Prime Minister Narendra Modi's Surgical Strike on BLACK MONEY
9, నవంబర్ 2016, బుధవారం
Modi's Surgical Strike
8, నవంబర్ 2016, మంగళవారం
నేను సైతం.....
నేను సైతం ఈరోజు నా దేశ ఋణం కొద్దిగా
తీర్చుకున్నాను
ఈరోజు ఊబెర్ అద్దె వాహనంలో
ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన
మెయిల్ లో ఇలా వుంది:
|
Before Taxes
|
112.26
|
|
Service tax (4.2%)
|
4.71
|
|
Swachh Bharat Cess (0.15%)
|
0.17
|
|
Krishi Kalyan Cess (0.15%)
|
0.17
|
|
|
||
|
COLLECTED
|
₹ 117.31
|
|
|
అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2
శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15
శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు
0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి
వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా
నా ధర్మం. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు
చెల్లించే పన్ను, సెస్సు వివరాలు
ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు
చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం
ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు
పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
5, నవంబర్ 2016, శనివారం
అమెరికాలో అలా....ఇండియాలో ఇలా...
“రేపు (నవంబరు ఒకటి) ఈ సమయానికి సింగపూర్ వెళ్ళే విమానంలో
ఉంటాను. అమెరికా ఎన్నికల దినం నవంబర్ 8 నాడు అక్కడే (సింగపూరులో) ఉంటాను
కాబట్టి ఇవాళ పొద్దున్న ఎర్లీ ఓటింగుకి వెళ్లాను. అక్కడ లైన్ లో మా అమ్మాయి కూడా
ఉంది. ఇద్దరం ఓటు వేసేశాం. అంతకు ఓ గంట ముందు మా అర్థాంగి కూడా ఓటు వేసేసి ఇంటి
కొచ్చి గొప్పలు చెప్పుకుంది. ఎవరు, ఎవరికి ఓటు వేశామో చెప్ప కూడదు. నా జాతకం ప్రకారం
సాధారణంగా నేను ఎవరి కి ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓడి పోతారు. అంచేత నా సంగతి
అమెరికాలో నవంబర్ 8 రాత్రికి తెలిసిపోతుంది. అదీ సంగతి.”
ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కోసం అమెరికా
నుంచి సింగపూరు వెడుతూ వంగూరి చిట్టెన్ రాజు ఫేస్ బుక్ లో అక్టోబర్ 31 న పెట్టిన
పోస్టింగు ఇది.
శుక్రవారం నాడు హైదరాబాదులో ఉంటున్న మా అన్నయ్య రామచంద్రరావు
గారు అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ అబ్బాయి రాజేష్ తో మాట్లాడినప్పుడు అతడూ ఇదే సంగతి
చెప్పాడు. ఇప్పుడే ఓటు వేసి వస్తున్నానని రాజేష్ ఫోనులో చెబుతుంటే ‘అదేమిటి! ఎనిమిదో తేదీ కదా ఎలక్షన్లు’
అని ఆశ్చర్యపోవడం ఈయన వంతయింది. అప్పుడు ‘ఎర్లీ వోటింగు దాని కధాకమామిషూ’ రాజేష్
వివరించి చెప్పాడు.
పోలింగు సమయానికి వూళ్ళో లేనివాళ్ళు, లేదా ఆ రోజున వేరే పనులు
వుండి ఓటు వేయలేని వాళ్ళకోసం ఏర్పాటు చేశారు ఈ ఎర్లీ పోలింగు పద్ధతి. ముందుగా
వెళ్లి ఓటు హక్కు వినియోగించు కోవడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లో పోలింగు కేంద్రాలు
ఏర్పాటు చేస్తారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కూడా ఈ సారి ఈ విధంగానే
ఎర్లీ ఓటింగు విధానంలో ఓటు వేసేశారు కూడా.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎవరయినా విదేశస్తులు ఆ దేశం
వెడితే అసలక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని కూడా వారికి అనిపించదు. ముఖ్యంగా ఇండియా
నుంచి వెళ్ళిన వాళ్లకు. ఎందుకంటే మన దగ్గర ఎన్నికలు వస్తే ఆ హడావిడి చెప్పాల్సిన
పనిలేదు. బహిరంగ సభలు, ఉపన్యాసాలు, ఊరేగింపులు, వాల్ పోస్టర్లు, కరపత్రాలు,
హోర్డింగులు, ఇలా ఎన్నికల యుద్ధ వాతావరణం చాలా కాలం కొనసాగుతుంది. అమెరికాలో కూడా
ఈ గందరగోళం కొంత లేకపోలేదు. కాకపొతే అది ఇళ్ళల్లో టీవీలకే పరిమితం. టౌన్ హాల్స్ లో
జరిగే ఎన్నికల సమావేశాలకు ఓ వెయ్యి మంది హాజరయితే అదొక భారీ బహిరంగ సభ కింద లెక్క.
కాకపొతే ఇలా మర్యాదగా ఎన్నికలు జరుపుకుంటూ పొతే మర్యాద
కాదనుకున్నారేమో కానీ, ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న
అభ్యర్ధులు ఇద్దరూ పోటీపడి తమ ఎన్నికల ప్రసంగాల్లో
అనకూడని మాటలు అన్నారు. పలకకూడని పలుకులు పలికారు. చేయకూడని ఆరోపణలు చేసుకున్నారు.
వీటిని ఇంటింటికీ మోసుకు వెళ్ళడంలో అక్కడి మీడియా కూడా తన పాత్ర అవధుల మేరకు
పోషించిందనే చెప్పాలి.
ఇదంతా చూసి, చదివి, విని ఇక్కడ అందరం అక్కడేదో జరిగిపోతోందన్న భ్రమల్లో
వున్నాం. కానీ ఏమీ జరగదు, ఎనిమిదో తేదీన ఎన్నిక తప్ప.
లేబుళ్లు:
అమెరికాలో అలా....ఇండియాలో ఇలా...
4, నవంబర్ 2016, శుక్రవారం
పుష్కరం నాటి అమెరికా
నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారు అమెరికా సందర్శించి – ‘నేను చూసిన అమెరికా’ అని ఒక పుస్తకం రాశారు. అది చదివి ఆ పుస్తకానికి అలా ఎందుకు పేరు పెట్టారా అని అనుకునేవాడిని. ఇన్నేళ్ళ తరవాత ఇప్పుడు అమెరికాలో అయిదు మాసాలు వుండి వచ్చిన తరవాత అర్ధమయింది. అదొక సువిశాల దేశం. టూరిస్టులుగా వచ్చిన వాళ్ళే కాదు, ఎన్నో ఏళ్లుగా అక్కడ వుంటూ వచ్చిన వాళ్ళు కూడా అమెరికాని పూర్తిగా చూడడం కుదరని పని. అందుకే చూసిన మేరకే అవగాహన చేసుకుని అక్షరబద్ధం చేసేందుకే ఈ ప్రయత్నం.
వీసాలు అంత కఠినం
అమెరికా వెళ్లడం అన్నది మన దేశంలో చాలా మందికి తీరని కల. ఎందుకంటె వీసా నిబంధనలు అంత కఠినతరం. డబ్బున్నవాళ్ళు కూడా మరో మరో విదేశానికి వెళ్లి వచ్చినంత సులభంగా అమెరికా వెళ్ళలేరు. అలాగే ఆనాటి సోవియట్ యోనియన్ కూడా. అయితే, ఓ పుష్కర కాలం క్రితం ఆకాశవాణి పుణ్యమా అని మాస్కోవెళ్లి అయిదేళ్ళు రేడియో మాస్కోలో పనిచేసివచ్చాను. ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో అమెరికాకు పోటీగా నిలబడిన మరో ఏకైక అధికార ధ్రువం సోవియట్ యూనియన్. అనేక దశాబ్దాల తరబడి అప్రతిహతంగా సాగిన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంతిమ ఘడియలు చూడగలిగే అరుదయిన అవకాశం లభించిన నేను –‘మార్పు చూసిన కళ్ళు ‘ – అనే పేరుతొ ఆనాటి అనుభవాలను గ్రంధస్తం చేయాలనుకున్నాను. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది. ( తదనంతర కాలంలో వచ్చిన ‘బ్లాగుల’ పుణ్యమా అని పుస్తకరూపంలో తీసుకురాలేకపోయిన దానిని - దాదాపు పదిహేడు భాగాలు - నా బ్లాగులో (http://www.bhandarusrinivasarao.blogspot.com) పొందుపరచగలిగాను.పోతే, ఇప్పుడు- సియాటిల్ లో వుంటున్న మా పెద్దకుమారుడు సందీప్, అమెరికా చూసే అవకాశాన్ని కల్పించి – సోవియట్ యూనియన్ – అమెరికాలు రెండింటినీ చూడగలిగిన కొద్దిమంది హైదరాబాద్ జర్నలిష్టులలో నన్ను కూడా చేర్చాడు. నాకు తెలిసి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్లు ఐ వెంకటరావు,కే. శ్రీనివాసరెడ్డి ఈ రెండు దేశాలను చూసినవారిలో వున్నారు. ఈ అవకాశం ఇకముందు ఎవరికీ దొరికే వీలు కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద కమ్యూనిస్ట్ దేశం - అంగ వంగ కలింగ దేశాల మాదిరిగా విచ్చిన్నమై చరిత్ర పుటల్లో మిగిలిపోయింది. కాగా, మిత్రుడు మాగంటి కోటీశ్వర రావు పూనికతో ఎలాటి టెన్షన్ పడకుండా లభించిన పది సంవత్సరాల వీసాలతో నేనూ మా ఆవిడ నిర్మల, హైదరాబాదులో 2003 సెప్టెంబర్ ఆరో తేదీ శనివారం మలేసియన్ ఎయిర్ లైన్స్ లో బయలుదేరి కౌలాలంపూర్ మీదుగా సుమారు ముప్పయి గంటలు ప్రయాణం చేసి తిరిగి అదే రోజు, అంటే శనివారం నాడే అమెరికాలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటయిన లాస్ ఏంజెల్స్ చేరుకున్నాము. భూమండలానికి ఆవలవైపువున్న దేశానికి చేరడంవల్ల కాలగమనంలో వచ్చిన మార్పు ఇది. (2003)
(ఆరంభానికి ప్రారంభం)
లేబుళ్లు:
పుష్కరం నాటి అమెరికా
3, నవంబర్ 2016, గురువారం
రమణ దీక్షితులు
తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన
అర్చకుడిగా నలభై ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్న రమణ దీక్షితులు గురించి ఆయన
మాటల్లోనే విందాం.
“నేను తిరుపతిలోనే పుట్టి పెరిగాను. మా
తండ్రి గారు వేంకటపతి దీక్షితులు తిరుమల శ్రీవారి దేవాలయంలో ప్రధాన అర్చకులు.
“ నా చిన్న తనంలో, అంటే, 1960 ప్రాంతంలో తిరుపతి చాలా చిన్న పట్టణం. వూళ్ళో రెండు సినిమాహాళ్ళు,
రెండే రెండు కార్లు, నాలుగు స్కూటర్లు వుండేవంటే నాటి పరిస్తితులను ఊహించుకోవచ్చు.
“నా తలితండ్రులకి నేను ఏకైక సంతానాన్ని. మునిసిపల్ స్కూల్లో, ఎస్.వీ.ఆర్ట్స్ కాలేజీలో చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీ;హెచ్.డీ. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పూర్తి
చేశాను.
“తరతరాలుగా మా కుటుంబీకులే శ్రేవారి ఆలయంలో
ప్రధాన అర్చకులుగా వుంటూవస్తున్నారు. అంచేత ఏదో ఒకరోజు ఈ బాధ్యతలు నేను
స్వీకరించాల్సి వస్తుందని నాకు తెలుసు.
“శ్రీవారి ఆలయంలో అర్చకత్వం అంటే మామూలు విషయం
కాదు. ఎన్నో నియమనిష్టలు అవసరం. అందుకే నా పెంపకం కూడా ఆ కోణంలోనే సాగింది.
ప్రాధమిక పాఠశాల స్థాయి నుంచి గట్టి క్రమశిక్షణలో పెరిగాను. ఆహారవిహారాల్లో కూడా
కఠిన నియమ నిబంధనలు ఉండేవి.
“ఇప్పటికీ కూడా నా భోజనం చాలా సింపుల్.
ఉడకబెట్టిన కూరగాయలు తప్పించి ఒండిన అన్నం కూడా ముట్టను.
“దురదృష్టం నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్
చేస్తుండగానే మా తండ్రి గారు విష్ణు సాన్నిధ్యం చేరుకున్నారు. దాంతో మా తండ్రి
గారి అడుగు జాడల్లో అర్చకత్వం స్వీకరించాను. అదేసమయంలో నా చదువు కొనసాగించాను.
మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ తీసుకున్నాను. అమెరికాలోని సౌత్ కరోలినా
యూనివర్సిటీలో సీటు వచ్చింది.
“అయితే వైఖానస ఆగమ సూత్రాల
ప్రకారం తిరుమల ఆలయంలో పనిచేసే అర్చకులు సముద్రాన్ని దాటి ప్రయాణం చేయరాదు.ఈ
సాంప్రదాయాన్ని గౌరవిస్తూ నాకు లభించిన ఈ అవకాశాన్ని వదులుకున్నాను.
“వంశపారంపర్యంగా నాకు లభించిన సువర్ణ అవకాశం అని అనుకోవడం లేదు. తన సేవకు
అర్హులైన వారిని ఆ స్వామే నిర్ణయించుకుంటారు. అది దైవ నిర్ణయం తప్ప వేరు కాదు”
లేబుళ్లు:
రమణ దీక్షితులు
నేరం యెట్లా అవుతుంది?
ఒక కలెక్టర్ తన కొడుకుని వెంటబెట్టుకుని రిపబ్లిక్ డే పెరేడ్ కి వెళ్ళాడు. ఒక ఎస్పీ తన కొడుకుని తన ఆఫీసులో కూచో బెట్టుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి భార్య భర్తకు కేరేజీతో భోజనం తీసుకువెళ్ళి తినిపించేది. ఒక ప్రధానమంత్రి తన బంధు మిత్రుల సమేతంగా ఒక దీవిలో హాలిడే గడిపి వచ్చారు. ఇలాంటి దేశంలో ఒక ప్రధాన అర్చకుడు చేసింది ఘోరం యెట్లా అవుతుంది ? నేరం యెట్లా అవుతుంది?
లేబుళ్లు:
టీటీడీ ప్రధాన అర్చకుడు
వదంతుల నడుమ అమెరికా అధ్యక్ష ఎన్నికలు
సూర్యుడి
కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు ఎక్కడో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు
జరగబోతుంటే దాని ప్రభావం మన దేశంలో కూడా కనబడుతోంది. ఎన్నికల ప్రచారం మొదలయిన తొలి
రోజుల్లో తన ప్రత్యర్ధి డెమొక్రాట్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కంటే బాగా వెనుకబడి
వున్నట్టు కానవచ్చిన రిపబ్లికన్ అభ్యర్ధి
డొనాల్డ్ ట్రంప్, పోలింగు ఘడియ దగ్గర పడే
వేళకు బాగా పుంజుకుని ప్రత్యర్ధి మీద స్వల్ప ఆధిక్యత కనబరచారంటూ వెలువడిన వార్తలతో
భారతీయ మార్కెట్లు గత బుధవారం నష్టాల్లో ముగిశాయి. వారిద్దరి నడుమా పోటీ
నువ్వానేనా అనే రీతిలో సాగుతోందనే మీడియా వార్తల నేపధ్యంలో ఇన్వెస్టర్లు వేచి
చూసే ధోరణి అవలంబిస్తూ వుండడం దీనికి
కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
పిడుగులు
పడ్డా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు నాలుగేళ్ళకోసారి జరిగితీరుతాయి. అదీ ఆ నెలలో
ఒక నిర్దిష్ట దినం రోజున. అంటే నవంబరు నెలలో మొదటి సోమవారం మరునాడు వచ్చే మొదటి
మంగళవారం రోజున. దీనికి ఇంత తిరకాసు
ఎందుకు?, మొదటి మంగళవారం అంటే సరిపోతుంది
కదా అనే సందేహం రావచ్చు. దానికి ఒక కారణం వుంది. ఆ మొదటి మంగళవారం మొదటి తేదీనే
రావచ్చు. అందుకే ఈ మెలిక. అంటే ఏమిటన్న మాట ఈ నిర్దిష్ట ఎన్నికల దినం నవంబరు రెండు
నుంచి ఎనిమిది వరకు మారే అవకాశం వుంది. ఈ సారి సోమవారం ఏడో తేదీ కాబట్టి ఎన్నికలు
ఆ మరునాడు మంగళవారం ఎనిమిదో తేదీన
జరగనున్నాయి. 1788 నుంచి ఇంతవరకు ఈ విధానం ఎటువంటి మార్పులు,
మినహాయింపులు లేకుండా అమలవుతోంది.
అంతా
సజావుగా సాగితే ఎనిమిదో తేదీన అమెరికన్
అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తవుతుంది. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి సజావుగా అనే పదం
వాడడానికి కూడా కారణం లేకపోలేదు. ఈ తడవ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో సాగుతున్న ప్రచార
సరళి గతంలో ఎన్నడూ ఎరగని అధమ స్థాయికి దిగజారి పోయింది. రకరకాల మీడియా ఊహాగానాలు
జోరందుకున్నాయి. ట్రంప్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయన్న సంకేతాలు మొదటిసారి
వెలువడడంతోనే వదంతులు కూడా లెక్కకు మిక్కిలి పెరిగిపోవడం మొదలెట్టాయి. ఇవి పతాక
స్థాయికి చేరాయనడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కొందరు ప్రపంచ దేశాల నాయకులు రహస్యంగా సమావేశమై ట్రంప్
శ్వేతభవనంలోకి అడుగు పెట్టకుండా నిరోధించాలని వ్యూహ రచన చేస్తున్నారనీ, ఇందులో
భాగంగానే ప్రెసిడెంట్ ఒబామా ఎన్నికల తేదీకి ముందుగానే దేశంలో మార్షల్ లా విధించి ఎన్నికలు వాయిదా వేయడమో, లేదా
పూర్తిగా రద్దు చేయడమో చేస్తారనే చర్చలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఇవన్నీ
గమనించినప్పుడు మన దగ్గరే పరిస్తితి కొంతలో కొంత మేలనిపించడం సహజం.
సరే!
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పోటీలో వున్న ఇద్దరిలో గెలుపెవరిది అనే విషయంలో
పోటీ మొదట్లో వున్న స్పష్టత ఇప్పుడు అంత స్పష్టంగా వున్నట్టు లేదు. ఇరువురి నడుమ
జయాపజయాలు గురించిన అంచనాల్లో తొలుత కానవచ్చిన తేడా క్రమంగా తగ్గిపోయింది. ఇది మీడియా ఊహాగానాల ఫలితం కావచ్చు. తుదకు అసలు ఫలితంలో తేడా కూడా వుండొచ్చు. పోలింగు తేదీ
దగ్గర పడుతున్న కొద్దీ వదంతుల తీవ్రత కూడా బాగా పెరిగిపోతోంది. అమెరికాలో అనేక
ఎన్నికలను చాలాకాలంగా చూస్తూ వస్తున్న వాళ్ళు సైతం గతంలో ఎన్నడూ ఎన్నికల ప్రచారం
ఇంతగా గాడితప్పిన దాఖలాలు లేవంటున్నారు.
మీడియా
ఎలాగూ సంచలన కేంద్రంగా పనిచేస్తుంది కనుక ఇటువంటి చర్చలు ఎలాగూ తప్పవు. ఎనిమిదో
తేదీన ఎన్నికలు జరగకా తప్పదు. వేచి చూడడమే విజ్ఞుల పని. ఫలితాల విషయం పక్కన బెట్టి అమెరికాలో రాజకీయ
క్షేత్రంలో వస్తున్న గణనీయమైన మార్పులు గురించి కొంత చెప్పుకుందాం.
గత
నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికాలో కార్పొరేట్ల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది.
దేశంలో రాజకీయ వ్యవస్థని శాసించడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు తమ నిధుల్లో
సింహ భాగాన్ని వెచ్చిస్తున్నాయి. అందుకు తగ్గ ప్రతిఫలాలను ప్రభుత్వాలనుంచి
రాబట్టుకుంటున్నాయి. 1970 కి పూర్వం కూడా ఈ కార్పొరేట్ల ప్రభావం ప్రభుత్వాల మీద వుండేది కానీ ఇప్పటితో పోలిస్తే చాలా
స్వల్పం. అరవయ్యవ దశకంలో అప్పటి పాలకులు జాతి శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని పౌర
సమాజానికి మేలు చేసే కొన్ని మార్పులు తలపెట్టారు. కార్పొరేట్ల లాబీ బలంగా లేకపోవడం
వల్ల ఆ రోజుల్లో వాటిని నిలవరించగల సత్తా వాటికి లేకపోయింది. కొత్త మార్పులను అవి
హరాయించుకోలేకపోయాయి. దాంతో తమ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు వందలాది వ్యాపార
వ్యవస్థలు, డెబ్బయ్యవ దశకం మధ్యలో మొట్టమొదటి సారి లాబీ చేయగల సామర్ధ్యం ఉన్నవారిని తమ కంపెనీల్లో నియమించుకుని ప్రభుత్వాలపై, వాటి విధానాలపై ప్రభావం
చూపడం మొదలు పెట్టాయి. అంతే కాదు తమకు
అనుకూలంగా వ్యవహరించే పార్టీలకు అపారమైన నిధులు సమకూర్చిపెట్టడానికి కూడా శ్రీకారం
చుట్టాయి. మొదట్లో ప్రభుత్వాన్ని శత్రువుగా పరిగణించిన కార్పోరేట్ శక్తులు
కాలక్రమంలో పాలకులను తమకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనంగా మార్చుకునే మార్గాన్ని
కనుగొనే ప్రయత్నాలు సాగించాయి. ఏతావాతా జరిగింది, జరుగుతున్నది ఏమిటంటే ఆ దేశంలో ఏ పార్టీ ప్రభుత్వం అయినా కార్పొరేట్ల అధీనంలోకి
తెలిసో తెలియకో వెళ్లి పోతుండడమే.
ఈ
పరిణామాలు అమెరికాకే పరిమితం కాదు. మన దేశంలో కూడా మొగ్గ తొడిగి పుష్పిస్తున్నాయి.
పొతే,
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, అధ్యక్షులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు:
1789 లో జార్జ్ వాషింగ్టన్ పోటీ లేకుండా
ఎన్నికయ్యారు. ఆయన మీద పోటీ చేసేవారే కరువయ్యారు. నిజానికి ఆయన ఏ పార్టీకి
ప్రతినిధిగా ఎన్నికల్లో పోటీకి నిలబడలేదు.
1872 లో యులిసెస్ ఎస్.
గ్రాంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే పోటీ లేకుండా కాదు. ఆయన మీద పోటీకి దిగిన ప్రత్యర్ధి పోలింగుకు ముందు
హఠాత్తుగా మరణించడం వల్ల గ్రాంట్ మహాశయులు నేరుగా వైట్ హౌస్ లో చేరిపోయారు.
ఆండ్రూ జాక్సన్
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున వైట్ హౌస్ లో మద్యం ఏరులై పారింది.
మందుబాబులు అర్ధరాత్రి అయినా కదలక పోవడంతో చివరికి జాక్సన్ చేసేది లేక మెల్లగా అక్కడి
నుంచి జారుకుని ఆ రాత్రి ఓ హోటల్ లో గడపాల్సిన పరిస్తితి ఏర్పడింది.
ఆల్
స్మిత్ అనే అభ్యర్ధి మద్యపానాన్ని తన ఎన్నికల నినాదం చేసుకున్నాడు. ‘నాకు వేసే
ప్రతి ఓటు పూటుగా మందు కొట్టడానికి
లైసెన్సు బిళ్ళ’ అంటూ ప్రచారం
చేసుకున్నాడు.
రూధర్ ఫోర్డ్ బి హేస్
తరహా వేరు. వైట్ హౌస్ లో ఇచ్చే విందుల్లో మందు సరఫరా చేసే పద్ధతికి ఆయన భరతవాక్యం
పలికారు.
అమెరికా
అధ్యక్షులు నివసించే భవనానికి వైట్
హౌస్ అని నామకరణం చేసింది ప్రెసిడెంట్
రూజ్ వెల్ట్. అంతకు ముందు ఆ భవనాన్ని ప్రెసిడెంట్ నివాసం (ప్రెసిడెంట్స్
ఎగ్జిక్యూటివ్ మాన్షన్) అని పిలిచేవాళ్ళు.
రూజ్
వెల్ట్ కి మరో ఘనత కూడా వుంది. ఆయన నాలుగు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ
తరువాత రాజ్యాంగాన్ని సవరించి ఒకే వ్యక్తి రెండు తడవలకు మించి అధ్యక్షుడిగా ఎన్నిక
కారాదని పరిమితి విధించారు.
జేమ్స్
కె పోల్క్ నిజానికి అమెరికాలోనే కాకుండా
యావత్ ప్రపంచంలో కూడా ఆదర్శ ప్రాయుడయిన
రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తాను చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని
అధికారంలోకి వచ్చిన తరువాత తుచ తప్పకుండా నెరవేర్చి చూపెట్టారు. అంతే కాదు, అవకాశం
వున్నప్పటికీ రెండోసారి పోటీ చేయడానికి ఆయన ఇచ్చగించలేదు.
అమెరికన్
అధ్యక్షులు అందరిలో విలియం హెన్రీ హారిసన్ అత్యంత దురదృష్టవంతుడు. ఎందుకంటే
అధ్యక్షుడిగా ఎన్నికై, వైట్ హౌస్ లో
ప్రవేశించిన ముప్పయి రెండు రోజుల్లోనే కన్నుమూశారు.
గ్రోవర్
క్లీవ్ లాండ్ అధ్యక్షుడిగా వున్న రోజుల్లో ఎవరు ఫోను చేసినా, ఆపరేటర్ తో నిమిత్తం లేకుండా ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకునేవారు.
వైట్
హౌస్ కి వచ్చిన అతిధులతో అధ్యక్షుడు కరచాలనం చేసే సంప్రదాయాన్ని థామస్ జెఫర్ సన్ ప్రవేశపెట్టారు.
అంతకు ముందు ప్రెసిడెంటుని కలవడానికి వచ్చినవారు
గౌరవ పురస్సరంగా ఒంగి అభివాదం చేసేవారు.
రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com
మొబైల్: 98491
30595
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

