6, ఆగస్టు 2020, గురువారం

ఇంటికి చేరిన పుస్తకం - పది భావజాలాలు


ఎస్. జైపాల్ రెడ్డిగారు రాసిన పది భావజాలాలుఅనే పుస్తకం నిన్ననే ఇంటికి చేరింది. ముద్రణ విషయంలోనే కాదు, ఆ పుస్తకాన్ని ఆత్మీయులకు చేరవేసే విషయంలో కూడా వారి కుమారుడు సూదిని ఆనంద్ రెడ్డిగారు చాలా శ్రమ తీసుకున్నారు అనిపించింది.
మితృలు భండారు శ్రీనివాసరావు గారికి కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్ధంఅంటూ వారి శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డిగారి పేరిట ప్రత్యేకంగా అచ్చొత్తి౦చిన ఒక కార్డును కూడా పుస్తకానికి జతచేసి పంపడంలో వారి సౌజన్యం కనిపించింది.
జైపాల్ రెడ్డిగారు ఎమ్మెల్యేగా వున్ననాటి నుంచి ఒక విలేకరిగా నాకు ఆయనతో పరిచయం. ఆయనది Oxford English అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అంత చక్కటి ఆంగ్లభాషా పరిజ్ఞానం. ఒక్కోసారి ఆయన మాట్లాడింది రిపోర్ట్ చేయాలంటే డిక్షనరీ చూడాలి అని హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాంటి ప్రజ్ఞావంతుడు ఇంగ్లీష్ లో రాసిన గ్రంధాన్ని తెనుగు చేయడం అంటే కత్తి మీద సామే. అయితే ఈ పుస్తకాన్ని అనువదించిన ప్రముఖ పాత్రికేయులు కల్లూరి భాస్కరం గారికి ఈ సాముగరిడీలు వెన్నతో పెట్టిన విద్య. జైపాల్ రెడ్డిగారు తమ ఈ పది వ్యాసాలకు వస్తువుగా ఎంచుకున్నది ఆషామాషీ అంశాలు కావు. మొత్తం ప్రపంచ చరిత్రను ఆపోసన పట్టి రాసినట్టుగా అనిపించే సైద్ధాంతిక సూత్రాలను ఆయన తన అనుభవంతో రంగరించి అక్షరరూపం ఇచ్చారు. ఆ రూపానికి తెలుగులో సొగసులు అద్దారు భాస్కరం గారు.
2005 లో జైపాల్ రెడ్డిగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని ఆయన తన ముందుమాటలో సవిస్తరంగా ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో ఆయన వినయశీలత కనబడుతుంది. అది ఇలా మొదలవుతుంది.
నా ఇరవైల నుంచి సహ విద్యార్ధుల ముందు, రాజకీయ సహచరుల ముందు,మీడియా నిపుణుల ముందు, విద్యావేత్తల ముందు నేనేదో పెద్ద మేధావిననుకుంటూ పొగరుతో జంకు లేకుండా ఆశుప్రసంగాలు చేస్తుండేవాడిని. అదృష్టం కలిసొచ్చి అలాంటి బడాయి ప్రసంగాలతో నలభయ్ ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడుపుకొచ్చాను. అంతేతప్ప నేను బహుముఖ పాండిత్యం వున్నవాడిని కాదు. పార్లమెంటు సభ్యుడిగా ఎంతోకొంత రాణించడానికి సరిపోయినంత సాధారణ లోకజ్ఞానం వుంటే చాలుననుకునే వృత్తిరాజకీయవాదిని మాత్రమే
సరే! ఇది ఆయన సౌజన్యానికి సంబంధించిన విషయం. నాలుగు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఏడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు అంటే జైపాల్ రెడ్డి గారు తానుగా చెప్పుకున్నట్టు ఎంతోకొంత రాణించిన ప్రజాప్రతినిధి ఎంతమాత్రం కాదు.
ఇక పుస్తకంలో ఆయన ప్రస్తావించిన పది భావజాలాలు ప్రజలు ప్రతి రోజూ వింటున్నవే కానీ వాటి మూలాల్లోకి వెళ్లి జైపాల్ రెడ్డి గారు వాటిని వివరించిన విధానం మెచ్చుకోదగ్గది. దాన్ని సరళతరంగా తెనుగు చేయడానికి ఎంతో శ్రమ పడిన కల్లూరి భాస్కరం గారి కృషి అనన్య సామాన్యం.
గోపాల కృష్ణ గాంధీ గారు ముందు మాట రాసారు. ఈ పుస్తకం గురించి శ్రీయుతులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ దీపక్ నయ్యర్ రాసిన పరిచయ వాక్యాలను కూడా పొందుపరిచారు.
ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారు ప్రచురించిన ఈ మూడు వందల పైచిలుకు పేజీల పుస్తకంలో ధర గురించిన ప్రసక్తి లేదు. (05-08-2020))



