2, డిసెంబర్ 2014, మంగళవారం

దీపం లేదు కదా!


ఏకాంబరం రాత్రి వేళ వీధి దీపం కింద వెతుకులాడుతుంటే దోవనపోయేవాడు ఆగి చూసి అడిగాడు 'ఏం వెతుకుతున్నావని'
'ఇంట్లో ఉంగరం పడిపోయింది'
'అలా అయితే ఇక్కడ ఎందుకు దేవులాడుతున్నావు?'
'ఎందుకేమిటి నీ మొహం! ఇంట్లో దీపం లేదు కదా!'

ఏకాంబరం విసుక్కున్నాడు.  

NOTE: Courtesy Image Owner

1, డిసెంబర్ 2014, సోమవారం

దిగ్భ్రాంతి అంటే !


ఏకాంబరం ఓ ఆదివారం వుదయం కారులో జోరుగా హుషారుగా షికారుకు వెడుతున్నాడు. అడవి బాటలో ఒంటరి ఆడపిల్ల - అదీ వయసులో వున్నదీ, అందంగా వున్నదీ తారస పడింది. అడిగి మరీ కారెక్కింది. ఆ అమ్మాయితో ముచ్చట్లు చెబ్తూ, ఆ మాటల కిక్కు ఎక్కేలోగా వూహించనిది జరిగిపోయింది. మాట్లాడుతూ  మాట్లాడుతూనే ఆ అమ్మడు నోట మాట లేకుండా స్పృహ తప్పి పడిపోయింది. ఏదేదో వూహించుకుంటూ వూహాలోకాల్లో వున్న ఏకాంబరం  ఆ పిల్ల పరిస్తితి చూసి దిమ్మ తిరిగి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
కాసేపట్లో తేరుకుని దగ్గర్లో వున్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
డాక్టర్ పరీక్ష చేసి అభినందనలు తెలిపాడు. ‘తండ్రి కాబోతున్నాడన్న కబురు’ చెవిలో వేశాడు.
ఏకాంబరం కాదన్నాడు. డాక్టర్ ఏదో చెప్పబోయేలోగా ఆ అమ్మడు కల్పించుకుని అతడే  పుట్టబోయే తన బిడ్డకు కాబోయే కన్నతండ్రని ఖరాఖండిగా చెప్పింది. ఏకాంబరం మరోసారి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
దాన్నుంచి మళ్ళీ తేరుకుని ధైర్యం కూడదీసుకుని ఆ అమ్మాయి అబద్ధం చెబుతోందని వాదించాడు. తాను చెప్పింది నిజం అని నిరూపించుకోవడానికి ఎలాటి పరీక్షకయినా సిద్ధం అన్నాడు.
డాక్టర్ డి.ఎన్.యే. పరీక్ష చేశాడు. టెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ ఫలితం ఏకాంబరాన్ని కొంత వూరట పరిచింది. ఆ పిల్ల చెప్పింది నిజం కాదని తేలిపోయింది. కాని అందులో వివరాలు అతగాడికి  మరింత దిగ్భ్రాంతి కలిగించాయి. ఆ అమ్మాయి గర్భవతి కావడానికి ఏకాంబరం కారణం కాదని మాత్రం  తేలింది కానీ, ఏకాంబరానికి ఆ అమ్మాయినే కాదు యే అమ్మాయినీ గర్భవతిని చేయగల సామర్ధ్యం పుట్టుకతోనే లేదన్న కఠిన వాస్తవం  ఆ టెస్టుల్లో బయట పడింది.
ఆ దిగ్భ్రాంతి నుంచి కూడా తేరుకుని  ఏకాంబరం ఇంటి దారి పట్టాడు. హఠాత్తుగా అతడికి తన కన్న పిల్లలు గుర్తుకు వచ్చారు.
అంతే!
దిగ్భ్రాంతికి పరాకాష్ట అంటే ఏమిటో  ఏకాంబరం అనుభవంలోకి వచ్చింది.


(నెట్లో చక్కర్లు కొడుతున్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

NOTE: Courtesy Image Owner         

30, నవంబర్ 2014, ఆదివారం

మనశ్శాంతికి మంచి మార్గం


బుద్ధుడు అంతేవాసులతో కలసి అడవి మార్గాన వెడుతున్నాడు.
దోవలో ఆగి ఒక శిష్యుడిని పిలిచి ‘దాహంగా వుంది మంచి నీళ్ళు పట్టుకురమ్మ’ని కోరాడు.
అతడు చుట్టుపక్కల పరికిచి చూస్తే దగ్గరలో ఓ వాగు కనిపించింది. ఆకుల దొన్నెలో నీళ్ళు పట్టుకురాబోయేలోగా ఒక  ఎడ్లబండి అటుగా వచ్చింది. ఎడ్లు వాగుదాటే క్రమంలో  అందులోని  నీళ్లన్నీ మురికి మురికిగా మారాయి.  ఆ నీటిని తీసుకువెళ్లడం ఆ శిష్యుడికి మనస్కరించలేదు.
తిరిగి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి వున్న విషయం మనవి చేసుకున్నాడు. ‘స్వామీ! వాగులో నీరు మురికి మురికిగా వుంది’
బుద్ధుడు తలపంకించి వూరుకున్నాడు.      

