6, ఆగస్టు 2020, గురువారం

ఇంటికి చేరిన పుస్తకం - పది భావజాలాలు


ఎస్. జైపాల్ రెడ్డిగారు రాసిన పది భావజాలాలుఅనే పుస్తకం నిన్ననే ఇంటికి చేరింది. ముద్రణ విషయంలోనే కాదు, ఆ పుస్తకాన్ని ఆత్మీయులకు చేరవేసే విషయంలో కూడా వారి కుమారుడు సూదిని ఆనంద్ రెడ్డిగారు చాలా శ్రమ తీసుకున్నారు అనిపించింది.
మితృలు భండారు శ్రీనివాసరావు గారికి కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారి జ్ఞాపకార్ధంఅంటూ వారి శ్రీమతి లక్ష్మీ జైపాల్ రెడ్డిగారి పేరిట ప్రత్యేకంగా అచ్చొత్తి౦చిన ఒక కార్డును కూడా పుస్తకానికి జతచేసి పంపడంలో వారి సౌజన్యం కనిపించింది.
జైపాల్ రెడ్డిగారు ఎమ్మెల్యేగా వున్ననాటి నుంచి ఒక విలేకరిగా నాకు ఆయనతో పరిచయం. ఆయనది Oxford English అని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అంత చక్కటి ఆంగ్లభాషా పరిజ్ఞానం. ఒక్కోసారి ఆయన మాట్లాడింది రిపోర్ట్ చేయాలంటే డిక్షనరీ చూడాలి అని హాస్యోక్తిగా చెప్పుకునేవారు. అలాంటి ప్రజ్ఞావంతుడు ఇంగ్లీష్ లో రాసిన గ్రంధాన్ని తెనుగు చేయడం అంటే కత్తి మీద సామే. అయితే ఈ పుస్తకాన్ని అనువదించిన ప్రముఖ పాత్రికేయులు కల్లూరి భాస్కరం గారికి ఈ సాముగరిడీలు వెన్నతో పెట్టిన విద్య. జైపాల్ రెడ్డిగారు తమ ఈ పది వ్యాసాలకు వస్తువుగా ఎంచుకున్నది ఆషామాషీ అంశాలు కావు. మొత్తం ప్రపంచ చరిత్రను ఆపోసన పట్టి రాసినట్టుగా అనిపించే సైద్ధాంతిక సూత్రాలను ఆయన తన అనుభవంతో రంగరించి అక్షరరూపం ఇచ్చారు. ఆ రూపానికి తెలుగులో సొగసులు అద్దారు భాస్కరం గారు.
2005 లో జైపాల్ రెడ్డిగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన స్నాతకోత్సవ ప్రసంగాన్ని ఆయన తన ముందుమాటలో సవిస్తరంగా ప్రస్తావించారు. ఆ ప్రస్తావనలో ఆయన వినయశీలత కనబడుతుంది. అది ఇలా మొదలవుతుంది.
నా ఇరవైల నుంచి సహ విద్యార్ధుల ముందు, రాజకీయ సహచరుల ముందు,మీడియా నిపుణుల ముందు, విద్యావేత్తల ముందు నేనేదో పెద్ద మేధావిననుకుంటూ పొగరుతో జంకు లేకుండా ఆశుప్రసంగాలు చేస్తుండేవాడిని. అదృష్టం కలిసొచ్చి అలాంటి బడాయి ప్రసంగాలతో నలభయ్ ఏళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడుపుకొచ్చాను. అంతేతప్ప నేను బహుముఖ పాండిత్యం వున్నవాడిని కాదు. పార్లమెంటు సభ్యుడిగా ఎంతోకొంత రాణించడానికి సరిపోయినంత సాధారణ లోకజ్ఞానం వుంటే చాలుననుకునే వృత్తిరాజకీయవాదిని మాత్రమే
సరే! ఇది ఆయన సౌజన్యానికి సంబంధించిన విషయం. నాలుగు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఏడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు అంటే జైపాల్ రెడ్డి గారు తానుగా చెప్పుకున్నట్టు ఎంతోకొంత రాణించిన ప్రజాప్రతినిధి ఎంతమాత్రం కాదు.
ఇక పుస్తకంలో ఆయన ప్రస్తావించిన పది భావజాలాలు ప్రజలు ప్రతి రోజూ వింటున్నవే కానీ వాటి మూలాల్లోకి వెళ్లి జైపాల్ రెడ్డి గారు వాటిని వివరించిన విధానం మెచ్చుకోదగ్గది. దాన్ని సరళతరంగా తెనుగు చేయడానికి ఎంతో శ్రమ పడిన కల్లూరి భాస్కరం గారి కృషి అనన్య సామాన్యం.
గోపాల కృష్ణ గాంధీ గారు ముందు మాట రాసారు. ఈ పుస్తకం గురించి శ్రీయుతులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ దీపక్ నయ్యర్ రాసిన పరిచయ వాక్యాలను కూడా పొందుపరిచారు.
ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారు ప్రచురించిన ఈ మూడు వందల పైచిలుకు పేజీల పుస్తకంలో ధర గురించిన ప్రసక్తి లేదు. (05-08-2020))కామెంట్‌లు లేవు: