17, డిసెంబర్ 2014, బుధవారం

విస్త'రణం'


(Published by 'SURYA' telugu daily in its edit page on 18-12-2014, Thursday)

తెలంగాణా మంత్రివర్గం విస్తరణలో ఆఖరి పంక్తి  వడ్డన కూడా పూర్తయింది. రాజ్యాంగం ప్రకారం శాసన సభ మొత్తం సభ్యుల సంఖ్యలో పదిహీను శాతం వరకు మంత్రులను నియమించుకునే తతంగం కూడా ముగిసింది. ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం పద్దెనిమిది మందితో మంత్రివర్గం కొలువుతీరింది.  ఇక పంచడానికి మిగిలింది ఏమీ లేదు. ఆశావహుల ఆశలపై  నీళ్ళు చల్లినట్టే. అయితే  చీకట్లో చిన్న కాంతి కిరణం ఏమిటంటే, మంత్రి పదవి రాలేదని కినుక వహించిన ఒక సీనియర్ టీ.ఆర్.యస్. నాయకుడిని  బుజ్జగిస్తూ, త్వరలోనే కేబినెట్ పునర్వ్యవస్తీకరణ  ఉంటుందనీ, అప్పుడు తప్పక న్యాయం చేస్తాననీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు వెలువడిన వార్తకధనాలే. వీటిల్లో నిజమెంతో తెలియదు కానీ, ఆశలు  పెంచుకుని నిరాశకు గురయిన వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినట్టు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పుటంగా కానవచ్చింది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అనే నానుడిని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఒక కొత్త సంప్రదాయానికి కూడా  కేసీయార్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రధమార్ధంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ని  మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే ఆయన తన శాసన  సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ పంపారు. అంటే మరో ఉప ఎన్నికకు రంగం సిద్దమవుతున్నట్టే.  
ప్రమాణ స్వీకారం వంటి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు మొహం చాటేయడం సహజమే కాని పాలక పక్షానికి చెందిన వారిలో పెక్కురు గైర్ హాజరు కావడం, ముఖ్యంగా  తెలంగాణా అసెంబ్లీలో చీఫ్ విప్ గా నియమితులయిన కొప్పుల ఈశ్వర్ వంటి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి రాకపోవడం పాలక పక్షానికి కొంత  ఇబ్బంది కలిగించే విషయమే. అదే రోజు ఉదయం విదేశీ పర్యటన నుంచి నగరానికి తిరిగి వచ్చిన రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీయార్ కుమారుడు  కే.టీ. రామారావు సయితం మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాకపోవడం ఆ పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలకు సంకేతం అని వాదించేవారున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సాంప్రదాయంగా గవర్నర్ తో కలిసి దిగే  మంత్రివర్గం ఫోటోలో కూడా కేటీఆర్ కనిపించలేదు. చీఫ్ విప్, విప్పులు, పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం గురించి జీవోలు వెలువడ్డాయి కానీ, ఆ పదవుల్లో నియమితులయిన వారిలో అనేకమంది మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు.  గైర్హాజరుకు ఎవరికి వుండే కారణాలు వారికి వున్నా, కేసీయార్ వ్యవహార శైలి నచ్చని ఆ పార్టీవారి చేతికి ఒక ఆయుధం అందించినట్టు అయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ అప్పుడే విమర్శల దాడి ప్రారంభించాయి. కొత్త మంత్రులలో అధికులు  తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కావడం సరి కొత్త విమర్శలకు,  మీడియాలో విస్తృత చర్చలకు దారితీసింది. 'తెలంగాణా మంత్రి వర్గాన్ని చూస్తుంటే రాష్ట్రాన్ని పాలిస్తోంది మా పార్టీ యేమో అన్న సందేహం కలుగుతోంద'ని టీటీడీపీ సీనియర్ నాయకుడొకరు చమత్కరించడం కొస మెరుపు.
మంగళవారం నాడు జరిగిన మంత్రివర్గ విస్తరణ అనంతరం,  ఇది నిజమేనేమో  అన్న అభిప్రాయం కలిగే అవకాశం వుంది. ముఖ్యమంత్రి కాకుండా తెలంగాణా మంత్రులు పదిహేడు మందిలో ఎనిమిదిమంది వేరే పార్టీలకు చెందినవారు. వారిలో ఎక్కువమంది  తెలుగుదేశం పార్టీలో ప్రముఖులుగా పేరుపొందిన వారు కావడం విశేషం.
ఈ విస్తరణతో తెలంగాణాలోని మొత్తం  పది జిల్లాలకు మంత్రి వర్గంలో స్థానం లభించినట్టయింది. తొలి విడతలో అవకాశం దక్కని  రెండు జిల్లాలకు ఈ సారి ప్రాతినిధ్యం లభించింది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, సీ. లక్ష్మారెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి  తుమ్మల నాగేశ్వరరావులను కేసీయార్ మంత్రులుగా తీసుకున్నారు. తెలంగాణాలో కొన్ని చోట్ల  బలంగా వున్న ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికే తుమ్మలను మంత్రిని చేసారనీ, కేవలం హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తలసాని శ్రీనివాస యాదవ్ కి మంత్రి పదవి ఇచ్చారనీ ఇప్పటికే విమర్శలు బయలుదేరాయి కూడా.           
ఎవరెన్ని అనుకున్నా, తాను  అనుకున్న పద్దతిలోనే ముందుకు సాగడం కేసీయార్ తత్వం. అన్ని విషయాలను అందరితో  చర్చిస్తూనే, కొన్ని అంశాలలో ఆయన తనకు తనుగానే నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్నో ఆటుపోట్లు నేర్పిన సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల కావచ్చు, పర్యవసానాలు ఎలా వున్నా ఎదుర్కునే గుండె నిబ్బరం ఆయనకు పుష్కలంగా అలవడింది. నాయకుడిగా ఎదగడానికీ, నిలదొక్కుకోవడానికీ ఈ రకమైన దృఢచిత్తం, ఏకపక్ష నిర్ణయాలు  అక్కరకు రావచ్చుకాని  ప్రస్తుతం ఆయనకు  వీటి అవసరం  బొత్తిగా లేదు. టీ.ఆర్.యస్. పార్టీకి సంబంధించినంతవరకు కేసీయారే కర్తా,కర్మా, క్రియా. ఆయన మాటని కాదనేవారు లేరు. కాదనుకుని నిలబడగలిగిన వారూ లేరు. మొత్తం పార్టీకి కేసీయారే సర్వం సహా చక్రవర్తి. ప్రాంతీయ పార్టీ అధినాయకులను ఎవరిని తీసుకున్నా ఇదే విధమైన వైఖరి కానవస్తుంది. దీనికి భిన్నంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ప్రాంతీయ పార్టీలను నడిపిన నాయకులతో పాటు, ఆ పార్టీలు కూడా  చరిత్ర గతిలో కలసిపోయిన విషయం కూడా కాదనలేని సత్యం.
మంత్రివర్గం కూర్పు అనేది  పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాల  మీదే ఆధారపడి వుంటుంది. ఎవర్ని మంత్రులుగా తీసుకోవాలి, ఎవరిని మంత్రివర్గం నుంచి తప్పించాలి, ఎవరికి ఏ శాఖలు అప్పగించాలి ఈ నిర్ణయాలు అన్నీ ముఖ్యమంత్రి అభీష్టం ప్రకారం జరుగుతాయి. ఇప్పుడు అలాగే జరిగింది కూడా.
సహజంగానే, మరీ  ముఖ్యంగా మరో అవకాశం ఇక లేదు అనుకున్న నేపధ్యంలో అసంతృప్తులు పెరగడం కూడా సహజంగానే జరుగుతుంది. 'మరో నాలుగున్నర ఏళ్ళ వ్యవధానం వుంది కదా! ఏదన్నా జరక్కపోతుందా, గుర్రం ఎగరకపోతుందా' అని వోపిగ్గా వేచి చూసే సహనం నేటి తరం రాజకీయుల్లో నానాటికీ లుప్తమవుతోంది. 'ఇలా పార్టీ టిక్కెట్టు సంపాదించు కోవడం, అలా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం, వెనువెంటనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసెయ్యడం' ఇలా సాగిపోతాయి వారి కలలు. దీనికి తోడు, ఉద్యమ పార్టీ అయిన టీ.ఆర్.యస్.లో ఆదినుంచీ పార్టీకు అన్నుదన్నుగా నిలబడి పోరాడిన వారికి, ఎట్టకేలకు తెలంగాణా కల సాకారమై, బంగారు తెలంగాణా నిర్మాణంలో పాలుపంచుకునే సువర్ణావకాశం  కోసం ఆరు మాసాలుగా ఎదురు చూస్తున్నవారికి, అందినట్టే కనబడిన మంత్రి పదవులను,  ఉద్యమంతో సంబంధం లేనివాళ్ళు ఆఖరు నిమిషంలో ఎగరేసుకుపోవడం మరింత బాధ కలిగించడం అసహజమేమీ కాదు.                                 
పుష్కర కాలానికి పైగా వొంటి చేత్తో ఉద్యమం నడిపి, దుష్కరమనుకున్న ప్రత్యెక రాష్ట్రాన్ని సాధించిన కేసీయార్ కు ఈ విషయాలు తెలియవని అనుకోలేము. ఇటువంటి వాటిని ఎలా నిభాయించుకు రావాలన్నది ఆయనకు కొట్టిన పిండి. ఎవర్ని ఎలా బుజ్జగించాలో, ఎవర్నిఎక్కడ, ఎలా హద్దుల్లో ఉంచాలో తెలిసిన నాయకుడు కాబట్టే ఇన్నేళ్ళు ఉద్యమం సెగ తగ్గకుండా చూడగలిగారు. అలా అని చెప్పి అన్ని రోజులూ ఒకే విధంగా నడిచిపోతాయి అనే అభిప్రాయం  పెంచుకోవడం కూడా సరయిన నాయకుడి లక్షణం కాదు. నొప్పించే నిర్ణయాన్ని కూడా సహచరులకు నచ్చచెప్పి వొప్పించే కుశలత నాయకుడికి చాలా  అవసరం. 'గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకనే' సూక్తి రాజకీయ నాయకులకు పూర్తిగా వర్తిస్తుందని జనం చెప్పుకునేది ఇందుకే. 

    
ఇక ఇప్పుడు తెలంగాణాకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడింది. రేపో మాపో అధికారుల విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి సాకులు చెప్పకుండా కాలయాపన లేకుండా పనులు  జరిగేలా చూడాలి. కలలు కంటున్న బంగారు తెలంగాణా సాకారం కావాలంటే ఎలాటి అలసత్వం కూడదు. పొరుగు రాష్ట్రంతో పొరపొచ్చాలు తగ్గించుకుని, అవసరమైన సహకారం అడిగయినా తీసుకుని వడివడిగా అడుగులు వేయాలి.
రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు గురించి ఆలోచించకుండా, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, వెనువెంటనే మంత్రి వర్గ  సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ  సత్వర కార్యాచరణకు ఆయత్తమైన కేసీయార్ వైఖరి  మెచ్చదగినదే. తాను పెట్టుకున్న లక్ష్యాలలో కొన్నింటినయినా వెంటనే చేసి చూపించగలిగితే ఇప్పుడు వినవస్తున్న విమర్శలు దూదిపింజల్లా కొట్టుకుపోతాయి. నాయకులకు పదవులు ప్రధానం కావచ్చు కానీ, ప్రజలకు అభివృద్ధి ముఖ్యం. చెప్పింది చేసి చూపించడం ఒక్కటే విమర్శకుల నోళ్ళు మూయించడానికి సరయిన మార్గం.    
రెండు తెలుగు రాష్ట్రాల అధినేతలు ఇక రాష్ట్రాభివృద్ధి అనే ఒకే లక్ష్యంతో కలిసికట్టుగా పనిచేయగలిగితేనే  రాష్ట్ర విభజన వల్ల ఏదైనా మంచి జరిగే వీలుంటే అది జరుగుతుంది. లేనిపక్షంలో ఈ ప్రయోగం విఫలమవుతుంది.
తోక టపా: తెలంగాణా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడిందన్న మాటే కాని, 'ఆకాశంలో సగం' అని గొప్పగా చెప్పుకునే మహిళలకు అందులో రవంత స్థానం లభించకపోవడం ఏవిధంగాను ఆమోదయోగ్యం కాదు, సమర్ధనీయమూ కాదు. ఇది నిష్టుర సత్యం.
(17-12-2014)

