇక చివర్లో ఒక మాట.
నేను రాసేవి ఆయా రాజకీయ పార్తీలకోసం, లేదా వాళ్ళ అధినాయకులకోసం. కొన్ని సందర్భాలలో ఈ రాతలు వాళ్లకు ఫీడ్ బ్యాక్. అది వాళ్లకు తెలుసు. తెలియనిదల్లా వారి అభిమానులకు. వారిని పట్టించుకుంటూ రాయాలి అంటే ఏ జర్నలిస్టు కూడా ఒక్క వాక్యం రాయలేడు. కాబట్టి వారందరికీ ఓ నమస్కారం.
(30-03-2021)

ఇటువంటివి అవసరమా!


మనమతం హిందూ మతం. దాన్ని గురించి గర్వపడదాం. ఆ మతానికి ఉన్న గొప్పతనాన్ని చెప్పుకుందాం. కానీ ఇతర మతాలను కించపరిచే హక్కు మనకు లేదు. మన మత గ్రంధాలు, ముఖ్యంగా భగవద్గీత వంటి వాటిని గురించి ఇతర దేశాల వాళ్ళు మంచి మాటలు చెబితే పొంగిపోతాం. ఆ విశాల హృదయం మనకు కూడా వుండాలని ఎప్పుడూ అనుకోం.




ఈ పోస్టు పెట్టిన వ్యక్తి నాకు బాగా కావాల్సిన వాడు. అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి వస్తుంటాడు. బహుశా ఇప్పుడు అక్కడే ఉన్నాడని అనుకుంటున్నాను. అక్కడ హిందూ టెంపుల్స్ గురించి, హిందూ దేవతల గురించి అక్కడి ప్రజల నుంచి ఏనాడైనా, ఎప్పుడైనా ఒక ప్రల్లదనపు మాట వినివుంటాడని నేను అనుకోను. ఎందుకంటే నేనూ చాలా సార్లు వెళ్లి వచ్చాను.
మనలో HATREDNESS వుంటే హృదయం విశాలం ఎలా అవుతుంది?
మన మతాన్ని మనం గౌరవించుకుందాం! అది మన ధర్మం.

వెలుగు చూడని వార్తలు – భండారు శ్రీనివాసరావు

 అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.

మర్నాడు ఒక ‘ప్రముఖ’ దినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.

అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ‘ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నది’ కిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ‘ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుంద’ని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ‘ఆ రెండు పత్రికలూ..’ అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

 

29, మార్చి 2021, సోమవారం

ఓ తుపాను ముచ్చట – భండారు శ్రీనివాసరావు

 ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!

దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.

ఈ తుపాను అదికాదు. దివి సీమ తుపానుకు  చాలా ఏళ్ళ ముందు నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు. 

ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది. 

ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు. 

తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.

అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.

వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.

మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు. 

తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  జనాలకు తెలవదు.