17, డిసెంబర్ 2020, గురువారం

వెలుగు చూడని వార్తలు

 


చాలా ఏళ్ళ క్రితం అప్పటి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకట్రామన్ హైదరాబాదు వచ్చి రాజ్ భవన్  గెస్ట్ హౌస్  లో మకాం చేశారు. అప్పుడు గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి. గవర్నర్ కార్యదర్శి గా వున్న కీర్తిశేషులు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ వి.చంద్ర మౌళిని వెంటబెట్టుకుని కుముద్ బెన్  గెస్ట్ హౌస్ కి  వెళ్లి మర్యాదపూర్వంగా ఉపరాష్ట్రపతిని కలిసారు.

మాటల సందర్భంలో గవర్నర్ కొంత ముభావంగా వుండడం గమనించి శ్రీ వెంకట్రామన్ ‘ఏమిటి అలా వున్నారు, ఒంట్లో బాగా లేదా’ అని పరామర్శించారు.

కుముద్ బెన్ అప్పుడు తన మనసు విప్పి ఇలా అన్నారు.

‘ఈ పత్రికల వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏ మంచి పనిచేయబోయినా అందులో ఈకలు పీకే ప్రయత్నం చేస్తారు. మంచి పనిలో చెడు కోణం చూసే వీళ్ళ పద్దతి చూస్తుంటే పొద్దున్నే పేపరు చదవాలంటే చిరాకుగా ఉంటోంది’

దానికి వెంకట్రామన్ చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పారు.

‘దీనికో చిట్కా వుంది. ఓ వారంపాటు ఏ పేపరూ చదవకుండా వుండండి. ఎనిమిదో రోజుకల్లా మనసుకు ప్రశాంతత చిక్కుతుంది

వామ్మో! సూర్యనారాయణా! – భండారు శ్రీనివాసరావు

 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్జీవోల సమ్మె జరుగుతున్న రోజులు.

ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టరు గారెకి చాలా దూరంలో వేరే జిల్లాకు బదిలీ అయింది. బదిలీ ఆపుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉండగానే ఈ సమ్మె వచ్చి పడింది. ఖమ్మంలో ఉంటున్న మా బావగారు నాకు ఫోన్ చేసి చెప్పారు,  డాక్టరు గారు బాగా తెలిసిన వాడు, ఎవరయినా తెలిసిన వాళ్ళు వుంటే సాయం చేయమని.

 వైద్య శాఖ మంత్రి గారు బాగా పరిచయం వున్న మనిషే. వెళ్లి కలుస్తే ఆయన ముందు సమ్మె అయిపోనీ చూద్దాం అన్నారు. కాస్త ఆగి  మళ్ళీ ఆయనే అన్నారు, ‘నేను చెబుతాను కానీ ఆ సూర్యనారాయణ వున్నాడే,  ఓ మొండి ఘటం, ఓ పట్టాన ఎవడి మాటా వినడు.

ఆ సూర్యనారాయణ గారు సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి.  ఆ రోజుల్లో వైద్య శాఖ కార్యదర్శిగా వున్నారు. ఆయనని వేరే శాఖ నుంచి బదిలీ చేసి ఎక్కువ కాలం కూడా కాలేదు. ఎవరి మాట లెక్కపెట్టని  అధికారి అని పేరు. ముక్కుసూటి మనిషి. తోటి  ఐ.ఏ.ఎస్. అధికారులు కూడా ఆయనకు ఒక మాట చెప్పడానికి సంకోచించేవారు. ఇక మామూలు అధికారులు అయితే ‘వామ్మో! సూర్యనారాయణ గారా! ఆయన ఎవరి మాటా వినే రకం కాదు’ అని ముందే  తప్పుకునేవారు.

ఇక ఏమైతే అదే అయిందని నేనే సచివాలయానికి వెళ్లాను ఆయన్ని కలుద్దామని. సచివాలయం మొత్తం బోసిపోయి వుంది. ఎక్కడా చడీ చప్పుడు లేదు. ఉన్నతాధికారులు మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. సూర్యనారాయణ గారి  చాంబర్స్ కు వెళ్లాను. చీటీలు ఇచ్చే అటెండర్లు లేరు. లోపల అధికారి వున్నారో లేరో చెప్పే పియ్యేలూ  లేరు. నీరవ నిశ్శబ్దంగా వుంది. నేనే తలుపు తట్టి  ‘మే ఐ క మిన్ సర్’ అన్నాను మెల్లగా. ‘యస్’ అని వినిపించింది లోపల నుంచి గంభీరంగా. తలుపు తోసుకుని వెళ్లాను.

తెల్లటి దుస్తుల్లో నల్లటి మనిషి ఒకరు కుర్చీలో కనిపించారు.

“ఎవరు మీరు? ఏం కావాలి” అన్నారాయన మరింత గంభీరంగా.

రేడియో కరస్పాండెంట్ ని అని చెప్పగానే ఆయన, నేను వచ్చింది సమ్మె సమాచారం కోసం అని అనుకుని అలాటి విషయాలు మీరు సీ ఎస్ ఆఫీసులో అడగాలి, నన్ను కాదు’ అన్నారు కరకుగా.

అప్పుడు  నేను వచ్చిన పని చెప్పాను. బదిలీ విషయంలో మీకు రికమెండ్ చేయడానికి పెద్ద పెద్దవాళ్లు కూడా జంకుతున్నారు. అంచేత నేనే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను’ అని చెప్పాను మాటల్ని కూడగట్టుకుంటూ.

‘ఎవరా డాక్టరు ఎక్కడ పనిచేస్తారు అని అడిగితే  చెప్పాను వివరాలు. అవి రాసి ఉంచుకున్న చీటీ ఆయనగారి చేతికి అందించాను.

ఒకసారి చదువుకుని ఆయన కుర్చీలో నుంచి లేచారు బయటకు వెళ్ళడానికి. ఇక ఇది  అయ్యే పని కాదనుకుని నేనూ ఆయన వెంట బయటకు వచ్చాను.

చిత్రంగా ఆయన పెయ్యే టేబుల్ దగ్గర ఆగిపోయి  టెలిఫోన్ డైరెక్టరీ చేతిలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా డి.ఎం.అండ్ హెచ్.ఓ. కి ఫోన్ చేశారు.

ఆయన లైన్లోకి రాగానే మా డాక్టరు గారి  వివరాలు చెప్పి, రిలీవ్ చేయవద్దని  అని నోటిమాటగా ఉత్తర్వులు ఇచ్చారు. ‘సార్! ఆర్డర్ టైప్ చేయడానికి స్టాఫ్ ఎవరూ లేరు’ అని అవతల నుంచి అన్నట్టు వుంది.

‘నా దగ్గర ఏమైనా వున్నారా!  నేనే డైరెక్టరీ వెతికి మీకు ఫోన్ చేశాను.. అర్ధం అయిందా’ అన్నారు సూర్యనారాయణ గారు తనదైన శైలిలో. 

అటు డి.ఎం.అండ్ హెచ్.ఓ. గారెతో పాటు ఇటు నాకూ అర్ధం అయింది, ఆయన వ్యవహార శైలి.

సూర్యనారాయణ గారెని చూడడం అదే నాకు మొదటి సారి. ఇలాంటి అధికారులు కూడా వుంటారా అని అనుకుంటూ బయటపడ్డాను.

నాకు తెలిసి ఆ డాక్టరు గారెని తర్వాత ఎవరూ కదల్చలేదు. ఖమ్మంలోనే రిటైర్ అయ్యారు.

ఇప్పుడు   ఆ అధికారీ లేరు, ఆ డాక్టరు గారూ లేరు, నా జ్ఞాపకాల్లో తప్పించి. (17-12-2020)                            

 

15, డిసెంబర్ 2020, మంగళవారం

పోట్లాడే పురోహితుడు – భండారు శ్రీనివాసరావు

 ‘‘ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు శాపం ద్వారా కానీ, శరం ద్వారా కానీ యుద్ధం చేయగలుగుతాడు.