NOTE :  Courtesy Image Owner   

15, డిసెంబర్ 2014, సోమవారం

ఓ తండ్రి అప్పగింతలు


"మిమ్మల్ని ఎలా సంబోధించాలో నాకు బోధపడడం లేదు. మా అమ్మాయి తరపు కొత్త కుటుంబం అనుకోనా. లేదు లేదు అమ్మాయికి పెళ్ళయిపోయింది కాబట్టి మీరే ఆమె కుటుంబం.
"ఇప్పటిదాకా మా అమ్మాయి మా ఇంటి దీపం. ఇకనుంచి అది వెలిగేది, వెలుగు ఇచ్చేది మీ ఇంట్లోనే.
"ఒక మాట అడుగుతున్నాను తప్పుగా భావించకండి. నేను కోరేది ఒక్కటే. మా అమ్మాయి ఎక్కడ వున్నా ఆనందంగా హాయిగా ఉండాలని. నిజానికి ప్రతి తండ్రీ కోరుకునేది ఇదే, నాకు బాగా నమ్మకం. మా ఇంట్లోకంటే మా అమ్మాయి మీ దగ్గరే మరింత సంతోషంగా ఉంటుందని. అయినా ఆడపిల్ల తండ్రిని. అందుకే పదేపదే చెబుతున్నాను, ఆమెను సంతోషంగా ఉంచమని. పుట్టి ఇన్నేళ్ళవుతోంది కానీ ఏనాడు మమ్మల్ని బాధ పెట్టలేదు, భారంగా మారలేదు. అది చెంగుచెంగున  ఇల్లంతా తిరుగుతూ వుంటే ఇల్లూ మనసూ తేలికయ్యేవి. నేను ఇంత  హాయిగా శ్వాస తీసుకుంటున్నాను అంటే కారణం యేమిటనుకుంటున్నారు? నేనిలా మనసారా నవ్వుకుంటున్నాను అంటే కారణం ఏమిటనుకుంటున్నారు? మా అమ్మాయే. అమ్మాయి వున్నచోట అంతా ఆనందమే. అంతా సంతోషమే. మాకు ఇకనుంచి ఆ ఆనందం  దూరమవుతోంది.  కానీ సంతోషం ఏమిటంటే ఇంత  మంచి వాళ్ళు కాబట్టి  మీకది దగ్గరవుతోంది.
"ఆడపిల్ల ఎన్నాళ్ళు పెంచినా 'ఆడ' పిల్లే  కాని 'ఈడ'పిల్ల కాదు. ఎప్పుడో ఒకప్పుడు పెళ్ళిచేసి అత్తవారింటికి పంపక తప్పదు. అది ప్రకృతి ధర్మం.
"నేనూ దానికి కట్టుబడే పెళ్ళిచేసి పంపుతున్నాను. ఒక రకంగా నా మొత్తం ప్రపంచాన్నే నేను మీకు ఇచ్చేస్తున్నాను. అది వెళ్ళిపోయిన  తరువాత మాకు మిగిలేది శూన్యమే. మీ దగ్గర అది సంతోషంగా ఉంటోంది అన్న భావనే ఇక మమ్మల్ని బతికిస్తుంది.  
"మేము దాన్ని ఒక రాజకుమారి మాదిరిగా పెంచాము. మీరు దాన్ని రాణి మోస్తరుగా చూస్తారని నమ్మకం.
"ఒక మాట చెబుతున్నాను నన్ను నమ్మండి.
"ఒక చక్కని వ్యక్తిత్వంతో కూడిన మనిషిగా తీర్చి దిద్దడానికి నేను అహరహం కష్టపడ్డాను.  మా నమ్మకాన్ని అది వమ్ము చేయలేదు. అదిప్పుడు ఒక సంపూర్ణ  మహిళ. అత్తమామల్ని గౌరవంగా చూసుకుంటుంది. మరదుల్ని, ఆడపడుచుల్నీ ప్రేమగా లాలిస్తుంది. తన భర్తను మీ బిడ్డగా మీకు మరింత దగ్గర చేస్తుంది. ఇవన్నీ నేర్చుకునే మీ ఇంట కుడికాలు మోపబోతోంది. ఏదో ఆశించి ఇవన్నీ చేయబోవడం లేదు, తన కర్తవ్యం  అనుకుని చేస్తుంది. బదులుగా ఆమెకు నగలూ, నాణ్యాలు అక్కరలేదు, చీరెలూ సారెలూ అవసరం లేదు, మీ కుటుంబంలో అందరితో పాటుగా ఇంత ప్రేమను పంచండి చాలు.
"నిజమే పొరబాట్లు చేయని మనుషులు వుండరు. ఒకవేళ పొరబాటున ఏదైనా పొరబాటు చేసి మీ మనస్సును నొప్పిస్తే దాన్ని తప్పుగా ఎంచకుండా మన్నించండి. మళ్ళీ మళ్ళీ ఆ పొరబాటు చేయకుండా మీ మన్నింపే దానికి అక్కరకువస్తుంది.
"ఎప్పుడయినా నలత అనిపిస్తే ఒక్క మంచి మాట చెప్పండి. ఏ మందులూ మీ అనురాగ పూరిత పలుకులకు సాటికావు. సాటి రావు.
"నెలలు తరబడి నేను దాన్ని చూడకపోయినా బాధ పడను. రోజూ  దానితో మాట్లాడాలని ఆరాటపడను. కాకపోతే,  అది మీ దగ్గర హాయిగా ఉంటోంది అన్న ఒక్క చల్లని కబురు తెలిస్తే చాలు. అంతే కాదు, అది మమ్మల్ని కూడా మరచిపోయెంతగా మీతో కలిసిపోతే అదే పదివేలు.
"అల్లుడు గారు ఒక్కమాట.
"ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు కాస్త గందరగోళంలా ఉండవచ్చు. అయితే రేపు దేవుడి దయవల్ల ఒక బంగారు తల్లికి తండ్రి అయిన నాడు నా ఈ మాటల్లోని సత్యం మీకు బోధపడుతుంది. మీ గుండెలోని అణువణువూ, మా అమ్మాయి ఎక్కడున్నా చల్లగా వుండాలి,  ఆనందంగా ఉండాలనే ఘోష పెడతాయి. అది అనుభవం మీద కానీ అర్ధం కాదు.
అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మళ్ళీ మళ్ళీ అర్ధిస్తున్నాను. నా బంగారు తల్లిని మీ ఇంట హాయిగా వుంచండి."