2, ఆగస్టు 2020, ఆదివారం

అంజయ్య గారిపై రాజీవ్ గాంధీకి కోపం ఎందుకు వచ్చింది?

ఓ రోజు మధ్యాన్నం ముఖ్యమంత్రి అంజయ్య యధావిధిగా సచివాలయంలో కొలువు తీరారు. ఇలా కాలక్షేపాలు చేయడానికి కారణం ఆయనే చెప్పారు.  తెల్లారుతూనే రాష్ట్ర పోలీసు హెడ్డు సీఎం ని కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితి వివరిస్తారు. ఆర్ధిక శాఖకు చెందిన అత్యున్నత అధికారి ఒకరు అంతకు ముందు రోజే ముఖ్యమంత్రికి  రాష్ట్ర ఖజానా  స్తితి గతులు, అంటే  ఖర్చులూ, పన్ను వసూళ్లు వగైరా ఏరోజుకారోజే తెలియచేస్తారు. ఈ రెండూ బాగుంటే ఇక మనం  చేసేది ఏముంటుందని  రొటీన్ ఫైళ్ళు సంతకాలు చేసుకుంటూ మంత్రివర్గ సహచరులతో, పేషీ అధికారులతో, జర్నలిస్టు మిత్రులతో హాయిగా  పిచ్చాపాటీ కాలక్షేపం చేయడం ఆయనకు రివాజు.  ఆ రోజు అలా సభ సాగుతూ వుండగా మొయినుద్దీన్ (సిఎం ఆంతరంగిక  కార్యదర్శి) వచ్చి అంజయ్య గారి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన హడావిడిగా లేచి వెళ్లి యాంటీ రూములో ఫోను మాట్లాడివచ్చారు. రమణమూర్తి గారిని పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్పారు. వూళ్ళో కట్టిన బ్యానర్లు వగైరా వెంటనే తీసేవేసే పని చూడమని చెబుతున్నట్టు అర్ధం అవుతూనే వుంది. (ఇక్కడ ఓ విషయం చెప్పాలి, అంజయ్యగారి ఆంతరంగిక బృందం గురించి వెంకయ్యనాయుడు గారు కాబోలు అసెంబ్లీలో ప్రాసయుక్తంగా ‘ఇంట్లో ఇంద్రసేనారెడ్డి, రూములో రమణమూర్తి, ముంగిట్లో మొయినుద్దీన్, ఇలా ఇంతమందిని దాటుకుని వెళ్ళాలి అంజయ్య గారి దర్శనం కావాలంటే’ అనేవారు. పూర్తి పాఠం పాశం యాదగిరి చెప్పాలి. ఇంద్రసేనారెడ్డి అంటే ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడు).

జరిగింది ఏమిటంటే రాజీవ్ గాంధీ మొదటిసారి హైదరాబాదు వస్తున్నారు. నగరమంతా ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. ఇలాంటి ఆర్భాటాలు రాజీవ్ కు నచ్చవు అని తెలుసుకున్న కొందరు పార్టీ నాయకులు ఆ విషయాన్ని చిలవలు, పలవలు చేర్చి ఢిల్లీకి మోశారు. ఆ రోజు వచ్చిన ఆ ఫోను పార్టీ అధిష్టాన దేవతల పూజారి నుంచి. తక్షణం అవన్నీ తొలగించాలని హుకుం.

మర్నాడు రాజీవ్ పాసింజర్ ఫ్లయిట్ లో ఒక సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా బేగంపేటలోని విమానాశ్రయంలో దిగారు. విషయం తెలియని వందలాదిమంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ వెలుపల  మేళాలు మోగిస్తూ, డప్పులు కొట్టుకుంటూ, డాన్సులు చేస్తూ, మిఠాయిలు పంచిపెడుతూ, పూలు వెదజల్లుతూ, పుష్పహారాలతో స్వాగతం చెప్పే ప్రయత్నాల్లో వున్నారు. రాజీవ్ బయటకు వచ్చి కారు ఎక్కేటప్పటికి ఇదీ పరిస్తితి. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదంతా అంజయ్య గారి మీదికి మళ్ళింది.

