29, మార్చి 2014, శనివారం

పాలకులు తీర్చలేని చిరు కోరిక


'ప్రజల మేనిఫెస్టో పేరుతొ ప్రోగ్రాం చేస్తున్నాం మీ అభిప్రాయం చెప్పండ'ని ఇప్పుడే ఒక ఛానల్ వాళ్లు ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్లారు.
అందులో చెప్పిన సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే.....

"సాధారణ జన జీవితంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గించాలని. అది చేస్తే మా నెత్తిన పాలుపోసినట్టేనని"  

వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమి?

వార్త - వ్యాఖ్య
News item in Deccan Chronicle today: " A total of 88 MLAs have defected to various political parties. The candidates are the same, the constituencies are the same but the parties have changed"

కొత్త జెండాలతో, కొత్త ఎజెండాలతో, కొత్త కండువాలతో వోట్లకోసం ఇళ్లకు వచ్చే అభ్యర్ధులకు  పాత కండువాలతో వున్న వాళ్ల పాత ఫోటోలను చూపిస్తే కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. ఏ స్వచ్చంద సంస్థ అయినా ఈ పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కాని వాటికి కూడా ఈ మధ్య సొంత ఎజెండాలు ఏర్పడుతున్నాయి. 

ఓటర్ల మేనిఫెస్టో



‘రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ తుచ తప్పకుండా అమలు చేసిన పక్షంలో జనం స్వర్గానికి వెళ్లాలనే కోరికను సైతం  చంపుకుంటారు.’ – విల్ రోగర్స్


ఎన్నికలకు ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక మేనిఫెస్టో ను విడుదల చేస్తుంది. ప్రజలు తమ పవిత్రమయిన వోటు వేసి తమను మాత్రమే ఎందుకు గెలిపించాలో, తమను గెలిపిస్తే  ఆ పవిత్రమయిన వోటు వేసినందుకు (గెలిస్తేనే సుమా) బదులుగా వోటర్ల రుణం తీర్చుకునేందుకు తమ పార్టీ ఏమేమి చేయబోతున్నదో అనే అనేకానేక  ఉచిత వరాలతో కూడిన ఎన్నో  వివరాలు ఈ మేనిఫెస్టోలో వుంటాయి. దీన్ని తయారు చేయడం కోసం ప్రతి పార్టీ ఎంతో పెద్ద కసరత్తు చేస్తుంది. ఇందునిమిత్తం  పార్టీ ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ పలు మార్లు సమావేశాలు జరిపి – ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలను గురించి లోతుగా అధ్యయనం చేసి వాటిని సవివరంగా చర్చిస్తుంది. అర చేతిలో వైకుంఠం చూపించే తరహాలో రూపొందించే ఈ మేనిఫెస్టో తయారీకి పెద్ద పెద్ద పార్టీల నుంచి చిన్నా చితకా పార్టీల వరకు ఎంతో శ్రద్ధ తీసుకుంటాయి. ఇక మేనిఫెస్టో విడుదల అనేది మరో పెద్ద తంతు. వోటర్ల మనసులకు గాలం వేసి పట్టే విధంగా ఆ యా పార్టీలకు చెందిన మేధావులు అంతా కలసి మేధో మధనం చేసి అందించిన సలహాలనన్నింటినీ అంతకంటే అందంగా అక్షరాలలోకి మార్చి కూర్చే ఈ మేనిఫెస్టో విడుదలకు మెగా సినిమా రిలీజ్ మాదిరిగా ఎంతో హడావిడి చేస్తారు. దీనికి ప్రచారం కల్పించడానికి పార్టీలు పడే యాతన ఇంతా అంతా కాదు. కాలక్రమేణా ఇది ఎన్నికలకు  ముందు ఓ తప్పనిసరి తతంగంగా  తయారయింది. కాకపొతే,  ఎన్నికల తరువాత మాత్రం  మళ్ళీ దీని ఊసెత్తితే ఒట్టు.
 ‘మీరిలా వోటు వేసి గెలించండి. మేమలా చెప్పినవన్నీ చేసి చూపిస్తాం’ అనే రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మాదిరిగానే, ‘ మీరిలా చేస్తామని మాట ఇవ్వండి. అప్పుడు మా వోటు అచ్చంగా మీకే’ అంటూ ఓటర్లే తమ మేనిఫెస్టోలతో ముందుకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జయ ప్రకాష్ నారాయణ గారు తమ లోక్ సత్తాను రాజకీయ పార్టీగా రూపు మార్చకుండా వుండి వుంటే బహుశా ఈ ప్రయోగం ఆయనే చేసివుండేవారేమో.  ఇలా ఈ దిశగా సాగిన ఆలోచనలనుంచి పుట్టుకొచ్చినదే ఇదిగో ఈ ‘ఓటర్ల మేనిఫెస్టో’.
      
1.  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చే ఎలాటి హామీ అయినా సరే, అధికారంలోకి రాగానే తాము దాన్ని యెలా అమలు చేయబోతున్నామో అన్న  విషయాన్ని స్పష్టంగా, ఏవిధమయిన అసంగ్దిగ్ధతలకు తావివ్వకుండా, శష భిషలకు పోకుండా  ఎన్నికల ప్రణాళికలో పేర్కొని తీరాలి. ఆకాశంలో చందమామను తెచ్చి చేతిలో పెడతామంటే సరిపోదు, అది యెలా సాధ్యమో కూడా  వోటర్లకు తెలియచెప్పాలి. యేరు దాటినదాకా పడవ మల్లయ్య, దాటిన  తరువాత బోడి మల్లయ్య సామెత మాదిరిగా కాకుండా గెలిచివచ్చిన తరువాత ఒక నిర్దిష్ట కాలంలో వాగ్దానాలు అమలుచేయలేని పక్షంలో అధికారం నుంచి తక్షణం తప్పుకుంటామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేయాలి. అంతేకాదు, ఉచిత వాగ్దానాల అమలుకు అయ్యే మొదటి ఏడాది వ్యయాన్ని తమ పార్టీ నిధులనుంచే ఖర్చు చేయాలి. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల వోట్లకు గాలం వేసే ప్రస్తుత విధానాలకు స్వస్తి చెప్పాలి.  (మీడియాకు మనవి: ఉచితానుచితాలు ఎరగకుండా ఆయా రాజకీయ పార్టీలు జనంపై వొదులుతున్న ‘ఉచిత’ హామీలను యెలా అమలు చేస్తారని మీడియా ప్రశ్నించి సమాధానాలు వారి నుంచి రాబట్టి ప్రజలకు తెలియచెప్పాలి.)
2. భారీ ఎత్తున ఎన్నికల ప్రచార సభలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించే పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. సాధారణ జనం ఇబ్బందుల పాలు కాకుండా చిన్న సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలి.
3. ఊరేగింపులుగా వెళ్లి అభ్యర్ధులు నామినేషన్లు వేయకూడదు. (ఆన్ లైన్ విధానంలో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించాలి.)
4. ఎంతటి హేతుబద్ధమయిన కారణం వున్నా సరే, ఏ  రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్య హక్కు పేరుతొ నడిరోడ్లపై  ధర్నాలు, బైఠాయింపులు, రాస్తా  రోఖోలు నిర్వహించరాదు.(అలాగే ప్రజలను ఇబ్బందుల పాలు చేసే ఇలాటి ఆందోళనా కార్యక్రమాలను ఎటువంటి పరిస్తితిలోను ప్రసారం చేయబోమని టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు వారికి  స్పష్టం చేయాలి. అంతేకాదు, ఈ రకమయిన ఆందోళనల కారణంగా ఇబ్బందులకు గురయ్యే ప్రజల మనోభావాలను సాధ్యమయినంత ఎక్కువగా ప్రసారం చేయాలి. ఆందోళనకారులను చెదరగొట్టడం, వారిని బలవంతంగా పోలీసు వ్యానుల్లోకి ఎక్కించడం వంటి దృశ్యాలు ప్రస్తుతం  చూపిస్తున్నారు. అలాకాకుండా రాస్తారోఖోల కారణంగా పడరాని పాట్లు పడుతున్న పౌరుల స్పందనలను ప్రత్యక్ష  ప్రసారం చేయాలి)
5. ఎన్నికల క్రతువు ముగిసే వరకు రెచ్చగొట్టే విధంగా వుండే రాజకీయ ప్రకటనలు, అవాకులు చవాకులులతో కూడిన స్క్రోలింగులను మీడియా సంస్తలు నిలిపివేయాలి.
6. ‘త్వంశు౦ఠ   అంటే  త్వంశు౦ఠ’ అంటూ సాగే రాజకీయ నాయకుల చర్చా గోష్టులను పదే పదే ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నుంచి ‘ఉచిత వినోదపు పన్ను’ రాబట్టాలి.
7. సంకీర్ణాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ పోలింగుకు ముందే కుదుర్చుకోవాలి. ఎన్నికలు ముగిసి పార్టీల బలాబలాలు నిర్ధారణ అయిన  తరువాత ప్రభుత్వం ఏర్పాటుకోసం అవకాశవాద కూటముల ఏర్పాటును నిషేధించాలి.
గమనిక: ఇవి కేవలం తొలి ఆలోచనలే. ఎన్నికల ఘడియ దగ్గర పడే  లోగా వీటికి మరింత స్పష్టమయిన పటిష్టమయిన రూపం ఇవ్వడంలో అంతా తలా ఓ చేయి వేయాలని  మనవి.

28, మార్చి 2014, శుక్రవారం

టీవీ సూపర్ ఫైన్ ప్రేక్షకులకు ఒక ముఖ్య గమనిక


“2014 లో ‘యుగాంతం’ కాబోతోందని గతంలో మేము ప్రసారం చేశాము. అయితే కొన్ని సాంకేతిక కారణాలవల్ల యుగాంతం 3014 సంవత్సరానికి వాయిదా పడిందని తెలపడానికి విచారిస్తున్నాము. అంతవరకూ చూస్తూ వుండండి టీవీ సూపర్  ఫైన్.”

27, మార్చి 2014, గురువారం

"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"




sr అనే బ్లాగు వీక్షకులు ఒకరు నేను రాసిన ప్రణయ గీతాలపై  ఒక కామెంటుతో పాటు ఒక ప్రశ్నను సంధించారు.
"గేయం పక్కనపెడితే, మీరు ఒక ఛానల్ కు అమ్ముడు పోయారా? ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను"
రామాయణంలో పిడకల వేట అన్నట్టు ప్రణయ కవిత్వం చదివి అడగాల్సిన ప్రశ్న కాకపోయినా వీరు నాకు మంచి మేలు చేశారనే అనుకుంటున్నాను.
ఎందుకంటే నేనూ ఎన్నాళ్ళనుంచో ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన పై పాఠకుడికి ముందు కృతజ్ఞతలు.
ఒక చానలు కు అమ్ముడు పోయారా అన్నది వారి సందేహం. ఒక ఛానల్ కు అమ్ముడుపోవడం కాదు ప్రతి రోజూ ఒక ఛానల్ కు పొద్దున్నే పోతున్నాను అన్నది నా జవాబు. వాళ్లు పిలుస్తున్నారు, నేను వెడుతున్నాను. అంచేత ఈ వివరాలు నలుగురికీ తెలియాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పాఠకుడు  తన వ్యాఖ్యతో ఆ అవసరం కలిపించారు.
ప్రతివారం నా షెడ్యూలు ఇది.
సోమవారం ఉదయం ఏడుగంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదు వరకు - జెమిని న్యూస్, మంగళవారం ఉదయం ఏడుగంటల నుంచి ఎనిమిది వరకు - హెచ్ ఎం టీ వీ, బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు - సాక్షి టీవీ, గురువారం ఉదయం ఏడు గంటలనుంచి అటూ ఇటూగా ఎనిమిది వరకు - మహా న్యూస్, శుక్రవారం ఉదయం ఏడు గంటలనుంచి ఎనిమిది వరకు - ఐ న్యూస్ ఛానల్, శనివారం ప్రత్యేకించి ఒక ఛానల్ అంటూ ఏమీ లేదు ఎవరు ముందు పిలిస్తే ఆ ఛానల్ కు (సాధారణంగా 10 టీవీ), ఆదివారం ఉదయం ఏడునుంచి ఏడు నలభై అయిదు వరకు - V 6 ఛానల్. ఇవికాక మధ్యాహ్నం, రాత్రి వేళల్లో  సందర్భాన్నిబట్టి చర్చాకార్యక్రమాలు వుంటాయి. గత రెండు మూడు సంవత్సరాలనుంచి నాది మారని షెడ్యూలు. కొత్త ఛానల్స్ వాళ్లు పిలుస్తున్నా, పాత చానల్స్ వాళ్లు అడుగుతున్నా వొప్పుకోలేని స్తితి.
మరి ఒక ఛానల్ కు అమ్ముడు పోతే ఇన్ని చానల్స్ వాళ్లు యెందుకు పిలుస్తారు. ఇంకో విషయం. నా అవసరాలను బట్టి నేను అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డా కొనడానికి నాకేదో అర్హత వుండాలి కదా! నాకంత మార్కెట్ వుందని అనుకోను. ఈ కొనడాలు, అమ్మడాలు అనే వ్యాఖ్యలతో నాకు తెలిసిన జర్నలిజం రంగాన్ని అవమానించవద్దు. ఇది నా విజ్ఞప్తి.
పోతే, మా కుటుంబం నమ్ముకున్న ఒక సూక్తితో దీన్ని ముగిస్తాను.
"కాసునమ్మి కక్కుర్తితో కలమునమ్మ తలపెట్టకు"
    

              

26, మార్చి 2014, బుధవారం

పాత కాగితాల్లో దొరికిన పాత గేయాలు


(ఓ వయసులో ఈ రాతలు రాయని మనసూ వుండదు-మనిషీ వుండడు - నేనూ మినహాయింపు కాదు. కాకపొతే - ముప్పయి , నలభై ఏళ్ళ   తరవాత చదువుతూ వుంటే - రాసింది నేనేనా అనిపిస్తోంది.  కాలమహిమ కాబోలు. ఏ వొక్క మహిళ అభ్యంతరం చెప్పినా వీటిని నిరభ్యంతరంగా తొలగిస్తా అని హామీ ఇస్తున్నాను.  - రచయిత )

రాత్రి ఓ నక్షత్రం
రాలి ఒళ్ళో పడింది-
తెల్లారి చూస్తే అది నువ్వే

కొందరికి చందమామని చూస్తే
తమ ప్రియురాలు గుర్తుకువస్తుంది
కానీ నిన్ను చూసినప్పుడే
నాకు చందమామ గుర్తుకువస్తుంది

నిన్ను ముట్టుకుంటే
మబ్బుల్ని తాకినట్టువుంటుంది
నిన్ను ముద్దుపెట్టుకుంటే
నక్షత్రాన్ని ముద్దాడినట్టువుంటుంది

నువ్వే నాదానివయితే
ఇక సమస్త ప్రపంచం నాదే

నువ్వు కనబడలేదన్న బెంగ నాకెందుకు?
అస్తమానం నిన్ను అంటిపెట్టుకునే వున్నానుగా

రాత్రి కలలో నువ్వు
రాత్రంతా నాతో నువ్వు
ఇద్దరి మధ్యా నలుగుతూ పాపం రాత్రి
చివరికి నీ కనురెప్పల మధ్య
నిద్రపోతూ నేను

నీ మనసు మెత్తనిదే
హృదయమే ఒక పాషాణం
కానీ నా ప్రేమ వెడితో అది కరక్క పోతుందా
నేను చూడకపోతానా

గొంతు కొరబోయింది
నిన్న చాటుగా నువ్విచ్చిన
ముద్దు ఘాటు కాదు కదా

ఇంత ముద్దొస్తున్నావ్
ఓ ముద్దిస్తే నీ సొమ్మేం పోయింది?

నీ అందంలో వున్న రహస్యం ఏమిటో
ఎందరి కళ్ళు పడ్డా
దిష్టే తగలదు

నువ్వెదురుగావుంటే
యుగాలు క్షణాలు
నువ్వు కనుమరుగయితే చాలు
క్షణాలు

నిన్ను నేను మరవాలంటే
నన్ను నేను మరవాలి
నన్ను నేను మరవాలంటే
నిన్ను నేను మరవాలి

షాజహానుకు బుద్దిలేదు
ప్రియురాలికి గుండెలో గుడి కట్టాలి కాని
చలువరాళ్ళతో తాజమహలు కడతాడా?

నిను చూడకుంటే చస్తాను
నువు కనబడితే పడి చస్తాను

కన్ను తెరిస్తే నువ్వు
కనులు మూస్తే నువ్వు
కలల్లో నువ్వు
కనురెప్పల్లో నువ్వు
పీల్చే గాలిలో
విడిచే శ్వాసలో
రాసే రాతలో
నువ్వే-నీ నవ్వే

ఊహల్లో నేను
ఊహించుకుంటూ నువ్వు
వర్తమానాన్ని నష్తపోతున్నాము.

(చలం రాతలు పిచ్చిగా చదివి)

25, మార్చి 2014, మంగళవారం

నీదా నాదా పైచేయి


రష్యన్లు హాస్య ప్రియులని ప్రతీతి. తమమీద తామే జోక్ వేసుకుని ఆనందించగల సంస్కారం వారిలో పుష్కలంగా వుంది.
గోర్భచెవ్ ఇచ్చిన వాక్స్వాతంత్ర్యం పుణ్యమా అని ఈ హాస్య ప్రియత్వం మరింత వెలుగులోకి వచ్చింది. అలా వారిలో వారు చెప్పుకునే కొన్ని జోకులను శౌనకాదిమునుల్లో ఒకరు విని సూతునికి చెప్పగా తెలియవచ్చిన ఒక జోకు కధాక్రమంబెట్టిదనిన:
సోవియట్ చరిత్రలో నికితా కృశ్చేవ్ ది ఒక ప్రత్యేక స్తానం. ఆయన ఒకసారి ప్రత్యేక విమానంలో అధికారిక పర్యటనపై అమెరికా బయలుదేరారు. ఆ రోజుల్లో అమెరికా గూఢచారి సంస్త ‘సీఐయే’, సోవియట్ గూఢచారి సంస్త ‘కేజీబీ’ – ఈ రెండింటి నడుమ ‘నీదా నాదా పై చేయి’ అనే రీతిలో అభిజాత్య ప్రదర్శన జరిగేది. ప్రతివిషయంలో ఏదోవిధంగా తమ ఆధిక్యతను చూపే అవకాశాన్ని దొరకబుచ్చుకోవడానికి ఈ రెండు సంస్తల అధికారులు అనుక్షణం శ్రమిస్తూ వుండేవారు.
ఆ రోజు కృశ్చేవ్ ప్రయాణిస్తున్న విమానం మరికొద్ది గంటల్లో వాషింగ్టన్ చేరుకోబోతున్నదనగా కేజీబీ అధికారి ఒకరు తనకు తెలియవచ్చిన సమాచారాన్ని సోవియట్ అధినాయకుడి చెవిలో వేశారు.
అంతకు కొన్ని గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో పనిచేసుకుంటూ తూలిపోయి ఓ పక్కకు వొరిగిపోయారట. ఆ వైనాన్ని క్షణం ఆలశ్యం చేయకుండా రష్యన్ టెలివిజన్లో ప్రసారం చేసిన సంగతి అది. అది విన్న కృశ్చేవ్ అమందానందకందాళభరితుడై, తన గూఢచారి విభాగం పనిచేస్తున్న విధానానికి హర్షం తెలియచేసారట. వారికి అభినందనలు అందచేసి ఆ పిమ్మట బాతు రూముకుపోయి లఘుశంక తీర్చుకుని వస్తూ వోడ్కా మత్తులో ఆయన తన ప్యాంటు బొత్తాములు పెట్టుకోవడం మరచిన విషయాన్ని అదేసమయంలో వాయిస్ ఆఫ్ అమెరికా ప్రసారం చేస్తోంది.(ట)