2, ఆగస్టు 2020, ఆదివారం

అంజయ్య గారిపై రాజీవ్ గాంధీకి కోపం ఎందుకు వచ్చింది?

ఓ రోజు మధ్యాన్నం ముఖ్యమంత్రి అంజయ్య యధావిధిగా సచివాలయంలో కొలువు తీరారు. ఇలా కాలక్షేపాలు చేయడానికి కారణం ఆయనే చెప్పారు.  తెల్లారుతూనే రాష్ట్ర పోలీసు హెడ్డు సీఎం ని కలిసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్తితి వివరిస్తారు. ఆర్ధిక శాఖకు చెందిన అత్యున్నత అధికారి ఒకరు అంతకు ముందు రోజే ముఖ్యమంత్రికి  రాష్ట్ర ఖజానా  స్తితి గతులు, అంటే  ఖర్చులూ, పన్ను వసూళ్లు వగైరా ఏరోజుకారోజే తెలియచేస్తారు. ఈ రెండూ బాగుంటే ఇక మనం  చేసేది ఏముంటుందని  రొటీన్ ఫైళ్ళు సంతకాలు చేసుకుంటూ మంత్రివర్గ సహచరులతో, పేషీ అధికారులతో, జర్నలిస్టు మిత్రులతో హాయిగా  పిచ్చాపాటీ కాలక్షేపం చేయడం ఆయనకు రివాజు.  ఆ రోజు అలా సభ సాగుతూ వుండగా మొయినుద్దీన్ (సిఎం ఆంతరంగిక  కార్యదర్శి) వచ్చి అంజయ్య గారి చెవిలో ఏదో చెప్పారు. వెంటనే ఆయన హడావిడిగా లేచి వెళ్లి యాంటీ రూములో ఫోను మాట్లాడివచ్చారు. రమణమూర్తి గారిని పక్కకు తీసుకువెళ్ళి ఏదో చెప్పారు. వూళ్ళో కట్టిన బ్యానర్లు వగైరా వెంటనే తీసేవేసే పని చూడమని చెబుతున్నట్టు అర్ధం అవుతూనే వుంది. (ఇక్కడ ఓ విషయం చెప్పాలి, అంజయ్యగారి ఆంతరంగిక బృందం గురించి వెంకయ్యనాయుడు గారు కాబోలు అసెంబ్లీలో ప్రాసయుక్తంగా ‘ఇంట్లో ఇంద్రసేనారెడ్డి, రూములో రమణమూర్తి, ముంగిట్లో మొయినుద్దీన్, ఇలా ఇంతమందిని దాటుకుని వెళ్ళాలి అంజయ్య గారి దర్శనం కావాలంటే’ అనేవారు. పూర్తి పాఠం పాశం యాదగిరి చెప్పాలి. ఇంద్రసేనారెడ్డి అంటే ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నాయకుడు).

జరిగింది ఏమిటంటే రాజీవ్ గాంధీ మొదటిసారి హైదరాబాదు వస్తున్నారు. నగరమంతా ఆయనకు స్వాగతం చెబుతూ బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. ఇలాంటి ఆర్భాటాలు రాజీవ్ కు నచ్చవు అని తెలుసుకున్న కొందరు పార్టీ నాయకులు ఆ విషయాన్ని చిలవలు, పలవలు చేర్చి ఢిల్లీకి మోశారు. ఆ రోజు వచ్చిన ఆ ఫోను పార్టీ అధిష్టాన దేవతల పూజారి నుంచి. తక్షణం అవన్నీ తొలగించాలని హుకుం.

మర్నాడు రాజీవ్ పాసింజర్ ఫ్లయిట్ లో ఒక సాధారణ ప్రయాణీకుడి మాదిరిగా బేగంపేటలోని విమానాశ్రయంలో దిగారు. విషయం తెలియని వందలాదిమంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ వెలుపల  మేళాలు మోగిస్తూ, డప్పులు కొట్టుకుంటూ, డాన్సులు చేస్తూ, మిఠాయిలు పంచిపెడుతూ, పూలు వెదజల్లుతూ, పుష్పహారాలతో స్వాగతం చెప్పే ప్రయత్నాల్లో వున్నారు. రాజీవ్ బయటకు వచ్చి కారు ఎక్కేటప్పటికి ఇదీ పరిస్తితి. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. అదంతా అంజయ్య గారి మీదికి మళ్ళింది.

సరే! తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు.

ఎయిర్ పోర్టులో రాజీవ్ అకాల ఆగ్రహానికి కారణం ఏమిటన్నది తర్వాత డాక్టర్ ఏపీ. రంగారావు ఇలా విశ్లేషించారు. రాజీవ్ రాజకీయాల్లోకి రాకముందు విమానాల పైలట్. ఎయిర్ పోర్టులో  పక్షి కనిపిస్తే పైలట్లకు పడదు. ఎందుకంటే ఆకాశంలో  ఎగిరే విమానాన్ని ఒక చిన్నపక్షి దీకొట్టినా  దానికి ప్రమాదమే. కాంగ్రెస్ కార్యకర్తలు పూలు, మిఠాయిలతో హడావిడి చేయడం గమనించిన రాజీవ్, వాటికోసం పక్షులు  వచ్చే అవకాసం వుందనుకున్నారు. ఇందుకు ఆ డాక్టర్ చెప్పిన ఉదాహరణ ఏమిటంటే.

ఒక రోగి కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. ఇంటిల్లిపాదీ అతడి చుట్టూ మూగి ఆందోళన పడుతుంటారు. ఈ స్తితిలో అక్కడకు వచ్చిన ఏ డాక్టర్ అయినా బంధువులపై కసురుకుంటాడు. ముందు అక్కడి నుండి వెళ్ళిపొండి, అతడికి గాలి తగలాలి’ అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ వైద్యుడు ఆగ్రహించింది ఒక మనిషిగా కాదు, ఒక డాక్టర్ గా. అలాగే విమానాశ్రయంలో కూడా రాజీవ్ తటాలున ఆగ్రహించడానికి ఇలాంటిదే కారణం కావచ్చని డాక్టర్ రంగారావు అభిప్రాయం. (నిజానికి రాజకీయ కారణాలు కూడా దోహదం చేసిన మాట కాదనలేము)               


1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

తనకోపమే తన శత్రువు అన్నమాట తెలియదనుకుంటా!☺️