సరే! తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు.

ఎయిర్ పోర్టులో రాజీవ్ అకాల ఆగ్రహానికి కారణం ఏమిటన్నది తర్వాత డాక్టర్ ఏపీ. రంగారావు ఇలా విశ్లేషించారు. రాజీవ్ రాజకీయాల్లోకి రాకముందు విమానాల పైలట్. ఎయిర్ పోర్టులో  పక్షి కనిపిస్తే పైలట్లకు పడదు. ఎందుకంటే ఆకాశంలో  ఎగిరే విమానాన్ని ఒక చిన్నపక్షి దీకొట్టినా  దానికి ప్రమాదమే. కాంగ్రెస్ కార్యకర్తలు పూలు, మిఠాయిలతో హడావిడి చేయడం గమనించిన రాజీవ్, వాటికోసం పక్షులు  వచ్చే అవకాసం వుందనుకున్నారు. ఇందుకు ఆ డాక్టర్ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే.

ఒక రోగి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంటిల్లిపాదీ అతడి చుట్టూ మూగి ఆందోళన పడుతుంటారు. ఈ స్తితిలో అక్కడకు వచ్చిన ఏ డాక్టర్ అయినా బంధువులపై కసురుకుంటాడు. ముందు అక్కడి నుండి వెళ్ళిపొండి, అతడికి గాలి తగలాలి’ అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ వైద్యుడు ఆగ్రహించింది ఒక మనిషిగా కాదు, ఒక డాక్టర్ గా. అలాగే విమానాశ్రయంలో కూడా రాజీవ్ తటాలున ఆగ్రహించడానికి ఇలాంటిదే కారణం కావచ్చని డాక్టర్ రంగారావు అభిప్రాయం. (నిజానికి రాజకీయ కారణాలు కూడా దోహదం చేసిన మాట కాదనలేము)               


1, ఆగస్టు 2020, శనివారం

స్వరయవ్వన రహస్యం

ఒకానొక కాలంలో రేడియో చిన్నక్కగా తన సుస్వరంతో లక్షలాదిమంది శ్రోతలను అలరించిన రతన్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితం ఫోను చేశారు. జర్నలిస్ట్ డైరీ ఫేం సతీష్ బాబు రూపొందించిన వీడియో చూసారట. అందులో తన గురించిన ప్రస్తావన వుందని మురిసిపోతూ చెప్పారు. ప్రస్తుతం ఆవిడ ఢిల్లీలో మనుమల దగ్గర వుంటున్నారు. సతీష్ కు థాంక్స్ చెప్పు బాబూ అని కోరారు.  

“మేమెవ్వరం రేడియోలో ఉద్యోగం అనుకుని చేయలేదు. కళాకారులకి కావాల్సింది కాసింత ప్రశంశ. అది మంచి టానిక్కులా పనిచేస్తుంది” అని అంటూ కొన్నేళ్ళ క్రితం సంఘటనను గుర్తుచేసుకున్నారు.

రేడియో న్యూస్ రీడర్ డి. వెంకట్రామయ్య గారు ఆకాశవాణిలో చిరకాలం పనిచేసిన వారితో ఒక ఇష్టాగోష్టి సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి కొద్ది రోజుల క్రితం రతన్ ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ‘నువ్వు నమ్మవు కానీ బాబూ నేను చావు ముఖంలో అడుగు పెట్టి మళ్ళీ బయటకు వచ్చాను. మా పిల్లలు ఆ మీటింగుకు ఇప్పుడు వెళ్లకపొతే ఏం’ అంటూ అభ్యంతర పెట్టారు. నా పోరు పడలేక తీసుకువచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన నన్ను చూస్తూనే నువ్వొక మాట అన్నావు, ‘ఏమండీ రతన్ ప్రసాద్ గారూ, మీ స్వర యవ్వన రహస్యం ఏమిటో చెబుదురూ’ అని. నిజం చెప్పొద్దూ! నేను ఎనభయ్ ఎనిమిదేళ్ళకు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఆ రోజు నువ్వన్న ఆ ఒక్క మాటే కారణం. అది మంచి టానిక్కులా పనిచేసింది. అంతకుముందు అనారోగ్యంతో చాలా అవస్థలు పడ్డాను. కానీ ఆరోజు నుంచి నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను. మా పిల్లలతో ఎప్పుడూ అంటుంటాను, శ్రీనివాసరావు ఆ ఒక్క మాటతో నాకు పునర్జన్మ ఇచ్చాడు అని. రేపోమాపో ఎనభయ్ తొమ్మిది వస్తుంది. ఈ కరోనా కాలం ముగిసి మళ్ళీ హైదరాబాదు ఎప్పుడు వస్తానో తెలవదు. ఈరోజు నీ పోస్టు చూసి ఫోన్ చేయాలనిపించింది. సతీష్ కు కూడా చెప్పు. ఈ వయస్సులోవున్న మాలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని ప్రోగ్రాం లో చేర్చినందుకు. వుంటాను నాయనా! ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆవిడను అడిగానని చెప్పు అనడానికి  నాకు నోట మాట రావడం లేదు. పాపం చిన్న వయసులోనే పోయింది. ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నవ్వుతూ, ఆప్యాయంగా మాట్లాడేది.  ప్రసాద్ గారు పోయిన తర్వాత నాకూ ఒంటరితనంలో బాధ ఏమిటో తెలుస్తోంది”

ఆవిడ అలా మాట్లాడుతూనే వున్నారు. నా ఆలోచనలో నేను వున్నాను.

ఒక మంచి మాటలో ఇంతటి శక్తి ఉందా!  

Image may contain: Ramarao Bondada and Bhandaru Srinivas Rao, people standing and indoor 

(01-08-2020)      

 


"మన రేడియో, మా రేడియో, నా రేడియో"


అయిదేళ్ళ క్రితం కాబోలు నా మితృడు జర్నలిస్ట్ డైరీ సతీష్ రూపొందించిన వీడియోలో నేను.
'రేడియో కార్మికుడు' అని నన్ను పరిచయం చేసిన సతీష్ సహృదయతకు నా ధన్యవాదాలు.

Image may contain: Bhandaru Srinivas Rao

30, జులై 2020, గురువారం

ఇదిగో ఇలాంటి రచనలే ఈనాటి అవసరం

 భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి. గతంలో ఇద్దరి ముగ్గురి అనుభవాలు ఫేస్ బుక్ లో చదివాను. వారితో పెద్ద పరిచయం లేకపోవడం వల్ల, వాళ్ళు మహిళలు కావడం వల్ల షేర్ చేయలేకపోయాను. ఇతరుల పోస్టులను సాధారణంగా నేను షేర్ చేయను. కానీ ఇలాంటి రచనలు నలుగురికీ చేరాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.
ఇదిగో ఇలాంటి రచనలే ఈనాటి అవసరం. భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.

రామకృష్ణ కధనం:

