30, ఏప్రిల్ 2020, గురువారం

మార్పు చూడని కళ్ళు (4)- భండారు శ్రీనివాసరావు


(చరిత్ర గతిని మార్చిన గోర్భచేవ్)

గోర్భచేవ్ ని  అరెస్టు చేసిన 1991, ఆగస్టు 18 న ఏమి జరిగింది అనే దానిపై విభిన్న కధనాలు ప్రచారంలో వున్నాయి. ఎందుకంటే  ఆ రోజుల్లో పత్రికలు ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తుండేవి.
బాగా విస్తృతంగా ప్రచారం పొందిన ఒక కధనం ప్రకారం, ఆరోజు  క్రైమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్  గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే  రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్  వ్లాదిమిర్  కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్ అధినేత నికితా  కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్  కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.
నన్ను అరెస్టు చేస్తున్నారా?” అని గోర్భచేవ్ ఆ అధికారులని ప్రశ్నించారు. అలాంటిది ఏమీ లేదని వాళ్ళు బదులు చెప్పారు. అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమితపడ్డట్టు కనిపించింది. దానితో వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి అయన నిర్ద్వందంగా  తిరస్కరించారు.
మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదుఅంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గోర్భచేవ్ దంపతులు ఫోరొస్ విడిదిలోనే గృహ నిర్బంధంలో  వుండిపోయారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.  ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.  దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ మాస్కోలో  విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను  ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టువెల్లడించారు.
ప్రెసిడెంట్ సెలవులో వున్నారుఅని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం,  చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారుఅని ఆయన చెప్పారు.
ఆగస్టు పరిణామాలపై రష్యన్ అధికారిక వార్తాసంస్థ టాస్ కధనం:
1991 ఆగస్టు  పరిణామాలను గురించి టాస్ విలేకరి జమ్యతినా తమారా తన కధనంలో ఇలా పేర్కొన్నారు.
1991 ఆగస్టు 19 వ తేదీ ఉదయం సోవియట్ న్యూస్ చానళ్ళలో మామూలు వార్తా కార్యక్రమాలను నిలిపివేసి స్వాన్ లేక్ బాలే ప్రసారం చేస్తూ వుండడం చూసిన  ప్రజలు, దేశ నాయకుడు ఎవరైనా చనిపోయారేమో అని భావించారు. కానీ ఇంతలోనే మరో ఊహించని వార్త బయటకు వచ్చింది. సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచేవ్ ఆరోగ్యం బాగాలేక, ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేరన్నది ఆ వార్తసారాంశం. అత్యవసర పరిస్తితుల్లో ఏర్పాటయిన అధినాయక సంఘానికి ప్రెసిడెంట్ బాధ్యతలు బదిలీ అవుతాయని కూడా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయిన ఈ కమిటీ దేశంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలను, ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించింది. పత్రికలపై ఆంక్షలు విధించింది.
రష్యన్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయిన బోరిస్ ఎల్త్సిన్ ఈ ఉత్తర్వులను తిరస్కరించారు. ఎల్త్సిన్ అయన అనుయాయులు మకాం చేసిన రష్యన్ పార్లమెంటు భవనానికి వెళ్ళే అన్ని దారులను వీధుల్లోకి వచ్చిన వేలాదిమంది రష్యన్లు దిగ్బంధనం చేసారు. బోరిస్ ఎల్త్సిన్ కు మద్దతుగా నిలిచారు.  కమిటీకి ఈ పరిణామాలు మింగుడు పడలేదు. వారిలో నైతిక స్తైర్యం దెబ్బతిన్నది. రక్తపాతాన్ని నివారించడం మంచిదనుకుని తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
ఆగస్టు 21 వ తేదీన అప్పటి సోవియట్ వైస్ ప్రెసిడెంట్ అలెక్జాండర్ రుత్స్కోయ్ గోర్భచేవ్ సెలవులు గడుపుతున్న క్రైమియా లోని ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్ళారు. ఆ రాత్రికే వారు మాస్కో తిరిగివచ్చారు కానీ అప్పటికే గోర్భచేవ్ భవితవ్యం, సోవియట్ యూనియన్ భవితవ్యం రెండూ  నిర్ధారణ అయ్యాయి. తర్వాత జరిగిన పరిణామాలలో సోవియట్ రిపబ్లిక్కులు ఒక్కొక్కటిగా స్వాతంత్రం ప్రకటించుకుంటూ పోయాయి. 1991 డిసెంబరు కల్లా సోవియట్ యూనియన్ చరిత్ర పుటల్లో చేరిపోయింది (ఇంకావుంది)

29, ఏప్రిల్ 2020, బుధవారం

ఇదేదో బాగానే వుంది మరి


కరోనా కాలంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళు తమకుతోచిన రీతిలో వంటలూ గట్రా చేస్తూ వాటిని పోస్టు చేస్తూ పొద్దుపుచ్చుతున్నారు. గరిటె తిప్పడం కాదుకదా, అట్లకాడ పట్టుకోవడం కూడా రాదనే నా బలహీనత నాకు తెలుసు కనుక నేనూ ఒక ప్రయోగం చేస్తున్నాను, వేరే విధంగా.
పూర్వపు రోజులకు వెళ్ళిపోయాను. అంటే వెనుకటి దూరదర్సన్ కాలానికి అన్నమాట. టీవీ చూసే సమయం బాగా తగ్గించాను. ఉదయం ఓ గంటా, సాయంత్రం ఓ మూడు గంటలు, అదీ ఏ ఛానల్ వాడయినా మంచి పాత సినిమా వేస్తేనే సుమా, టీవీ ఆన్ చేస్తున్నాను. వెనుకటి రోజుల్లో అయితే, పగలల్లా మేజా మీద ఠీవిగా కూర్చున్న టీవీ మీద ఓ గుడ్డ కప్పిఉంచితే, అది శివుడి గుడిలో నందివాహనంలా ఓ చోట కదలకుండా వుండేది. ఇప్పుడు గోడకు అతుక్కు పోయిన బల్లిలా నోరుమూసుకుని పడుంటోంది.
అది ఎలా వుందని కాదు, నేను మాత్రం నిక్షేపంలా కొత్త నెత్తురు పట్టిన మనిషిలా తయారవుతున్నాను. బీపీ గట్రా చూసుకోలేదు కానీ ఖచ్చితంగా నార్మల్ గానే వుండివుంటాయి. మనసు ప్రశాంతంగా వుంటే మనిషి కూడా ప్రశాంతంగానే ఉంటాడు. ఉండక చస్తాడా ఏమిటి.


నిన్ననే ద్వితీయ విఘ్నం కూడా గడిచింది కాబట్టి ఈరోజు మూడో రోజు ధైర్యంగా ఈ పోస్టు.

28, ఏప్రిల్ 2020, మంగళవారం

నచ్చడు! నచ్చడంతే!!



అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది ‘నాకు నీ ఫేస్ నచ్చలేదు’ అని.
అంటే అతడి మొహం నచ్చకపోతే ఆ వ్యక్తిలో నచ్చదగిన ఏ లక్షణాలు లేనట్టేనా!
ఈ మానసిక వ్యాధికి ఏదన్నా పేరు ఉందేమో తెలియదు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న విపరీత వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒకటి మాత్రం సత్యం అనిపిస్తోంది. చంద్రబాబును నచ్చని వారు ఈ జన్మలో అతడ్ని మెచ్చరు. అలాగే జగన్ మోహన రెడ్డి. ఇతడ్ని ద్వేషించేవారికి అందుకు ప్రత్యేకమైన కారణం అక్కరలేదు. ఆ సినిమాలో చెప్పినట్టు జస్ట్ జగన్ మాకు నచ్చడు, నచ్చడంతే! అంతే కాదు, అతడేమి చేసినా మంచయినా సరే మాకు నచ్చదు, నచ్చదు నచ్చదంతే. చంద్రబాబును నరనరాన ద్వేషించేవారిది కూడా ఇదే తరహా! ఆయన ఏ పని చేసినా మాకు నచ్చదు, నచ్చదు గాక నచ్చదు. మరో మాట లేదు.
మరో విషయం ఏమిటంటే వీరెవ్వరూ వాళ్ళపార్టీల కార్యకర్తలు కాదు, వారి అనుచరులు కాదు. వాళ్ళు గెలిచినా, ఓడినా వీళ్ళకు ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఏదో ప్రయోజనం ఆశించి పెంచుకున్న అభిమానం కాదు వీరిది.
అయినా సరే! మేమింతే మేము మారం అనేది వీరి నినాదం. నాకో డౌటనుమానం. అదేమిటంటే వీరిలో ఎవరికయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు వుందా!


(ఎవరి ఫోటో ముందు పెట్టాలి అనేదానిపై వాదులాట మొదలయినా ఆశ్చర్యం లేదు)

27, ఏప్రిల్ 2020, సోమవారం

అక్షరాలా తొమ్మిది లక్షలు


900000
కరోనా లాక్ డౌన్ వల్ల దొరికిన వెసులుబాటు కావచ్చు, నా బ్లాగు “భండారు శ్రీనివాసరావు వార్తావ్యాఖ్య’’ ను చూసేవారి సంఖ్య అక్షరాలా తొమ్మిది లక్షలకు చేరుకున్నది.
అక్షర లక్షాధికారిని చేసిన పాఠక మిత్రులకు ధన్యవాదాలు.
బ్లాగు లింకు:



మార్పు చూడని కళ్ళు (మూడో భాగం)



గోర్భచెవ్ అరెస్టు
1991, ఆగస్టు 18.
క్రిమియా నల్ల సముద్ర తీరంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడి వేసవి విడిది ఫోరొస్ భవనపు గేట్ల దగ్గర అయిదు ఓల్గా కార్లు వచ్చి ఆగాయి. అప్పటి సోవియట్ ప్రెసిడెంట్ మిహాయిల్  గోర్భచెవ్ ఆ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గట్టి భద్రత ఉన్న ప్రాంతం. ఎవరైనా ఆగంతకులు వాహనాల్లో దూసుకువస్తే వాటి టైర్లు పంక్చర్ చేయడానికి ఆ మార్గంలో ఏర్పాట్లు వున్నాయి. మొదటి కారు నుంచి కేజీబీ అత్యున్నత అధికారి యూరి ప్లీకనోవ్ దిగారు. సోవియట్ అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు కనిపెట్టి చూసే బలగాలు ఆయన పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఆయన్ని చూడగానే  రెడ్ స్టార్లు కలిగిన ఆ భారీ పచ్చటి ఇనుపగేట్లు తెరుచుకున్నాయి. పీకనోవ్ తో పాటు అయిదుగురు కేజీబీ అధికారులు, సైనికాధికారులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వారి అంగరక్షకులు ఆ విడిది గృహంలోకి దూసుకు వెళ్ళారు. ఆ సమయంలో వాళ్ళు వస్తారని ఏమాత్రం సమాచారం లేని ప్రెసిడెంట్ గోర్భచెవ్, ఆశ్చర్యపోతూ కేజీబీ చీఫ్  వ్లాదిమిర్  కృశ్చెవ్ తో మాట్లాడడానికి ఫోను చేయడానికి ప్రయత్నించారు. కానీ లైన్ కట్టయింది. ఒకనాటి సోవియట్ అధినేత నికితా  కృశ్చెవ్ ఉదంతం గుర్తుకువచ్చింది. 1964 లో కృశ్చెవ్ ఇలాగే నల్ల సముద్ర తీరంలో విశ్రాంతిగా రోజులు గడుపుతున్నప్పుడు ఆయన్ని హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.
ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని నిజంగా అరెస్టు చేశారా లేక ఆయన స్వచ్చందంగానే ఈ అరెస్టుకు అంగీకరించారా అనే విషయంలో ఇప్పటికీ అనుమానాలు వున్నాయి. సోవియట్  యూనియన్ ని రిపబ్లిక్ ల సమాఖ్యగా ప్రకటించే కొత్త ఒప్పందంపై ఆగస్టు ఇరవైన ప్రెసిడెంట్ గోర్భచెవ్ సంతకం చేయాల్సి వుంది. అదే జరిగితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం ఖాయం అని నమ్మే వారిలో కొందరు ఒక బృందంగా ఏర్పడి ఆ ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమాన్ని వాయిదా వేయించాలని తలపోశారు. అందులో భాగంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సిందిగా ప్రెసిడెంట్ గోర్భచెవ్ ని ఒప్పించడం కోసం ఆ బృందం కేజీబీ అధికారులని నల్లసముద్ర తీరంలోని వేసవి విడిదికి పంపిందని ఓ కధనం ప్రచారంలో వుండేది. అప్పటికే ప్రెసిడెంట్ గోర్భచెవ్ రాజకీయ ప్రత్యర్ధి బోరిస్ ఎల్త్సిన్ రష్యన్ సోవియట్  రిపబ్లిక్ అధ్యక్షుడిగా పెద్ద మెజారిటీతో ఎన్నికయ్యారు. ఆయన ఆర్ధిక సంస్కరణల విషయంలో గోర్భచేవ్ కంటే రెండడుగులు ముందున్నారు. యువతలో మంచి అభిమానం సంపాదించుకున్నారు.
సోవియట్ యూనియన్ సమగ్రతను కాపాడాలని అనుకున్నవారి ప్రయత్నాలు ఫలించలేదు. అనుకున్నట్టే నాలుగు మాసాల అనంతరం సోవియట్ యూనియన్ చరిత్ర గర్భంలో కలిసిపోయింది. ఆగస్టు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఇరవై వరకు అసలు ఏం జరిగింది అన్నది ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది.
ఆరోజు ప్రెసిడెంట్ గోర్భచెవ్ వేసవి విడిదిలో ఏమి జరిగింది అనే విషయంలో కూడా విభిన్న కధనాలు వున్నాయి. తన ఇంటికి హఠాత్తుగా వచ్చిన కేజీబీ అధికారులని చూసి మొదట్లో ప్రెసిడెంట్ గోర్భచెవ్  కంగారు పడ్డారని అధికారిక వర్గాల సమాచారం.  అయితే అరెస్టుచేసి తీసుకుపోవడంలేదని హామీ ఇచ్చిన తరువాత ఆయన కొంత స్థిమితపడ్డట్టు కనిపించింది. ఆ తరువాత వాళ్ళు తనముందు పెట్టిన డిమాండ్లని అంగీకరించడానికి మాత్రం  తిరస్కరించారు.
“మీరు నమ్మక ద్రోహులు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు, తప్పదు” అంటూ ఆయన వారిని హెచ్చరించారు. వాళ్ళు మాస్కో తిరిగి వెళ్ళిన తర్వాత ఫోరొస్ విడిదిలోనే గోర్భచేవ్ దంపతులు గృహ నిర్బంధంలో  వుండిపోయారు. తరువాత రైసా గోర్భచేవ్ మరణించారు. ఇంట్లో ఉన్నారన్న మాటే కానీ వారిద్దరూ చాలా భయం భయంగా రోజులు గడిపారు.  ఏది తిందామన్నా భయమే. ఏది తాగాలన్నా భయమే.  దేంట్లో విషం కలిపారో తెలవదని రైసా తర్వాత ఒక దర్యాప్తు అధికారితో చెప్పారు.
మరునాడు, ప్రెసిడెంట్ గోర్భచెవ్ వద్ద వైస్ ప్రెసిడెంటుగా పనిచేసిన గెన్నదీ యనఏవ్ మాస్కోలో  విలేకరులతో మాట్లాడారు. ప్రెసిడెంట్ మిహాయిల్ గోర్భచెవ్ సెలవులో వున్నారు. అందుచేత తాను  ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు.
‘ప్రెసిడెంట్ సెలవులో వున్నారు’ అని యనయేవ్ ప్రకటిస్తున్నప్పుడు ఆయన గొంతు కంపించడం,  చేతులు వణకడం టీవీ తెరలపై ప్రపంచం యావత్తు చూసింది.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ నల్ల సముద్ర తీరంలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం కులాసాగానే వున్నారు. త్వరలోనే మళ్ళీ విధులకు హాజరవుతారు” అని ఆయన చెప్పారు.
ఆ రోజు ఆ విడిదిలో ఏమి జరిగింది అనేదానిపై వాలెరీ బోల్దిన్ కధనం వేరుగా వుంది. ఈయన కూడా కుట్రదారుల్లో ఒకరు.
“ప్రెసిడెంట్ గోర్భచెవ్ చాలా కోపంగా కనిపించారు. అన్నింటికీ మించి ఏమైనా సరే బోరిస్ ఎల్త్సిన్ బెడద వదిలిపోవాలి అనే భావం అయన మాటల్లో ధ్వనించింది.
చివరికి ఇలా అన్నారు. “పొండి. ఏం చేసుకుంటారో చేసుకోండి”
అయితే ఎమర్జెన్సీ ఎలా విధించాలి అనే దానిపై మాకు కొన్ని సూచనలు కూడా చేసారు అని బోల్దిన్ చెప్పారు.
(ఇంకా వుంది)

ప్రాయంలో అడుగిడుతున్న ప్రాంతీయ పార్టీ

(టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురితం)

పందొమ్మిదేళ్ళ క్రితం 2001లో తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అయినప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కూడా అనేకమంది మెటికలు విరిచారు. గతంలో  తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో పుట్టిన పలు రాజకీయ పార్టీల గాటనే  టీఆర్ఎస్ పార్టీని కూడా కట్టి, ఆ పార్టీ భవిష్యత్తుపై  నైరాశ్యంతో  కూడిన ప్రకటనలు చేసారు. అయితే ఇటువంటి అనేకానేక  ఊహాగానాలను, అన్నిరకాల బాలారిష్టాలను అధిగమించి తెలంగాణా ప్రజానీకం పరచిన వెచ్చటి పొత్తిళ్ళలో ఈ పచ్చటి పసికూన పెరిగి పెద్దదయి ఇరవై ఏట అడుగు పెట్టింది.
సహజమైన బాలారిష్టాలను తట్టుకుని నిలబడ్డం వేరు, కావాలని పసికందును పసిగుడ్డుగానే చిదిమి వేయాలనే దుష్ట పన్నాగాలు వేరు. భాగవతంలో చిన్ని కృష్ణుడిని మట్టుబెట్టడానికి కంసాదిదానవులు అనేకవిధాలుగా ప్రయత్నాలు చేసినట్టు టీఆర్ఎస్ పార్టీని కూడా ఆదిలోనే అంతం చేయడానికి అన్ని రకాల రాజకీయ కుట్రలు జరిగాయి. కుట్రదారుల  ఉద్దేశ్యం ఒక్కటే. తెలంగాణా అనే భావన తెలంగాణా ప్రజల్లో లేదని, అది కొందరు అవకాశవాద లేదా నిరుద్యోగ రాజకీయ నాయకుల దుష్టపు ఆలోచన అని రుజువు చేసి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని శాశ్వతంగా సమాధి చేయడం. ఇక ముందు ముందు ఎవరి నోటా ఆ మాట వినిపించకుండా చేయడం.
అయితే ఈసారి ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన టీఆర్ఎస్ పార్టీకి కర్తా, కర్మా, క్రియా అయిన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ  నిరర్ధకం అయిపోయాయి. కడకంటా కాడిని కింద పడవేయకుండా శ్రీ కేసీఆర్ తనదైన శైలిలో విలక్షణ౦గా ఉద్యమాన్ని నడుపుకు రావడంతో ఆ ఎత్తులన్నీ చిత్తయిపోయాయి. పుష్కరకాలానికి పైగా సాగిన ఈ మహోద్యమం వాడి, వేడి ఎక్కడా, ఎప్పుడూ, ఏమాత్రం  తగ్గకుండా చూడడానికి, దారితప్పకుండా కనిపెట్టి చూడడానికి  ఆయన ఎన్నో రకాల శ్రమదమాదులకు గురికావాల్సి వచ్చింది. అటు కేంద్రాన్ని,  ఇటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ  పార్టీలను రాజకీయంగా ఏకకాలంలో ఎదుర్కుంటూ, ఉద్యమదీప్తి కొడిగట్టకుండా చూడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇతరేతర రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ, తెలంగాణా ఉద్యమాన్ని దారితప్పించాలని ప్రయత్నించే ‘విభీషణులను’ సయితం నిలువరించాల్సిన పరిస్తితి. అటువంటి వారి కారణంగా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నప్పుడు లక్ష్యసాధన కోసం గొంగళి పురుగులను సయితం  ముద్దాడ వలసిన దుస్తితి.  వెలుగుతున్న పెట్రోమాక్స్ లైట్ లో వెలుగు తగ్గి, వత్తి ఎర్రబడుతున్నప్పుడల్లా,  పంపుతో గాలికొట్టి మళ్ళీ వత్తిని తెల్లగా  ప్రకాశవంతం చేసినట్టు, ఉద్యమకాలంలో కేసీఆర్ తన వ్యూహాలను, ఎత్తుగడలను  తాజా రాజకీయ పరిణామాలకు, పర్యవసానాలకు  తగినట్టుగా మార్చుకుంటూ ప్రత్యేక తెలంగాణా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా వుండిపోయేట్టు చేయగలిగారు.  అందుకు ప్రధానంగా తోడ్పడ్డది అనర్ఘలమైన ఆయన ప్రసంగనైపుణ్యం ఒకటి కాగా, తెలంగాణా పట్ల ఆయనకు ఉన్న పరిపూర్ణమైన అవగాహన మరొకటి. ఆకాంక్ష నెరవేరి, తెలంగాణా స్వప్నం సాకారమై  ప్రత్యేక రాష్ట్రంగా  ఏర్పడ్డప్పుడు దాన్ని బంగారు తెలంగాణాగా రూపొందించడానికి ‘ఏమిచేయాలి, ఎలా చేయాలి’ అనే విషయంలో ఆయన కన్న కలలు, వాటిని సాకారం చేసుకోవడానికి రూపొందించుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాలికలు అన్నీఇన్నీ కావు.  ఇలా బహుముఖంగా ఆలోచించి చేసిన ప్రయత్నాలు కాబట్టే, పార్టీపరంగా చేపట్టిన  రాజకీయ ఉద్యమానికి ఇవన్నీ అవసరమైన ఊతాన్నీ, ఉత్తేజాన్నీ  ఇవ్వగలిగాయి. తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేయగలిగాయి.
తెలంగాణా పురపాలక,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసీఆర్  లాగే చక్కని మాటకారి.  గతంలో ఒకసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, ‘కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించింద’ని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటి  మీద రాత కాకుండా  రాతి మీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం.
తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్క అనుమానం కూడా నిజం కాలేదు. సందేహాస్పదులు కోరుకున్నది జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వచ్చి పడ్డ కరోనా లాక్  డౌన్ ఎండాకాలంలో కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న,  కేసీఆర్ సాధించిన ‘అద్భుతం’ ఇది.
అయితే, తెలంగాణా సాధన ఒక ఎత్తయితే, సాధించిన దానిని సమర్ధవంతంగా అనుకున్న రీతిలో మలచడం మరో ఎత్తు.
దీనికి  ప్రత్యక్ష సాక్ష్యం తెలంగాణాలో అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి నీళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పుడు కనుబొమలు ముడిచినవాళ్ళే, ఇప్పుడు ఉప్పొంగి ఉరకలు పెడుతూ పరుగులు తీస్తున్న గోదావరమ్మను కళ్ళార్పకుండా చూస్తూ మురిసిపోతున్నారు.
టీఆర్ఎస్ ఇన్నేళ్ళ ప్రస్థానంలో అధికార పగ్గాలు అందుకోవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. గతంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న రాజకీయ పార్టీలు ప్రజలు అందించిన అధికారాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడ్డ వైనాలు తెలుసు. కానీ తెలంగాణా రాష్ట్ర సమితి దీనికి మినహాయింపు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డ తర్వాత రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువ స్థానాలు కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకత్వం పట్ల ప్రజలు తమకున్న నమ్మకాన్ని మరోసారి నిరూపించి చూపారు.
మరోసారి అధికార పీఠం అధిరోహించిన కేసీఆర్ తనదైన పద్దతిలో ముందుకు వెడుతున్న తరుణంలో కరోనా వైరస్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు పెనుసవాలుగా మారింది. అయినా ప్రజల ప్రాణాలు ముఖ్యం అనుకున్న ప్రభుత్వం, దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్పందించి లాక్ డౌన్ వ్యవధిని పొడిగించింది. కరోనాని కట్టడి చేయడానికి తెలంగాణా  ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ప్రశంసించారు.
ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గతంలో మాదిరిగా ఘనంగా జరుపుకోలేని పరిస్తితి.
అయితే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో గలగలా పారుతున్న గోదావరి జలాల్లోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఆనందాలను తిలకించే అవకాశం ఈసారి లభించింది.   

26, ఏప్రిల్ 2020, ఆదివారం

యాదమ్మ సొంతిల్లు


ఈ కరోనా గొడవ లేకపోతె తప్పక వెళ్ళాల్సిన శుభ కార్యం.
యాదమ్మ పిల్లలు కొత్త ఇల్లు కట్టుకుని ఆ ఇంటి ఫోటోలు వాట్సప్ లో పంపారు. లాక్ డౌన్ కారణంగా ఫంక్షన్ ఏమీ చేయడం లేదని, మీ ఆశీస్సులు కావాలని కోరారు. అంతటితో అయితే ఈ పోస్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఏనాడో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈనాడు, ఇల్లు కట్టుకున్నామని, అసలీ ఇల్లు అమ్మ (మా ఆవిడ) పట్టు పట్టి కట్టేదాకా ఊరుకోలేదని, కానీ ఇది పూర్తయిన తర్వాత చూడడానికి అమ్మలేదని వాళ్ళు బాధ పడ్డారు. 



ఈ యాదమ్మ ఎవరంటే....
199
1 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో అద్దెకు  ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. మా నలుగురి కోసం కాకపోయినా, రష్యా నుంచి ఓడలో  వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా, ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్నాడు. అతడికి ఓ  ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది. అతడే వాళ్ళింట్లో కంప్యూటర్ మాస్టర్. అతడే ఇంటి ఫోటోలు పంపాడు.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
నువ్వేం చేస్తున్నావని తిరుమలమ్మను అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను అనేది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!