11, డిసెంబర్ 2014, గురువారం

భూమంత్రం


యాభై ఏళ్ళకు పూర్వం అప్పటి కేంద్ర మంత్రి కే ఎల్ రావు గారి పుణ్యమా అని మా ఊళ్లకు కరెంటు వచ్చింది. వీధి  దీపాలే కాని,  బాగా కలిగిన కామందులు కూడా ఇళ్ళకు  కరెంటు కనెక్షన్ తీసుకోవడానికి సంక్షేపించారు. ఆ రోజుల్లో అప్పుడే తండ్రి చనిపోయి ఇంట్లో పెత్తనం చేతికి వచ్చిన మా స్నేహితుడొకరు మొత్తం ఇంటిని  ఆధునికం చేసే పని మొదలు పెట్టాడు. పెంకుటిల్లు తీసి డాబాగా మార్చాడు. గోడలకు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న రంగులు వేయించాడు. కరెంటు కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబు లైట్లు, ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా గుండ్రటి అద్దాలు వున్న దీపాలు పెట్టించాడు.  నాలుగు బ్యాండ్ల  రేడియో కొన్నాడు. ఇంటి ముందు వసారాలో పేము కుర్చీలు వేసాడు. లోపల డైనింగ్ టేబులు, డెకొలాం మంచాలు, దోమతెరలు,  తిరగడానికి మోపెడ్ ఇలా చూస్తుండగానే వూళ్ళో వాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని కన్నుల ముందు ఉంచాడు. అంతా భేష్ అన్నారు. ఇంట్లో వాళ్ళయితే సంతోషం పట్టలేకపోయారు. ఇది ఇంటర్వెల్ ముందు కధ. ఇలాటివి ఇరవై రీళ్ళు వుండవు. షార్ట్ ఫిలిమ్స్. అలా చూస్తుండగానే ముగింపు తోసుకువస్తుంది. అదే జరిగింది. పొలాలు చూసి అప్పులిచ్చిన వాళ్ళు ఆ పొలాలమీదే కన్నేశారు. బాకీలు తీర్చడానికి వున్న ఆస్తి సున్నా అయింది. పూలమ్మిన చోట సామెత మాదిరిగా జీవితం తయారయింది. ఇంతే కావాలి, లేకపోతే ఏం చూసుకుని ఆ ఎగురుడు అని నలుగురూ నానా మాటలు అన్నారు. దాంతో నలుగురిలో తలెత్తుకుని తిరగలేక మొత్తం కుటుంబం ఓ రోజు వూరు విడిచి వెళ్ళిపోయింది.

ఇన్నేళ్ళ తరువాత ఇదెందుకు గుర్తుకు వచ్చింది అంటే -
కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్తితులు చూసి.
ఒకరి దగ్గర డబ్బుందని అంటున్నారు. మరొకరేమో 'డబ్బా అసలేలేదు ఎలానో ఏమిటో' అని పేద మాటలు చెబుతున్నారు. కానీ ఇద్దరి తరహా చూస్తె, పెట్టె ఖర్చులు చూస్తె, చేసే ఆలోచనలు చూస్తె ఆకాశాన్ని తాకుతున్నాయి. అవి నిజం కావాలంటే, వున్న డబ్బే కాదు  యెంత డబ్బున్నా ఏ మూలకూ చాలదు.
అందుకే కాబోలు ఇద్దరూ 'భూ మంత్రం' అందుకున్నారు.

చూద్దాం ఏం జరుగుతుందో!  
NOTE : Courtesy Image Owner       

10, డిసెంబర్ 2014, బుధవారం

రక్తం తాగుతున్న రోడ్లు

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY IN ITS EDIT PAGE ON 11-12-2014, THURSDAY)

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని వేలమంది మరణిస్తున్నారని ప్రభుత్వాలు గణాంకాలు విడుదల చేస్తుంటాయి. కానీ ఆ ప్రమాదాల్లో అర్ధాంతరంగా కన్నుమూసిన వారి కుటుంబాల వ్యధ గురించి ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోరు. అటువంటి వారి అకాల మరణం ఒక తీరని వెత అయితే, అందువల్ల వారి వారి కుటుంబాల్లో ఏర్పడే పరిణామాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగా వుంటాయి. ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి  ఒక కుటుంబానికి ఏకైక ఆధారం కావచ్చు. మంచిగా  చదువుకుంటూ భవిష్యత్తులో ఒక కుటుంబానికి చక్కని ఆసరా కాగలిగిన విద్యార్ధి కావచ్చు. అన్నింటికీ మించి ఆ పోయిన ప్రాణం, విలువ కట్టలేని అతి విలువైన ప్రాణం. అలాటివాటికి పరిహారం ప్రత్యామ్నాయం కానేరదు.
అనేక విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న రోడ్డు ప్రమాదాలకు అనేకానేక కారణాలు. అతివేగం వీటిల్లో ప్రధానమైనది. వేగంగా దూసుకుపోయే అధునాతన మోటారు వాహనాలు, వాటితో వాయువేగంతో ప్రయాణించగల అధ్బుతమైన రహదారులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని అన్న చందంగా  వాటిని నడిపే వారిలో అత్యధికులు పాత పద్దతుల్లోనే వాహనాలను నడపడానికి అలవాటు పడిన వారు. అధవా వాటిని నడిపే మెలకువల్లో ప్రవేశం వున్నా వేగంగా వాహనాలను నడపడంలో వారికి ఉత్సాహం వుంది కానీ ఎదురుకాగల ప్రమాదాల విషయంలోనే  ఎరుక లోపిస్తోంది. అందుకే మంచి రోడ్లు, మంచి వాహనాలు వున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే బెరుకు పుట్టిస్తున్నాయి. బాధితుల కుటుంబాల్లో గుబులు రేకిస్తున్నాయి. విలువైన మానవ వనరులను ఆవిరి చేస్తున్నాయి.
ప్రమాదాలకు పెద్దంతరం చిన్నంతరం లేదు, పేదా గొప్పా తారతమ్యం లేదు. చివుక్కుమనిపించే నిజం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల్లో కలవారు కన్నుమూస్తే, పత్రికల్లో పతాక శీర్షికలు, సామాన్యులు చనిపోతే సింగిల్ కాలాలు. అంతే  తేడా!     
హైదరాబాదు నగరం చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు చూసినప్పుడు మనమూ ఎవరికీ తీసిపోలేదని అనిపిస్తుంది. దానిమీద ప్రయాణిస్తున్నప్పుడు అద్భుతమైన అనుభూతి. ఎక్కడో విదేశాల్లో చూసే అవీ సినిమాల్లో చూసే అందమైన రహదారులు మన సొంతం అయ్యాయని అనిపిస్తుంది. ఈ మధ్య అమెరికా నుంచి వచ్చిన మితృడిని ఆ మార్గంలో తీసుకువెడితే అతడన్న మాట నన్ను నిరుత్తరుడిని చేసింది. ఇలాటి రోడ్డు  వేసిన వాళ్ళను ఆ దేశంలో జైలుకు పంపుతారని అతడి వ్యాఖ్యానం. వేగంగా వెళ్ళే వాహనాలు అంతే వేగంతో మలుపు తీసుకోవడానికి వీలైన విధంగా రోడ్డు నిర్మాణం లేదన్నది అతగాడి అభిప్రాయం. అంటే రోడ్డు నిర్మాణ దశలో ఎదురయిన వొత్తిళ్ళకు అనుగుణంగా రోడ్డు మలుపులు తిరుగుతూ వెళ్ళిందన్నది అతడి మాటల తాత్పర్యం. అందులో నిజానిజాల మాట తెలియదు కాని, ఆ రోజుల్లో  పనిచేసిన రాజకీయ వొత్తిళ్ళు ఎలాటివో తెలుసు కనుక కిమ్మనకుండా వుండిపోయాను. అలాగే సాధారణ వేగంతో సాధారణ రహదారులపై సాధారణ వాహనాలను నడపడానికి అలవాటుపడిన వాళ్ళు అసాధారణమైన వేగంతో వెడుతూ, లేన్లు మార్చుకుంటూ వాహనాలను నడిపే ప్రావీణ్యం సంపాదించుకోలేదన్న వాస్తవం ఆ రోడ్డుపై తిరిగే వాహనాలను కొద్దిసేపు పరికిస్తే ఇట్టే అర్ధం అవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారి సూచికలను ఓ పక్క గమనిస్తూ, మరో పక్క అలవాటులేని వేగంతో ప్రయాణిస్తూ, సరయిన బాటలో వేడుతున్నమా లేదా అనే సంశయంతో మధన పడుతూ, దారిపక్కన కనీసం టెయిల్ ల్యాంపులు కూడా లేకుండా ఆపివుంచిన వాహనాలను చూస్తూ బండి నడపడం అన్నది ఇంకా చాలామందికి అలవడినట్టు లేదు.
ఇక హైదరాబాదు నుంచి విజయవాడ వైపు అలాగే రెండు రాష్ట్రాలలో అనేక ప్రదేశాలను కలుపుతూ కొత్తగా  నిర్మించిన నాలుగు లేన్ల రహదారుల పరిస్తితి కూడా ఏమంత భిన్నంగా లేదు. విశాలమైన రహదారులను విదేశాలకు దీటుగా నిర్మించుకోగలిగాం అని గొప్పలు చెప్పుకోవడం కూడా 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న సామెతను మరిపించేదిగా వుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ హైవేస్ (జాతీయ రహదారులు) ని ఫ్రీ వేస్ అంటారు. అవి నగరాలను కలుపుతాయి కాని వాటి మధ్యగా పోవు. దారి నడుమ నగరాలను కలుపుతూ మళ్ళీ అనుసంధాన మార్గాలు వుంటాయి. అదే మన దగ్గర హైదరాబాదు - విజయవాడ అరవై అయిదో నెంబరు జాతీయ రహదారి విషయం చూడండి. ఆ రోడ్డు కొన్ని చోట్ల వూళ్ళ మీదుగా పోతుంది. మరికొన్ని చోట్ల వూళ్ళ నడుమ నిర్మించిన  ఫ్లయ్ వోవర్ల మీదుగా వెడుతుంది. ఇంకొన్ని చోట్ల ఊళ్లకు దూరంగా వెడుతుంది. అంటే ప్రతిచోటా రాజకీయ వొత్తిళ్ళకో లేక మరో మరో కారణం చేతనో  రోడ్డు 'రూటు' మారిపోయిందని అనుకోవాలి.  అంటే అర్ధం ఏమిటి? రోడ్డు నిర్మాణంలో ఆత్రుత  తప్పితే భద్రతా ప్రమాణాల విషయంలో శ్రద్ధ పెట్టలేదనుకోవాలి. ఈ దారిలో ఒక్క నల్గొండ జిల్లాలోనే ఏటా వెయ్యిమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు  కోల్పోతున్నారని లెక్కలు తెలుపుతున్నాయంటే భద్రత పట్ల పెట్టాల్సిన శ్రద్ధలో శ్రద్ధ తగ్గిందని కూడా అనుకోవాలి. ఆ విషయం అలా వుంచండి.  అధికారులు నిర్ణయించిన వేగ  పరిమితుల్లోనే వాహనాలు నడుపుతున్న డ్రైవర్ కు హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఆవులూ, గేదెలు  ఇతర జంతువులు  కనిపిస్తే, రాంగు రూటులో ఎదురుగా దూసుకువస్తున్న మరో వాహనం ఎదురయితే,  'యాక్సిడెంటు' సంగతి దేవుడెరుగు ముందు గుండె ఆగినంత పనవుతుంది. మరి వీటికి ఎవరు కారణం? పాలకులా, అధికారులా, వాహనదారులా?  

       
ఒక ప్రమాదం జరిగినప్పుడు మరీ ప్రత్యేకించి అందులో ఎవరయినా ముఖ్యుడు మరణించినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి. మీడియాలో చర్చలు జరుగుతాయి. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానిపై నిపుణులు సలహాలు ఇస్తారు.
అంతే! మరో ప్రమాదం జరిగి మరో ముఖ్యుడు మరణించేవరకు నిశ్శబ్దం.
కటువుగా అనిపించవచ్చు కాని నిజానికది  'స్మశాన నిశ్శబ్దం'
(10-12-2014)

NOTE: Courtesy Image Owner 

అంతా భ్రాంతియేనా!


రహదారులపై వాహనాలు మితిమించిన వేగంతో వెళ్ళకుండా నియంత్రించాలంటే ఏం చెయ్యాలి. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలి. నిఘా కెమెరాలను అమర్చాలి. ట్రాఫిక్ సిబ్బందినీ,  జరిమానాల మొత్తాన్నీ పెంచాలి లేదా ఉల్లంఘనులకు వేసే శిక్షలను మరింత కఠినతరం చేయాలి.
ఇవన్నీ ఎందుకని అనుకున్నారేమో కెనడాలో 'భ్రాంతి'ని నమ్ముకున్నారు.
చక్కని రహదారుల మధ్యలో అక్కడక్కడా గుంటలు తవ్వారు. వాటిని గమనించి వాహనదారులు ఎవరికివారే వేగం తగ్గించి నడపాల్సిన పరిస్తితి ఏర్పడింది. రోడ్ల గుంతల వల్ల వాహనాల వేగాన్ని బాగా నియంత్రించగలిగామని అక్కడివారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇదేం గొప్ప మా దేశంలో రోడ్ల కంటే గుంటలే  ఎక్కువని మనమూ గొప్పలకు పోవచ్చు కానీ కెనడా గుంటలు మనదగ్గర మాదిరిగా నిజం గుంటలు కావు. గుంతలమాదిరిగా కానవచ్చే పోస్టర్లను రోడ్లపై అతికిస్తారు.(ఫోటోలలో కనబడే చిత్రాలను గమనిస్తే అర్ధం అవుతుంది) వాటిని చూసి డ్రైవర్లు అసంకల్పితంగానే వేగం తగ్గిస్తారు. ఈ నకిలీ గుంటలను మార్చి మార్చి మరోచోటకు మార్చుకునే సౌలభ్యం కూడా వుంది. భ్రాంతితో భయం కలిగించి వేగనియంత్రణ చేస్తున్నారన్నమాట.


ఇంకో విషయం ఏమిటంటే ఈ సమాచారం ఇంటర్ నెట్లో బహుళ ప్రచారంలో వున్న ఓ 'ఈ వదంతి' అంటే, 'ఈ మెయిల్', 'ఈ సేవ'  మాదిరిగా 'ఈ వదంతి' (E Rumour)  అన్నమాట. అది అన్నమాట అయినా, ఉన్నమాట అయినా వినడానికి, చదవడానికి బాగుంది కాబట్టి నమ్మేస్తే ఓ పనయిపోతుంది.     

NOTE: Courtesy Image Owner 

9, డిసెంబర్ 2014, మంగళవారం

"అర్ధం చేసుకోండి - అర్ధాలు వెతక్కండి"


పెద్ద సినిమాలు తీసే వారికీ ప్రయాసే, కొండొకచో చూసేవారికీ ప్రయాసే.
చిన్న సినిమాలు తీయడానికి కష్టమూ ఎక్కువే ప్రతిఫలమూ తక్కువే.
ఇక మరీ చిన్న సినిమాలు, సంక్షిప్త చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్ పేరు ఏదయినా, వాటిని  తీసే వారికి పేరొస్తుందేమో కాని  కాసులు కురవడం అపనమ్మకమే. కాకపొతే సినిమా తీయాలన్న అభిలాషా, చేతులు కాలే నిడివీ తక్కువ కావచ్చు, యూ ట్యూబ్ వంటి మాధ్యమాలు అందుబాటులోకి రావడం వల్ల కావచ్చు చిన్నా పెద్దా సినిమాలు తీయలేనివాళ్ళు ఈ వైపు మళ్ళుల్లుతున్నారు. చూసే అవకాశం రావాలే కాని, వీటిల్లో మంచి కధలు, ఎంచక్కని  కధనాలు, తీస్తున్న విధానాలు వీటన్నిటితో పాటు మరో ప్లస్ పాయింటు ఏమిటంటే  టైం వృధాకాకుండా చూసేయొచ్చు. అలాటి అవకాశం మొన్న సాయంత్రం నాకు లభించింది.



ఆ చిట్టి పొట్టి చిత్రం పేరు 'అద్వైత'. పేరు చూసి ఇదేదో వేదాంతం బాపతు అని పొరబడే అవకాశం వుంది కాని చూసిన తరువాత, చూసిన అందరి అభిప్రాయమూ అద్వైతమే. అంటే అంతా 'బాగుంది' అన్నవాళ్ళే కాని  వేరే మాట వినబడలేదు.
'అద్వైత' తీసిన వాళ్ళు సినిమా రంగానికి కొత్తేమో కాని ఆ మాధ్యమానికి కొత్తకాదని నాకూ అనిపించింది. నిజానికి సినిమాలు చూడడం నాకూ కొత్తే! ఎప్పుడో కాని చూడని అలవాటు ఎన్నాళ్ళుగానో వుంది.
రేడియోలో పనిచేసేవారికి చెప్పే మొదటి పాఠం - "Brevity is the soul of expression". అంటే 'సంక్షిప్తత భావ వ్యక్తీకరణకు దగ్గరి మార్గం' అని అర్ధం చెప్పుకోవచ్చు. ఇది లఘు చిత్రాలకు కూడా వర్తించే సూత్రం.
ఇరవై ఇరవై రెండు నిమిషాలలోనే టైటిల్స్ తో సహా శుభం కార్డులాంటి 'అర్ధం చేసుకోండి - అర్ధాలు వెతక్కండి' అనే సున్నిత అభ్యర్ధనతో మొత్తం చిత్రం ముగుస్తుంది. నటీనటులు ఇద్దరే. మూడో మనిషి మాటవరసకు అన్నట్టు కనిపించి మాయమైపోతాడు. చిత్రం యావత్తు ఆ ఇద్దరి మధ్య సంభాషణలతో నడుస్తుంది. అంటే కత్తిమీద సామే. విసుగనిపించకుండా కధనం సాగాలి.  అన్నింటికంటే చమక్కుమనిపించే ముగింపు మరీ ముఖ్యం. ఓ హెన్రీ కధల్లో మాదిరి. ఫోటోగ్రఫీ నైపుణ్యం, శబ్దగ్రహణం, క్లోజప్పుల్లో హావభావాలు అన్నీ కలిస్తేనే చూడవచ్చిన వారు మెచ్చుకోలు మాటలు చెబుతారు. అదృష్టవశాత్తు 'అద్వైత' లఘు చిత్రానికి ఇవన్నీ సమపాళ్ళలో కుదిరాయి.


అందుకే నాటి ప్రదర్శనకు ప్రేక్షకులుగా వచ్చిన ప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రసిద్ధ నటి జయసుధ, మధుర శ్రీధర్, రచయిత సిరా శ్రీ, నటుడు అడవి శేషు  (ఎవరి పేరన్నా మరచిపోతే క్షమించాలి, అసలే ఈ రంగం నాకు కొత్త)  అందరిదీ ఒకే మాట. 'మంచి ప్రయత్నం'  అద్వైత హీరో హీరోయిన్లు చైతన్య, లాస్య - కొత్తగా దర్శక పాత్రలో ప్రవేశించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రేమకు అవి చక్కని కాంప్లిమెంట్లు. పడిన శ్రమకు  ఎంచక్కని ఫలితం కూడా.
చివరకు చెప్పేదేమిటంటే అసలు విషయం అంతా ఆ 'చమక్కు' లోనే వుంది. విషయమే కాదు, మహిళల కోణంలో నుంచి ఆలోచించి రాసి తీసిన 'ఇతివృత్తం' కూడా.
చూడాలని  అనుకున్నవారికి దారి చూపే లింకు :
ADVAITHA link.

తోక టపా: అసలు మరో చమక్కు ఏమిటంటే ఈ లఘు చిత్రం దర్శకురాలు ఎవ్వరో కాదు, మా మేనకోడలు విజయలక్ష్మి, బంధు మితృడు జ్వాలా నరసింహారావు పెద్దమ్మాయి ప్రేమ మాలిని దటీజ్ బుంటీ. ఇంకో చమక్కు ఏమిటంటే ప్రసాద్ లాబ్స్ లో ఆరోజు అద్వైత చిత్రం చూసేవరకు మాకెవ్వరికీ 'ప్రేమ' ఈ చిత్రం తీస్తున్నట్టు తెలవదు. అదో చిత్రం!

8, డిసెంబర్ 2014, సోమవారం

వొరిగిన కర్ణాటక సంగీత శిఖరం నేదునూరి


(PUBLISHED BY 'ANDHRA JYOTHI' DAILY IN ITS EDIT PAGE ON 09-12-2014, TUESDAY)
1968  జనవరి నెల.  నలభై ఆరేళ్ళ నాటి మాట.  హైదరాబాదు రవీంద్ర భారతిలో ప్రభుత్వ సంగీత కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాజ సంగీత ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వేదికమీద  నలభయ్ ఏళ్ళ వయసున్న విద్వాంసులు ఒకరు త్యాగరాజ విరచిత 'మోక్షము కలదా!' అనే కీర్తనను సారమతి రాగంలో పాడడం ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు శ్రీ  ఎం చంద్రశేఖరన్ , మృదంగ విద్వాంసులు శ్రీ దండమూడి రామ్మోహనరావులు సహకరిస్తుండగా,  శ్రీ నేదునూరి కృష్ణమూర్తి అనే ఆ విద్వాంసుడు ఆలపించిన ఆ కీర్తనతో కిక్కిరిసిన సభామందిరం యావత్తు అదోరకమైన  తన్మయస్తితిలో  తేలిపోయింది.  త్యాగరాజస్వామి  వారు ఎంతటి  ఆర్తితో ఆ కీర్తన రాసారో అదే ఆర్తి,  కృష్ణమూరిగారి స్వరంలో తొణికిసలాడింది. అద్భుతమైన ఆలాపన, స్వరకల్పన సంగీత ప్రియులను సమ్మోహితులను చేసాయి. సుమారు నలభయ్  అయిదు నిమిషాలపాటు రవీంద్ర భారతి ఆడిటోరియం,  నేదునూరివారి సంగీత లహరిలో మునకలు వేసింది. వయోలిన్ తో ఆయనకు సహకరించిన చంద్రశేఖరన్   తమిళుడు. అయినా నేదునూరివారి సంగీతామృతం సేవించిన పరవశత్వం ఆయనలో గోచరించింది. ఆ మాధుర్యపు మత్తులోనుంచి బయటపడి, ఆడిటోరియం బయటకు వచ్చిన తరువాత చంద్రశేఖరన్  తమిళంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దండమూడివారు తెలుగులో చెప్పారు. 'నా జీవితం ధన్యమయింది. ఇంత  గొప్ప సంగీతాన్ని పక్కనే  కూర్చుని వినే భాగ్యం కలిగింది. నేదునూరివంటి సంగీతకళానిధి జీవించిన కాలంలో సమకాలీనులుగా  మనగలిగిన అదృష్టం నన్ను వరించింది. ఈ భాగ్యానికి నన్ను నేనే అభినందించుకుంటున్నాను'
ఆయన నోటి నుంచి సంగీత కళానిధి అనే పదం రావడం యాదృచ్చికమైనా,  తరువాతి రోజుల్లో అది నిజమై కూర్చుంది. సంగీతంలో విశిష్ట సేవ చేసేవారికి చెన్నై  సంగీత అకాడమీ ఏటా ఇచ్చే పురస్కారం సంగీతకళానిధి. ప్రతి సంగీత  విద్వాంసుడు దాన్ని 'పద్మ' పురస్కారం కన్నా మిన్నగా  భావిస్తారు. అలాటి సంగీత పురస్కారం నేదునూరివారిని వరించింది. తమిళ సంగీత విద్వాంసులు సయితం నేదునూరివారికి  ఈ పురస్కారం లభించడంపట్ల హర్షామోదాలు వ్యక్తం చేసారు. మరో విశేషం ఏమిటంటే 1991 లో సంగీత కళానిధి పురస్కారం ప్రకటన వెలువడినప్పుడు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి. ఆయనకు ఆ రోజుల్లో పీ.ఆర్.ఓ గా   వున్న వనం జ్వాల నరసింహారావు ద్వారా విషయం తెలుసుకుని చెన్నారెడ్డి గారు   చక్కని అభినందన సందేశం పంపారు. ఆ పురస్కారం అందుకున్న తరువాత ప్రసంగించాల్సివచ్చినప్పుడు నేదునూరివారికి ఒక చిన్న ఇబ్బంది ఎదురయింది. స్టేజీ మీద ఆంగ్లంలో ప్రసంగించగల ప్రావీణ్యం ఆయనకు లేదు. ఇంగ్లీష్ ప్రసంగాన్ని అండవిల్లి మాస్టారు తయారుచేసి ఇచ్చారు.  చెన్నై మ్యూజిక్  అకాడమీలో అనేకమంది సంగీత ఘనాపాటీల సమక్షంలో నేదునూరివారికి సంగీత కళానిధి పురస్కారం జరిగింది. ఆ అకాడమీలో కృష్ణమూర్తిగారికి ఒక రికార్డు వుంది. ఏటా డిసెంబరు నెలలో జరిగే  సంగీత ఉత్సవాల్లో  1951  నుంచి క్రమం  తప్పకుండా సుమారు అరవై ఏళ్ళపాటు  కచ్చేరీ చేస్తూ వస్తున్న  ఘనత నేదునూరి వారిది. మొదటి వరసలో అప్పటి వరకు కళానిధి  పురస్కారం పొందిన వారు ఆసీనులయివుంటారు. వారి సమక్షంలో,  దేశం నలుమూలలనుంచి వచ్చే వేలాదిమంది సంగీత ప్రియులు వరసగా కొన్ని రోజులపాటు సంగీతాంబుధిలో వోలలడుతారు. నగరంలోని హోటళ్ళన్నీ సంగీత అభిమానులతో నిండిపోతాయి. దీన్ని చెన్నై మ్యూజిక్ సీజను అంటారు.  తమిళనాటకూడా కృష్ణమూర్తిగారికి పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు.    చెన్నైకి మకాం  మార్చాల్సిందని ఆయనపై చాలా వొత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం తాను  సంగీత పాఠాలు నేర్చుకున్న ఉత్తరాంధ్రనే తన శేష జీవితం గడపడానికి ఎంచుకున్నారు. విశాఖ మువ్వలవాని పాలెంలో ఆయన నిర్మించుకున్న గృహం నిజానికి ఒక సంగీత నిలయం. ప్రతి రోజూ పొద్దున్నే నిత్య విద్యార్ధి మాదిరిగా తంబురా పట్టుకుని సంగీత సాధన చేస్తూరావడం ఆయనకే చెల్లింది.



