17, నవంబర్ 2014, సోమవారం

ఆలస్యం చేస్తే 'చూడలేని' సినిమా 'పరంపర'


ఎవరో అన్నట్టు ఈరోజుల్లో చాలా సినిమాలు చూడలేనివే. కొన్ని కోట్లు పెట్టి తీస్తారు. పెద్ద యాక్టర్లు. పెద్ద పెద్ద సెట్టింగులు. ముందుగా టిక్కెట్లు కొనుక్కుని వెడితే 'ఇంకా ఎప్పుడు అయిపోతుందిరా నాయనా' అనిపిస్తాయి. ఆ విధంగా 'చూడలేని' సినిమాలు అవి. మరికొన్ని, నిజంగా చాలా కొన్నే. వీటిని తీసేవారికీ దమ్ముండాలి. చూసేవారికీ దమ్ముండాలి. ఎవరో చెబితే పోనీ చూద్దాం అనుకుని, ఆర్చుకుని తీర్చుకుని వెళ్లేసరికి 'ఆ బొమ్మ' ఎంచక్కా ఎగిరిపోతుంది. ఆ విధంగా ఆ సినిమాలు కూడా 'చూడలేనివి'.
నిన్న ఆ రెండో బాపతు సినిమా ఒకటి చూడడం తటస్తించింది. 'చక్రవాకం' టీవీ సీరియల్ 'ఫేం' బిందు నాయుడు  గారి భర్త డాక్టర్  బాలాజీ  మొన్న ఫోన్లో మాట్లాడుతూ మాట వరసకు చెప్పినట్టు చెప్పారు,  'పరంపర అనే సినిమా వచ్చింది చూడండి' అని. 'వీలుంటే కాదు, వీలుచేసుకుని చూడండి, ఎందుకంటె ఇటువంటి సినిమాలు ఎక్కువ రోజులు ఆడవు'  అని ఆయన  చెప్పకపోయినా విషయం నాకు అర్ధం అయింది.


ఆదివారం మధ్యాహ్నం జూబిలీ క్లబ్ లో జ్వాలా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ  లంచ్. మాటల సందర్భంలో మళ్ళీ 'పరంపర' ప్రస్తావన. అది ఎక్కడ ఆడుతుందో తెలుసుకుని ఆరుగంటల ఆటకు వెళ్ళండి అని పదో నెంబరు కౌంటర్ లో నా పేరు చెప్పండి అని లంచ్ కు వచ్చిన బుంటీ చెప్పింది. 'మంచి పుస్తకాన్ని కొని చదవాలి, మంచి సినిమా టిక్కెట్టు కొని చూడాలి' అని ఈ మధ్య ఓ తిరుగులేని స్వచ్చంద  ప్రతిన చేసుకుని పాటిస్తున్న నేను,  కాస్త ముందుగానే థియేటర్ కు వెళ్లి పలానా వారు చెప్పిన పలానా కౌంటర్ దగ్గర  పలానా వారి పేరు చెబుతుండగానే కౌంటర్లోని అమ్మడు 'ఎన్ని టిక్కెట్లు' అని అడిగింది. దాంతో బోధ పడింది చూడబోతున్న సినిమా 'రెండో రకం చూడలేని' సినిమా అని.
సినిమా సంగతి ఎలా వున్నా హాలు బాగుంది. జనం అనుకున్నట్టే పలచపలచగా వున్నారు. మొదటి రోజు 'మిధునం' సినిమాకు వెళ్ళినప్పుడు ఇదే అనుభవం. చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదులో  'శంకరాభరణం' మొదటి ఆట చూసినప్పుడు కూడా ఇదే సీను.
సినిమా మొదలయింది. డైరెక్టర్ ఫోటోగ్రఫీ రంగానికి చెందిన  వ్యక్తి  అని నెట్లో చదివాను. అందుకే కాబోలు ప్రతి ఫ్రేము చాలా అందంగా ఉండేట్టు జాగ్రత్త తీసుకున్నారు. తండ్రీ కొడుకుల కధ. చిన్న లైనుతో కధ అల్లుకోవడం వల్ల దాన్నుంచి  దారి తప్పిపోకుండా సినిమా నడిపించారు. సినిమా ఇలా తీయాలని అనుకుని తీసినట్టు వుంది కానీ ఇలా తీస్తేనే జనం చూస్తారు అనే భావనతో తీసినట్టులేదు. అంచేత సినిమాకు డాక్యుమెంటరీ ఛాయలు అద్దుకున్నాయి. రాజీపడని ఈ తత్వం ఓ సారి సినిమాకు కీడు చేయవచ్చు, కొండొకచొ మేలూ చేయవచ్చు.
సినిమాలో ప్రధాన పాత్రధారి నరేష్. ఆయన అనగానే మనకు జంధ్యాల జ్ఞాపకం వస్తారు. నవ్వులు జ్ఞాపకం వస్తాయి. అయితే, ఇలాటి సినిమాలు తీసేవారికీ, చూసేవారికే కాదు అందులో వేషం వేసేవారికి కూడా దమ్ముండాలి. నరేష్, అయన భార్యగా నటించిన అలనాటి సీనియర్ హీరోయిన్ ఆమని  కూడా తమకు ఆ దమ్ముంది అని నిరూపించారు. మొదటి నుంచి చివరి వరకు మాసిన నెరిసిన గడ్డంతో ఒక మధ్య తరగతి మానవుడిగా, నిత్య సమస్యలతో సతమతం అయ్యే గృహస్తుగా, కోరికలకు తనకుతానే సమాధి కట్టుకుని జీవితంతో సమాధానపడే వ్యక్తిగా నరేష్ ఇందులో నటించారు. ఆ మాటకు వస్తే ఇటువంటి సినిమాల్లో నటీనటులు నటించరు. అలా అలా కధలో లీనమై జీవిస్తారు.  నరేష్, ఆమని కూడా అదేపని చేసారు.
'సినిమా అనగానే కాస్త మెలో డ్రామా వుండాలి వుండి తీరాలి' అని సినీ పండితుల ఉవాచ. కానీ దర్శకుడు ఇవేవీ పట్టించుకున్నట్టు లేదు. తను అనుకున్నట్టు తాను  తీసుకుంటూ పోయాడు. 'నేనిలాగే తీస్తాను, చూస్తే  చూడండి లేకపోతే లేదు' అనే అనే గుండె ధైర్యం  సినిమా అంతటా నిండుగా  పరచుకుంది.' చాలా సీరియస్ సినిమారా బాబోయ్' అనే వాటిల్లో కూడా అక్కడక్కడా కొంత హాస్యం చిప్పరిల్లేలా జాగ్రత్తలు తీసుకోవడం కద్దు. కానీ ఈ సినిమా దర్శకుడు మహా మొండివాడు.  రాజీ పడే ధోరణి యెంత మాత్రం  ఎక్కడా కానరాలేదు. అందుకు చెప్పాలి ఆయనకు కంగ్రాట్స్.
పొతే, నాకు చాలా రోజులనుంచి గోదావరి జిల్లాల గ్రామీణ సౌందర్యం వీక్షించాలని కోరిక. నేను కొన్న టిక్కెటు ఖరీదు  అక్కడికి వెళ్లి రావడానికి అయ్యే బస్సు చార్జీకంటే తక్కువ. నేత్రపర్వంగా వున్నాయి దృశ్యాలు.  అది చాలు అనిపించింది.
సినిమా చూసిన తరువాత బాగుందా లేదా అనే చర్చ ఎలాగూ వుంటుంది. తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు.
నాకు మాత్రం ఒకటే అనిపించింది.
'ఈ సినిమా బాగుందా లేదా అనికాదు. మూసబాణీలో కొట్టుకుపోతున్న తెలుగు చలన చిత్ర రంగాన్ని ఓ మలుపు తిప్పాలంటే ఇటువంటి సినిమాలు అడపాదడపా రావాలి. అలా రావాలంటే సకృత్తుగా వచ్చే ఇటువంటి 'పరంపర' సినిమాలను టిక్కెట్టు కొని చూసి, ఇలాటివి మరికొన్ని తీయడానికి  మరి కొంతమంది ముందుకు వచ్చేలా చేయాలి.
సినిమా చూసిన ఇంకోటి కూడా  నాకనిపించింది. నేను కొన్న నూట యాభయ్ రూపాయల టిక్కెట్టులో మొత్తం సొమ్ము ఈ సినిమా తీసిన వారికే పొతే బాగుంటుందని.
అది సాధ్యం కాని  పని. అలాగే 'పరంపర' వంటి సినిమాలు తరచుగా చూడ్డం కూడా.
దర్శకుడు మధు మహంకాళి గారికి 'హాట్స్ ఆఫ్'
కానీ ఇలాటి హాట్స్ ఆఫ్ లు, అవార్డులు 'కాసు'కు సమానం కావు కదా! 

తోక టపా: ఇందులో మా రేడియో కోణం కూడా ఒకటుంది. చిత్రంలో ఒకచోట రేడియోలో వార్తలు వినబడుతుంటాయి. ఆ స్వరం ఎవ్వరిదయ్యా  అంటే,  మన ఈ ఫేస్ బుక్ ప్రపంచం మిత్రుడు, రేడియోలో ఇప్పటికీ వార్తలు చదువుతున్న పోణంగి బాలభాస్కర్ ది, వెంటనే ఫోను చేసి చెప్పాను.
  
 (17-11-2014)

16, నవంబర్ 2014, ఆదివారం

మనం ఎక్కడ వున్నాం ? లోపం ఎక్కడ వుంది ?



ఈ ప్రశ్న వేసింది ఆషామాషీ వ్యక్తి కాదు. భారత రాష్ట్రపతిగా  పనిచేసి యావత్ భారత ప్రజల అభిమాన నీరాజనాలు అందుకున్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం. 
అందరం గుర్తు పెట్టుకుని ఆచరించాల్సిన అంశాలతో ఆయన చేసిన అనుగ్రహ భాషణంఇది. తెలుగుదనం కోసం, అనువాద సౌలభ్యం కోసం చేసుకున్న చిన్న చిన్న మార్పులు మినహా ఇది పూర్తిగా ఆయన అంతరంగ ఆవిష్కరణం.
చిత్తగించండి.



మనం ఎందులో తక్కువ. ఎవరితో తక్కువ. మన బలాలు, మన విజయాలు మనమే గుర్తించ లేకపోతున్నాం.
పాల దిగుబడిలో మనమే ముందున్నాం. గోధుమ ఉత్పత్తిలో రెండో స్తానం. అలాగే వరి ధాన్యం విషయంలో కూడా మనదే ద్వితీయ స్తానం. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల విషయం తీసుకుంటే మనదేశమే మొదటి వరసలో వుంది.
ఇలా చెప్పుకోదగ్గ విజయాలు మన దేశం ఎన్నో సాధించింది. కానీ ఏం లాభం? వీటి గురించి ఒక్క ముక్క కూడా మన మీడియాలో రాదు. పేపర్ తిరగేస్తే చాలు అన్నీ చెడ్డ వార్తలే. అపజయాలు. ఉత్పాతాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. వీటికి సంబంధించిన సమాచారమే.
ఆ మధ్య టెల్ అవీవ్ వెళ్లాను. అంతకుముందు రోజే అక్కడ బాంబు పేలుళ్లు జరిగాయి. కొంతమంది ఆ దాడిలో మరణించారు. మరునాడు ఉదయం ఒక ఇజ్రాయెలీ పత్రిక తిరగేశాను. మొదటి పేజీలో ఒక ప్రధాన వార్త కనబడింది. అది బాంబు పేలుడుకు సంబంధించింది  కాదు. ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తి అయిదేళ్ళు కష్టపడి పచ్చిక మొలవని ఎడారి భూమిని సస్యశ్యామలం చేసిన వైనం గురించి రాసిన కధనం అది. అలాటి ఉత్తేజకరమైన సమాచారంతో అక్కడివాళ్లు తమ దినచర్య ప్రారంభిస్తారు.
"బాంబు పేలుడు సంఘటన గురించిన వార్త లోపలి పేజీలో వేసారు. చావులు, చంపడాలు, బాంబు దాడులు, పేలుళ్లు, ఇలాటి వార్తలన్నీ అంత ప్రముఖంగా అక్కడి పత్రికలు  ప్రచురించవన్న సంగతి అప్పుడే  అర్ధం అయింది.
మరి మన దగ్గరో. ఇందుకు పూర్తిగా భిన్నం. చావులు, జబ్బులు, నేరాలు, ఘోరాలు వీటితోనే మీడియా మనకి సుప్రభాతం పలుకుతుంది.
ఎందుకిలా జరుగుతోంది? జవాబులేని ప్రశ్న. సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
సరే. ఇదొక కోణం. మన దేశాన్ని గురించి నేను అన్నీ ప్రతికూల అంశాలే మాట్లాడుతున్నానని అనిపించినా అలాటిదే మరో విషయాన్ని ప్రస్తావించక తప్పడం లేదు.
అదేమిటంటే.  విదేశీ వస్తువుల  మీద మనకున్న మోజు. మనకు విదేశీ టీవీలు కావాలి. విదేశీ దుస్తులు కావాలి. ప్రతిదీ విదేశాల్లో తయారయిందే కావాలి. ఎందుకిలా ఆలోచిస్తున్నాము. ఎందుకిలా విదేశీ వస్తువులపై  వ్యామోహం పెంచుకుంటున్నాము. స్వావలంబన ద్వారా ఆత్మ గౌరవం పెరుగుతుందన్న వాస్తవాన్ని యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నాము.
ఆ  మధ్య హైదరాబాదులో ఒక సదస్సులో మాట్లాడుతున్నాను. ఓ పద్నాలుగేళ్ళ బాలిక నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగింది. ఇస్తూ ఆ అమ్మాయిని అడిగాను జీవితంలో నీ లక్ష్యం ఏమిటని. ఆ అమ్మాయి బదులిచ్చింది. 'అంకుల్. అన్నింటా మెరుగ్గా తయారయిన  భారత దేశంలో జీవించాలని వుంది అని.
ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి కోరిక తీర్చే బాధ్యత  మనందరిమీదా  లేదంటారా. ఆ కర్తవ్యం  మనది కాదంటారా. అలాటి అమ్మాయిల కోసం అయినా మనందరం కలసి ఈ మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
మరో విషయం. మనందరికీ  ఒక అలవాటుంది. మన ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటాము. మన చట్టాలు బూజుపట్టిన చట్టాలని గేలి చేస్తాము. మన మునిసిపాలిటీ వాళ్లు నిద్ర పోతున్నారు, వీధుల్లో పోగుపడుతున్న చెత్త గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శిస్తాము. ఫోన్లు పనిచేయవంటాము. రైల్వే వాళ్ళు మొద్దు నిద్దర పోతున్నారని హేళన చేస్తాము. ఇక మన విమాన సంస్తలంత దరిద్రంగా పనిచేసేవి మొత్తం ప్రపంచంలో ఎక్కడా  లేవంటాము. ఉత్తరాల బట్వాడాను తాబేలు నడకతో పోలుస్తాము.
ఇలా అంటూనే వుంటుంటాము. అలా అంటూ వుండడం మన  జన్మ హక్కు అనుకుంటాము.
వాక్స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చిన హక్కు సరే.  కానీ మనమేం చేస్తున్నాము? ఈ ప్రశ్న ఎప్పుడయినా వేసుకున్నామా? 
మన దేశం నుంచి సింగపూరు వెళ్ళే వాళ్ళను గమనించండి. పోనీ మనమే అక్కడికి వెళ్ళామనుకోండి. ఆహా యెంత గొప్ప ఎయిర్ పోర్ట్! యెంత అద్భుతంగా వుందని మెచ్చుకుంటాము. అక్కడి రోడ్లని చూసి మురిసి ముక్కచెక్కలవుతాము. పొరబాటున కూడా సిగరెట్ పీకను నిర్లక్ష్యంగా బయటకు విసిరేయలేము. అలా చేస్తే జరిమానా కట్టాలని తెలుసు కనుక.  సాయంత్రం అయిదు గంటలనుంచి రాత్రి ఎనిమిది నడుమ అక్కడి ఆర్చర్డ్ రోడ్డు మీద కారులో వెళ్ళడానికి అయిదు డాలర్లు చెల్లించాల్సివస్తే కిక్కురుమనకుండా కడతాము. ఏ షాపింగ్ మాలుకో, రెస్టారెంటుకో వెళ్లి అక్కడ కారు పార్కు చేసినప్పుడు కిమ్మనకుండా పార్కింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ సమయంలో మన హోదా, స్తాయి గురించి అక్కడివారితో వాదన పెట్టుకోము. మన దేశంలో సాధారణంగా చేసే పనులు అక్కడ చేయం. రంజాన్ సమయంలో కూడా అక్కడ ఎవ్వరూ బహిరంగ ప్రదేశాల్లో తినడానికి సాహసించరు.
లండన్ లో టెలిఫోన్ ఉద్యోగి వద్దకు వెళ్లి, నేను మా వాళ్ళతో ఎస్టీడీ మాట్లాడుతాను. ఈ పది పౌండ్లు వుంచుకుని  నాకు బిల్లు పడకుండా చూడండిఅని అడిగే ధైర్యం చేయం.
వాషింగ్టన్ వెళ్ళినప్పుడు గంటకు యాభయ్ అయిదు  మైళ్లకు మించి కారు డ్రైవ్ చేయం. అధవా చేసి, ట్రాఫిక్ పోలీసు పట్టుకుంటే, ‘నేనెవరో తెలిసే నా కారు ఆపుతున్నావా!అంటూ హుంకరించం. లేదా నేను పలానావారి తాలూకు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోఅని ఆమ్యామ్యా పైసలు  చేతిలో పెట్టే తెగింపు చేయం.
అలాగే, ఆస్త్రేలియాలోనో, న్యూ జిలాండ్ లోనో సముద్రపు వొడ్డున తిరుగాడుతూ, తాగేసిన కొబ్బరి బొండాను అక్కడే పారేసే తెగువ చేయలేం.  వెతుక్కుంటూ వెళ్లి గార్బేజి  బిన్ లో వేసికాని రాము.
టోకియోలో  పాన్ నములుతూ అక్కడే వీధిలో ఉమ్మేయగలమా ? బోస్టన్ కు వెళ్ళినప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో ఎంక్వయిరీ చేయగలమా? విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి నియమాలను తుచ తప్పకుండా పాటించ గలిగిన మనం అవే ఇక్కడ యెందుకు చేయలేకపోతున్నాం. ముక్కూ మొహం తెలియని పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి పద్ధతులను అంత చక్కగా పాటించే మనం అదే మన దేశంలో యెందుకు చేయలేకపోతున్నాం. అమెరికా వెళ్లి వచ్చిన వాళ్ళను అడగండి. అక్కడ కుక్కల్ని పెంచుకునే ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో అది కాలకృత్యాలను తీర్చుకున్నప్పుడు వారే స్వయంగా ఆ మలినాన్ని శుభ్రం చేస్తారు. జపాన్ లో కూడా అంతే!  కానీ మన దగ్గర అలాటి సన్నివేశం ఎప్పుడయినా చూశారా?
ఎందుకంటే, మనం వోటు వేసి ఏదో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ తరువాత అన్నీ దానికే వొదిలేసి మన బాధ్యతలనుంచి తప్పుకుంటాం. అన్నీ ప్రభుత్వమే చూసుకోవాలని అనుకుంటాం. అందరి కష్టసుఖాలను అదే  కనిపెట్టి చూడాలని కోరుకుంటాం.
వీధుల్లో చెత్త పోగుపడితే దాన్ని  తొలగించాల్సిన బాధ్యత మునిసిపాలిటీదే అని తీర్మానిస్తాము. పైపెచ్చు చెత్తను ఎక్కడబడితే అక్కడ వెదజల్లడం మన హక్కుగా భావిస్తాం. రైళ్లల్లో టాయిలెట్లు శుభ్రంగా వుంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే అన్నది మన సిద్దాంతం. అవి శుభ్రంగా వుంచడంలో మన పాత్ర కూడా వుందన్న సంగతి  మరచిపోతాం. ఈ విషయంలో రైల్వే  సిబ్బందికి కూడా  మినహాయింపు ఇవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకులకు సరయిన సేవలు అందడం లేదంటే అందులో వారి పాత్ర కూడా వుంటుంది.
ఇక వరకట్నాలు,ఆడపిల్లలు వీటికి  సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వస్తే మనం చేసే వాదనలని   ఆపగలవారు, అడ్డగలవారు  వుండరు. ఇలాటి సాంఘిక సమస్యలపై గొంతుచించుకు వాదించడం వెన్నతోబెట్టిన విద్య. పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయిఅన్న సూత్రం ఇక్కడ బాగా వర్తిస్తుంది. దేశం మొత్తమే అలా తగలడుతున్నప్పుడు ఒక్కడ్ని ఒంటరిగా ఏం చేయగలను  చెప్పండి. మా అబ్బాయికి కట్నం తీసుకోకుండా వున్నంత మాత్రాన సమాజాన్ని పీడిస్తున్న ఈ జాడ్యం విరుగుడు అవుతుందన్న ఆశ నాకు లేదు మాస్టారూఅంటూ   అని ధర్మపన్నాలు వల్లిస్తాం.
మరెలా ఈ వ్యవస్థకు పట్టిన అవస్థలను తొలగించడం? దానికీ మన దగ్గర సమాధానం వుంది. మొత్తం వ్యవస్థను, సమాజాన్ని  క్షాలనం చేసేయాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. బాగు బాగు. చక్కటి సాకు దొరికింది. వ్యవస్థ అంటే ఏమిటి? సమాజం అంటే ఎవరు? పక్కింటివాళ్ళు, ఎదురింటివాళ్ళు, మన  కాలనీవాళ్లు, వూళ్ళో వున్న పౌరులు, లేదా  మునిసిపాలిటీ, ప్రభుత్వం, ప్రభుత్వ అధికార్లు. అంతే. మనం  కాదు. ఈ వ్యవస్తలో  మనం మాత్రం  వుండం. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. పోనీ ఎప్పుడో వీలు చిక్కి అవకాశం వచ్చినా కన్నంలో దూరిన ఎలుకలా ఏమి పట్టనట్టు వుండిపోతాం. ఎవరో రాకపోతారా ఈ వ్యవస్థను బాగుచేయక పోతారాఅని ఎదురు చూపులు చూస్తుంటాం. లేదా ఏ అమెరికాకో వెళ్ళిపోయి వాళ్ల వ్యవస్థ యెంత గొప్పగా పనిచేస్తోందో చెప్పుకుంటూ అందులోనే ఆనందాన్ని అనుభవిస్తూ వుంటాం. ఒకవేళ న్యూ యార్క్ లో పరిస్థితులు బాగాలేకపోతే, విమానం ఎక్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోతాం. అక్కడా అదే పరిస్తితి ఎదురవుతే గల్ఫ్ వెళ్ళే ఫ్లయిట్ పట్టుకుంటాం. అక్కడ ఖర్మకాలి యుద్ధం వస్తే భారత ప్రభుత్వం కలగచేసుకుని క్షేమంగా స్వదేశానికి చేర్చాలని డిమాండ్ చేస్తాం. అదీ మన పరిస్తితి. అదీ మన మనస్తత్వం. అంతే కాని,  వ్యవస్థను బాగుచేయడంలో మన వంతు పాత్ర ఏమిటని ఎవరం, ఎప్పుడూ ఆలోచించం. బాధ్యతలకు భయపడితే, అంతరాత్మలను డబ్బుకు తాకట్టు పెడితే ఇదే పరిస్తితి.
ఒకనాటి అమెరికా అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెనడీ తన దేశస్తులకు ఇచ్చిన సందేశాన్నే మనకు వర్తించేలా మరోరకంగా చెప్పుకుందాం.

భారత దేశం మనకు ఏమిచ్చిందని అడగొద్దు. దేశానికి మనం ఏం చేయగలమో చెబుదాం. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు  ఈనాడు యెలా వున్నాయో అలా భారత దేశాన్ని తయారుచేయడానికి మనం ఏం చేయగలమో దాన్నిచేద్దాం.  (14-08-2012)

15, నవంబర్ 2014, శనివారం

కడుపుకోత



(నవంబర్ పదహారు జాతీయ పత్రికా దినోత్సవం)
పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా,  ఆ రంగానికి ఒకప్పుడు చెందిన మనిషిగా ఒక్కోసారి  కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది 'పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం' అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. చదవం, చూడం అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు. అదో వైచిత్రి.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు చందా కట్టి ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. అవి ఏం రాస్తున్నాయి అనే దానికంటే వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రికల  నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని  పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు. నిజమే! మునుపటి రోజుల్లో మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి వున్న మాట వాస్తవమే. అయితే, మనుగడకోసం  ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి ఇతరేతర రంగాల్లో వుండే అవలక్షణాలన్నీ  కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెలుగునాట దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు కత్తులతో నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం. 'ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది' అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. 'అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు' అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకూ  ఎదురవుతాయి.

ఎందుకంటే  అన్నం తింటున్నది గొంగట్లో కనుక.

(NOTE: Courtesy Image Owner) 

చరిత్రలో నెహ్రూ స్థానం

(Published by 'SURYA' telugu daily in its Edit page on 16-11-2014, SUNDAY)
నూటపాతికేళ్ళ క్రితం జన్మించి యాభయ్ ఏళ్ళ కిందట మరణించిన జవహర్ లాల్ నెహ్రూ గురించి  ఈనాడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటే ఆయనలో ఎన్నో గొప్ప లక్షణాలు వుండి తీరాలి. గొప్ప చరిత్రకారుడు అయినప్పుడే ఇది సాధ్యం. అయితే ఇందులో విడ్డూరంగా కానవచ్చే ఒక విషయం ఏమిటంటే, నెహ్రూను ప్రత్యర్ధి కాంగ్రెస్ ఆస్తిగా పరిగణించి ఆయన్ని చరిత్రపుటల్లో నుంచి సమూలంగా తొలగించాలని పావులు కదుపుతున్న మోడీ సర్కారు కూడా ఇన్నేళ్ళ తరువాత జనం నెహ్రూను సంస్మరించుకోవడంలో పరోక్షంగా సహకరించడం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏళ్ళతరబడి ప్రధానమంత్రిగా పనిచేసి తన అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఒక సముచిత స్థానం కల్పించడంలో నెహ్రూ చేసిన కృషి జాతి స్మృతి పేటికలో ఈనాటికీ పదిలంగా వుంది. నెహ్రూ పొరబాట్లు చేసివుండవచ్చు కానీ తప్పులు చేయలేదు అని విశ్వసించే జనానికి ఈనాటికీ  కొదవలేదు.  ఆయన నూటపాతిక జయంతిని ప్రభుత్వమే స్వయంగా పూనుకుని నిర్వహించి వుంటే మోడీ సర్కారుకు మరింత వన్నె వచ్చి వుండేది అని వారు నమ్ముతున్నారు. నెహ్రూ మా పార్టీ ఆస్తి అని కాంగ్రెస్ నమ్ముతున్నట్టే మోడీ ప్రభుత్వం కూడా ఆయన్ని కాంగ్రెస్ మూల పురుషుడిగానే భావిస్తూ ఆయన స్మృతిని పరిహరించడం ద్వారా కాంగ్రెస్ మూలాలను పెళ్లగించవచ్చుననే ఉద్దేశ్యంతోనే, ఏటా నవంబర్ పదునాలుగో తేదీన సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్న చాచా నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా అధికారికంగా జరిపే పద్దతికి స్వస్తిచెప్పినట్టు భావిస్తున్నారు. ఈ అభిప్రాయానికి బలం చేకూర్చే విధంగానే  మోడీ సర్కారు అడుగులు పడుతున్నాయి. గతంలో వాజ్ పాయ్ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన రోజుల్లో కూడా పండిత నెహ్రూ జయంతిని  యధారీతిగా సర్కారే నిర్వహించిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. అలాగే,  కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో మహా నాయకుడు, నెహ్రూ సమకాలికుడు, అన్నింటికీ మించి మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ కు చెందిన ఉక్కుమనిషి -  సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తిరిగి  తెర మీదకు తీసుకువస్తున్న తీరే ఇందుకు నిదర్శనం.
కాంగ్రెస్ కూడా ఈ విషయంలో తక్కువ తినలేదు. నెహ్రూను తమ సొంత ఆస్తిగా పరిగణించే విధానం ఇంకా ఆ పార్టీలో కొనసాగుతోంది. నెహ్రూ నూటపాతిక జయంతిని పురస్కరించుకుని  ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సుకు దేశదేశాల వారిని ఆహ్వానించిన ఆ పార్టీ,  సొంత దేశపు ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోడీని పిలవకపోవడం దీనికి దృష్టాంతం. ఏతావాతా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల నడుమ ఇప్పటికే వున్న అనేక విభేదాంశాల జాబితాలోకి నెహ్రూ పేరు కూడా చేరింది.
నెహ్రూ ప్రధానిగా పాలించిన తొలి ఏళ్ళలో, కాంగ్రెస్ పార్టీకే చెందిన అనేకమంది నాయకుల ప్రాధాన్యతను ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో ఒక పధకం ప్రకారం తగ్గిస్తూ వచ్చారనీ, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే క్రమంలో ఇది జరుగుతూ వచ్చిందనీ నమ్మేవారు ఆ పార్టీలోనే అప్పుడూ వున్నారు, ఇప్పుడూ వున్నారు.  స్వతంత్ర భారతావనికి ప్రధమ ప్రధానమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు నెహ్రూను మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉన్నప్పటికీ జవహర్ మీద గాంధీ పెంచుకున్న అవ్యాజానురాగం, పటేల్ అవకాశాలకు గండి కొట్టిందని వారి నమ్మకం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, నెహ్రూ నేతృత్వంలో పనిచేయడానికి సర్దార్ పటేల్ ఎన్నడూ విముఖత చూపలేదు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసువాది అయిన సర్దార్  పటేల్, ఉప ప్రధానిగా, హోమ్  మంత్రిగా తన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించారు. ఆనాటికి  ఇంకా సజీవంగా వున్న ప్రజాస్వామిక లక్షణాల దృష్ట్యా కేంద్ర మంత్రివర్గ సమావేశాల్లో లేదా ఇతర సందర్భాల్లో నెహ్రూ, పటేల్ ల నడుమ సాగిన వాదోపవాదాలు ఇరువురి మధ్యా సఖ్యత తక్కువ అనే సంకేతాలను ఇచ్చివుండవచ్చు. కానీ, ప్రజాస్వామిక  విధానాల్లో నెహ్రూకు వున్న విశ్వాసం యెంత బలవత్తరమైనదో తెలియచెప్పే సంఘటనలు కూడా అనేకం వున్నాయి. పటేల్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తన అభీస్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ వాటిని నెహ్రూ ఆమోదించిన తీరే ఇందుకు ఉదాహరణ.
జవహర్ లాల్ నెహ్రూ దగ్గర కార్యదర్శిగా పనిచేసిన  సీనియర్ ఐ.సీ.ఎస్. అధికారి శ్రీ కె.పీ.ఎస్. మీనన్ ఏదో సందర్భంలో చెప్పిన ఒక ఉదంతం ఇది.


భారత దేశానికి  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  అనేక సంస్థానాలను  ఇండియన్ యూనియన్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నిజాం నవాబు ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎలాటి చర్య తీసుకోవాలనే విషయంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్న ఆ సమావేశం గంటల తరబడి కొనసాగింది. అర్ధరాత్రి కావొస్తోంది. సర్దార్ పటేల్ మగత నిద్రలోకి జారిపోయినట్టు కళ్ళు మూసుకుని వున్నారు. భారత సైన్యాలను  హైదరాబాదు పంపే విషయంలో  సుదీర్ఘంగా చర్చ సాగుతోంది. కళ్ళు మూసుకుని అంతా వింటున్న సర్దార్ పటేల్ లేచి ఒక్కసారిగా  ఇలా అన్నారట.
ఇండియన్  ఆర్మీ  ఇప్పటికే హైదరాబాదు చేరిపోయింది. మేజర్ జనరల్ చౌదరి అక్కడే వున్నాడు.
పటేల్ మాటలు విని అక్కడివారంతా మ్రాన్పడిపోయారు.  ప్రధాని నెహ్రూ పరిస్తితి కూడా అదే. అలా ఉండేదిట సర్దార్ పటేల్ వ్యవహార శైలి.

నెహ్రూ ప్రజాస్వామ్య వాది అనేందుకు చరిత్రలో మరికొన్ని ఉదాహరణలు వున్నాయి.  స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జవహర్ మాటకు ఎదురుండేది కాదు. జవహర్ లాల్ నెహ్రూ పట్ల పార్టీలో వ్యక్తి ఆరాధన శృతి మించుతోందనీ, దానిని అరికట్టకపోతే ఆయనలోని అహంభావం మరింత పెరిగి ఒక సీజర్ మాదిరిగా తయారవుతాడనీ, ఇది పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదనీ కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో వ్యాసాలు వెలువడుతుండేవి. వాటిని 'చాణక్య' అనే కలం పేరుతొ రాస్తున్నది స్వయంగా జవహర్ లాల్ నెహ్రూ అన్న నిజం చాలా ఏళ్ళవరకు ఎవ్వరికీ తెలియదు. నెహ్రూను తీవ్రంగా వ్యతిరేకించేవారెవ్వరో ఆ పేరుతో ఆ వ్యాసాలు  రాస్తున్నారని అనుకునేవారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత ప్రపంచవ్యాప్తంగా  నూతన ఆర్దిక విధానాలు అమలుకావడం మొదలైన దరిమిలా, అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోవడం చూసాం. ధరల పెరుగుదల వంటి  రుగ్మతలు మినహా ఆర్ధిక సంస్కరణలవల్ల ఆదిలో తలెత్తిన అనేక ఆటుపోట్లను మన దేశ ఆర్ధిక వ్యవస్థ తట్టుకోగలగడానికి ప్రధాన కారణం - ప్రభుత్వ రంగ వ్యవస్థలకు శ్రీకారం చుడుతూ, మరో పక్క ప్రైవేటు రంగానికి పరిమిత ఊతం ఇస్తూ నెహ్రూ అలనాడు అనుసరించిన మిశ్రమ ఆర్ధిక విధానం. ఈ వాస్తవాన్ని ఈనాటి ఆర్ధిక నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు.
కాశ్మీర్ సమస్య, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలలో నెహ్రూ తనకుతానుగా తీసుకున్న నిర్ణయాలు దేశ శ్రేయస్సుకు విఘాతంగా పరిణమిస్తాయని నెహ్రూ రోజుల్లో కూడా బహిరంగ విమర్శలు చెలరేగాయి. అయితే జాతి జనులలో నెహ్రూకు వున్న అపార ఆకర్షణ ముందు ఈ విమర్శలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నెహ్రూ మరణించిన వెంటనే ఆసేతుహిమాచలం స్పందించిన తీరు నెహ్రూకు ప్రజల్లో వున్న ఆదరణకు అద్దం పడుతుంది.
నెహ్రూ  అనంతరం ఆయన వారసురాలయిన శ్రీమతి ఇందిర అనుసరించిన కొన్ని విధానాలు కాంగ్రెస్ పార్టీ పట్ల  ప్రజల్లో విరక్తిని  కలిగించిన మాట కూడా నిజం. అయితే అదేసమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దోహదం చేసిన యుద్ధంలో  పాకిస్తాన్ పై,  పై చేయి సాధించిన నాయకురాలిగా శ్రీమతి ఇందిరా గాంధి,  చరిత్రలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న విషయం కూడా వాస్తవం. రాజకీయ ప్రత్యర్దులనే కాకుండా సొంత పార్టీలో ప్రత్యర్దులను సయితం ఆవిడ విడిచిపెట్టలేదు. సర్వం సహా నాయకురాలిగా రూపొందాలనే కాంక్ష చివరికి శ్రీమతి ఇందిరాగాంధీ జీవితాన్నే బలితీసుకుంది. విచిత్రం ఏమిటంటే శ్రీమతి ఇందిరను, ఆమె విధానాలను తూర్పారబట్టిన వారు కూడా అధికార అందలం ఎక్కిన తరువాత దాన్ని నిలుపుకునే క్రమంలో వాటినే అనుసరించడం.
ప్రత్యర్ధి పార్టీలను సమూలంగా నిర్మూలించాలనే ఆలోచనలు ఇప్పుడు మరింత వూపందుకున్నట్టుగా కానవస్తోంది. నిజంగా ఇది విచారకరం. ప్రజాస్వామ్య ప్రియులను ప్రధానంగా కలవరపరుస్తున్న  అంశం ఇదే.
రాజకీయ నేతలు రాజకీయులుగా మిగిలిపోకూడదు. రాజనీతిజ్ఞులుగా పరిణతి చెందే ప్రయత్నం చేయాలి. చరిత్ర సృష్టించే ప్రయత్నం చేయాలి కానీ, ఎవరినో చరిత్ర గర్భంలో కలిపే యోచనలు మంచి చేయవు. చరిత్రను  తిరగరాయాలని గతంలో ఎందరో పూనుకున్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలో తలపెట్టిన  'టైం కాప్స్యూల్' వ్యవహారం ఇంకా కొందరికి గుర్తుండేవుంటుంది. కాబట్టి గమనంలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, చరిత్రకారులను ఎవ్వరూ తయారు చేయలేరు. చారిత్రిక పురుషులకు  చరిత్ర తనకుతానుగా తనలో స్థానం కల్పిస్తుంది. అలాగే, చరిత్ర హీనులను పనికట్టుకుని చరిత్ర నుంచి తొలగించాల్సిన అక్కర కూడా లేదు. అలాటివారు ఎవరికివారే చరిత్ర పేజీలనుంచి కనుమరుగయి పోతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. (15 - 11 - 2014)

NOTE: Courtesy Image Owner 

14, నవంబర్ 2014, శుక్రవారం

సారీ! గుర్తు పట్టలేకపోయాను!


అరవయ్యవ పడిలో పడ్డ సూర్యాకాంతానికి గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్ బల్ల మీద పడుకోబెట్టగానే ఇక తనకు చావు తధ్యం అనుకుంది. ఆ సమయంలో ఆమెకు  దేవుడు కనబడ్డాడు. 'నాకిక భూమ్మీద  నూకలు చెల్లినట్టేనా సామీ' అని అడిగింది.
'నీకేమయింది, నిక్షేపంలా  ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అంటూ దేవుడు మాయమై పోయాడు.
ఆయనన్నట్టే ఆమెకు నూకలు మిగిలే వున్నాయి. బతికిబట్టకట్టింది. ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇంటికి పంపేముందు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండమన్నారు.
మరో నలభయ్ ఏళ్ళు  బతుకుతావని దేవుడు చెప్పిన విషయం బాగా గుర్తుండి పోయింది. అంత ఆయుస్సు పెట్టుకుని ఈ ముసలి అవతారం ఎందుకనిపించిందో ఏమో, చీరె కట్టు నుంచి  పంజాబీ సూట్ లోకి  దూరిపోయింది. జుట్టుకు నల్ల రంగు వేయించింది. మొహంలో ముడతలు కనబడకుండా  ట్రీట్ మెంట్ తీసుకుంది. ఆసుపత్రిలో అందరూ నోళ్ళు వెళ్ళబట్టి చూస్తుండగానే  అరవై నుంచి ఇరవై వయసు పిల్ల మాదిరిగా మారిపోయింది. ఆసుపత్రి నుంచి డిస్  చార్జ్ అయి ఇంటికి వస్తుంటే వేగంగా వస్తున్న కారు డీకొట్టి అక్కడికక్కడే కన్ను మూసింది. కళ్ళు తెరిచి చూస్తే, 'ఇంకా నలభయ్ ఏళ్ళు బతుకుతావు' అన్న భగవంతుడు తన కళ్ళల్లోకి చూస్తూ కనిపించాడు. 'ఇదేమిటయ్యా ఇలా చేసావు. బోలెడు ఆయుస్సు వుందని గొప్పలు చెప్పావు. ఆ మాత్రం కారు కింద పడకుండా తప్పించలేకపోయావా' అని గదమాయించింది.
దేవుడు మందహాసం చేస్తూ చెప్పాడు. 'ఆ కారుకింద పడింది నువ్వా! నేనసలు గుర్తే పట్టలేకపోయాను సుమా!'  
      

(శ్రీ కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

13, నవంబర్ 2014, గురువారం

మా బావగారు చెప్పిన నెహ్రూ గారి కధ

  
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు గారు. ఖమ్మం జిల్లా రెబ్బవరం కాపురస్తులు. కొద్దికాలం అస్వస్థులుగా వుండి కన్ను మూశారు. గతించి కూడా చాలా కాలం అయ్యింది. స్వాతంత్రోద్యమ కాలంలో పద్నాలుగు మాసాలకు పైగా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారు కూడా ఆయనతో పాటే జైల్లో వున్నారు. ఈ ఇద్దరు గర్భంతో వున్న భార్యలను పుట్టింట్లో (అంటే మా ఊరు కంభంపాడులో మా అమ్మానాన్నల వద్ద వొదిలి) దేశం కోసం జైలుపాలయ్యారు. సరే! అది అలా వుంచితే -
ఓరోజు బంధువుల ఇంట్లో జరిగిన  కార్యక్రమంలో మా మేనల్లుడు అంటే రామచంద్ర రావుగారి కుమారుడు కొలిపాక రాంబాబు  ఓ వృత్తాంతం చెప్పాడు. మా బావగారు సుస్తీ చేసి ఆసుపత్రిలో వున్నప్పుడు ఆయన్ని అడిగాడట. 'నాన్నా! మీలాటివాళ్ళు లక్షల మంది నానా కష్టాలు పడితే ఈ స్వాతంత్రం వచ్చింది. మీరు నిజంగా కోరుకున్నది ఇలాటి దేశాన్నేనా'
ఆయన ఇలా జవాబు చెప్పారట.
'స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో  నెహ్రూ గారు ఆంధ్రాలో ఓ మీటింగులో మాట్లాడడానికి వచ్చారు. ఖమ్మం నుంచి నలభై యాభయ్ మందిమి  బయలుదేరి రైల్వే స్టేషన్ కు వెళ్లాము. టిక్కెట్లు కొనడానికి వెడితే అక్కడి స్టేషన్ మాస్టారు అన్నారట 'నెహ్రూ గారి మీటింగుకు టిక్కెట్లు ఎందుకండీ' అని. బహుశా ఆరోజు గట్టిగా 'కాదుకూడదు' అని గట్టిగా వాదించి వుంటే దేశం ఈనాడు ఈ స్తితిలో వుండేది కాదేమో!  ఫ్రీ ఇండియా అంటే  జనాలకు  అన్నీ ఫ్రీ అనే భావన ప్రబలేది కాదు. ఇది మనదేశం, దీని లాభనష్టాలన్నీ  మనవే అన్న అభిప్రాయం బలపడకుండా పోయింది. మేము కోరుకున్న దేశం ఇదా అంటే ఇది కాదని చెప్పగలను కానీ కోరుకున్న ఆ దేశం యెలా వస్తుందో, ఎప్పుడూ వస్తుందో  మాత్రం చెప్పలేను. బహుశా నేనయితే చూస్తానన్న ఆశలేదు'



(ఫోటోలో మా బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్రరావు)

నెహ్రూ - ఓ జ్ఞాపకం



నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు.
ఎవరీ నారాయణ దొర గారు ? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?
అప్పట్లో కలం కూలీ జీ. కృష్ణ గారు ఢిల్లీ లో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి నివాసానికి ఈ నారాయణ దొరగారు వచ్చారు. సాలూరు ప్రాంతీయుడయిన కునిసెట్టి వెంకట నారాయణ దొర పాత కాలపు కాంగ్రెసువాది.
అప్పటి సంగతులను గురించి శ్రీ జీ. కృష్ణ తమ ‘విలేఖరి లోకం’లో ఇలా గుర్తు చేసుకున్నారు.
“దొరకు ఇంగ్లీష్ రాదు. హిందీ కూడా రాదు. వచ్చీ రాగానే జవహర్ లాల్ నెహ్రు గారితో మాట్లాడాలన్నాడు. వెంటనే వచ్చి కలవవచ్చని ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది. పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు.
“దొరగారు ఖద్దరు దుస్తులు ధరించి వెళ్లారు. వెంటనే దర్శనం లభించింది. దొరగారు గదిలోకి వెళ్ళగానే గులాబీ పువ్వు నెహ్రూ షేర్వాణీకి తగిలించడానికి ముందుకు కదిలాడు. నెహ్రూ గారు అమాంతం అతడిని పట్టి ఎత్తి సోఫా మీద పడేశాడు. అప్పటినుంచి కాసేపటిదాకా ఇద్దరూ నవ్వులే నవ్వులు. దీనికి కొంత  నేపధ్యం  వుంది.
1936 లో ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రాలో ప్రచారానికి వచ్చిన నెహ్రూకు అంగరక్షకుడిగా అప్పటి ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శి బులుసు సాంబమూర్తి గారు వెంకట నారాయణ దొరను నియమించారు. నెహ్రూకు తెలుగు రాదు.. దొరకు హిందీ రాదు. అయినా సైగలతో గడిపేశారు. బొబ్బిలిలో నెహ్రూ పై  జస్టిస్ పార్టీవాళ్లు రాళ్లవర్షం కురిపించారు. అంతే! దొర అమాంతం నెహ్రూను  ఎత్తుకుని ఫర్లాంగు దూరం తీసుకువెళ్లాడు. జవహర్ లాల్ యెంత గింజుకున్నా దొర వొదలలేదు.
మళ్ళీ 1953 లో ఢిల్లీలో తనను చూడవచ్చిన దొరను కూడా నెహ్రూ అమాంతం ఎత్తి సోఫాలో కుదేసి పాత స్మృతులను నెమరువేసుకున్నారని కృష్ణ గారు రాశారు.
(చిత్రంలో శ్రీ జి.కృష్ణ గారు)