“ఇంట్లోకి వచ్చి ఇంటిల్లిపాదినీ చుట్టేసింది
కరెక్ట్ గా నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా పాట్లు ఇవాళ్టి తో
తీరాయి.
మా ఇంటిల్లిపాదీ అనుభవించిన ఆర్డియల్ అంతా ఇంతా కాదు.
నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా టెన్షన్.. నాకు టెంపరేచర్ తగ్గకపోగా మరో మూడు రోజుల్లో నా భార్య శ్రీదేవి, అబ్బాయి రాహుల్ కి కూడా జ్వరం సోకడంతో పడిన హైరానా అంతా ఇంతా కాదు.
మరెందుకు జాప్యం చేయడం ఎందుకనుకుని నేను, శ్రీదేవి, రాహుల్, ఏ అనారోగ్య లక్షణాలు లేకపోయినా మా కోడలు సోనాలి.. టెస్ట్ లకు సిద్ధం అయ్యాం. అసలైన ఆర్డియల్ మొదలైంది.
ఈ నెల 2న టెస్ట్, రెండు రోజుల తరువాత నలుగురికీ పాజిటివ్, పాజిటివ్ అని తెలిసిన రోజు రాత్రి పడిన టెన్షన్, హాస్పటల్ అడ్మిషన్ కోసం ఎంత మందిని అడిగానో.. ఎవరూ నో అనరు కానీ సాయం చెయ్యలేని పరిస్థితి..మా ఆఫీసు వాళ్లు ఒక వైపు, నా చిరకాల మిత్రుడు దేవులపల్లి అమర్ ఇంకో వైపు, నా సోర్సెస్ ద్వారా నేను మరోవైపు.. ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరాశ.. పెరుగుతున్న టెన్షన్..
మా రమణ అన్నయ్య (Asian Institute of Gastroentrogy -AIGలో పేషెంట్స్ కేర్ మేనేజర్)పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించి వాళ్ల గచ్చిబౌలి హాస్పటల్ లో నాకు, శ్రీదేవికి అడ్మిషన్ ఇస్తామంటే.. రాహుల్, సోనుని వదలి ఎలా వెళ్లాలని మరో టెన్షన్.. మర్నాడు వాళ్లకు అడ్మిషన్ ఇప్పిస్తానని అన్నయ్య భరోసా ఇచ్చాక హాస్పటల్ కి బయలుదేరాం.
ఇంత టెన్షన్, బాధ, నిస్సహాయత మధ్య ఏదో ఒకటి తినాలికదా.. ఏ లక్షణాలు లేకపోయినా తనకు పాజిటివ్ వచ్చిందన్న షాక్ లో ఉన్న సోను తేరుకుని, అప్పటికప్పుడు మా ఇద్దరికీ అట్లు పోస్తే ఎలా తిన్నామో? హాస్పటల్ కి ఏమేమి తీసుకు వెళ్లాలి, మేం రెంట్ కి ఉంటున్న ఇంటి వాళ్లకి ఎలా చెప్పాలి.. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో.. హాస్పటల్ కి వెళ్లేందుకు ట్రాన్స్ పోర్ట్ ప్రయత్నాలు.. మా ఆఫీసు వాళ్లు కూడా పాజిటివ్ కదా.. టాక్సీ వాళ్లు రారేమో (అప్పటికి రాత్రి తొమ్మిది) అన్న అనుమానం..
మరోవైపు.. రాహుల్.. మా ఇంటివాళ్ల అబ్బాయికి విషయం చెబితే.. అతగాడు పెద్ద మనసుతో అలాగా.. అనడమే కాకుండా ఏమైనా సాయం కావాలంటే చెప్పమంటే.. అతడిలో భగవంతుడు కనిపించాడు.. అరగంట లో వెహికిల్ (టాక్సీ ఏర్పాటు చేసుకున్నాం) రావడం.. తో బయలుదేరాం.
ఏఐజి గచ్చిబౌలిలో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూంటే మరేమీ చెయ్యలేక నేను, శ్రీదేవి బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇద్దరికి రూం ఇవ్వమని కోరితే... వేర్వేరు వార్డుల్లో ఇస్తున్నామని కోఆర్డినేటర్ చెప్పిన క్షణం పడిన వేదన.. ఆ వెంటనే తేరుకుని ఒకే రూం ఇచ్చే విషయం కన్సిడర్ చేయమని బతిమిలాడు కోవడం...అర్థరాత్రి దాటి ఒకటిన్నర సమయంలో ఓకే ఇద్దరికీ ఒకే రూం ఇస్తున్నట్టు చెప్పడంతో హమ్మయ్య అనుకుంటూ వదిలిన నిట్టూర్పు...అడ్మిట్ అయిన మరు క్షణం నుంచి ట్రీట్మెంట్ కి అవసరమైన వైద్య ప్రక్రియ మొదలుకావడంతో కాస్త కుదుటపడ్డా ఇద్దరి ఆలోచనలు ఇంట్లో ఉన్న అబ్బాయి, కోడలు గురించే... పాపం ఎలా ఉన్నారో అనే...
మా అదృష్టానికి మర్నాడు వాళ్లిద్దరికి అడ్మిషన్ ఇవ్వడమే కాదు.. ఒకరికొకరు తోడు ఉండడానికి వీలుగా ఓకే రూం అలాట్ చేయడం తో ముందు రోజు రాత్రి నుంచి పడిన టెన్షన్ తగ్గింది.
ఏఐజి ది గ్రేట్.. సర్వీస్, అటెన్షన్.. ట్రీట్మెంట్.. మెడికల్ టీం మిరాకిల్.. వెంటనే కోలుకోవడం మొదలైంది..మా అబ్బాయి, కోడలు నాలుగు రోజుల్లో డిశ్చార్జి అయితే నేను, శ్రీదేవి పూర్తిగా కోలుకుని తొమ్మిది రోజుల్లో ఇంచక్కా ఇంటికి వచ్చేశాం.
మేం హాస్పటల్ ఉండగానే మా ఆరోగ్యం గురించి ఫోన్ చేసి వాకబు చేసిన మాతో పాటు మా బిల్డింగ్ లో మరో రెండు పోర్షన్స్ లో రెంట్ కు ఉంటున్న కుటుంబాల వారు..మా పట్ల ఎంతో కన్ సర్న్ చూపించి.. ఏ హెల్ప్ కావాలన్నా తామున్నామని ఇచ్చిన భరోసా మర్చిపోలేనిది.
డాక్టర్స్ సూచించిన15 రోజుల హోం క్వారంటైన్ ఈ సోమవారం తో ముగియడంతో, కట్టడి చేసిన కరోనాని తరిమి కొట్టేమా లేదా నిర్ధారించుకోవడానికి నిన్న మరోమారు కోవిడ్ పరీక్ష లు చేయించుకున్నాం. ఇవాళ ఉదయం మా నలుగురిని ఆవరించిన కరోనా కనుమరుగైందంటూ.. నెగిటివ్ ఫలితం రావడంతో.. ఆ సంతోషం అందరితో పంచుకుంటున్నాను.
బిఎస్ రామకృష్ణ (BSR).
30-07-2020 – గురువారం”

Image may contain: 4 people, including Ramakrishna Buddhavarapu, people standing

29, జులై 2020, బుధవారం

పేర్ల పురాణం –

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారడం అందరికీ తెలిసిందే. పధకాలు కాకుండా ప్రభుత్వ శాఖల పేర్లు కూడా మారిపోవడం కూడా కొత్తేమీ కాదు. కొత్తగా మోడీ ప్రభుత్వం కేంద్రంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయించింది. సమగ్ర జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేసిన పిమ్మట దాని అమలుకోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ శాఖకు దాని పూర్వ నామమే దక్కింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యా మంత్రిత్వ శాఖగా ఉంటూ వస్తున్న ఈ శాఖ పేరును రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయినప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. అప్పటికే అనేక కీలకమైన శాఖలు నిర్వహించిన పీవీ. నరసింహారావు గారిని ఈ శాఖకు మంత్రిని చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పీవీ గారంతటి సీనియర్ కు ఇంతటి అప్రధాన శాఖ ఏమిటని. రాజీవ్ గాంధి ఆ శాఖ పేరును కూడా  మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. పీవీ గారు ఆ శాఖను ఎంత సమర్ధవంతంగా తీర్చిదిద్దారు అంటే చివరకు అది కేంద్ర ప్రభుత్వంలోని అతి కీలక మంత్రిత్వ శాఖల్లో ఒకటిగా మారిపోయింది.

ఇటువంటి ఘటనలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగాయి. సమాచార, పౌర సంబంధ శాఖను ఉన్నట్టుండి సమాచార, జన సంబంధ శాఖగా మార్చారు. అంటే పౌర అనే పదం తీసేసి జన అనే పదం చేర్చారు. కానీ రాజధాని నుంచి జిల్లాల వరకు ఆ శాఖ కార్యాలయాల బోర్డులను, లెటర్ హెడ్లను, ఆఖరికి అధికారిక స్టాంపులను మార్చాల్సి వచ్చింది.

మళ్ళీ చాలా కాలం  తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభువులకు ఆ పేరు నచ్చలేదు. తిరిగి సమాచార, పౌర సంబంధ శాఖగా మారిపోయింది.

చిత్రం ఏమిటంటే ఆ శాఖ పేరులోనే పౌర సంబంధాలు. నిజానికి ఆ అధికారులు నెరిపేది పత్రికా సంబంధాలు.

(29-07-2020)

27, జులై 2020, సోమవారం

వీళ్ళను భయపెట్టడం నా వల్ల కాదు - కరోనా మన్ కి బాత్


కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.

‘ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

‘ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’

‘ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.

‘నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’

‘అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు.  నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ  సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.

‘అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’

‘పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.

‘మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో నాలుగేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.

ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’