అప్పటికి అక్కడే విశ్రాంతికోసం  విడిది చేసిన బుద్ధుడు కొంతసేపు గడిచిన తరువాత అదే శిష్యుడిని పిలిచి మంచి నీరు పట్టుకు రావాల్సిందని మళ్ళీ కోరాడు.
శిష్యుడు మళ్ళీ వాగువద్దకు వెళ్లాడు.
అప్పటికీ వాగులో నీళ్ళు  తేరుకోలేదు.  బురద బురదగానే వున్నాయి.
శిష్యుడు తిరిగి వచ్చి అదే విషయం బుద్ధుడితో చెప్పాడు. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు.
మరి కొద్ది సేపటిలోనే ఆ శిష్యుడికి మళ్ళీ పిలుపు. నీళ్ళు తెమ్మని గురువుగారి అర్ధింపు.
ఈసారి వెళ్లేసరికి వాగులో నీరు తేరుకుని వున్నాయి. నిర్మలంగా వున్న నీటిని ఆకు దొన్నెలో తెచ్చి గురువు గారికి అందించాడు.
బుద్ధుడు ఆ నీటిని సేవించి శిష్యుడితో ఇలా అన్నాడు.
‘దీన్నిబట్టి నీకేం అర్ధం అయింది. ముందు వెళ్ళినప్పుడు వాగులో నీళ్ళు మురికిగా వున్నాయి.
‘కొంత వ్యవధానం తరువాత అవే తేరుకున్నాయి. అవి అలా తేరుకోవడానికి మనం చేసినదేమీ లేదు. కొంత వ్యవధి ఇచ్చాం అంతే.
 ‘మన మనసు కూడా ఆ వాగులో నీటి మాదిరే.
‘అది కలత చెందినప్పుడు దాన్ని దాని మానాన వొదిలిపెట్టాలి. కాసేపటి తరువాత అదే కుదుట పడుతుంది.
‘ఈ మర్మం తెలుసుకోగలిగితే మనశ్శాంతి కష్టమేమీ కాదు.
‘మానసిక ప్రశాంతత కోసం వేరే  ప్రయత్నాలేవీ  అవసరం లేదు. నిజానికి ఎలాటి ప్రయత్నమూ లేకుండానే దాన్ని పొందవచ్చు.’



28, నవంబర్ 2014, శుక్రవారం

రాతి యుగం ఆలోచనలు ఇక మారవా?


(Published by 'SURYA' telugu daily in its Edit Page on 30-11-2014, SUNDAY)

నవంబర్ మాసంలో నాలుగో గురువారం అమెరికాలో చాలా ప్రాముఖ్యత కలిగిన దినం. ఆ రోజును అమెరికాలో 'థాంక్స్ గివింగ్ డే' గా పాటించి ఘనంగా జరుపుకుంటారు. కనిపెంచిన  తలితండ్రులకు  ఆదేశపు పౌరులు కృతజ్ఞతలు తెలుపుతూ తమ స్తోమత కొద్దీ కానుకలు ఇచ్చే రోజు. ఆ పండుగ తరువాతి రోజున వచ్చే   శుక్రవారం అమెరికన్లకు 'బ్లాక్ ఫ్రైడే'.  వారి  జీవితంలో ఈ బ్లాక్ ఫ్రైడే కి చాలా ప్రాముఖ్యత వుంది. బ్లాక్ డే అనగానే అదేదో సంతాప దినం అని అనుకోరాదు. ఆ రోజున అమెరికాలో క్రయ విక్రయాలు  భారీగా జరుగుతాయి.  కొనుగోలుదారులతో  వీధులు చాలా రద్దీగా వుంటాయి. యెంత రద్దీ అంటే ఆరోజున కారు  టైర్ల గుర్తులతో రహదారులు నల్లగా తయారవుతాయిట. అందుకే ఆ దినాన్ని అమెరికన్లు బ్లాక్ ఫ్రైడే అని పిలుచుకుంటారని  ఒక కధ ప్రచారంలో వుంది.
జన జీవితంలో విశేష ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ రెండు ప్రత్యేక దినాలను ఈ ఏడాది జరుపుకోరాదని అనేక ప్రజా సంఘాలు పిలుపు ఇచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే-  అమెరికా దేశంలోని సెంట్ లూయీస్ పొలిమేరల్లోని ఫెర్గ్యూసన్ పట్టణంలో జరిగిన ఓ సంఘటన.  
శరీర వర్ణాన్ని బట్టి రక్తం రంగు మారదు. మనిషి స్తితిగతులనుబట్టి ప్రాణం విలువ పెరగదు, తరగదు.
అయినా ఈ పాడు  ప్రపంచంలో విలువల కొలమానాలు తారుమారవుతూనే వున్నాయి. ఇటీవల అమెరికాలో ఒక న్యాయ స్థానం గ్రాండ్ జ్యూరీ  ఇచ్చిన తీర్పే దీనికి నిలువెత్తు ఉదాహరణ.
ఒక నల్ల జాతి యువకుడ్ని కాల్చి చంపిన  ఘటనలో, అందుకు కారకుడయిన  శ్వేతజాతి  పోలీసు అధికారిపై   నేరారోపణ చేసే అవసరం లేదని మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ కోర్టు గ్రాండ్ జ్యూరీ చేసిన  నిర్ణయం దేశవ్యాప్తంగా వివాదాలకు, ప్రపంచవ్యాప్తంగా నిరసనలకు కారణమయింది.



నిరసనలు కొన్ని చోట్ల హింసారూపం దాల్చాయి. అనేక ఇండ్లు తగులబెట్టారు. వాహనాలకు నిప్పంటించారు. అల్లరి మూకలను అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయు తూటాలు పేల్చారు.   ఫెర్గ్యూసన్ గవర్నర్ జే నిక్సన్ తన రాష్ట్రంలో అత్యవసర పరిస్తితి ప్రకటించి శాంతి భద్రతలను అదుపుచేయడం కోసం రెండు వేలమందికి పైగా నేషనల్ గార్డులను రంగంలోకి దించారు.  ప్రెసిడెంట్ ఒబామా సైతం శాంతిని కాపాడడంలో సహకరించాలని  అన్ని వర్గాల ప్రజలకు  విజ్ఞప్తి చేయాల్సివచ్చింది. ప్రెసిడెంట్ తన నివాసం అయిన వైట్ హౌస్ లో కూర్చుని టీవీ, రేడియో ద్వారా ఈ విజ్ఞప్తి చేసారు. ప్రధాన టీవీ ఛానళ్ళు ప్రెసిడెంట్ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే, టీవీ తెరలపై సగం వైపు  ఒబామాను, మరో సగంలో ఫెర్గ్యూసన్ నగరంలో జరుగుతున్న హింసాత్మక  దృశ్యాలను ఏకకాలంలో చూపించడం విశేషం.  ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలకు అడ్డుకట్టపడలేదు.  అమెరికాలో  జాత్యహంకార మూలాలు ఇంకా మిగిలే వున్నాయని మీడియా గగ్గోలు మొదలయింది. ఒక ఆఫ్రికా అమెరికన్ దేశాధ్యక్షుడిగా వున్నప్పుడు జరిగే  ఇటువంటి సంఘటనలకు సహజంగానే ప్రాచుర్యం లభిస్తుంది.      
ఈ పరిణామాలకు దారితీసిన కాల్పుల సంఘటన  గత ఆగస్టు తొమ్మిదో తేదీన ఫెర్గ్యూసన్ నగర నడివీధిలో అరిగింది. పద్దెనిమిదేళ్ళ  నల్లజాతి యువకుడు మైఖేల్ బ్రౌన్ ని పోలీసు అధికారి డారెన్ విల్సన్ తన రివాల్వర్ తో ఆరు సార్లు కాల్చడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు తన మీద దాడి  చేసాడనీ, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపాల్సివచ్చిందనీ అధికారి వివరణ ఇచ్చుకున్నాడు. బ్రౌన్  తనను కారులోకి నెట్టి, తన ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఆ అధికారి పేర్కొన్నట్టు సెంట్ లూయీస్ పోలీసులు చెబుతున్నారు.    అయితే ఆ సంఘటన జరిగినప్పుడు బ్రౌన్ వెంట వున్న అతడి స్నేహితుడు డోరియన్ జాన్సన్ కధనం వేరేగా వుంది. 'ఇద్దరూ కలిసి  జాన్సన్ ఇంటికి నడిచి వెడుతుండగా పోలీసు వాహనం అటుగా వచ్చింది. పోలీసు అధికారి వారిని పక్కకు తొలగి నిలబడమని ఆదేశించాడు. అధికారి కారు నుంచి దిగుతూనే కారు డోరుతో బ్రౌన్ ని బలంగా నెట్టాడు. బ్రౌన్ ని చేతులతో వొడిసి పట్టుకుని రివాల్వర్ తో కాల్చాడు.'  మామూలుగా అయితే ఇది సర్వ సాధారణ సంఘటనే. కాల్చిన పోలీసు అధికారి శ్వేత జాతీయుడు కావడం, విచారణ జరిపిన గ్రాండ్ జ్యూరీ, ఆ అధికారి తప్పేమీ లేదని  తీర్పు చెప్పడం యావత్ వివాదానికి తెర తీసింది.
గతంలో ఇటువంటి సంఘటనలు జరక్కపోలేదు. శ్వేత జాతి పోలీసులు ఆఫ్రికన్ అమెరికన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు కూడా వున్నాయి. అమెరికాలో వర్ణ వివక్షను అరికట్టడానికి అబ్రహాం లింకన్ కాలంలో మొదలయిన సంస్కరణలు, చేసిన చట్టాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా తక్కువేమీ కావు. ఆదేశంలో నల్లజాతివాడని, నీగ్రో అనీ పిలవడం నిషిద్ధం. అయినా వారిలో ఇంకా అభద్రతాభావం గూడుకట్టుకునే  వుంది. ఫెర్గ్యూసన్ సంఘటన  దరిమిలా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలలా వినవస్తున్న నిరసన స్వరాలు అమెరికన్ పాలకుల మనస్తత్వంలో మార్పు తీసుకు రాగలవని విశ్వసించడం మినహా చేయగలిగింది లేదు.
సమస్త సృష్టిలో ఎక్కడా లేని ఈ వర్ణ వివక్ష కేవలం మానవులకే పరిమితం కావడం మరో విషాదం. 

NOTE : Courtesy Image Owner   


26, నవంబర్ 2014, బుధవారం

'రాజధాని' కబుర్లు

(Published By 'SURYA' Telugu Daily in its Edit Page on 26-11-2014, Thursday)

ఇప్పుడు ఎక్కడ విన్నా 'రాజధాని' కబుర్లే.
దేశాలకు గానీ రాష్ట్రాలకు గానీ నూతన రాజధానుల నిర్మాణం అనేది కొత్తేమీ కాదు. ప్రాచీన కాలంలో ఈజిప్షియన్లు, రోమన్లు, చైనీయులు తరచుగా రాజధానులను ఒక చోటి నుంచి మరో చోటికి మార్చుకున్నట్టు ఆధారాలు వున్నాయి. రాజకీయ, ఆర్ధిక కారణాలు మాత్రమే కాకుండా దేశ రక్షణ అంశాలు కూడా ఇందులో ముడిపడి వున్నాయి. ప్రజల నడుమ ఐక్యత, ప్రాదేశిక భద్రత అనేవి రాజధాని ఎంపికలో కీలక భూమిక పోషిస్తాయి. 


(ప్రాచీన రాజధాని)

దక్షిణ కొరియా  ఉదాహరణ తీసుకుందాం.
అక్కడ కొత్త రాజధాని నిర్మించాలని ప్రతిపాదించారు  ప్రస్తుత రాజధాని సియోల్ కాకుండా సెజోంగ్ అనే మరో చోట నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవాలని 2005 లోనే ఒక బృహత్తర ప్రణాళిక రూపొందించారు. రెండు లక్షల పదమూడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక భారీ భవన నిర్మాణాన్ని 2011  నవంబర్ లో మొదలు పెట్టి  రెండేళ్లలో  పూర్తిచేశారు. నిరుడు డిసెంబర్ నెలలో సియోల్ నుంచి అనేక ప్రభుత్వ విభాగాలను నూతన రాజధానికి తరలించారు. పాత రాజధాని సియోల్ లో మాదిరిగా  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మౌలిక సదుపాయాలతో కిక్కిరిసిపోకుండా కొత్త రాజధానిని సరికొత్త ఆలోచనలతో నిర్మించాలనే పాలకుల అభిప్రాయానికి అనువుగా వృత్తాకారంలో, మధ్యలో ఎలాటి నిర్మాణాలు లేకుండా నూతన  రాజధాని డిజైన్ కు రూపకల్పన చేసారు. వృత్తాకార నిర్మాణాలకు ఆవల ఇరవై ఇరుగు పొరుగు ఆవాస ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రణాలికలు తయారు చేసారు. సాంప్రదాయిక ఇరుగుపొరుగు ప్రాంతాల అభివృద్ధితో పాటు, మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా అభివృద్ధి  చేసే ఆధునిక విధానాలను జోడించడం ఈ ప్రణాళికల్లోని ప్రత్యేకత.
అయితే కొత్త రాజధాని నిర్మాణ పధకాలకు మొదటి అడ్డంకి రాజకీయ ప్రత్యర్ధుల విమర్శల రూపంలో ఎదురయింది.  కొరియన్ జాతీయ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చలు చాలా తీవ్రంగా జరిగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురయినా ప్రభుత్వం తన ప్రణాళికతో ముందుకు పోయింది. నిరుడు జులై నెలలో మలేసియా కు చెందిన పుత్రజయ, కొరియా నూతన రాజధాని నగరం సెజోంగ్ సిటీ నడుమ అవగాహన పత్రంపై సంతకాలు జరిగాయి. కొత్త రాజధాని ఒక ఆర్ధిక కేంద్రంగా రూపొందేందుకు వీలుగా ఉప ప్రణాలికలు తయారు చేసారు. భవిష్యత్తులో పెరగబోయే జనాభా అవసరాలకు తగ్గటుగా పౌర సదుపాయాలు కల్పించడానికి వీటిని తయారు చేసారు.
ఇక బ్రెజిల్ విషయం తీసుకుంటే -
బ్రెజిల్ దేశపు రాజధాని నిర్మాణం జరిగి  యాభయ్ ఏళ్ళు పూర్తయిన తరువాత కూడా ఈనాటికీ అది ప్రపంచంలోని సుందర రాజధాని నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతూ  ఉన్నదంటే ఆ నగరం రూపకల్పన యెంత పకడ్బందీగా చేసారో అర్ధం అవుతుంది. పైగా ఈ రాజధాని నిర్మాణాన్ని కేవలం నలభయ్ ఒక్క మాసాలలో పూర్తిచేయగలగడం మరో విశేషం. 1956 - 1961 మధ్య బ్రెజిల్ అధ్యక్షుడిగా వున్న జుసెలినో కుబిత్చెక్ - బ్రేసీలియా పేరుతొ ఈ కొత్త రాజధాని నిర్మాణాన్ని సత్వరంగా పూర్తి చేసి 'అయిదేళ్ళలో యాభయ్ ఏళ్ళ అభివృద్ధి' అనే నినాదానికి ఊపిరి పోశారు. పట్టుదల వుంటే ఏదీ అసాధ్యం కాదు అని నిరూపించారు.    
పొతే,  అమెరికా.
అమెరికన్  విప్లవం అనంతరం దేశ రాజధానికి అనేక నగరాలను పరిశీలించారు.ఫిలడెల్ఫియా, బాల్టిమోర్, న్యూయార్క్ సిటీలతో పాటు ఎనిమిది నగరాలు పరిశీలనకు వచ్చాయి. చివరికి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ పొటామాక్ నదీ తీరంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసారు. వర్జీనియా, మేరీ లాండ్ రాష్ట్రాల వాళ్ళు రాజధాని నగర నిర్మాణానికి అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ విధంగా వాషింగ్టన్ డీసీ నగరం రూపుదిద్దుకుంది. 1800 నుంచి అమెరికా రాజధానిగా విలసిల్లుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక ప్రయోజనాలు, ఉత్తరాది రాష్ట్రాల యుద్ధ బకాయిల చెల్లింపు డిమాండ్ల కారణంగా తలెత్తిన వివాదం దరిమిలా రాజీ మార్గంగా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవలసి వచ్చింది.
రష్యా
14 వ శతాబ్దం నుంచి 1712 వరకు రష్యన్ సామ్రాజ్యానికి మాస్కో రాజధానిగా వుండేది. దరిమిలా రష్యాను మరింత పాశ్చాత్య పోకడలకు దగ్గర చేసే ఉద్దేశ్యంతో యూరోపుకు దగ్గరగా వుండే సెంట్ పీటర్స్ బర్గ్ నగరానికి రాజధానిని మార్చారు. తిరిగి కమ్యూనిస్ట్ విప్లవం అనంతరం రాజధాని    1918 లో మళ్ళీ మాస్కోకి తరలిపోయింది.
కెనడా
కెనడా పార్లమెంటు సమావేశాలను మొదట్లో టొరంటో. క్యూబెక్ సిటీలు రెండిట్లో విడతలువారీగా నిర్వహిస్తూ వుండేవారు.   1857లో అట్టావా దేశపు రాజధాని అయింది. నిజానికి ఆరోజుల్లో అట్టావా అనేది చాల చిన్న పట్టణం. పైగా బాగా వెనుకబడిన ప్రాంతంలో వుండేది. కాకపొతే ఒంటారియో, క్యూబెక్ ప్రాంతాలకు నడుమ వుండడం దీనికి కలిసివచ్చింది.
ఆస్ట్రేలియా 
19 వ శతాబ్దంలో మొత్తం ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ ఈ రెండే పెద్ద నగరాలు. దేశ రాజధాని విషయంలో ఈ రెంటి నడుమ గొప్ప పోటీ ఏర్పడింది. రాజీ మార్గంగా కొత్త రాజధాని నిర్మించాలని నటి పాలకులు నిర్ణయించారు. విస్తృతంగా సర్వే చేసిన తరువాత న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి అక్కడ రాజధాని నిర్మించారు. ఆవిధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించిన కాన్ బెర్రా 1927 నుంచి ఆస్ట్రేలియా రాజధానిగా ఉంటోంది. సిడ్నీ. మెల్బోర్న్ నగరాల నట్టనడుమ ఈ కొత్త రాజధానిని నిర్మించారు. కాకపోతే సముద్రతీరం లేని రాజధాని నగరం అది.
ఇండియా
ఇండియా బ్రిటిష్ పాలనలో వున్నప్పుడు 1911 వరకు తూర్పు తీరంలో వున్న  కలకత్తా రాజధానిగా వుండేది. పరిపాలన సౌలభ్యం కోసం బ్రిటిష్ వారు రాజధానిని ఉత్తర భారతంలోని ఢిల్లీకి మార్చారు. న్యూ ఢిల్లీ నగరాన్ని  ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947 సంవత్సరం నుంచి భారత దేశపు రాజధానిగా కొనసాగుతోంది.
టాంజనీయా
1970 ప్రాంతాల్లో టాంజనీయా రాజధానిని తీర ప్రాంతంలో వున్న దార్ ఎస్ సలాం నుంచి దేశం నడిబొడ్డులో వున్న దొదోమా నగరానికి మార్చారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి కానీ నూతన రాజధాని నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
మియన్మార్ (బర్మా)
లోగడ బర్మాగా వున్న నేటి మియన్మార్ కు ఒకప్పుడు రంగూన్ రాజధానిగా వుండేది. మియన్మార్ రాజధాని మార్పిడి చాలా ఆకస్మికంగా జరిగిపోయింది.  2005 నవంబర్ లో సైనిక ప్రభుత్వం రంగూన్ లో వున్న ప్రభుత్వ సిబ్బందిని హుటాహుటిన దేశానికి ఉత్తర కొనలో వున్న నేపిడా (Naypyidaw) నగరానికి తరలి వెళ్ళమని ఆదేశించింది. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే రాజధాని కోసం మూడేళ్ళ క్రితమే ఆ నగరాన్ని నిర్మించిన విషయం బయటకు పొక్కకుండా చూడడం. ఈ వివాదాస్పద రాజధాని మార్పిడికి కారణం జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహా అని ఒక వదంతి అక్కడ బహుళ ప్రచారంలో వుంది. పెద్ద నగరం అయిన రంగూన్ ను వొదిలి చాలా చిన్న జనాభా కలిగిన పట్టణాన్ని ఎంచుకోవడానికి మరో పైకి చెప్పని కారణం వుంది. రంగూన్ వంటి పెద్ద నగరంలో రాజధాని వుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో  జనం పెద్ద ఎత్తున పోగవడానికి ఆస్కారం వుంటుంది. అంచేత అలాటి వాటికి వీలులేకుండా  చూడడానికే రాజధానిని మరో చోట  మారుమూల చిన్న ప్రాంతానికి తరలించారని  రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. (26-11-2014)
NOTE: Courtesy Image Owner




25, నవంబర్ 2014, మంగళవారం

మంత్రిని కుమ్మిన గేదె కధ


సాక్షాత్తు ఒక కేంద్ర మంత్రిని  పల్లెటూరి  గేదె ఒకటి   కొమ్ములతో కుమ్మి కింద పడేసింది. ఇది జరిగింది వెనుకబడిన  మహబూబ్ నగర్ జిల్లాలో. వేల జనం చూస్తుండగా గేదె తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. చుట్టూ వున్న అధికారులు, పోలీసులు నిశ్చేష్టులయి చూస్తూ వుండిపోయారు. మొత్తమ్మీద  సుఖాంతంగా ముగిసిన ఈ కధాకధన క్రమంబెట్టిదనిన:



(This incident was narrated to me by my brother Shri B.Ramachandra Rao, who retied as Chief General Manager State Bank Of India. Story in his words)
"దాదాపు 31 సంవత్సరాల క్రితం 1983 లో నేను హైదరాబాదు స్టేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ గా పనిచేస్తున్న రోజులు.  ఒక రోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళీ వెళ్ళగానే సీ.జీ.ఏం. గారు అర్జంటుగా పిలుస్తున్నారని కబురు. శ్రీ ఏమ్వీ  సుబ్రహ్మణ్యం గారు (ఇప్పుడు లేరు) అప్పుడు సీ.జీ.ఎం. నేను  వెళ్లేసరికి ఆయన ఛాంబర్లో  నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు  శ్రీ మల్లు అనంత రాములు గారు కూర్చుని వున్నారు.  కేంద్రంలో ఆర్ధిక శాఖ సహాయ మంత్రిగా వున్న  శ్రీ  జనార్ధన పూజారి గారికి అయన  చాలా సన్నిహితులు. సీజీఎం గారు విషయం సూటిగా చెప్పారు.
'మరో పది రోజుల్లో మంత్రిగారు నాగర్  కర్నూల్  వస్తున్నారట. స్టేట్ బ్యాంక్ వాళ్ళు బ్రహ్మాండమయిన లోన్ మేళా ఏర్పాటుచేయాలి.'
ఇంతలో అనంత రాములు గారు, జనార్ధన  పూజారి గారికి తాను  యెంత దగ్గరో తెలియచెప్పడానికో ఏమో ఆ గదిలోనుంచే ఫోను కలిపించి ( అప్పట్లో సెల్ ఫోనులు లేవు) మంత్రిగారితో మాట్లాడించారు. ఫంక్షన్ ఎలా జరగాలో మంత్రిగారు  ఫోనులోనే మా సీజీఎం గారికి పది నిమిషాలపాటు హుకుం జారీ చేసారు. అనంతరాములు గారు సంతృప్తిగా వెళ్ళిపోయారు కానీ,  సీజీఎం గారికి భయం పట్టుకుంది. మంత్రిగారు ఆ సభకి కనీసం పదివేలమంది రైతులు రావాలి, ప్రతివారికీ రుణ సంతర్పణ జరగాలి అని చెప్పారట. 'పదిరోజుల్లో ఇది ఎలా సాధ్యం అని అంటూనే, 'ఏం చేస్తావో తెలవదు. మంత్రి గారి చేత మాట రాకుండా చూడాల్సిన బాధ్యత నీది. మీటింగ్ ఏర్పాట్లు ఘనంగా వుండాలి. యెంత ఖర్చయినా పరవాలేదు. నేను 'రాటిఫై' చేస్తాను. నాకు మాత్రం మాట రాకూడదు' అనేసారు. (జనార్ధన పూజారి గారు వ్యక్తిగతంగా ఎంతో నిజాయితీ పరులు. కానీ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా బహిరంగ సభల్లో కడిగేస్తారు. పేరుకు జూనియర్ మంత్రి అయినా ఆయన అంటే బ్యాంకింగ్ రంగంలో టెర్రర్. దేశమంతా లోన్ మేళాలు పెట్టించి బ్యాంకింగ్ వ్యవస్తఃను ఒక రకంగా పలుచన చేసారు. అది వేరే సంగతి).
ఇక చూడాలి. మా అవస్థలు. వున్నది పదిరోజులు. రుణాలు ఇవాల్సింది పదివేల మందికి. నాగర్ కర్నూల్ డివిజన్లోని మా పదిమంది బ్రాంచి మేనేజర్లు రాత్రనక, పగలనక అవిశ్రాంతంగా కష్టపడ్డారు. నేను కూడా వారితో కలిసి ఆ  ప్రాంతం అంతా తిరిగాను. మా మేనేజర్లతో ఒక్కటే చెప్పాను. 'ఈ హడావిడిలో ఎలాటి తప్పులు చేయవద్దు. తప్పుడు పేర్లతో లోన్లు ఇవ్వవద్దు. మీ మీద  ఏ వత్తిడి వచ్చినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా నాకు ఫోను చేసి చెప్పండి. మర్నాడే నేను వచ్చి చూసుకుంటాను. మీరు మాట పడవద్దు, నాకు మాట రానియ్యవద్దు.'
సిబ్బంది శ్రమ ఫలించింది. పెట్టుకున్న టార్గెట్ చేరుకోగలిగాము.
ఆరోజు రానే వచ్చింది. సాయంత్రం నాలుగు గంటలకు నాగర్ కర్నూల్ లో బహిరంగ సభ.  హైస్కూల్ మైదానంలో ఎక్కడ చూసినా జనమే జనం. రుణ గ్రహీతలకోసం మంజూరు చేసిన  దాదాపు వెయ్యి గేదెలు, రెండు వందల ట్రాక్టర్లు, వందలాది పంపు సెట్లు అక్కడకు తెప్పించి పెద్ద ఎగ్జిబిషన్  పెట్టాము.
అదంతా చూసి అనంతరాములు గారు ఖుషీ. ఆయన ఖుషీ చూసి మా సీజీఎం గారు ఖుషీ. కధ ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక జరగరాని సంఘటన జరిగిపోయింది.
మంత్రి గారు ఈలోపల గేదెల స్టాల్ చూస్తానన్నారు. అక్కడికి వెళ్లి అక్కడి బ్యాంకు సిబ్బందితో గేదెలను గురించి రకరకాల ప్రశ్నలు సంధించారు. జవాబులు ఆయనకు సంతృప్తి కలిగించడంతో బతుకు జీవుడా అనుకున్నాము. ఇంతలో అనంత రాములు గారు 'చీకటి పడుతోంది, తొందరగా సభ మొదలు పెడదాం' రండని పిలిచారు. మంత్రి గారు సరేనంటూ  పక్కకు తిరిగారు. పెద్ద పెద్ద  కొమ్ములున్న ఓ పెద్ద గేదె ఆయన కంట పడింది. అలాటి గేదెలు బాగా తెలిసున్నవాడిలా  ఆయన చరచరా దాని దగ్గరకు వెళ్లి చూసారు. ఆ గేదె గురించి  మళ్ళీ కొన్ని ప్రశ్నలు వేసారు. మేము తత్తరపడుతుంటే  అయన -  'మీరంతే. ఏసీ రూముల్లో కూర్చునే బ్యాంకర్లు. గేదెలగురించి మీకేం తెలుస్తుంది? నేను చెబుతాను వినండి' అంటూ ఓ చేత్తో గేదె కొమ్ములు పట్టుకుని చెప్పడం మొదలు పెట్టారు.
ఆ గేదెకి ఈ వ్యవహారం నచ్చినట్టు లేదు. అకస్మాత్తుగా అది మెడవంచి కొమ్ములతో మంత్రిగారిని అమాంతం కుమ్మేసింది. గేదె కబుర్లు చెప్పబోతున్న మంత్రిగారికి కళ్ళు బైర్లు కమ్మాయి. కుమ్మడమే కాకుండా అది పూజారి గారిని కింద పడేసి కాళ్ళతో తొక్కబోయింది. అందరం బిత్తరపోయాం. ఏం చెయ్యాలో తెలియదు. ఓపక్క గేదె కాళ్ళకింద మంత్రి గారు. మరో పక్క కాలెత్తి తొక్కడానికి సిద్ధంగా వున్న గేదె. వూరివాళ్ళు కలిపించుకుని గేదెని పట్టుకు  వెళ్లి దూరంగా కట్టేశారు. మంత్రిగారు కిందపడి  లేవలేకుండా వున్నారు. ఇంతలో ఎవరో 'డాక్టర్ డాక్టర్' అని అరిచారు. ఇంకెవరో వెళ్లి ఓ డాక్టర్ ని పట్టుకొచ్చారు. అమ్మయ్య అనుకున్నాం.  తీరా చూస్తె అయన పశువుల డాక్టర్. మా సీజీఎం గారి బీపీ పెరిగిపోతోంది. చివరికి పూజారి గారు తనకు తానే తేరుకున్నారు. తేరుకోగానే ఆయనకు తను మంత్రి అన్న విషయం స్పృహకు వచ్చింది. లేచి  నిల్చుని 'డోంట్ వర్రీ నాకేం కాలేదు. నాకు ప్రజలు ముఖ్యం. వారితో మీటింగ్ ముఖ్యం. నాకేం జరిగిందన్నది ముఖ్యం కాదు' అంటూ చకచకా వెళ్లి స్టేజి ఎక్కారు.
జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమో ఏమో మంత్రి గారు ఆరోజు అనర్ఘళంగా మాట్లాడారు. గట్టిగా గొంతెత్తి ప్రసంగించడం మొదలు పెట్టారు. మేము ఏర్పాటు చేసిన అనువాదకుడు కూడా రెచ్చిపోయి అంతకంటే గట్టిగా బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు.
మంత్రి గారు స్వరం పెంచి అడిగారు. " ఇక్కడకు వచ్చిన పదివేలమందిలో బ్యాంకు లోను కోసం ఎవరయినా లంచం ఇచ్చారా. అది నాకు తెలవాలి. లంచం ఇస్తే చేతులెత్తండి. వాళ్ళను ఇక్కడే సస్పెండ్ చేస్తాను, మీకేం భయం లేదు. భయపడకుండా చేతులెత్తండి."
కాసేపు అంతటా నీరవ  నిశ్శబ్దం. స్టేజి మీద మరింత భయంకరమైన నిశ్శబ్దం. అయిదు నిమిషాలు గడిచాయి. ఎవరూ చేతులు ఎత్తలేదు.
మంత్రి గారు పట్టువదలని విక్రమార్కుడిలా మళ్ళీ మైకు పట్టుకుని చెప్పారు.
అనువాదకుడు తెలుగులో అంతకంటే గట్టిగా కరిచినట్టు అరిచి చెప్పాడు.
'చెప్పండి. భయపడకండి' అంటూ.
చివరికి మంత్రిగారు ఓ మెట్టు దిగి అడిగారు.
'సరే. ఇప్పుడు మరోటి అడుగుతా చెప్పండి.  మీలో లంచం ఇవ్వకుండా లోను తీసుకున్నవాళ్లు ఎవ్వరో చేతులు ఎత్తండి'
ఒక్కసారిగా అందరూ చేతులు ఎత్తారు. స్టేజ్ మీద వున్న బ్యాంకర్లు  ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి గారు ఉపన్యాసం ఇలా ముగించారు.
'ఈ నాగర్ కర్నూల్ సభని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా మీ ఉదాహరణే చెబుతాను'
అక్కడికి కధ సుఖాంతం. కానీ కధ అయిపోలేదు.
అప్పుడు రుణ మేళాలు. ఇప్పుడు రుణ మాఫీలు. బ్యాంకింగ్ వ్యవస్థ ఎటు  పోతోందో, ఎటు  పోవాలో అర్ధం కాని  పరిస్తితి.
"Are we playing for galleries? Are we indulging in competitive populism? When so many banks in other  countries  collapsed at one point of time, we are proud that banks in India stood the test of the time. Let us not politicise or pollute our banks. Long live Indian Banks"  

22, నవంబర్ 2014, శనివారం

ఏదో ఒకటి కావాలి!

"పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పిల్లలకు పెద్ద
వాళ్ళ పేర్లు కలిసొచ్చేటట్టు పొడుగాటి పేర్లు పెడతారు. చివరికి, చిట్టీ, చిన్నా అంటూ పొట్టి పేర్లతో పిలుస్తారు.
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ను ఏ టాక్సీ
వాడయినా బేగంపేట్ అనే అంటాడు. అలాగే
శంషాబాదు ఎయిర్ పోర్ట్. ఏ పేరు పెట్టినా చివరికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అనే. ఇక ఈ నాామకరణాాలన్నీ రాజకీయ వాదులాటలకోసం"



NOTE: Courtesy Cartoonist