అయితే ఈనాటి ఈ వ్యాస ప్రేరకుడు అయిన బ్రాహ్మణుడు యుద్ధాలు చేసేవాడు కాదు, శాపాలు పెట్టేవాడూ కాదు. కేవలం సంభావనల దగ్గర పోట్లాటకు దిగేవాడు. అదీ ఆయన అడిగినంత సంభావన ఇవ్వకపోవడం వల్ల కాదు, మనం ఇచ్చే సంభావన ఆయనకు నచ్చకపోవడం వల్ల.
ఇందులో విశేషం ఏముంది?
చాలా సందర్భాలలో విన్నదే కదా అనుకోవచ్చు. కానీ ఈ పురోహితులవారి తరహానే వేరు. అందుకే ఆయన గురించి రాయాలని అనిపించింది.
వీరి పేరు ఇంగువ వెంకయ్య గారు. మా స్వగ్రామంలో మా ఇంటి పురోహితులు. శుభాశుభ కార్యక్రమాలన్నింటికీ ఆయనే బ్రహ్మ. మా అక్కయ్యల పెళ్ళిళ్ళు, మా పెద్దన్నయ్య పెళ్లి, ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా రెండో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు, మా మూడో అన్నయ్య పెళ్లి ఆయన నలుగురి పిల్లల పెళ్ళిళ్ళు ఆయనే దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించారు. నా పెళ్లి నేనే చేసుకున్నా కాబట్టి ఆయన గారికి ఛాన్స్ దొరకలేదు. మా ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తూ ఆయన తన పెళ్లి మాట మరచిపోయారేమో అలాగే చివరి వరకు ఘోటక బ్రహ్మచారిగానే వుండిపోయారు.
మనిషి మంచివాడే కానీ ఈయనతో రెండు సమస్యలు. అది వ్రతం కానీ, వడుగు కానీ, ఆబ్దీకం కానీ మొత్తం క్రతువు శాస్త్ర ప్రకారం జరిపించాల్సిందే. తూతూ మంత్రం వ్యవహారం కాదు. పూర్తిగా అంతా పద్దతి ప్రకారం చేయాల్సిందే. గంటలు గంటలు సాగే ఈ తంతు చూస్తూ బీపీలు, సుగర్లు వున్నవాళ్ళకు కళ్ళు తిరిగిపోయేవి. ‘అయ్యా వెంకయ్య గారూ, అందరూ పెద్దవాళ్లు, భోజనానికి ఆగలేరు, కాస్త త్వరగా లాగించండి’ అని మొత్తుకున్నా ఆయన వినిపించుకునే రకం కాదు.
మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కొడుకు పెళ్ళి హైదరాబాదులో జరిగితే ఆయనే వచ్చి చేయించారు. వడుగు ముందు ఇంట్లో చేసుకుని తర్వాత కళ్యాణ మంటపానికి వెళ్ళాలి. వెంకయ్య గారు తెల్లవారుఝామునే వడుగు కార్యక్రమం మొదలెట్టారు. బారెడు పొద్దెక్కినా వడుగు తంతు సాగుతూనే వుంది. అవతల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. కానీ వడుగు ఓ పట్టాన తెమిలేలా లేదు. సాధారణంగా సంయమనం కోల్పోని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఇక ఉండబట్టలేక ‘వెంకయ్యగారు మీరు ఇక్కడ వడుగు చేస్తూనే వుండండి, ఈలోపల మేము వెళ్లి ఆ పెళ్లి పని ముగించుకుని వస్తాం’ అనేసారు.
ఇక సంభావన దగ్గరికి వచ్చేసరికి వస్తుంది అసలు తంటా. ఇక్ష్వాకుల కాలం నాటి రేట్ల ప్రకారం పదో పరకో చాలనే తత్వం ఆయనది. (ఈ కధాకాలం ముప్పయ్యేళ్ళ నాటిది) తమతమ విభవానికి తగ్గట్టు ఎవరైనా వేయి నూట పదహార్లు ఇవ్వబోయినా ఆయన తీసుకోరు. తను తీసుకునే నూట పదహారు రూపాయలు లెక్కకట్టి తీసుకుని మిగిలిన డబ్బు గృహస్తుకు ఇచ్చేసి వెడతారు. కాదుకూడదు అంటే వస్తుంది తంటా. చూసేవారికి ఆయన అడిగినంత వీళ్ళు ఇవ్వడం లేదేమో, అందుకే పొట్టు పొట్టవుతున్నారు అని అపోహ పడే ప్రమాదం కూడా వుంది.