(ఒక ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner  

రాజధాని (?) కబుర్లు


నవ్యాంధ్ర ప్రదేశ్ కు విజయవాడ అధికారికంగా కొత్త రాజధాని కాకపోవచ్చు. కానీ రాష్ట్ర విభజన
 జరిగిన జూన్ రెండో తేదీ నుంచి రాజధాని అన్నప్పుడల్లా బెజవాడ పేరే వినిపిస్తూ వస్తున్నదేమో నిన్న విజయవాడలో ఒక రోజు వున్నప్పుడు నాకూ అదే భావన కలిగి 'రాజధాని కబుర్లు' అని మొదలు పెట్టాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వూళ్ళో ఆకస్మిక తనిఖీలు చేసి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన మరునాడే నేనా వూరు వెళ్లాను, మా మూడో  అక్కయ్యగారి సంవత్సరీకాలకోసం. చిన్నప్పుడు చదువుకున్న వూరు కావడం వల్లా, కాస్త వ్యవధానం దొరకడం వల్లా  పొద్దున్నే లేచి వూళ్ళో నాలుగయిదు చోట్లు -  గవర్నర్ పేటలోని చక్రవర్తి రోడ్డు, మ్యూజియం రోడ్డు, అలంకార్ టాకీసు, ఏలూరు కాలువ వంతెన, గాంధీ నగరం లోని సన్యాసి రాజు వీధి, జింఖానా రోడ్డు అలా అలా నడిచి తిరిగాను. బెజవాడలో మరో సౌలభ్యం ఏమిటంటే అలా కాలినడక మీదే  చాలా ప్రాంతాలు చుట్టబెట్టి రావచ్చు.బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు బాగానే  వున్నాయి. మిగిలిన చోట్ల పారిశుధ్యం పరిస్తితి ఘోరం అనిపించింది. 


(విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు)

అందుకే కాబోలు మునిసిపల్ మేయర్, కమీషనర్ తమ విధులను పొద్దటి నుంచీ మొదలు పెట్టాలని సీ.ఎమ్. ఆదేశించినట్టు ఆరోజే పత్రికల్లో కూడా  చదివాను. ఉరుకులు పరుగులు పెట్టి అలసిపోయి,  రేపటినుంచీ చూసుకుందాం అనుకున్నారేమో వీధులన్నీ కాస్త కంపరం కలిగించేలానే వున్నాయి. మరీ అంత ఉదయమే చూస్తె అన్ని ఊళ్లల్లో అలానే వుంటాయి అని వాదించవచ్చు కాని, హైదరాబాదులో పొద్దున్నే కలయ తిరగడం ఛానల్ల చర్చల పుణ్యమా అని నాకు అలవాటే.  మరీ గొప్పగా లేకపోయినా,  వెగటు కలిగించే పరిస్తితులు హైదరాబాదులో లేవని మాత్రం చెప్పవచ్చు. బెజవాడలో నా  చిన్నప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అంకురార్పణ జరిగింది. మరి గాంధీనగరం వంటి చోట్ల కూడా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువలు కనిపించాయి. బహుశా వర్షపు నీరు పోవడానికి ఏర్పాటు కావచ్చు కానీ వాటిల్లో కనిపించింది మురికి నీరే. నగరానికి వస్తున్న భవానీ భక్తుల కారణంగా హైదరాబాదు నుంచి వచ్చే వాహనాలను దుర్గ గుడి వైపునుంచి కాకుండా వేరే మార్గాల్లో మళ్లించినందు వల్ల అంతకు  ముందు రోజు సాయంత్రం  ఓ గంట సేపు అదనంగా వూళ్ళో తిరగాల్సివచ్చింది. పాత బస్తీ, చిట్టి నగర్ ఇలా అనేక ప్రాంతాలను చుట్టబెడుతూ మా నగర సందర్శన సాగింది. ఒకచోట ఎవరినో దారి అడిగితె 'నేరుగా వెళ్ళండి మూడు వంతెనలు వస్తాయి, దాటిన  తరువాత వంద ఫీట్ల రోడ్డు ఎక్కండి' అని సలహా చెప్పాడు. అన్నట్టే మూడు వంతెనలు తగిలాయి. నాకూ వాటి సంగతి తెలియదు. అవి ఎలా ఉన్నాయంటే వాటిని దాటేలోగా కూలిపోతాయేమో అనేంత  పాతపడి, మాంధాతల కాలంలో కట్టినట్టుగా వున్నాయి.
కొత్త రాజధాని నిర్మాణం ఎక్కడ జరిగినా, అందులో విజయవాడకు ఎంతో కొంత ప్రాధాన్యం, పాత్ర తప్పకుండా వుంటాయి. కాబట్టి అ నగరం మంచి చెడ్డలు గురించి మరింత ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందేమో అని కూడా అనిపించింది. అందుకే ఈ నాలుగు ముక్కలు.