(కీర్తిశేషులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి) 

ఇటీవలనే   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమాచార సలహాదారు  శ్రీ పరకాల ప్రభాకర్ విశాఖలోని ఆయన ఇంటికివెళ్ళి పరామర్శించి వచ్చారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో తీసుకున్న చర్యలు గురించి  నేదునూరివారు ప్రశంసించినట్టు  వార్తలు వచ్చాయి. నేదునూరి కృష్ణ మూర్తి గారు తన గురువయిన పినాకపాణి మాదిరిగా శత వర్షాలు జీవిస్తారని అనుకున్నారు కానీ అశేష యశస్సును తన వెనుకే  వొదిలి అనారోగ్యంతో  తాను యెంతగానో అభిమానిస్తూ వచ్చిన విశాఖ పట్నంలోనే కన్ను మూశారు. కర్ణాటక సంగీతంలో హిమాలయాల ఎత్తుకు ఎదిగిన ఇద్దరు సంగీత చక్రవర్తులు శ్రీ  మాండలిన్ శ్రీనివాస్, శ్రీ  నేదునూరి కృష్ణ మూర్తిని ఒక్క ఏడాదిలోనే  పోగొట్టుకోవడం కర్ణాటక సంగీత అభిమానులకు తీవ్ర నిరాశను కలిగిస్తోంది.
నేదునూరి వారి శిష్యులకు సయితం కేంద్ర ప్రభుత్వం  ఇచ్చే 'పద్మ' అవార్డులు  లభించాయి కానీ వారి గురువుకు  రాకపోవడం శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మొదలయిన వారి  అభిమానులందరికీ మనస్తాపం కలిగిస్తున్న విషయం. అయితే ఇంతలోనే  వారిక లేరన్న వార్త.
కర్ణాటక సంగీతంలో గురువుకు సాటిగా పేరు తెచ్చుకుంటున్న మల్లాది సోదరులు జనరంజకమైన  నేదునూరి బాణీని  అజరామరం చేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.
చెన్నైలో  ఈ నెల ఇరవైనుంచి సంగీత ఋతువు మొదలవుతుంది. చెన్నై మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో,   టీ.టీ.కే. ఆడిటోరియంలో ఎప్పటిమాదిరిగా ఈసారి నేదునూరి వారి కచ్చేరీ  లేకపోవడం ఒక లోటయితే, వచ్చే నెల జనవరి ఇరవై ఆరు భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించబోయే 'పద్మ' పురస్కార గ్రహీతల జాబితాలో నేదునూరి వారి పేరు ఉండకపోతుందా అన్నది ఆయన అభిమానుల ఆశ.
చూడాలి ఏం జరుగుతుందో!

NOTE : Photo Courtesy Image Owner 


        

7, డిసెంబర్ 2014, ఆదివారం

నడిచి వచ్చిన దారి - 1


నాకు తెలిసిన మా వూరు ఒకనాటి పల్లెటూరు. ఈ నాటిది కాదు. ఎదుగూ బొదుగూ లేని పల్లెకు మా వూరు నిలువెత్తు దర్పణం. వాగులు వంకలు దాటుకుంటూ వెళ్ళాలి. పుట్టానన్న మాటే కాని వూళ్ళో వున్నది తక్కువ. చదువులకోసం చిన్నప్పటి నుంచీ మా అక్కా బావల దగ్గరే పెరిగాను. సెలవులు ఇస్తే చాలు ఎగురుకుంటూ వెళ్లి వూళ్ళో వాలిపోయేవాడిని. బెజవాడనుంచి ఉదయం ఓ బస్సు. మళ్ళీ సాయంత్రం ఇంకో నైట్ హాల్ట్ బస్సూ. పెనుగంచి ప్రోలుకు రూపాయికి అర టిక్కెట్టు. అక్కడ మా అన్నపూర్ణక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కయ్య పెట్టిన చిరుతిండ్లు తిని చలో రంగా అంటూ మా వూరుబాట పట్టేవాడిని. యేరు దాటగానే వరుసగా మూడు కాలువలు. మోకాలు లోతు నీళ్ళు. నీటి  పాములు వుంటాయేమో అని భయం. గబగబా కళ్ళు మూసుకుని దాటి కాలువ గట్టెక్కితే పరుగు లాటి నడక. మాయాబజారులో వివాహ భోజనం పాట ఎత్తుకుంటే అలుపు తెలియకుండా వూరు చేరేవాడిని. మధ్యలో ఎదురయిన వాళ్ళు గుర్తు పట్టి చిన్నబ్బాయి గారు అని పలకరిస్తుంటే అదోరకం పులకరింత. మా వూరు మా వాళ్ళు అన్న భావన. 


(మా స్వగ్రామం కంభంపాడులో మా ఇల్లు)
       

ఊళ్ళోకి రాగానే మొదట్లోనే మా ఇల్లు. దొడ్లో చింతచెట్టు. వెనక గుమ్మంలో నిలుచుని మా అమ్మ ఎదురు చూపులు. వసారాలోనే 'సీనాయ్  వచ్చాడు చూడూ' అంటూ మా బామ్మ పలకరింపులు. మట్టికొట్టుకుపోయిన కాళ్ళు కడుక్కుని అమ్మ ఇచ్చిన నీళ్ళు తాగుతుంటే 'అమ్మయ్య వూరికి వచ్చాన'న్న ఆనందం. సొంతూరు అంటే ఎందుకో  అంత మమకారం.   (ఇంకా వుంది)

6, డిసెంబర్ 2014, శనివారం

తెలివిడి


ఏకాంబరం రంపపు మిల్లులో పనిచేస్తుంటే చేయి మిషన్ లో చిక్కుకుంది. ఆపరేషన్ చేసి మోచేతివరకు  తీసేసారు. మేనేజర్ పలకరించడానికి వెళ్ళాడు. 'నువ్వు కొంత అదృష్టవంతుడివి ఏకాంబరం. నీది ఎడమచేతి వాటం కదా! కుడి చేయి మిషన్ లో పడింది.'
ఏకాంబరం పొంగిపోయాడు.
'సరిగ్గా ఆఖరు నిమిషంలో, నేను ఎడమ చేతి వాటం మనిషినని గుర్తుకు వచ్చింది సారూ. వెంటనే తెలివిగా దాన్ని వెనక్కి లాక్కుని కుడి చేయి లోపల పెట్టాను. లేకపోతే నిష్కారణంగా ఇబ్బంది పడేవాడిని'




NOTE: Courtesy Image Owner