10, ఆగస్టు 2020, సోమవారం

వైఎస్ ఆఖరి ఘడియలు

 వైఎస్ ఆఖరి ఘడియల్ని విజయమ్మ  తను రాసిన "నాలో...నాతొ...YSR"  అనే పుస్తకంలో  చాలా వివరంగా, ఒక డైరీ లాగా రాసుకొచ్చారు, ఈ పుస్తకంలో.

ఆవిడ మాటల్లోనే :

“సెప్టెంబరు -2.  ఉదయం 7.15 కల్లా రెడీ అయిపోయారు. బ్రేక్ ఫాస్ట్ దగ్గరకూర్చున్నప్పుడు జగన్ వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఫోను వచ్చింది. ‘సార్!  వర్షాలు బాగా పడుతునాయి. ఇప్పుడు పోవద్దు సార్!’ అంటున్నారు ఎవరో అవతల నుంచి. నేనూ అదే మాట చెప్పాను.

‘పైలట్ వద్దంటే చేసేదేముంటుంది. ఇంటికి వస్తాను. వేరే అప్పాయింట్ మెంట్లు లేవు కాబట్టి అందరం కూర్చుందాములే’ అన్నారు నాతో.

“ఎప్పుడూ నవ్వుతూ వుండే ఈయన ఆరోజు మాత్రం హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కొంచెం సీరియస్ గా వున్నారని చాలామంది నాతో చెప్పారు. తర్వాత టీవీల్లో చూసినప్పుడు నాక్కూడా అలాగే అనిపించింది.

“ఉదయం 8.34 కి  హెలికాప్టర్ టేకాఫ్ అయింది. 9.34 నుంచి హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయట.

“విషయం తెలిసి భారతి, షర్మి పిల్లలు బెంగుళూరు నుంచి హైదరాబాదు వచ్చారు.

“సెప్టెంబరు - 3

“హెలికాప్టర్ కూలిపోయిన సంగతి జగన్ కు ముందే తెలిసినా మాతో చెప్పలేదు. రూములోకి వెళ్లి చాలాసేపటివరకూ బయటకు రాలేదు.

“తర్వాత జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుని భోరున ఏడ్చాడు. మాకు ఆ వార్త నమ్మశక్యంగా అనిపించలేదు.

“మధ్యాన్నం 12.30 నుంచి  గవర్నర్, చంద్రబాబునాయుడు ఇంకా చాలామంది నాయకులు పరామర్సకు రావడం మొదలయింది.  కానీ ఈయన జీవించే ఉన్నారన్న నమ్మకం నాలో చావలేదు. అందుకే గవర్నర్ పలకరించగానే నేను, ‘ఆయనకేం కాదు, హి ఈజ్ ఎలైవ్’ అన్నాను. ఆ పెద్దాయన షాకయ్యి, ఇంకేం మాట్లాడాలో అర్ధం కాక కాసేపు మౌనంగా వుండి వెళ్ళిపోయారు.

“సాయంత్రం 5.30

“కర్నూలు నుంచి ఈయన్నిఇంటికి తీసుకువచ్చారు. రూము మధ్యలో పెద్ద బాక్సు. తెల్లని బట్టల్లో చుట్టి ఉంచారు. ఒక్కసారి చూపించమని అడిగాను. ‘వద్దు వద్దు చూస్తే మీరు తట్టుకోలేరు. మీ మనస్సులో వుండే ఇమేజ్ ని అలాగే ఉంచుకోండి’ అన్నారెవరో.

“షర్మికి ఎక్కడలేని కోపం వచ్చింది.

‘ఎందుకు అలా కవర్ చేసారు. అసలు ఇందులో వున్నది నాన్నేనా! వుంటే, ముఖం ఎక్కడ? కాళ్ళు ఎక్కడ? అదయినా మాకు తెలియాలి కదా’ అంటూ అరిచేసింది.

సెప్టెంబరు - 4

ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సోనియా గాంధి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధి వచ్చారు.

రెండు హెలికాప్టర్లలో ఈయన్ని తీసుకుని అందరం సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకున్నాం. 5. 20 ప్రాంతంలో లక్షలాది జనాలమధ్య, తోపులాటల నడుమ ఈయన్ని సమాధి చేసారు. అదే సమయంలో ఆకాశంలో హరివిల్లు కనబడింది. ఆ రాత్రి చుట్టూ ఒక వలయంతో చంద్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించాడు. పక్కనే మరో కాంతివంతమైన నక్షత్రం కూడా కనబడింది. బ్రదర్ బిల్లిగ్రాహమ్ చనిపోయినప్పుడు కూడా ఈ దృశ్యం కనబడిందట”

రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్తితుల్లో తమ కుటుంబం పడిన మానసిక వేదనలను విజయమ్మ విశదంగా రాశారు.