‘వెంకయ్య గారికి సంభావన ఇచ్చే వేళయింది. అందరూ లేచి అడ్డంగా నిలబడండి, ఆయనగారు సంభావన తీసుకోకుండా వెళ్ళిపోతారేమో” అని మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారు అంటుండేవారు హాస్యోక్తిగా.
మా రెండో అన్నయ్య కుమారుడి పెళ్ళిలో సంభావన కింద మా అన్నగారు ఐదువేల నూట పదహార్లు ఇద్దామనుకుని కూడా వెంకయ్య గారితో తంటా ఎందుకని వేయి నూటపదహార్లు తాంబూలంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది చూసి నాకు నూట పదహార్లు చాలు అని మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వబోయారు. ‘మా తృప్తి కొద్దీ ఇస్తున్నాం. కాదనకండి’ అని మా అన్నయ్య ఆయనకు నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తే వెంకయ్య గారు ఇలా అన్నారు. ‘లడ్డూలు రుచిగా వున్నాయని ఐదో ఆరో తినం కదా! సంభావన కూడా అంతే. నేనెంత తీసుకోవాలో అంతే తీసుకుంటాను’ ఇదీ ఆయన వరస.
గోదానాల వల్ల లభించిన ఆవులతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది మా చిన్నప్పుడు. వాటిని మేపే శక్తిలేని వెంకయ్య గారి ఇంట ఆ కళకళలు ఎన్నాళ్ళు వుంటాయి. వాటిని అమ్మేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. వాటిని పుష్టిగా మేపడానికి ఆదాయం సరిపోదు. అయినా సరే వెంకయ్య గారు తను నమ్మిన సిద్దాంతానికే జీవితాంతం కట్టుబడే వున్నారు. తన సంపాదనలో కొంత ఆవుల మేతకు ఖర్చు చేసేవారు. నోట్ల రూపంలో వచ్చే సంభావనలు మినహాయిస్తే నాణాలుగా వచ్చిన వాటిని ఖర్చుచేయడం వారి ఇంటా వంటా లేదు. చిల్లర డబ్బుల రూపంలో వచ్చిన సంభావనలు అన్నీ ఓ రేకు డబ్బాలో పడేసేవారు. వేయి రూపాయలుకు సరిపడా చిల్లర పైసలు ఆయన దగ్గర దొరుకుతాయని వూళ్ళో చెప్పుకుకుని నవ్వుకునేవారు. (15-12-2020)
(కింది ఫోటో: 1985లో మా పెద్దన్నయ్య పెద్ద కుమారుడు రఘు వివాహం, తర్వాత వ్రతం చేయిస్తున్న వెంకయ్య గారు)
Image may contain: 2 people, including Vani Veldurthy, people standing, child and indoor
Ramachandra Rao Bhandaru, Ramakrishna Jagarlamudi and 110 others
54 Comments
7 Shares
Like
Comment
Share
Comments

12, డిసెంబర్ 2020, శనివారం

Journalist Diary || SATISH BABU || సినిమావాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్...

Journalist Diary || SATISH BABU || With BHANDARU SRINIVAS RAO


 37 ఏళ్ళక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ, అలనాటి పాలక పక్షం కాంగ్రెసును మట్టికరిపించిన రోజుల్ని నాచేత, నానోట గుర్తు చేయించిన జర్నలిస్ట్ డైరీ సతీష్ బాబుకు, విశ్వనాధ్ గారికి కృతజ్ఞతలు.

సిద్దిపేటలో విమానాశ్రయం ఊహకందని విషయం: Political Analyst Bhandaru Sriniva...