NOTE: PHOTO COURTESY SAKSHI  

13, డిసెంబర్ 2014, శనివారం

వండనలయదు వేవురు వచ్చిరేని..


ఎనభయ్యవ దశకం చివర్లో మేము మాస్కోలో వున్న ఆ రోజుల్లో,  ఆవిడను చూసినప్పుడల్లా 'వండనలయదు వేవురు వచ్చిరేని...అన్నపూర్ణకు నుద్దియౌ అతని గృహిణి...' అని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడి భార్య గురించి చదువుకున్న పద్యం గుర్తుకు వచ్చేది.
ఆవిడ ఇవ్వాళ లేరు. నిన్ననే అన్నీ ముగిసిపోయాయని ఆమె కుమారుడు రాహుల్ పొద్దున్నే ఇచ్చిన  ఎస్ ఎం ఎస్.
ఆవిడ సుందరమ్మ గారు.  ఆ రోజుల్లో మాస్కోలో చదువుకునే చాలామంది తెలుగు పిల్లలకు మాస్టరు గారి భార్య. ఆ మాస్టారు సామాన్యుడు కాదు. రాదుగ  ప్రచురణ విచాగంలో పనిచేసి ఈ మధ్యనే కన్నుమూసిన ప్రసిద్ధ రచయిత, గ్రంధ విమర్శకుడు రాళ్ళభండి వెంకటేశ్వర రావు గారు. (ఆర్వీయార్ గా  ప్రాచుర్యం పొందిన ఆయన సుప్రసిద్ధ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ మీది అభిమానంతో తన ఏకైక పుతృడికి  ఆ పేరే పెట్టుకున్నారు) మాస్కోలో ఆయన ఇల్లు అన్నపూర్ణ నిలయం. రోజూ ఎంతమందో అక్కడ సుందరమ్మ గారి  చేతివంట రుచి చూసి  వెళ్ళేవారు. ఆర్వీయార్ గారి ముచ్చట్లు, సుందరమ్మగారి చేతి వంటలు వినీ, తినీ భుక్తాయాసంతో వెనక్కిమళ్లడం నాకింకా గుర్తు.

(మాస్కోలో శ్రీ ఆర్వీయార్ గారి ఇంట్లో అప్పటి కేంద్ర మంత్రి శ్రీ శంకరానంద్ తో - గులాబీ రంగు చీరెతో వున్నది సుందరమ్మ గారు) 


ఎంతోమందికి పట్టెడన్నం పెట్టిన ఆ పుణ్యాత్మురాలికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను. (13-12-2014)

అన్నీ ఆశ్చర్యాలే!

  
ఒక పోలీసు ఉన్నతాధికారి పదవీ విరమణ అనంతరం ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఏమంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఈ మధ్య కాలంలో అది సర్వసాధారణమై పోయింది. కానీ 'ఆయన' విషయంలో అల్లా కాదు. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ మనిషి. నరనరాన  కాంగ్రెస్ రక్తం. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ,  కాంగ్రెస్ బద్ధ శత్రువు అయిన తెలుగుదేశంలో చేరారు పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ గా రిటైర్ అయిన ఆ పెద్ద మనిషి.
మరో ఆశ్చర్యం ఏమిటంటే ఎవరయినా ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకున్నప్పుడు అధికారంలో వున్న పార్టీని ఎంపిక చేసుకుంటారు. ఈయన గారు మాత్రం ఏరికోరి అప్పుడే ఎన్నికల్లో వోడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశంలో చేరారు. అధికారంలో లేని పార్టీ నాయకుడ్ని కలవడానికి ఆ పార్టీ వాళ్ళే ఇష్టపడరు. వీలైనప్పుడల్లా మొహం చాటేస్తుంటారు. అలాటిది ఈయన ఆ పార్టీలో చేరడం ఆ రోజుల్లో చుట్టపక్కాల్లో, స్నేహితుల్లో ఒక చర్చనీయాంశం అయింది. నిజంగా విడ్డూరమే. సరే. చేరాడు. చేరిన తరువాత ఎన్నికలు రావడానికి  అయిదేళ్ళు నిరీక్షణ.  అంతటితో కధ ముగిస్తే బాగుండు. అయిదేళ్ళ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన చేరిన తెలుగుదేశం పార్టీకి తిరిగి పరాజయమే ఎదురయింది. అంటే మరో అయిదేళ్ళు. ఆ తరువాత కూడా ఆ పార్టీకి ఎలాటి ఆశలు  లేని రోజులు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గరనుంచి అంటిపెట్టుకుని వుండి అధికార పదవులు అనుభవించిన  వారిలో కొందరు, పార్టీకి చెడ్డ రోజులు దాపురించగానే  ఎవరి దారి  వారు చూసుకున్నారు.  అయినా ఆ పార్టీని, ఆ పార్టీ నాయకుడినే అయన నమ్ముకున్నాడు. ఎట్టకేలకు  సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తాను  ఎంపిక చేసుకున్న పార్టీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. కోరుకున్న చంద్రబాబే  కొత్త ముఖ్యమంత్రి అయ్యారు.  ఆరునెలలు గడిచాయి. నాయకుడి వద్ద నుంచి అడపాదడపా ఆశావహమైన సంకేతాలే  కాని ఖచ్చితమైన  ఆదేశాలు లేవు. అయినా నమ్మకం గొప్పది. నమ్మకాన్ని నమ్ముకున్నవాళ్ళు విజేతలవుతారని రుజువయింది. నాయకుడు మాట నిలబెట్టుకున్నాడు.  జీవో వచ్చింది,  ఆంధ్రప్రదేశ్ పోలీసు  హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ. అదీ క్యాబినెట్ హోదాతో.


పోలీసు ఉన్నతాధికారిగా వివిధ హోదాల్లో  పనిచేసి పదవీ విరమణ అనంతరం అదే శాఖలో ఒక ముఖ్యమైన సంస్థకు అలా చైర్మన్ అయ్యింది  ఎవ్వరో కాదు  మా మేనకోడలు శారద భర్త, మా సావిత్రక్కయ్య అల్లుడు  శ్రీ రావులపాటి సీతారామారావు గారు. వారికి మనః పూర్వక అభినందనలు.
ఒక చేత్తో కలం పట్టి రచనా వ్యాసంగం, మరో చేత్తో లాఠీ పట్టి శాంతిభద్రతలు పర్యవేక్షించిన మనిషికి ఈ కొత్త బాధ్యత మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిద్దాం.     

   

12, డిసెంబర్ 2014, శుక్రవారం

సర్వే జనా స్సుఖినోభవంతు


ఏకాంబరానికి కష్టాలు కట్టగట్టుకుని వచ్చాయి. ఏం చేయాలో తెలియక శివుడ్ని గురించి సుదీర్ఘ తపస్సు చేశాడు. చివరకి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.



'మా ఆవిడకి నలతగా వుంది. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎన్నో రకాల వైద్యాలు చేయిస్తున్నాను. అయినా నిమ్మలించడం లేదు' చెప్పాడు ఏకాంబరం
'సరే! ఆవిడ సంగతి చూస్తా! ఇంకేమిటి చెప్పు' అన్నాడు భోళాశంకరుడు
'మా చిన్నాడు చదువులో బాగా పూర్. ఒక్కో క్లాసులో రెండేళ్ళు లాగిస్తున్నాడు, వాడ్ని ఐ ఏ ఎస్ చెయ్యి స్వామీ నీకు పుణ్యం వుంటుంది'
'ఇంకా' అన్నాడు' వరాలు ఇచ్చే హుషారులో పరమేష్టి
'ఇంకా అంటే ఇంకా వున్నాయి, ఆఫీసులో చాకిరీ చేయించుకోవడమే కాని ఓ ప్రమోషనూ లేదు చట్టుబండలు లేదు. నువ్వు తలచుకుంటే నన్ను మా ఆఫీసుకి మేనేజర్ని చెయ్యలేకపోతావా?'
'ఓస్ అంతేనా ఇంకా ..'
ఏకాంబరం నోరు తెరిచేలోగా విష్ణు మూర్తి హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాల సముద్రంలో శేష పాన్పుపై పవ్వళించి లక్ష్మీ దేవితో పాచికలు, పరాచికాలు  ఆడుతూ మరో కంట ముక్కంటి వరాల జల్లు కురిపిస్తున్న చందాన్ని వీక్షించినవాడై 'సిరికిన్ చెప్పడు...' పద్యం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా ఏకాంబరం కోరికల చిట్టాకు అడ్డం  పడి అడిగాడు.
'ఏమయ్యా ఏకాంబరం! ఏవిటా అడగడం. నటరాజుకి నీలాగా  పనీపాటా లేదనుకున్నావా! నీ తపస్సు చూసి ముచ్చటపడి,  ఆయన పార్వతీ దేవితో కలిసి చేస్తున్న శివ తాండవ నృత్యం కూడా మధ్యలో వొదిలేసి వచ్చేసాడు. నువ్వేమో అంతూ పొంతూ లేని కోరికల జాబితా ఆయన ముందు పెడుతున్నావు. ఇవన్నీ ఎందుకు కాని ఓ చిట్కా చెబుతా విను. ఒకే ఒక వాక్యం తో కూడిన వరం. నీకూ మంచిది, ఆయనకూ మంచిది. లోకానికి మరీ మంచిది.
అదేమిటంటే -
సర్వేజనా స్సుఖినోభవంతు - అందరూ బాగా వుండాలని కోరుకో! ఒక్క ముక్కతో  సరిపోతుంది.
ఆ అందరిలో నువ్వూ ఉంటావు కదా! ' అన్నాడు.
ఏకాంబరానికి విష్ణువు లాజిక్ అర్ధం కాలేదు, కానీ పరమేశ్వరుడు మాత్రం  వరాలు ఇవ్వడంలో తనకున్న బలహీనత తెలిసిన విష్ణువే ఇలా సమయానికి వచ్చి తాను  మరో పొరబాటు చేయకుండా అడ్డుపడ్డాడని అర్ధం చేసుకున్నాడు.

NOTE Courtesy Image Owner 

మళ్ళీ 'పవనాలు' వీయబోతున్నాయా !


1982 - 2008 - 2014
తెలుగు జాతి రాజకీయ  చరిత్రకు  సంబంధించి  ఈ సంవత్సరాలకు చాలా ప్రాధాన్యత వుంది. ఆ మూడు సంవత్సరాలలో  తెలుగు సినీరంగ ప్రముఖులు మువ్వురు తెలుగునాట రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. వీరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు అలనాడు ధృవతారగా వెలిగిన శ్రీ నందమూరి తారక రామారావు. 1982 మార్చి21 వ తేదీన ఆనాటి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 'తెలుగుదేశం' పేరుతొ ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు నాటకీయ పక్కీలో ఒక ప్రకటన చేసి మొత్తం రాజకీయ వర్గాలను ఆశ్చర్య చకితులను చేసారు. అంతకుముందు  సినీ రంగానికి చెందిన జగ్గయ్య వంటి కళాకారులు ఎన్నికల్లో పోటీచేసినా  అది పరిమిత పరిధుల్లోనే జరిగింది. పొరుగున వున్న తమిళనాట మాదిరిగా సినీ రంగానికి చెందిన వారు రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసే సంప్రదాయం మన రాష్ట్రానికి అప్పటికి కొత్త. పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా  అధికార పగ్గాలు చేపట్టి దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్టీయార్  ఒక రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత చాలా ఏళ్ళు గడిచిన అనంతరం  2008 లో మరో అగ్రనటుడు రాజకీయాల్లోకి వచ్చి 'ప్రజారాజ్యం' పేరుతొ మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  వరసగా అనేక సంవత్సరాలు తెలుగు చలనచిత్రసీమను వొంటి చేత్తో శాసించిన మెగా  స్టార్ చిరంజీవి  తన పార్టీని ఓ ప్రభంజనం మాదిరిగా జనంలోకి తెచ్చి మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అయితే ఆయన ప్రయత్నాలు అనుకున్న విధంగా  ఫలించక పోవడంతో పద్దెనిమిది సీట్లు, పద్దెనిమిది శాతం వోట్లతో అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. తన మనస్తత్వానికి ఈ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు సరిపడవని నిర్ధారణకు వచ్చారేమో తెలియదు కాని, తొమ్మిదినెలల్లో అధికారానికి వచ్చిన ఎన్టీయార్ రికార్డు మాదిరిగా పార్టీని స్థాపించిన మూడేళ్ళలోనే దాన్ని కాంగ్రెస్ లో కలిపేసి చేతులు దులుపుకున్నారు. దరిమిలా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఒక స్థాయి మంత్రి పదవితో సంతృప్తి పడి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తరువాత నామమాత్రంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. అన్నగారి ప్రజారాజ్యం పార్టీ  యువజన విభాగం అయిన యువ రాజ్యం నాయకుడుగా రాష్ట్రం నలుమూలలు తిరిగి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసి, కాంగ్రెస్ వారి పంచెలు వూడదీస్తాననే తీరులో తనదైన బాణీలో  ఆవేశపూరిత ప్రసంగాలు  చేసి, ఎన్నికల అనంతరం అన్నగారు పార్టీతో సహా ఆ కాంగ్రెస్ పంచనే చేరడం హరాయించుకోలేక  పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా, మౌనంగా వుండిపోయారు.. మళ్ళీ ఈ ఏడాది ఎన్నికలకు ముందు  హఠాత్తుగా రంగ ప్రవేశం చేసి  2014 మార్చిలో జనసేన పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసున్నట్టు ఆర్భాటంగా ప్రకటించి తన అభిమానులను అలరించారు. రాజకీయ ప్రత్యర్ధులను అదరగొట్టారు. అప్పటివరకు అన్నచాటు  తమ్ముడిగా పేరున్న పవన్, అదే  అన్నగారి పార్టీకి  వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయడం అందరికీ ముఖ్యంగా అయన కుటుంబంలోని వారికే ఎంతో  ఆశ్చర్యం కలిగించింది. పేరుకు  పార్టీ అయితే పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని మరో ప్రకటన చేసి అభిమానులను ఉసూరుమనిపించారు. ఈలోగా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.  రాష్ట్ర విభజన అంశం ఆయనకు బాగా కలిసివచ్చింది. జాతీయ రాజకీయాల్లో కొత్త మెరుపులు మెరిపిస్తున్న మోడీ ఆయనకు బాగా నచ్చారు.  పవన్ వంటి జనాదరణ వున్న సినీ హీరోల అవసరం మోడీకి లేదా ఆయన నాయకత్వం  వహిస్తున్న బీజేపీకి వున్న మాట కూడా కాదనలేనిది. ఆనాటి పరిస్తితులు అలాటివి. అది పవన్ కళ్యాణ్ కు మరింతగా కలిసివచ్చింది. మంచి డైరెక్టర్, చక్కని తారాగణం, గట్టి కధాబలం వున్న సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది అన్న సినీ సూత్రం వంటబట్టించుకున్న పవన్, తెలివిగా అడుగులు వేసి బీజేపీతో చేతులు కలిపాడు. అంతే  కాదు, తాను కొత్తగా స్థాపించిన 'జనసేన' పార్టీని ఎన్నికలబరిలో దింపకుండా, సీట్లకోసం బేరసారాలు ఆడకుండా,  తాను కూడా పోటీ చేయకుండా ఒక కొత్త వ్యూహంతో మోడీ పార్టీకి ప్రచారం చేసిపెట్టాడు. ఇది సినీ రంగంలో మామూలే. తాము వాడని సబ్బులకు వారు తమ ప్రకటనలతో  గిరాకీ కలిపిస్తారు. అదే వాణిజ్య సూత్రాన్ని పవన్  ఎన్నికల్లో ప్రయోగించి ఫలితాలను ప్రభావితం చేసే విధంగా  అటు మోడీకి, మరోపక్క బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపికి ప్రచారం చేసిపెట్టారు. పవన్ ఆవేశం, సమాజంపట్ల  ఆవేదన ఆయన ప్రసంగాలలో ప్రతిఫలించడంతో  అభిమానులనే కాకుండా సాధారణ  జనాలను సయితం ఆయన ఆకట్టుకోగలిగాడు. ఫలితం గురించి వేరే చెప్పక్కర లేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి లభించిన విజయంతో మోడీ దృష్టిలో  పవన్ నిజంగా ఒక హీరో అయిపోయాడు. మోడీ తన  ప్రమాణస్వీకారానికి రావాల్సిందని  స్వయంగా ఆహ్వానించడం దీనికి దృష్టాంతం.
సరే! ఎన్నికలు ముగిసాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొలువు తీరారు. ఎవరికి వారు తమ పనుల్లో తీరికలేకుండా మునిగి పోయారు. వారు అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, కొద్దో, గొప్పో సహకరించిన  మరి పవన్ కళ్యాణ్  ఇన్నాళ్ళు ఏమైనట్టు? ఆయన పెట్టిన జనసేన సంగతి ఏమిటి? కాకపొతే, ఇటీవల ఒక సందర్భంలో ఆయనే చెప్పారు కొత్త చిత్రాలతో బిజీగా వున్నానని.
ఈ నేపధ్యంలో ఒక వార్త తిరిగి సంచలనం సృష్టించింది. పవన్ పార్టీ జనసేన, రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని. పార్టీ ఎన్నికల చిహ్నం విషయం కూడా త్వరలో నిర్ణయం కాబోతోందని. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకే గుర్తుపై పోటీ చేయడానికి వీలుగా తాము పెట్టుకున్న అర్జీకి ఆమోదం రాగానే జనసేన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించడం  జరుగుతుందని స్వయంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన 'జనసేన' వెబ్ సైట్ లో కానవస్తోంది. అంటే క్రియాశీలక రాజకీయ పార్టీగా జనసేన ఇక ముందు వ్యవహరించబోతోందన్న ధ్వని ఇందులో వుంది. దానికి తోడు 2019  ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన  మాట గమనార్హం.
ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో పవన్ పార్టీ,  రాష్ట్ర రాజకీయాలను  అంటే,  ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో ఏమేరకు ప్రభావితం చేయగలుగుతుంది అన్నది చర్చనీయాంశంగా తయారయింది. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధానం వుంది కాని అది వేరే సంగతి.
ప్రస్తుతానికయితే దేశంలో మోడీ హవా బాగా సాగుతోంది. స్వయంగా ముందరి కాళ్ళకు తనకు తానుగా బంధాలు వేసుకోకపోతే చంద్రబాబు నాయుడికీ అంత ఇబ్బందికర పరిస్తితి ఏమీ కనబడడం లేదు. ఏదయినా అలాటి  అవకాశం వస్తే ఎగరేసుకుపోవడానికి వైయస్సార్ పార్టీ కాచుకునే వుంది. మరి ఈ పరిస్తితుల్లో - అప్పుడప్పుడు  మెరిసి  మురిపించే పార్టీగా పేరు తెచ్చుకున్న పవన్ పార్టీ కి కొత్తగా లభించే అవకాశాలు ఏపాటివి?
భవిష్యత్ ఎన్నికల్లో ప్రత్యేకించి ఆంద్ర ప్రదేశ్ లో పవన్ సాయం తీసుకోవడానికి బీజేపీకి ఎలాటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. పవన్ వంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు వొప్పుకోవాలే  కాని జనసేనను తమ పార్టీలో కలుపుకోవడానికి కూడా సిద్ధపడవచ్చు. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, ముందస్తు చూపుతో 'కాంగ్రెస్ రహిత భారత దేశం' అనే స్వప్నాన్ని  సాకారం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో, ప్రధానంగా దక్షిణాదిన,   ప్రజాదరణ వున్న స్థానిక నాయకులను దగ్గరికి తీసుకునెందుకు పావులు కదుపుతున్న విషయం రహస్యమేమీ కాదు.  మోడీకి దగ్గరవాడు కావడం, రాజకీయాలకు కొత్తకావడం పవన్ కు ఈ విషయంలో అదనపు అర్హతలు.


అయితే ఇక్కడ చిక్కుముడి ఎవరో కాదు.  పవన్ కల్యాణే.  పవన్ అంటేనే గాలి. అది ఎటు  వీస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ మనసులో ఏముందో పవన్ కే తెలియదని హాస్యోక్తిగా చెప్పుకుంటారు.
అట్టహాసంగా పార్టీ పెట్టాడు. పోటీ చేయలేదు. పెట్టిన పదేళ్ళ తరువాత పోటీకి దిగుతానని మరో ప్రకటన చేసాడు. రాజకీయాల్లో ఇవన్నీ కొత్త పుంతలు.
రాజకీయ విశ్లేషణలు చేసేవారికి కూడా ఆయన ఒక పట్టాన  కొరుకుడు పడడు.  అందుకే అయన ఏం చెయ్యబోతున్నాడన్నది ఊహకు అందని విషయం.
కొసమెరుపు:
'జనసేన' వెబ్ సైట్ చూసిన వారికి ప్రముఖంగా ఒక వాక్యం కనిపిస్తుంది.
"నేను రాజకీయవాదిని కాను - పవన్ కళ్యాణ్"   
(12-12-2014)
NOTE : Image Courtesy Owner