“పార్టీ అధిష్టానం ఆరళ్ళు భరించలేక జగన్ ఎంపీ పదవికీ, నేను ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసాము.  జగన్ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. అతడికి మద్దతుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా  చేసారు. జగన్ ని కట్టడి చేస్తే కొత్త పార్టీకి  పుట్టగతులు లేకుండా పోతాయని అనుకుందో ఏమో ఉపఎన్నికలకు పదిహేను రోజుల ముందు జగన్ ని విచారణ పేరుతొ పిలిచి నాడు అరెస్ట్ చేసారు. జైలుకు పోతూ జగన్ నాతొ చెప్పాడు.

‘వాళ్ళు మనల్ని నమ్ముకుని బయటకు వచ్చారు. వాళ్ళని గెలిపించుకోవాలి.  నువ్వూ, షర్మీ క్యాంపెయిన్ కి వెళ్ళాలమ్మా’ అని. బస్సులో పదివేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేసాం. తొంభయి  రోజులకు రావాల్సిన బెయిలు రాకుండా ఆపారు. కోడలు భారతి బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి నలిగిపోయింది. మరో పక్క సాక్షి నిర్వహణ బాధ్యతలు. ఆస్తుల జప్తులు. మానసిక వేధింపులు. దుష్ప్రచారాలు.

“జగన్ కు బెయిల్ రాకపోవడంతో, షర్మిల అన్న విడిచిన బాణంలా పది మాసాలపాటు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మూడువేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తండ్రి పోయిన తర్వాత పిల్లలు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది. పదహారు నెలల తర్వాత జగన్ జైలు నుంచి బయటకు వచ్చాడు.

“ఎన్నికల తర్వాత వై.ఎస్.ఆర్.  పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నాం కానీ రాలేదు. జగన్ మాత్రం నిరాశ పడకుండా మళ్ళీ జనం మధ్యకు వెళ్ళాడు. పద్నాలుగు నెలల పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. ఒక కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం ఒక రికార్డు.  పడిన ఈ కష్టాలకు 2019 ఎన్నికల్లో  ప్రజలు చక్కని  ఫలితం చూపించారు. బ్రహ్మాండమైన  మెజారిటీతో గెలిపించారు.

“జగన్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ, ‘వై.ఎస్’ అనగానే నేను ఒక్కకసారిగా ఉద్వేగానికి గురయ్యా. తొమ్మిది సంవత్సరాల పాటు అనుభవించిన కష్టాలు, మోసిన నిందలు, అనలేని, వినలేని మాటలు, కేసులు, జగన్ జైలు ..అన్నీ ఒక్కసారి గుర్తుకువచ్చాయి.

“పేదవాడి కోసం నాన్న ఒక్క అడుగు వేస్తే  నేను రెండు అడుగులు వేస్తాను’ అంటున్న జగన్ ని చూస్తే,పేదలకోసం ఈయన ప్రారంభించిన ప్రతి పధకాన్ని జగన్ అమలుచేసి తీరతాడనే  నమ్మకం కలుగుతోంది.

“అప్పుఅడప్పుడు అనిపిస్తుంది. ఈయన  వున్నప్పుడు ఇంట్లో పదిమందిమి ఎంత బాగావుండేవాళ్ళం. జీవితం ఎంత పర్ఫెక్ట్ గా సాగేది’ అని.  షర్మి వెంటనే అంటుంది.

‘అమ్మా రోజులు గడుస్తున్న కొద్దీ మనం స్వర్గంలో వున్న నాన్నని కలవడానికి ఒక్కోరోజు దగ్గరవుతున్నాం అని మరచిపోకు. మనం ఆయనతో కొన్నేళ్ళే గడిపామని బాధపడే  అవసరం లేదు. స్వర్గానికి చేరిన తర్వాత అక్కడ ఫ్యామిలీ అంతా ఎప్పటికీ కలిసి జీవిస్తాం’

“ఇక జగన్ వాళ్ళ నాన్న ఎక్కడికీ వెళ్ళలేదని భావిస్తున్నాడు. తను వేసే ప్రతి అడుగూ ఈయన దగ్గర వుండి  చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని విశ్వసిస్తున్నాడు. ప్రజల ప్రేమలో ఈయన  కనబడుతూనే ఉన్నాడని జగన్ నమ్ముతున్నాడు.

పిల్లలు ఇలా వుంటే ఇక ఆ తల్లికి ఏం కావాలి!      

కామెంట్‌లు లేవు: