3, జనవరి 2015, శనివారం

రచన వెనుక రహస్యం.


1975 నాటి మాట. బెజవాడ ఆంధ్ర జ్యోతిలో పనిచేస్తున్నరోజులు. అప్పటికే హైదరాబాదుకు మకాం మార్చిన ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారికి ఓ ఆలోచన వచ్చి బెజవాడలో అసిస్టెంట్ ఎడిటర్ గా వున్న నండూరి రామమోహన రావు గారిని సంప్రదించారు. అనుదినం జరిగే సంఘటనలపై స్పందించి నాలుగు లైన్లలో హస్యస్పోరకంగా వుండే గేయాన్ని రాయించాలని వారి ఉద్దేశ్యం. రాయగలరా అని అడక్కుండా రాయండి అనేసారు రామ్మోహన రావు గారు నాతొ. ఆవిధంగా మొదలయ్యాయి ఆంద్ర జ్యోతి దినపత్రికలో ఎడిట్ పేజీలో కార్టూన్లవంటి నా వాక్టూన్లు. చిత్రకారుడు రమణ గారు ఓ చిన్న చిత్రాన్ని దానికి జోడించేవారు.
ఆరోజుల్లో గోరాగారి కూరగాయల ఉద్యమం మొదలయింది. బెజవాడ గవర్నర్ పేటలోని రాఘవయ్య పార్కులో కార్యక్రమం. వ్యవసాయ శాఖ మంత్రి ఏసీ సుబ్బారెడ్డి గారు ముఖ్య అతిధి. పూలదండల బదులు కూరగాయల దండలు వేయాలనేది గోరాగారి ఉద్యమం. కూరగాయలు పెంచితే ప్రజలకు ఉపయోగం అనేది ఆయన సిద్దాంతం. సరే సభ మొదలయింది. కూరగాయలతో చేసిన దండలు వేసారు, పుష్ప గుచ్చాల బదులు కాలీ ఫ్లవర్, క్యాబేజీలతో రూపొందించిన గుచ్చాలు అందించారు. సుబ్బారెడ్డి గారు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే రకం. మనసులో  దాచుకుండే మనిషి కాదు. అయన  మాట్లాడుతూ, గోరాగారి ఉద్దేశ్యం మంచిదే  అయినా మనిషి మానసిక ఆనందానికి పూలతోటలు కూడా అవసరమన్నారు. పూల చెట్లు పీకి వాటి స్థానంలో కూరగాయల మొక్కలు పెంచేబదులు, కాలువగట్ల మీద, వృధాగా వున్న ప్రాంతాలలో  కూరగాయల పాదులు వేస్తె నలుగురుకీ ఉపయోగం అన్నట్టు ప్రసంగించారు. ఆ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని నేను వాక్టూన్ రాసాను. అదే ఇది.
కాయ 'గోరా'లు
కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని, మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా

(జూన్, 11, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)


ఈ దినసరి వాక్టూన్ల రచనావ్యాసంగం నేను జ్యోతిని వొదిలిపెట్టి హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో విలేకరిగా చేరేవరకు నిరవధికంగా అనుదినం కొనసాగింది.   

NOTE: Courtesy Image Owner 

విమాన ప్రమాదం - ప్రత్యక్ష ప్రసారం



విమాన ప్రమాదాలు, అదృశ్యాలు గురించి వరస సమాచారాలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో 2009 లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం బ్లాక్ బాక్స్ ఆధారంగా యూ ట్యూబ్ లో లభ్యమవుతోంది. విమానం గాలిలోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే పక్షులు డీకొన్న కారణంగా ఒక నదిలో కూలిపోయిన దృశ్యాలు ఇందులో వున్నాయి.


జనవరి పదిహేనవ తేదీన న్యూయార్క్ నగరంలోని లా గార్దియా ఎయిర్ పోర్ట్ నుంచి యుయస్ ఎయిర్ వేస్ కు చెందిన ఎయిర్ బస్ విమానం, వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ కు బయలుదేరింది. అయితే మూడు నిమిషాలు కూడా  గడవకముందే ఆ విమానాన్ని పక్షులు డీకొన్నాయి. ఫలితంగా ఇంజిన్ శక్తి దెబ్బతిన్నది. ప్రమాదాన్ని సకాలంలో పసికట్టిన విమాన సిబ్బంది దగ్గరలో ఎలాటి విమానాశ్రయం లేకపోవడంతో తెగించి విమానాన్ని మన్హాటన్ సిటీ దాపున హడ్సన్ నదిలో దింపారు. విచిత్రం ఏమిటంటే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరక్కపోవడం. అందులోని  155 మంది ప్రయాణీకులు, సిబ్బంది  సురక్షితంగా బయట పడ్డారు.  తరువాత ఆ విమాన సిబ్బందిని అత్యుత్తమ పురస్కారంతో గౌరవించారు.
ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది లింక్ లో చూడవచ్చు.


NOTE: Courtesy youtube



2, జనవరి 2015, శుక్రవారం

పేరు మారినా తీరు మారునా?

(Published by 'SURYA' telugu daily in its edit page on 04-01-2015, SUNDAY)

భారత  ప్రభుత్వం ఇక 'భారతీయ పాలన' అందించబోతోందా? అవునననే అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ.
గత ఆగస్టులో ఎర్రకోట బురుజులమీద నుంచి ఇచ్చిన  పంద్రాగస్టు సందేశంలో, ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో మరో కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నట్టు  మోడీ తన మనసులో మాట బయట పెట్టారు. తరువాత ఢిల్లీ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇప్పుడు తాజాగా నూతన సంవత్సరం తొలి రోజున 'నీతి ఆయోగ్' అనే పేరుతొ సరికొత్త  సంస్థను ఏర్పాటు చేసారు. 'నీతి' అనేది, 'నేషనల్ ఇన్ష్టి ట్యూషన్ ఫర్  ట్రాన్స్ ఫార్మింగ్  ఇండియా' అనే   ఆంగ్ల నామానికి సంక్షిప్త రూపం.  దీనితో అరవై అయిదేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘానికి చరమగీతం పాడినట్టయింది. భారత దేశపు ప్రధమ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆలోచనతో అలనాడు రూపుదిద్దుకుని, ఇన్నేళ్ళుగా జరిగిన  దేశాభివృద్ధిలో తనకంటూ ఒక చారిత్రిక స్థానాన్ని  సముపార్జించుకున్న  ప్రణాళికా సంఘం,  చివరికి ప్రధాని  మోడీ కొంగొత్త  ఆలోచనకు అనువుగా చరిత్ర పుటల్లో  కలిసిపోయింది.  ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ సారధులు కొత్త కొత్త ఆలోచనలు చేయడం, సరికొత్త పధకాలకు రూపకల్పన చేయడం పరిపాటే. కానీ, ఏళ్ళతరబడి తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్న కొన్ని వ్యవస్థలను సమూలంగా మార్చివేసి, నూతన వ్యవస్థలకు అంకురార్పణ చేయడానికి చాలా బలమైన రాజకీయ సంకల్పం  అవసరం. మోడీ ఆ పనిచేసి చూపారు.  గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం నడిపిన అప్పటి ప్రధాని వాజ్  పాయ్ కూడా ప్రణాళికా సంఘం జోలికి పోకపోవడం గమనార్హం. ఇప్పుడా ఘనత మోడీ ఖాతాలో చేరింది.


ప్రణాళిక సంఘం పని తీరు గురించి ఇటీవలి కాలంలో ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయినప్పటి నుంచి విభిన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఇది చాలా మంచి వ్యవస్థ అనేవారితో పాటు, ఇదొక వ్యర్ధ వ్యవస్థ అనీ, అజాగళస్థనమనీ చులకనగా మాట్లాడిన వాళ్ళూ వున్నారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చేయడానికి తప్ప దీనివల్ల ఎలాటి ప్రయోజనం లేదని వాదించే వారి అభిప్రాయం పట్లే మోడీ మొగ్గు చూపారని అనుకోవాలి. తాను  ప్రతిపాదించిన కొత్త వ్యవస్థ పట్ల కూడా ఆయన బాగా నమ్మకం పెంచుకున్నట్టు ప్రధాని  ట్వీట్ చేసిన ట్విట్టర్ సందేశం తెలుపుతోంది. ఈ అంశంపై కేంద్ర క్యాబినెట్ చేసిన తీర్మానం కూడా అదే తీరును వ్యక్తపరచింది. ప్రభుత్వానికి దశ, దిశ నిర్దేశించే బాధ్యత కొత్త వ్యవస్థకు అప్పగించారు. దేశాభివృద్ధికి భారతీయత జోడించడం ఇందులోని నవ్యత్వం. ఈ తీర్మానాన్ని రూపొందించేటప్పుడు మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అమ్బెర్ద్కర్, స్వామీ వివేకానంద దీన్ దయాళ్ ఉపాద్యాయ వంటి మహనీయుల స్పూర్తిదాయక ప్రవచనాలను సూక్తులను పేర్కొనడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా భారత దేశ పాలనావ్యవస్తలో సమాఖ్య స్పూర్తికి పెద్ద పీట వేయడం ఈ కొత్త సంస్థ ఏర్పాటులోని  ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రాలకు సముచితమైన పాత్ర  ఉండేలా, జాతీయ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేయడం ఈ సంస్థ బాధ్యతల్లో ఒకటి. గ్రామా స్థాయి నుంచి ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నది మరో లక్ష్యం. సహకార సమాఖ్య (ఫెడరల్) స్పూర్తిని కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వానికీ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే విధమైన జాతీయ ఎజెండాను తయారు చేయాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యాల్లో వుంది.
విభిన్న ఆలోచనలకు వేదికగా దీని తయారు చేసేందుకు ఈ సంస్థ పరిధిని చాలా విస్తృతం చేసారు. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వుండే ఈ సంస్థలో విభిన్న రంగాలకు చెందిన వారు సభ్యులు గా వుంటారు. సీయీవో, ఉపాధ్యక్షులను ప్రధాని నియమిస్తారు. అయిదుగురు శాశ్వత  సభ్యులు వుండే ఈ 'నీతి ఆయోగ్' లో ఇద్దరు సభ్యులను యూనివర్సిటీలనుంచి, ప్రసిద్ధ పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్ నెంట్ గవర్నర్లు పాలకమండలిలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
పొతే, కాలం చెల్లిన సంస్థగా మోడీ సర్కారుచేత ముద్ర వేయించుకుని కాలగతిలో కలిసిపోయిన  ప్రణాళికాసంఘం (యోజనా ఆయోగ్) చరిత్ర కూడా చిన్నదీ కాదు, తీసివేసేంత అల్పమైనదీ కాదు. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని1950 మార్చినెలలో కేబినేట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసారు. అప్పట్లో నెహ్రూ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారున్నారు. కానీ నెహ్రూ వాటిని ఖాతరు చేయకుండా తాను అనుకున్న రీతిలోనే ముందుకు సాగిపోయారు. ఆ నాటినుంచి ప్రణాళికా సంఘ ప్రయాణం అరవై అయిదేళ్లుగా నల్లేరు మీది బండిలా సాగిపోయింది. పన్నెండు పంచవర్ష ప్రణాళికలకు ఇది రూపకల్పన చేసింది. సుమారు రెండువందల లక్షల  కోట్ల రూపాయల నిధుల వ్యయానికి పచ్చ జెండా చూపింది. దేశంలో వ్యవసాయ విప్లవానికీ, భారీ పరిశ్రమల ఏర్పాటుకు దోహదం చేసి మిశ్రమ ఆర్ధిక విధానాలతో నవ భారత నిర్మాణానికి గట్టి పునాది వేసింది.
ధిగ్గనాధీరులయిన వారు ఈ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. పదేళ్ళపాటు వరుసగా పనిచేసిన గౌరవం గుల్జారీ నందాకు, మాంటెక్ సింగ్ ఆహ్లూ వాలియాకు దక్కింది. శ్రీయుతులు కృష్ణమాచారి, సీ ఎం త్రివేది, అశోక్ మెహతా, సీ. సుబ్రహ్మణ్యం, పీ ఎన్ హక్సర్, ఎన్డీ తివారి, ఎస్ బీ చవాన్, పీసీ సేథీ, మన్మోహన్ సింగ్, పీ. శివశంకర్, మోహన్ దారియా, జస్వంత్ సింగ్, కేసీ పంత్ మొదలైనవారు  ప్లానింగ్ కమీషన్ ఉపాధ్యక్షులుగా సేవలు అందించిన వారిలో వున్నారు.
నెహ్రూ నెలకొల్పిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సహజంగానే జీర్ణించుకోలేకపోయింది. నవభారత నిర్మాణ సారధిగా సత్సంకల్పంతో నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం దేశ పురోగతిలో ఎంతో గొప్ప పాత్ర పోషించిన విషయాన్ని  మోడీ ప్రభుత్వం విస్మరించిందనీ, కేవలం ప్రజల మనస్సుల్లో నుంచి నెహ్రూ ఇందిరాగాంధీల స్మృతిని చెరిపివేసే దురుద్దేశ్యంతోనే సంస్కరణల పేరుతొ ఇటువంటి సమూల మార్పులకు శ్రీకారం చుడుతోందని ఆరోపించింది. సీపీఎం, సీపీఐ నాయకులు కూడా కాంగ్రెస్ తో గొంతు కలిపారు.
యాదృచ్చికమే కావచ్చు కానీ, నెహ్రూ స్మృతిని విస్మృతం చేసేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలకు మద్దతు ఇస్తున్నట్టుగా కేంద్ర  ప్రభుత్వం మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులకు ఇస్తున్న గౌరవం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల  పట్ల చూపడం లేదనిపించే దృష్టాంతాలు కానవస్తున్నాయి. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహించే అంశంలో మోడీ సర్కారు అనుసరించిన విధానాన్ని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. అలాగే మహాత్మా గాంధీ దక్షిణాప్రికా నుంచి భారత దేశానికి తిరిగివచ్చిన రోజును వందేళ్ళ వేడుకగా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనలు జారీ చేయడాన్ని, సర్దార్ పటేల్ కు 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' పేరుతొ మొత్తం ప్రపంచంలోనే  అతి ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పడానికి మోడీ ప్రయత్నం చేయడాన్ని ఉదహరిస్తూ, గాంధీ, పటేల్ వంటి కాంగ్రెస్ నాయకుల పట్ల అనుసరిస్తున్న ఉదార వైఖరి నెహ్రూ విషయంలో ప్రదర్శించడం లేదన్నది వారు చేస్తున్న  ప్రధాన ఆరోపణ.

రాజకీయాల్లో ఆరోపణలే కాని వివరణలు వుండవు. అది వారికీ తెలుసు. వీరికీ తెలుసు. (02-01-2015)

31, డిసెంబర్ 2014, బుధవారం

HAPPY NEW YEAR – 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు

                                     


"వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             "అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!"
                 
      

నిర్మలాదేవి - భండారు శ్రీనివాసరావు 

(NIRMALADEVI & BHANDARU SRINIVASRAO) 

30, డిసెంబర్ 2014, మంగళవారం

విగ్రహాలు - వివాదాలు


(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 01-01-2015, THURSDAY)

బహిరంగ ప్రదేశాలలో అనుమమతి లేకుండా ప్రతిష్టించిన రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించే చర్యలను సత్వరం తీసుకోవాల్సిందని ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటినీ హైకోర్ట్ ఆదేశించింది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతూ, పారిశుధ్య విభాగాలకు సవాలుగా పరిణమిస్తున్న ఫ్లెక్సీల వాడకంపై కూడా కోర్టు కొరడా  ఝలిపించింది.

చోటామోటా నాయకుల పుట్టిన రోజులకు సయితం నగర వీధులన్నీ ప్లాస్టిక్ ఫ్లేక్సీలతో, తోరణాలతో నిండిపోతున్నాయి. అసలే చెత్త నగరాలుగా పేరొందిన నగరాలు ఈ ప్లాస్టిక్ చెత్తతో మరింత చెత్తగా తయారవుతున్నాయి. నిజానికి ఇవి  నివారించగలిగిన వ్యర్ధాలు. కానీ అడిగే నాధుడు లేక ప్రతిచిన్న కార్యక్రమానికి వందలాది  ఫ్లేక్సీలు, వేలాది తోరణాలు తెల్లారేసరికల్లా వీధుల్లో ప్రత్యక్షం. అవి తీసీ తీయకముందే మరో కార్యక్రమం. మళ్ళీ షరా మామూలే. ఈ  నేపధ్యంలో న్యాయస్థానం ఉత్తర్వు ఒకింత ఊరట కలిగించేదిగావుంది. అయితే,  కోర్టులు  ఎన్నో ఆదేశాలు ఇస్తుంటాయి. వాటిలో కొన్నే అమలుకు నోచుకుంటాయి. మరి ఈ తాజా ఉత్తర్వు ఏ జాబితాలోకి చేరుతుందో చూడాలి. 
  
మన దగ్గర ఇటీవలి కాలంలో పెచ్చరిల్లిపోతున్న రాజకీయ  విగ్రహారాధన విష సంస్కృతి నేపధ్యంలో ఈ వార్తకు ఎంతో ప్రాధాన్యం వుంది. కాకపోతే దీనికి రావాల్సిన ప్రాముఖ్యం, ప్రాచుర్యం మీడియాలో లభించలేదేమో అనిపిస్తోంది.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు మన రాష్ట్రంలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు వాటిల్లో  మచ్చుకు కూడా కానరావు. కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన వీఐపీకి తీరుబడి దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో వొదిలేస్తారు. వారి భక్తి  తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం దొరకని ప్రస్తుత నాయకుడి మీదో తెలియక దారినపోయే జనం తలలు పట్టుకుంటారు. అలాగే ఆ విగ్రహాల కారణంగా సామాన్య జనజీవనానికి ఏమైనా అసౌకర్యం కలుగుతోందా అన్న విషయం కూడా వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం. సరిగ్గా ఈ అంశంపైనే హైకోర్టు స్పందించినట్టు కనబడుతోంది.  
   
'విగ్రహారాధన కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన  పుణ్య భూమి మనది. అయినా  విగ్రహాలకు మాత్రం  ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు వద్దన్న బుద్దుడి  విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో కానవస్తాయి. ఇక  ప్రసిద్ధ హిందూ  ఆలయాల్లో కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు స్వయంభూ విగ్రహాలుగా అవతరించాయని చెబుతారు. ఇవి కూడా జన సంచారానికి దూరంగా అధిక భాగం కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర భారతంలో ఆయా మత విశ్వాసాలకు తగిన ఆలయాలు అనేకం వున్నాయి. దైవానికి ఒక రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా విగ్రహాలు లేని ప్రార్ధనా మందిరాలు అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను సందర్శించే  యాత్రీకుల సయితం  సంఖ్య నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల పుణ్యమా అని కుల మతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమ అవసరాలకోసం రాజకీయ పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మతం అనేది ఒక జీవన విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప శక్తిగా మారుతూ వస్తోంది. రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు వినరాకుండా పోతున్నాయి.

మత ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది ఏమీ లేదు. కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో వివాదగ్రస్తం అవుతున్నాయి. ఒకప్పుడు  మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది మహనీయులుగా, మానవీయులుగా  వెలుగొందిన వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ విగ్రహాలు కూడా చెల్లని కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే  కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు పలుచోట్ల చోటు చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి సోవియట్ యూనియన్ లో,  స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు తదనంతర కాలంలో పట్టిన దుస్తితి చరిత్ర రికార్డుల్లో  నమోదయివుంది. ఆఖరికి లెనిన్  మసోలియంలో అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన స్టాలిన్ శరీరాన్ని వెలికి తీసి వేరే చోట ఖననం  చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా భవిష్యత్తు ఉండదని చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత లోపిస్తోంది.  కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు. కొందర్ని జీవించి ఉండగానే జనం జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు  లేకుండా చేస్తారు. రాజకీయానికి జాలీ దయా వుండవు.       
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన' అంబరాన్ని తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని  బడుగు బలహీన వర్గాల నాయకులు రవిదాస్, నారాయణ గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్, పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్ అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే తన విగ్రహాల ఏర్పాటు పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం.  2007 నుంచి రెండేళ్ళ  కాలంలో మాయావతి ఈ నాయకుల  స్మారక చిహ్నాల నిర్మాణాలపై వందలకోట్లు ఖర్చు చేసారు.  
ఇక మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి కలిసి ఏకంగా నాధూరాం గాడ్సే విగ్రహ స్థాపనకు నడుం బిగించాయి. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహం ఏర్పాటు అయితే అది మొత్తం దేశంలోనే మొట్టమొదటి గాడ్సే విగ్రహం అవుతుంది. మీరట్ లో ఇందుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం  పోలీసు బందోబస్తు నడుమ ఇటీవల పూర్తయింది కూడా.
కేరళ లోని కోజికోడ్ పట్టణానికి ఏకంగా విగ్రహాల నగరం అనే పేరు కూడా వుంది.
ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రానికి రాజధాని నగరంగా వున్న హైదరాబాదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో జిబ్రాల్టర్ రాక్ అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పించారు. ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల ఎత్తులో ఒక వేదికను నిర్మించారు. భారీ విగ్రహానికి కావాల్సిన  ఏకశిలను  నల్గొండ జిల్లాలో స్థపతులు ఎంపికచేసి విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది పనివారలు, శిల్పుల సాయంతో అయిదేళ్లపాటు శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది అడుగులు ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కారు. అనేక వ్యయప్రయాసల అనంతరం మూడువందల యాభై టన్నుల బరువున్న ఆ విగ్రహం సుమారు నలభై మైళ్ళు ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన భారీ క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని ముంబై నుంచి తెప్పించారు.
ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త ఎన్టీ రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని పూర్తిచేసే పనికి పూనుకుంది. 1990, మార్చి పదో తేదీన విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ జలాలమీదుగా తరలిస్తుండగా వంద గజాల దూరం దాటకుండానే ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. కల్మషం ఎరుగని బుద్ధ భగవానుడు కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు. చిట్టచివరకు  1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు జలసమాధి నుంచి బయటపడి తనకోసం సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు.  2006 లో బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే తెలుగువెలుగుల విగ్రహాలు వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో రాకపోకలకు అంతరాయం కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే ఆ విగ్రహాలకు ఎంపిక కూడా వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప వ్యక్తులను పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి. ప్రత్యెక రాష్ట్ర ఉద్యమ సమయంలో మరోసారి ఈ అంశం వెలుగులోకి రావడమే కాకుండా విభజనవాదులు వాటిల్లో కొన్నింటిని విధ్వసం చేసేవరకు విషయం ముదిరిపోయింది.
అభివృద్ధి చెందిన  అనేక దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక పక్కగా విగ్రహాలు  ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు లేకపోవడమే కాకుండా చూపరులకు కంటికి విందు గొలుపుతాయి. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు ప్రపంచంలో వివిధనగరాలకు  ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.

    
విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి విగ్రహారాధన ఏదో ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల సంవత్సరాల నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎత్తయిన విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. ప్రస్తుతం ఆ రికార్డు సొంతం చేసుకునే పనిలో మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. గుజరాత్ లో  అతి ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు అంకురార్పణ చేసింది కూడా. నర్మదా డామ్ ఎదురుగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం పూర్తయినాడు  అదే యావత్ ప్రపంచంలో అతి ఎత్తయిన విగ్రహం అవుతుంది.


అనేక చారిత్రిక ఘట్టాలకు ఆనవాలుగా విగ్రహాలను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే సమాజాన్ని బాగా ప్రభావితం చేసిన మహనీయుల పట్ల గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించడం పరిపాటి.  అమెరికా అధ్యక పదవి రేసులో దేశాన్ని చుట్టబెడుతున్న రోజుల్లో ప్రెసిడెంట్ ఒబామా ఇలినాయిస్ రాష్ట్రంలోని, మెట్రోపాలిస్  నగరంలో  ఏర్పాటు చేసిన హాలీవుడ్ చిత్ర కధానాయకుడు 'సూపర్ మ్యాన్' విగ్రహం ఎదుట నిలబడి ఫోటో తీయించుకుని మరీ తన ముచ్చట తీర్చుకున్నారు. న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు తునక.   లండన్ లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ బొమ్మ చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.

(31-12-2014)

NOTE: Photo Courtesy Image Owner 

నిలబెట్టుకోలేని మాట


ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు.
నేను చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి వారు ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.
ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది కామన్ గా తమకుతాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం అని. కానీ, కామన్ గా జరిగేది ఏమిటంటే  మర్నాడు సీను షరా మామూలే. హాల్లో   పీఠం వేసుకుని, విలాసంగా  సిగరెట్టు వెలిగించి, మందహాసంతో  మందు గ్లాసు  పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ మాట అస్సలు  గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం అన్నట్టు.  కావున,  కావుకావుమని చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని  రాజకీయ నాయకులను  నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
మనం మాట తప్పడానికి  కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త ఏడాది మళ్ళీ వస్తుందని.       
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన గట్టునే పెట్టి వెడుతున్నారు.

అదన్న మాట.

NOTE: Courtesy Cartoonist 

29, డిసెంబర్ 2014, సోమవారం

ప్రపంచమే ఒక నాటక రంగం


స్వామి  చిత్రానంద లేచి వెళ్లి టీవీ ఆఫ్ చేసి వచ్చి కూర్చుని చెప్పారు.
'చూశారు కదా! అందుకే అన్నారు, ప్రపంచమే ఒక నాటక రంగం అనీ,  మనమందరం ....'
శిష్యులలో ఒకడు తొందర పడి అన్నాడు 'మనమందరం నటీ నటులం'
'కాదు నాయనా మనలో చాలామందిమి ప్రేక్షకులం. కొందరే నటులు. ఇప్పటిదాకా టీవీలో వారినే కదా చూశారు'
అన్నారు స్వామి చిత్రానంద.
పేరుకు తగ్గట్టే ఆయన చాలా చిత్రమైన మనిషి. శిష్యులకు బోధించే తీరు కూడా అలాగే విలణంగా వుంటుంది.
టీవీలో వస్తున్న ప్రోగాం గురించి ఆయన చెప్పారు.
'అందులో ఇంటర్వ్యూ ఇచ్చిన శాల్తీని  గుర్తుపట్టారు కదా!'
'గుర్తుపట్టాము  గురువు గారు. ఆయగారేమో  నిన్నమొన్నటి దాకా ఓ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ ప్రత్యర్ధి పార్టీని అయినదానికీ కానిదానికీ ఉతికి ఆరేస్తూ, చెరిగేస్తూ  గంట క్రితమో అరగంట క్రితమో అదే పార్టీలోకి దూకేసినవాడు. కదా! గురువు గారు'     
'కదా! పాత్ర మారిన తరువాత మాట తీరు కూడా ఎలా మారిపోయిందో చూశారు కదా!. ఇప్పటికయినా అర్ధం అయిందా మనమందరం  ఎలాటి ఘనాపాటీ నటీ నటుల మధ్య బతికేస్తున్నామో'
'మరే గురువు గారు. మా చిన్నప్పుడు సావిత్రీ ఎంటీయారు ఓ సిన్మాలో  ప్రేయసీ ప్రియులుగా ప్రేమ పాటలు పాడే సుకుని,  మరో చిత్రంలో అన్నాచెల్లెళ్ళుగా కావిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంటే అబ్బ యెంత గొప్పగా పాత్రల్లో వొదిగిపోయారో అనిపించేది'
'అలాటి సినిమాలు మ్యాట్నీ ఒక హాల్లో, మొదటాట ఇంకో హాల్లో చూసి మతులు పోగొట్టుకునే వాళ్ళం కూడా' ఇంకో శిష్యుడు అందుకున్నాడు.
'ఇందాక  టీవీలో  పాత పార్టీ నాయకుడ్ని పొగిడేస్తూ, కొత్తగా చేరిన కొత్త పార్టీ నాయకుడ్ని చెరిగేస్తూ గతంలో తాను  చేసిన కామెంట్ల  పాత క్లిప్పింగులు మధ్య మధ్యలో చూపిస్తుంటే  ఆ నాయకుడి మోహంలో రంగులు ఎలా మారతాయో చూద్దామని ఉగ్గబట్టి చూశాను గురువుగారు. కానీ అదేం  చిత్రమో ఆయన మోహంలో రంగులు మారలేదు సరికదా, టీవీలో చూపిస్తున్నది  తనని కాదు వేరే ఎవర్నో అన్నంత దిలాసాగా కనిపించేసరికి నేనే బిత్తరపోయాను గురువుగారు. వీరి నటన చూస్తుంటే ఆస్కారు కూడా వీరికి తక్కువ అవార్డేమో అనిపించింది'
'గతంలో ఆ పార్టీ అధినేత కుటుంబం నడిపే కంపెనీ పాలు విషపూరితం, కేసు పెట్టి అరెస్టు చేయాలి  అంటూ తాను  గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్  పాత  క్లిప్పింగులు ఓ పక్క చూపిస్తుంటే, ఆయన మాత్రం నిర్వికారంగా   మా ఇంట్లో అప్పుడూ ఇప్పుడూ ఆ పాలే తాగుతాం, చంటివాడికి ఉగ్గు పాలకింద ఆ కంపెనీ పాలే పడతాం అనే తీరులో  ఎంతో ధీమాగా చెబుతుంటే వీళ్ళ నటన  ముందు సినిమా నటులు కూడా బలాదూరు అనిపించింది'
శిష్యుల వ్యాఖ్యానాలు విని స్వామి చిత్రానంద చివరగా అనుగ్రహ భాషణ చేశారు.

'మనిషి నాలుకకు నరం లేదు. నరం లేని నాలిక ఎటువైపేనా తిరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల మాటలు గురించి చెప్పేదేముంది. వారు తమ అవసరాన్నిబట్టి పార్టీ మారతారు. పార్టీ అవసరాన్నిబట్టి మాటలు మారుస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేదంతా నిజం అనుకోకూడదు. అలాఅని మనం కూడా బయట పడరాదు సుమీ. నమ్మినట్టు నటిస్తే ఓ పనయిపోతుంది. ఎందుకంటె ఎన్నాళ్ళు ప్రేక్షకులుగా వుండిపోతాం చెప్పండి. మనమూ ఎదగాలి కదా! సరే! ఈపూటకి ఈ పాఠం చాలు. రేపు మరో కొత్త సంగతి చెప్పుకుందాం' అని శిష్యులకు సెలవిచ్చారు స్వామి చిత్రానంద. 



NOTE: Courtesy Cartoonist